“ఏయ్! మీరిక్కడేం చేస్తున్నారు?” అతను అడిగారు, కుతూహలం నిండిన చూపుతోనూ, దృఢమైన స్వరంతోనూ.
నాకతను కనిపించిన ఎత్తైన నది ఒడ్డున ఆయనను ఎవరూ కలవరని నాకు వెంటనే అర్థమయింది.
అనిరుద్ధ సింగ్ పాతర్ ఒడ్డు మీంచి నది వైపుకు దూకారు. అకస్మాత్తుగా ఆగి, పక్కకు తిరిగి నన్నిలా హెచ్చరించారు: “ఆ ప్రదేశంలో మృతదేహాలను కాలుస్తారు. నిన్న ఎవరో చనిపోయారు. అక్కడ నిలబడొద్దు, నావెంట రండి!”
చక్కటి సూచన, అని నేననుకున్నాను. ఎందుకంటే చనిపోయినవారిని వారు సంపాదించుకున్న ఏకాంతంలో విశ్రాంతి తీసుకోనివ్వడం సముచితం అని నాకపించింది.
పశ్చిమ బెంగాల్, పురులియా జిల్లాలోని కంసావతి నది మోకాళ్ల లోతు నీటిలో అతను నేర్పుగా సాగుతున్నప్పుడు, రెండు మీటర్ల ఎత్తున్న నది ఒడ్డుమీంచి కిందికి వస్తూ నేనతన్ని గమనించాను. అతని వేగాన్ని అందుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ, నేనుకూడా ఒడ్డున వేగంగా నడిచాను.
తన వయసును తెలియనివ్వని అతని చురుకుదనం తన నైపుణ్యాన్ని దాచలేకపోవడం విస్మయానికి గురిచేసింది. 50ల చివర వయసున్న ఆ వ్యక్తిని, “కాకా, మీరు నదిలో ఏం చేస్తున్నారు?” అని అడక్కుండా ఉండలేకపోయాను.
అనిరుద్ధ తను నడుముకు సంచిలాగా కట్టుకున్న తెల్లటి గుడ్డను వదులుచేసి, తను పట్టుకున్న వాటినుండి ఒక్క రొయ్యని సున్నితంగా బయటకు తీసి, చిన్నపిల్లాడిలా ఉప్పొంగిపోతూ ఇలా అన్నారు: “చింగ్రీ (రొయ్య)ని చూశారా? ఇది ఈరోజు మా (కుటుంబం) మధ్యాహ్న భోజనం అవుతుంది. సుక్నో లొంకా, రొసున్ వేసి వేయించిన ఈ రొయ్యలు గొరొమ్-భాత్తో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి." ఎండు మిరపకాయలు, వెల్లుల్లివేసి వండిన రొయ్యలు, వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.






