"నేనిక్కడేం చేస్తున్నానంటారా? మరేం లేదు, నేనిక్కడికి దగ్గరలోనే నివాసముంటాను," అక్కడికి ఒక 200 మీటర్ల అవతలగా ఉన్న తన ఇంటివైపు చేతులూపి చూపిస్తూ చెప్పారు సుఖ్రామ్ కుమేటీ. ముత్తాత అయినప్పటికీ తానింకా తొలి అరవైల వయసులోనే ఉన్నానని నమ్మే సుఖ్రామ్, విశాలంగా పరచుకొని ఉన్న ఒక చెట్టు నీడలో, రోడ్డు అంచున ఉన్న ఒక రాతి మీద కూర్చొని ఉన్నారు. అతని చుట్టూ ఉన్న సామగ్రి మమ్మల్ని ఆ ప్రశ్న అడిగేలా చేసింది.
ఆ సామగ్రిలో తెల్లటి ద్రవం నింపిన సుమారు ఇరవై లీటర్లు పట్టే ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా ఉంది. దాని పక్కన బహుశా ఒక పదేళ్ళ క్రితం రంగు నిల్వ చేసిన, ఇప్పుడు పాతబడిపోయిన ఒక ప్లాస్టిక్ బక్కెట్ ఉంది. మూడంచెల అంచులున్న ఆ బక్కెట్లో నీళ్ళున్నాయి. మెరిసే రంగురంగుల పాత్రలు ఆ నీటిలో తేలుతున్నాయి. నేలమీద పడివున్న ఎర్రని ప్లాస్టిక్ గ్లాసు కాకుండా కస్టమర్ల కోసం రెండు రంగుల మగ్గులున్నాయి. పసుపు రంగులోకి మారుతోన్న పెద్ద ప్లాస్టిక్ డబ్బా మీద వెలిసిపోయిన గులాబీ రంగు మగ్గు ఉంది. వెలిసిపోయిన ఆలివ్ పచ్చ పెయింట్ బక్కెట్ మీద నీలమణి రంగు మగ్గు ఉంది.
అది కొడోలీ గ్రామం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన అబూఝ్మాడ్ (అబుఝ్మాడ్ లేదా అబుఝ్మార్ అని కూడా అంటారు) లోకి మనం నారాయణ్‌పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ వైపునుంచి వెళ్ళినప్పుడు తగిలే రెండో గ్రామమది.
తానేం చేస్తున్నాడో, కొద్దిగా అసహనంతో, సుఖ్రామ్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతి మా బృందంలో నా ఒక్కడికే అర్థంకాలేదు.
"సల్ఫీ, సల్ఫీ..." నా అజ్ఞానానికి చిరాకుపడుతున్నట్టుగా కళ్ళు తిప్పుతూ అన్నారతను. నేను మాలో ఇద్దరం పట్టుకునివున్న కెమెరాలవైపు చూపు తిప్పాను. కానీ అతను మమ్మల్ని సెల్ఫీలు తీసుకోవటం కోసం ఆహ్వానించటంలేదు.





