ఈ సమయంలో, పూర్ణియా జిల్లాలో మొక్కజొన్న పండే ప్రదేశంలోని ఒక భాగం గుండా వెళ్ళే తారుతో వేసిన ప్రధాన రహదారి రెండు వైపులా బంగారంతో పొదిగినట్టు ఉంటుంది. మొక్కజొన్న పంట కోతలు ముగిశాయి, రైతులు తమ పొలాలకు ఆనుకుని ఉన్న రహదారికి ఇరు వైపులా పసుపురంగు మొక్కజొన్న గింజలను ఆరటం కోసం తివాచీలా పరచారు. చందవా-రూపస్పుర్ ఆదివాసీ టోలా సమీపించే సమయంలో, గింజల్లో తేమ వేగంగా ఆవిరైపోవడం కోసం సంథాల్ స్త్రీ పురుషులు ఒక చెక్క నాగలి వంటి సాధనంతో గింజలను తిరగతిప్పడాన్ని మనం చూస్తాం. ఇక్కడే ఎక్కడో ఒకచోట ఒక చౌకీదార్ కాపలాగా ఉండే ఉండాలి, త్వరలోనే ఆ ఆదివాసుల తలుపులు తట్టి, వారు తరతరాలుగా కౌలు రైతులుగా పనిచేస్తూవస్తోన్న భూస్వాములకు రావలసిన వాటాను వసూలు చేస్తాడు. రాష్ట్రంలో భూమి హక్కుల సంస్కరణలు జరిగి ఏళ్ళు గడచిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ తమ పంటలో నుంచి కొంత భాగాన్ని భూస్వాములకు చెల్లిస్తున్నారు.
ప్రధాన రహదారి నుండి కొంచెం దూరంలో, గ్రామానికి సమీపంలో, ఐదు దశాబ్దాల నాటి ఊచకోతలో మరణించిన వారి పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నం నుండి వారి పూర్వీకులు కూడా కాపలా కాస్తుంటారు. చుట్టూ కంచె వేసిన ఒక పొలం లోపల, ఒక ఎత్తైన వేదికపై ఉన్న తెల్లటి స్తంభం మీద నవంబర్ 22, 1971న భూస్వాములు దారుణంగా హత్య చేసిన 14 మంది పేర్లు రాసిన పాలరాయి ఫలకం ఉంది.
"గ్రామం మొత్తం శ్మశాన భూమిలా కనిపించింది. ప్రతి ఇంటి నుండి ఏడుపులు, పొగలు ఎగసిపడుతున్నాయి. జనం ఓదార్చలేని స్థితిలో ఉన్నారు. వారు [భూస్వాముల ప్రైవేట్ సైన్యం] 45 ఇళ్ళకు నిప్పుపెట్టి వాటిని బూడిద చేసేశారు." యుక్తవయసులో ఉండగా శివనారాయణ్ చూసిన ఆ ఊచకోత జ్ఞాపకాలు వయసుమళ్ళినప్పటికీ మసకబారలేదు. బిహార్లోని అతని సముదాయపు స్థితిగతులలో కాలం కూడా పెద్దగా మార్పులను తీసుకురాలేదు.
అయినప్పటికీ, "అది భూమి కోసం జరిగిన పోరాటం," ఇప్పుడు 70 ఏళ్ళ వయసున్న శివనారాయణ్ ముర్ము చెప్పారు. ఈ ఊచకోతలో ఆయన తన ఇద్దరు బంధువులను కోల్పోయారు. "సూర్యుడు అస్తమించలేదు." 2025 జూలై మాసంలో ఒక సాయంత్రం వేళ మేం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వేరొరొక సమయంలోకి జారిపోయారు. "వాళ్ళు తుపాకులు, కర్రలు, గొడ్డళ్ళ వంటి ఆయుధాలతో వచ్చి మా నివాసప్రాంతం మొత్తాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వాళ్ళు మా ఆదివాసుల ఇళ్ళను తగలబెట్టారు, కనిపించినవారిని కాల్చి చంపారు, సజీవ దహనం చేశారు," అని ఆయన చెప్పారు.
కానీ శివనారాయణ్కు గతంలోనే మరింత లోతుగా తగిలిన గాయపు బాధకు ఇది తోడై మరింతగా పెరిగింది. ఈ ఊచకోతకు దాదాపు ఏడు సంవత్సరాల ముందు, అతను కేవలం పదేళ్ళ బాలుడిగా ఉండగా, అతని తండ్రి లఖన్ లాల్ హెంబ్రమ్ హత్యకు గురయ్యారు. ఇందుకు కూడా భూమే కారణం. "అతను చదువుకున్నవాడు. సంథాల్ ఆదివాసుల యాజమాన్య హక్కుల కోసం పోరాడేందుకు కోర్టుకు వెళ్ళేవాడు. ఒకసారి అతను తనతో మాట్లాడటానికి వచ్చిన భూస్వామి వైపు మనుషులను సాగనంపటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. మూడు రోజుల తరువాత, ఇంటి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో గొంతు కోసి ఉన్న అతని మృతదేహం కనిపించింది." కానీ ఎవరూ దోషులుగా నిర్ధారణ కాలేదు.
పూర్ణియాలో ఊచకోత జరిగిన ఒక దశాబ్దం తర్వాత, ఈ కేసులో 25 నుండి 30 మంది భూస్వాముల పక్షంలోని దోషులకు దిగువ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించినప్పుడు కాలం మారుతోందని శివనారాయణ్ భావించారు.
కానీ ఆయనకు సగం కథ మాత్రమే తెలుసు.















