“ఘుంఘూ వేసుకొని వెళితే పిడుగు అసలు నీ మీద పడదు,” అంటారు ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా, కుజామ్ గ్రామవాసి సుఖనీ అసుర్. ఘుంఘూ అంటే మాలూ మొక్క (ఫనేర వాహ్లీ - అడ్డ తీగ) ఆకులతో మలిచే ఒకలాంటి గొడుగు. మాలూ మొక్క ఆ ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది.
ఘుంఘూను ఏడాదంతా వాడతారు. ఎండాకాలాల్లో అది లూ (వడగాలుల) నుండీ, చలికాలాల్లో చల్లటిగాలుల నుండీ, వర్షాకాలాల్లో వాన నుండీ కాపాడుతుంది. గుమ్మటంలాగా ఉండే ఈ ఘుంఘూను తలమీద పెట్టుకొంటే, పెట్టుకొన్న వాళ్ళ చేతులు ఖాళీగా ఉండి ఏ పని అయినా చేసుకోవచ్చు.
ఘుంఘూ ఎలా చేయాలో చిన్నపిల్లగా ఉన్నపుడే సుఖనీ తన తల్లి దగ్గర నేర్చుకొన్నారు. “ఇంతకుముందు ప్రతొక్కరూ అడవుల్లో పెరిగే మాలూ ఆకుల్ని సేకరించి ఘుంఘూను తయారుచేసేవారు,” 56 ఏళ్ళ సుఖనీ చెప్పారు. “కానీ ఇప్పుడు దీన్ని కొంతమందే ఉపయోగిస్తున్నారు, దీన్ని తయారుచేసేవారు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.”
సుఖనీ అసుర్ సముదాయానికి చెందినవారు. రాష్ట్రంలో అత్యంత దుర్బల ఆదివాసీ సమూహంగా (PVTGs) ఈ తెగను జాబితా చేశారు. ఆమె కుటుంబం వారికున్న 10 ఎకరాల భూమిని సాగు చేస్తుంది. అందులో ఎక్కువగా వరి, మొక్కజొన్న, గుండలీ (సామలు) అనే చిరుధాన్యాన్ని పండిస్తారు.
సుఖనీ నివసిస్తున్న మూడు గదుల మట్టి ఇంటికి అర కిలోమీటరు దూరం నుండి బిష్ణుపూర్ అటవీ పరిధి మొదలవుతుంది. ఆ మట్టి ఇంట్లో ఆ కుటుంబానికి చెందిన 12మంది నివసిస్తున్నారు. కుజామ్ గ్రామస్తులు వంట చెరుకు, పండ్లు, పచ్చిక బయళ్ళ వంటివాటి కోసం ఆ అడవి మీద ఆధారపడతారు. “హమారా రోజీ రోటీ సబ్ యహీ హై [మా జీవనోపాధి, మనుగడ అంతా ఇక్కడే],” అంటారు సుఖనీ.
























