లాతేహరా టోలాలో, రహదారికి ఇరువైపులా దాదాపు రెండు డజన్ల ఆదివాసుల ఇళ్ళు ఉన్నాయి. కొన్ని ఇళ్ళు సిమెంటుతోనూ, మరికొన్నిటిని మట్టితోనూ, గడ్డితోనూ నిర్మించారు. అది సెప్టెంబర్ నెలలో ఒక మధ్యాహ్నవేళ. ఇప్పుడే వర్షం ఆగింది. ఆకాశం దాదాపు తేటగా ఉంది. కొంతమంది వృద్ధ మహిళలు దారి పక్కన ఉన్న ఇళ్ళ నీడలో కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ సమయం గడుపుతున్నారు.
ఫూల్‌మణి వంగిపోయిన వీపు, లోతుగా ముడతలు పడిన మొహం ఆమె వయసుని చెప్పకనే చెబుతున్నాయి. ఆమె కర్ర పట్టుకొని నడుస్తూ నా వైపుకు వస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఫూల్‌మణి వయసు మూడేళ్ళు. తనకి 21 ఏళ్ళు నిండినప్పటి నుండీ, జమూయి జిల్లాలోని లాతేహరా టోలాకు చెందిన ఈ సంథాల్ ఆదివాసీ పేరు మహిళా వోటరు జాబితాలో ఉంది. అయితే, గత నెలలో ఆవిడ పేరును తొలగించారు. దాంతో, ఇకపై ఎలా బతకాలి అని తొలి 80ల వయసులో ఉన్న ఫూల్‌మణి ఆందోళన పడుతున్నారు. ఓటు వేయలేని పక్షంలో తాను కీలకమైన ప్రభుత్వ పథకాలకు అనర్హురాలిని అవుతానని ఈ వృద్ధ మహిళ భయపడుతున్నారు.
దుబరాతరీ గ్రామం, కనార్ ఆదివాసీ టోలాలో విష్ణుదేవ్ హాఁసదా పేరును కూడా అర్హులైన వోటర్ల జాబితా నుండి తొలగించారు. అదేవిధంగా రాజు కిస్కు పేరు కూడా. అలాగే, ఫూల్‌మణి కుటుంబంలోని మరో ఐదుగురు సభ్యులు పేర్లను తొలగించారు. వీళ్ళందరూ బూత్ నంబర్ 14, ఉత్క్రమిత్ మధ్య విద్యాలయ, ఖిర్భోజనా (తూర్పు) కిందకి వస్తారు. ఇలా మొత్తం 50 మంది పేర్లను తొలగించారు. నేను తనిఖీ చేసినప్పుడు, వాళ్ళలో 50 శాతం మంది ఆదివాసులే ఉన్నారు. సవరణ తరువాత జారీ చేసిన తుది జాబితాలో, ఈ బూత్‌లో 661 మంది వోటర్ల పేర్లు ఉన్నాయి.
బిహార్‌లో 2025 జూలైలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను చేపట్టారు. ఈ ప్రక్రియలో, ‘చనిపోయారు’, ‘వేరొక చోటుకు వెళ్ళారు’ అనేవి ప్రధాన కారణాలుగా పేర్కొంటూ 66 లక్షలకు పైగా వోట్లను తొలగించారు. చదవండి: బిహార్ ఎన్నికలు: ‘చనిపోయిన’ ఆదివాసులు చెప్పిన కథలు
ఈ రాష్ట్ర జనాభాలో ఆదివాసుల సంఖ్య రెండు శాతం కంటే తక్కువ. అయితే, ఇటీవలి ఎన్నికలకు ముందు చేపట్టిన SIRలో, పేర్లు తొలగించబడినవాళ్ళలో అధికంగా వీళ్ళే ఉన్నారు. ఇక్కడి ఆదివాసులు తమ జీవనోపాధి కోసం సమీపంలోని కొండల నుండి లభించే చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడతారు. రోజంతా అడవి నుండి ఎండు కట్టెలను సేకరించి, సాయంత్రం సమీపంలోని మార్కెట్లో అమ్మి, దాదాపు రూ.150 నుండి 200 వరకు సంపాదిస్తారు. దీనితో పాటు, పొలాలలో రోజువారీ కూలీలుగా ఎక్కడ పని దొరికితే అక్కడ, లేదా MNREGA కింద పనిచేస్తారు.
















