ఉదయం మూడు గంటల సమయం. నారింజ రంగు టార్పాలిన్ గుడారం బయట కూర్చొని ఉన్న నందిని, తన నేస్తం చూపిస్తోన్న సెల్ ఫోన్ టార్చి వెలుగులో మేకప్ వేసుకుంటోంది.
ఒక సాదా నూలు చీర కట్టుకొని ఉన్న ఆ 18 ఏళ్ళ అమ్మాయికి మరి కొద్ది గంటల్లో పెళ్ళి జరగబోతోంది.
ఆ ముందు రోజు సాయంత్రమే ఆమె, ఆమె వరుడైన 21 ఏళ్ళ జయరామ్లు బంగళామేడు (అధికారికంగా సెరుక్కనూర్ ఇరులర్ కాలనీ అని పిలుస్తారు) నుంచి తమ స్నేహితులతో, కుటుంబాలతో కలిసి మామిళ్ళాపురం వచ్చారు. దక్షిణ చెన్నైలోని ఈ బీచ్ పొడవునా చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఉంటోన్న వందలాది ఇరులర్ కుటుంబాలలో, తమిళనాడులోని తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన ఈ బృందం కూడా ఒకటి.
తమిళనాడు తీరప్రాంతంలో అతి కొద్దికాలమే ఉండే శీతాకాలం వేసవికాలానికి దారినిచ్చే ప్రతి మార్చి నెలలో మామిళ్ళాపురం (ఇంతకుముందు మహాబలిపురం అని పిలిచేవారు) బంగారు రంగు ఇసుక, రంగు రంగులను విరజిమ్ముతుంది. సమీపంలోని చెట్ల నుండి తాజాగా కత్తిరించిన కొమ్మల మీద సన్నటి చీరలు, టార్పాలిన్లు కట్టి ఏర్పాటు చేసిన ఆవరణలు, గుడారాలతో సందడి సందడిగా మారుతుంది.
ప్రసిద్ధి చెందిన ఈ బీచ్లో మామూలుగా స్థానిక, అంతర్జాతీయ పర్యాటకులు చేసే సందడిని మాసి మాగమ్ పండుగను జరుపుకోవడానికి రాష్ట్రమంతటి నుంచీ వచ్చిన ఇరులర్ సముదాయపు ప్రజలు భర్తీ చేస్తారు. సుమారు 2 లక్షల జనాభా (భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంక ప్రొఫైల్, 2013) ఉన్న ఇరులర్లు ప్రత్యేకించి హానికి లోనయ్యే ఆదివాసీ సమూహం (PVTG) కు చెందినవారు. వారు తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉన్న చిన్న, చిన్న సమూహాలుగా నివసిస్తున్నారు.


























