బుట్టలు మోస్తూ నడుస్తోన్న మహిళలు, గొడ్డళ్ళు పట్టుకున్న పురుషులు, ఎడ్ల బండ్లను తోలుతున్న రైతులు, గోర్ మారియా సంగీతానికి నృత్యం చేస్తోన్న యువతీయువకులు - నారాయణ్‌పూర్‌లో, దట్టమైన ఉష్ణమండల అటవీ ప్రాంతంలోని గఢ్బెంగాల్ గ్రామంలో, వెదురు కంచె వేసిన ఈ పాత మట్టి ఇంటి ప్రాంగణంలోకి గోండు ఆదివాసుల ప్రపంచం దిగివచ్చినట్లు అనిపిస్తోంది. ఆ ప్రదేశమంతా వెచ్చగా, అప్పుడే నరికిన కలప వెదజల్లుతున్న పచ్చిదనపు పరిమళం, మట్టి సువాసనతో నిండిపోయింది. సగం చెక్కిన కొయ్య ముక్కలు కొన్ని చుట్టూ పడేసి ఉన్నాయి. ప్రతీ ఒక్కటీ ఒక కథను చెప్పడానికి వేచి చూస్తోంది. అలాగే తన పనిముట్లు, కలప, శిక్షణార్థులతో చుట్టుముట్టబడిన వృద్ధుడు పండి రామ్ కూడా.
గొంతుక్కూర్చొని, ఒక చెక్కిన చిన్న కొయ్య ముక్క మీదకు వంగి, రక్షణ కోసం పెట్టుకున్న కళ్ళద్దాల వెనుక ప్రస్తుతం శుక్లాల వల్ల బలహీనపడిన కళ్ళను చిట్లిస్తున్న ఈ 70 ఏళ్ళ వృద్ధుడు, ఒక కళాకృతికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అప్పుడప్పుడు, అతను తన ప్రత్యేక పనిముట్లను వాటి స్థానిక పేర్లతో ఉచ్ఛరిస్తున్నారు – ఛేనీ, తిర్కూన్, రేగీ, పటాసీ, హథోడీ. అలాగే, తన చేతుల ప్రతి కదలికతో పాటు, తన మాతృభాష అయిన గోండీలో సలహాలు ఇస్తూ లేదా హెచ్చరిస్తూ, తన విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. పండీ రామ్ చెక్కపై చెక్కుతున్న ప్రతీ గీతా అడవిని శ్వాసిస్తుంది, ఆ అడవితో సామరస్యంగా గడిపిన జీవితాన్ని అతని మురియా గోండ్ సముదాయానికి చెందిన ఒక తరం స్పష్టంగా గుర్తుంచుకుంటుంది.
కానీ, ఈరోజుల్లో అతనికి పని చేయడం కష్టంగా మారింది. అలా అని, పనికి దూరంగా ఉండడమూ కష్టమే. “కొయ్య ముక్కలను తాకగానే ఏది సరైనదో, దేనిపైన పని చేయాలో ఆయనకి ఇట్టే తెలిసిపోతుంది,” అతని కొడుకు బల్దేవ్ తెలిపారు. అతను కూడా ఒక కళాకారుడే. “నా శ్వాస ఎంత ముఖ్యమో, ఈ కళ కూడా అంతే ముఖ్యం,” పండీ రామ్ అన్నారు. “నేను దీన్ని వదిలేస్తే, బహుశా ఇక బతకలేనేమో!” చెక్క ముక్కలను సానపెట్టడం, విగ్రహాలు చెక్కడం, అలాగే కలపను అటూ ఇటూ కదిలించడంలో నిమగ్నమై ఉన్న నలుగురైదుగురు వ్యక్తులతో కలిసి వరండాలో కూర్చునివున్న ఆయన అన్నారు.
“ఇది కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే చేసే పని అనుకునేవాడిని,” పండీ రామ్ చెప్పారు. “అయితే, పట్టణవాసులు దీన్ని ప్రశంసించడం మొదలుపెట్టారు. దాంతో, ఇది నా జీవనాధారం కావొచ్చని గ్రహించాను. నా తండ్రి దగ్గరి నుండి పొందిన నైపుణ్యాలను క్రమంగా మెరుగుపరచుకోవడం ద్వారా, ఈ పనినే నా జీవితంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను.” తన సముదాయపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్నీ, పురాతన సంప్రదాయక కొయ్య చెక్కడపు కళనూ సజీవంగా ఉంచడానికి అతని 35 ఏళ్ళ ఆచరణ అంకితమైంది. కొయ్య, దానితో తయారైన గృహోపకరణాలు, కళాకృతుల వంటి వస్తువులు ఇళ్ళలో, ఆచారాలలో, పండుగలలో, సముదాయపు దైనందిన జీవితంలో అంతర్భాగంగా నిలిచాయి తప్ప జీవనోపాధికి ఒక మార్గంగా అయితే కాదు.


























