"మా నాన్న నన్ను చదువుకోనిచ్చివుంటే నేనొక పోలీస్ అధికారిని అయ్యుండేదాన్ని," గుట్టగా పడివున్న అంట్ల గిన్నెలు, సబ్బు నురగ తేలుతోన్న సింకు వైపు తిరగబోతూ నిరాశగా చెప్పారామె. అప్పుడు సమయం ఉదయం 9 గంటలవుతోంది. ఇప్పుడామె త్వరత్వరగా ఆ గేటెడ్ కమ్యూనిటీలోని మరో అపార్ట్మెంటుకు పరుగెత్తాలి. తాను ఇంటి పనిమనిషిగా పనిచేసే ఆ కాలనీలో అందరూ అనితా దీదీ అని పిలిచే ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ముందు ఇంకా ఐదు ఇళ్ళల్లో పనిచేయాల్సివుంది. వాయవ్య హైదరాబాడ్లో ఆమె పనిచేసే ఉన్నతస్థాయి శివారు ప్రాంతమైన నల్లగండ్ల నుండి పొరుగునే ఉన్న సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులో ఉండే తన ఇంటికి వెళ్ళాలంటే ఆమె 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.
ఇప్పటికే నలుగురు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ళ అనితా రాథోడ్ తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న లంబాడీ సముదాయానికి చెందినవారు. దేశంలో వలస కార్మికులను ఆకర్షించే ఐదు అగ్ర నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ నగరంలోని గేటేడ్ కమ్యూనిటీలలో పనిచేసే అనేకమంది వలస కార్మికులలో అనిత కూడా ఒకరు. ఎక్కవ గంటలపాటు పనిచేసే ఆమె చల్లగిద్ద తాండాలో తన ఉమ్మడి కుటుంబాన్నీ, సొంత ఊరైన మైనేలీలోని తల్లిదండ్రుల వద్ద తన పిల్లలనూ, చివరకు తన కలలను కూడా వదిలిపెట్టి ఇక్కడకు రావలసివచ్చింది.
పొద్దున్నే 4 గంటలకు లేచి వంటచేసి, బట్టలుతికి, ఇంటిని శుభ్రం చేయటంతో ఆమె రోజు మొదలవుతుంది. ఉదయం ఐదున్నరకల్లా దగ్గరలోని రంగారెడ్డి జిల్లా లింగంపల్లి వెళ్ళటానికి ఆమె బస్ ఎక్కుతారు. అక్కడి నుంచి నల్లగుండ్లలోని గేటెడ్ కమ్యూనిటీకి 6.30కల్లా చేరటానికి రూ. 20 ఇచ్చి ఆటో ఎక్కుతారు. తెలంగాణా ప్రభుత్వం 2023లో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించటంతో, ఆమెకు తన పని ప్రదేశానికి చేరటానికి అయ్యే ప్రయాణ ఖర్చులో కొంత భారం తగ్గింది.














