“ఇదిగో... ఇక్కడే నేను మంచులో దాదాపుగా కూరుకుపోయాను. చాలామంది నేను చనిపోయానని అనుకున్నారు.”
తంగ్లాంగ్ లా పర్వత మార్గంలో, 17,480 అడుగుల ఎత్తులో, భారీగా మంచు కురిసిన రోజును గుర్తుచేసుకున్నారు సరాప్. “మిగతా కూలీలందరూ నన్ను కాపాడడానికి పరుగెత్తుకుంటూ వచ్చారు,” అన్నారతను. దగ్గర్లోనే ఆర్మీ ఆసుపత్రి ఉండడంతో, అదృష్టం కొద్దీ అతనికి త్వరగా చికిత్స అందింది.
లద్దాఖ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో పనిచేసే సరాప్ లాంటి రహదారి నిర్మాణ కూలీలు అనిశ్చిత వాతావరణాన్ని, అది వెంట తెచ్చే ప్రమాదాలను నిత్యం ఎదుర్కొంటుంటారు. తరచూ ఇక్కడ ఉష్ణోగ్రతలు ఘనీభవించే స్థాయికి పడిపోతుంటాయి. అయితే, గత రెండు దశాబ్దాలలో, పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. “వాతావరణ మార్పుల వల్ల ఆలస్యంగా కురుస్తోన్న హిమపాతం బరువైన మంచును తెస్తోంది. దాంతో, ఇప్పుడు మేం మరిన్ని ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం,” లేహ్ జిల్లాలోని జియా గ్రామంలో నివసించే సరాప్ తెలిపారు.
ఈ ప్రాంతంలో రెండవ ఎత్తైన పర్వత మార్గమైన తంగ్లాంగ్ లాను తిరిగి తెరిచే బాధ్యత శ్రామికుడైన సరాప్, అతని బృందంపై పడింది. భరించలేని చలి, తీవ్రమైన వాతావరణం ఈ పర్వత మార్గాన్ని అక్టోబర్ నుండి మే వరకు మూసివేస్తుంది. దీన్ని తెరిస్తే గనుక, లేహ్-మనాలి హైవేపై ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. ఈ 428 కిలోమీటర్ల ప్రయాణం నాలుగు పర్వత మార్గాల గుండా సాగుతుంది, తంగ్లాంగ్ లా చాలా ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుండి చూస్తే, కనిపించే దృశ్యం చకితుల్ని చేసినప్పటికీ, తీవ్రమైన గాలి, చలి కారణంగా 10 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడి ఎవరూ ప్రకృతిని ఆస్వాదించలేరు.


















