"మేమేమీ ఉన్నవాళ్ళం కాము, మీరే చూస్తున్నారు కదా, కానీ మా మెహమాన్ [అతిథులు]లను ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. అంచేత, దయచేసి వచ్చేయండి," లఖ్‌పత్ తాలూకాలోని మోరీ గ్రామానికి చెందిన కరీమ్ జాట్ నాతో అన్నారు. నలభైల మధ్యవయసులో ఉన్న ఆయన గత కొన్నేళ్ళ పాటు నేను ఎవరి జీవితాలను డాక్యుమెంట్ చేస్తూవచ్చానో ఆ ఫకీరాణీ జాట్లలో ఒకరు. సావ్లా పీర్ ఉత్సవం ముగిసిన తర్వాత నేను లఖ్‌పత్ నుండి బయలుదేరుతున్నప్పుడు ఆయన నాకు వీడ్కోలు పలుకుతున్నారు. అదే సమయంలో వారితో కలిసి ఈద్ జరుపుకోవడానికి నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. అది మార్చి 2024లో జరిగింది, ఇప్పుడిది మార్చి 2025. కరీమ్ భాయ్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ, నేను మళ్ళీ గుజరాత్‌లోని కచ్ఛ్ తాలూకా మోరీకి వెళ్తున్నాను.
ఒక గాఢమైన కౌగిలింతతో నాకు స్వాగతం పలకటం కోసమే కరీమ్ భాయ్ ఎదురుచూస్తున్నారు. "మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది," తన స్వరంలో స్పష్టమైన ఉద్వేగం, ఆప్యాయత ధ్వనిస్తోండగా చెప్పారతను. "ఈ సంవత్సరం రంజాన్ చివరి నమాజ్ చేయడానికి నాకు ఇంకా సమయం ఉంది కాబట్టి మనం కాసేపు నడకకు వెళ్ళొద్దాం." మోరీకి తనదైన సొంత అందం ఉంది - క్షితిజ సమాంతరంగా బారుతీరి ఉన్న కొన్ని జెముడు పొదలు తప్ప మరేమీ లేని బంజరు ఎడారి ప్రాంతం. సాయంత్రమైపోయినా సూర్యుడింకా కుంకలేదు. అయితే, కచ్ఛ్ అఖాతం నుండి వీచే గాలి మన వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ఒక చిన్న నీటిగుంట అంచున నిల్చొని అత్యద్భుతమైన సూర్యుడ్ని చూస్తున్నాం. "నేను బండ్లు అమ్మేశాను," గుసగుసగా చెప్పారు కరీమ్భాయ్. "నా దగ్గర ఇంకా నా చిన్నకొడుకు మేపే 200 ఒంటెలున్నాయి. కాని ఆదాయమూ, దాంతోపాటు మేత బీళ్ళు కూడా తగ్గిపోతున్నాయి." ఆయన కొంతసేపు ఆగి, తన గొంతు సవరించుకుంటూ ఇలా అన్నారు: "సాయంకాలపు నమాజ్‌కు సమయమయింది. రేపే ఈద్. ఇంక వగచటంలో అర్థంలేదు. అందరం కలిసి ఆస్వాదిద్దాం."










