"హరియాణా, పంజాబ్ హూఁ లేగే జైసల్మేర్ తక్ సారో దేశ్ మ్హారో పగా హూ నాపేడో హైఁ [హరియాణా, పంజాబ్ నుండి జైసల్మేర్ వరకు దేశమంతా మా పాదాలతో చుట్టేశాం]," అంటారు భాదర్ భోపా. వాయువ్య రాజస్థాన్లోని తన ఇంటి దగ్గర ఒక చెట్టు కింద కూర్చొనివున్న ఈ 65 ఏళ్ళ పెద్దమనిషి "మేం చూడని ప్రదేశమంటూ ఏదీ లేదు," అన్నారు.
గుజరాత్, రాజస్థాన్లలో నివసించే సంచార భోపా సముదాయానికి చెందిన భాదర్ వెదురు, కొబ్బరి చిప్పలతో తయారుచేసిన తంత్రీ వాద్యమైన రావణ్హత్థాను వాయిస్తూ తన జీవితంలో ఎక్కువ భాగం దేశమంతటా తిరుగుతూ గడిపారు. "మేం ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళాం, అక్కడ బస చేశాం, ప్రదర్శనలు ఇచ్చాం, మళ్ళీ ముందుకు సాగాం," ఆయన PARIతో చెప్పారు.
చివరకు, 11 ఏళ్ళ క్రితం భాదర్, ఆయన ఐదుగురు కొడుకులు చురూ జిల్లాలో స్థిరపడ్డారు. "ఆ [సంచార] జీవనంతో విసిగిపోయాను, అందుకే ఒక గ్రామంలో స్థిరపడ్డాను," అని ప్రస్తుతం ధీర్వాస్ బరాలో నివసిస్తోన్న భాదర్ చెప్పారు. ఆ గ్రామం గుండా చాలాసార్లు ప్రయాణించి ఉండటంతో పాటు, అక్కడి ప్రజలు బాగా పరిచయం ఉన్నవారే కావడంతో ఆయన ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. సంగీతకారులుగా భోపా కుటుంబం మా గ్రామం గుండా ప్రయాణించడాన్ని చూసినట్లు మా తాతగారు గుర్తుచేసుకుంటారు.
రాజస్థాన్లో భోపాలను ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి)గా పరిగణిస్తున్నప్పటికీ, ఆ కుటుంబం తమను తాము షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడిన నాయక్ సముదాయానికి చెందినవారిగా చెప్పుకుంటుంది. నాయక్ సముదాయం కూడా వారిని తమలో భాగంగా అంగీకరించడానికి సంకోచిస్తారు.
ధీర్వాస్ బరాలో భూమిని కొనాలంటే చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి, వారు మొదటి రెండేళ్ళు గ్రామం వెలుపల నివాసమున్నారు. "ఆ తర్వాత మేం గ్రామ సర్పంచ్ని కలిశాం, ఆయన మాకు ఈ భూమిని వాడుకునే అవకాశం ఇచ్చాడు," భాదర్ భోపా కొడుకైన భన్వర్ లాల్ చెప్పారు. "ఇది మొత్తం దాదాపు ఒక బీఘా, మూడు బిస్వాలు [సుమారు 0.75 ఎకరం] ఉంటుంది.”
ధీర్వాస్ బరా గ్రామం ప్రధాన బస్ స్టాండ్ నుండి దక్షిణం వైపుకు తిరిగి, కచ్చా రోడ్డు వెంబడి పొలాల వైపుకు వెళితే, దారిలో రెండు శ్మశాన్ భూములు (శ్మశానభూములు) కనిపిస్తాయి. మొదటిదాన్ని ఇతర వెనుకబడిన తరగతుల కింద జాబితా చేయబడిన స్వామి సముదాయంవారు ఉపయోగిస్తుండగా, దానికి కొద్ది దూరంలో ఉన్న రెండవదాన్ని షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించారు. రోడ్డుకు ఒకవైపు ఈ శ్మశానభూములు ఉండగా, దళిత్ మొహల్లా (నివాస ప్రాంతం) రోడ్డుకు మరోవైపు ఉంటుంది. దీనికి ఆవల చనిపోయిన జంతువుల కళేబరాలను పడేసేందుకు కేటాయించిన ప్రదేశమైన హడవార్ ఉంటుంది.
50 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి కుటుంబమైన భాదర్ భోపా కుటుంబంవారు కూడా, ఈ హడవార్లోని ఒక భాగంలో నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నారు. వారంతా ఇప్పుడు ఒకే చోట స్థిరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది వారు గతంలో గడిపిన జీవితానికి పూర్తిగా భిన్నమైన జీవనశైలి.










