పాతదైపోయిన బాగ్దువర్ ప్రాథమిక పాఠశాల భవనం ముందు నిలబడి అతను తాను విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతనెప్పుడూ చదువుకోవటాన్ని ఇష్టపడిందిలేదు. తన గ్రామంలోని చాలామంది పిల్లల మాదిరిగానే, బాప్తైల్ గ్రామంలోని ఇంటి నుండి 1.5 కిలోమీటర్ల కఠినమైన నడక దూరంలో ఉన్న ఈ బడికి అతన్ని వెళ్ళేలా చేసింది, అక్కడ పెట్టే మధ్యాహ్నం భోజనం మీది ఆశ మాత్రమే.
"నేను బడిలో ప్రతి ఒక్కరితో కొట్లాటలు పెట్టుకుంటూ ఉండేవాడిని, అక్కడ ఎన్నడూ పాఠాలు నేర్చుకున్నదే లేదు. రోజూ టీచర్ల చేతిలో తన్నులు తినేవాడిని. 5వ తరగతిలోనే బడి మానేశాను. అప్పుడు నాకు బాంబే [ముంబై] గురించి పిచ్చి ఆలోచనలుండేవి," అన్నారు 24 ఏళ్ళ నబీన్ ఠాకూర్. ప్రస్తుతం (అగస్ట్, 2024) ఆయన ఒక కుటుంబ వివాహానికి హాజరయ్యేందుకు తన కలల నగరాన్నుంచి తపన్ బ్లాక్‌లోని తన గ్రామానికి తిరిగివచ్చారు. నబీన్ గత పదకొండేళ్ళకు పైగా ముంబైలోని నిర్మాణ ప్రదేశాలలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.
"ఆ రోజుల్లో ఖరీపారా చుట్టుపక్కల ఎక్కువగా ఉన్న వ్యవసాయ కూలీల, దినసరి కూలీల కుటుంబాలకు చెందిన పిల్లలంతా చిన్న తరగతులలోనే చదువు మానేసి పనుల కోసం వెతుక్కునేవారు," అన్నారతను. "కానీ పనులేమీ ఉండేవి కావు. కేవలం ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసున్న మగపిల్లల దగ్గరనుంచి, 50ల వయసులో ఉన్న పెద్దవారి వరకూ బతుకుతెరువు వెతుక్కుంటూ బయటకు వెళ్ళాల్సివచ్చేది. మాకు ఇంకేం అవకాశాలున్నాయి?" వలస పోవటమెందుకు అనే ప్రశ్నకు జవాబు అన్నట్టు ఎదురు ప్రశ్న వేశారు నబీన్.
























