విజయ్ మరోత్తర్ తన తండ్రితో తాను చివరిసారి జరిపిన సంభాషణను తల్చుకుని చాలా బాధపడుతుంటాడు.

అది చాలా తేమగా ఉన్న ఒక వేసవి సాయంత్రం, యవత్మాల్ జిల్లాలోని వారి గ్రామం మెల్లగా మలి సంధ్యలోకి జారుతోంది. అతను మసక వెలుతురుగా ఉన్న గుడిసెలో తన తండ్రికి, తనకు రెండు పళ్ళాలలో - చక్కగా మడతపెట్టిన రెండు రోటీలు, పప్పుకూర, ఒక గిన్నె అన్నం పెట్టాడు.

కానీ అతని తండ్రి ఘనశ్యామ్ ప్లేట్‌ను చూసి ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయారు- ‘ఉల్లిపాయ ముక్కలేవి?’ దానికి ఆయనంత ఎక్కువగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని పాతికేళ్ళ విజయ్ అభిప్రాయం. అయితే, అతను అప్పుడప్పుడూ ఆయన ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నాడు. "కొంతకాలం నుంచి ఆయన పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు," అని చెప్పాడతను. "చిన్న విషయాల మీదే ఆయన పెద్ద రాద్దాంతం చేసేవారు." మహారాష్ట్రలోని అక్పురీ గ్రామంలోని తమ ఒంటి గది గుడిసె బయట ఖాళీ ప్రదేశంలో ప్లాస్టిక్ కుర్చీపై కూర్చునివున్న విజయ్ చెప్పాడు.

విజయ్ వంటగదిలోకి వెళ్లి తన తండ్రి కోసం ఉల్లిపాయ ముక్కలు తరిగాడు. అయితే రాత్రి భోజనం అయ్యాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విజయ్ ఆ రాత్రి చాలా అన్యమనస్కంగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన తండ్రితో మంచిగా మాట్లాడాలనుకున్నాడు.

కానీ ఘనశ్యామ్‌ ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలోంచి లేవలేదు.

59 ఏళ్ల ఆ రైతు రాత్రే పురుగుల మందు తాగారు. విజయ్ మేల్కొనడానికి ముందే ఆయన మరణించారు. అది ఏప్రిల్ 2022.

PHOTO • Parth M.N.

యవత్మాల్ జిల్లా, అక్పురిలోని తన ఇంటి బయట విజయ్ మరోత్తర్. 2022 ఏప్రిల్‌లో ఆత్మహత్య చేసుకున్న తన తండ్రితో తను మాట్లాడిన చివరి మాటలను తల్చుకుని అతను చాలా విచారిస్తున్నాడు

తన తండ్రి మరణించిన తొమ్మిది నెలల తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు కూడా విజయ్, ఇప్పటికీ కాలాన్ని వెనక్కి తిప్పాలనీ, ఆ దురదృష్టకమైన రాత్రి తామిద్దరి మధ్య జరిగిన ఇబ్బందికరమైన సంభాషణను మర్చిపోవాలనీ అనుకుంటున్నాడు. అతను తన తండ్రి ఘనశ్యామ్‌ను, మరణానికి కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడూ ఆందోళనగా ఉండే వ్యక్తిగా మారిపోయినట్టు కాకుండా, అంతకుముందు ఉన్నట్టుగా ఒక ప్రేమగల తండ్రిగా గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని తల్లి, ఘనశ్యామ్ భార్య రెండేళ్ల క్రితమే మరణించారు.

అతని తండ్రి ఆందోళనకు ఆ గ్రామంలోనే ఆ కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమితో చాలా సంబంధం ఉంది. దాంట్లో వాళ్లు సంప్రదాయకంగా పత్తి, తూర్ (కంది) సాగు చేసేవాళ్లు. "గత ఎనిమిది పదేళ్ళుగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని విజయ్ చెప్పాడు. "వాతావరణం ఎలా మారుతుందో అంచనా వేయలేకపోతున్నాం. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చి, వేసవి కాలం చాలా సుదీర్ఘంగా ఉంటోంది. మేం విత్తనాలు వేసిన ప్రతిసారీ అదేదో పాచికలు వేసినట్లే ఉంటోంది.’’

30 ఏళ్లపాటు రైతుగా ఉన్న ఘన్‌శ్యామ్‌కు ఆ అనిశ్చితి తనకు బాగా తెలిసిన, చేస్తున్న ఏకైక పని విషయంలో తన  సమర్థతపట్ల సందేహాలు లేవనెత్తింది. "వ్యవసాయం అనేది అదనుకు సంబంధించిన విషయం," అంటాడు విజయ్. "కానీ మారుతూ పోతున్న వాతావరణ పరిస్థితుల్లో మనకు దాని గురించి సరిగా తెలీడం లేదు. ఆయన పైరు నాటిన ప్రతిసారీ, వర్షాలు కురవకుండా పోయాయి. ఆయన దానిని వ్యక్తిగతంగా తీసుకున్నారు. విత్తిన తర్వాత వర్షం పడనప్పుడు, రెండోసారి వేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి,” అని అతను చెప్పాడు.

రెండోసారి విత్తడం అంటే, ప్రాథమికంగా ఉత్పత్తి ఖర్చును అది రెట్టింపు చేస్తుంది. కానీ పంట వల్ల రాబడి వస్తుందని రైతు ఇంకా ఎదురు చూస్తాడు. అయితే చాలాసార్లు అలా జరగదు. "వర్షాలు సరిగా కురవని ఒక పంటకాలంలో, మాకు రూ. 50,000 నుండి 75,000 మధ్య నష్టం వస్తుంది," అని విజయ్ చెప్పాడు. ఒఇసిడి ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం, వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతలోనూ, అవక్షేపంలోనూ వ్యత్యాసాలకు దారి తీయటం వలన సాగునీరు లభించే ప్రాంతాలలో వ్యవసాయ ఆదాయం 15-18 శాతం తగ్గింది. సాగునీరు లేని ప్రాంతాల్లో ఈ నష్టాలు 25 శాతం వరకు ఉండవచ్చని సర్వే పేర్కొంది.

విదర్భలోని తన ప్రాంతానికి చెందిన అనేకమంది చిన్న రైతులలాగే ఘనశ్యామ్ కూడా ఖరీదైన నీటిపారుదల పద్ధతులను పాటించే స్తోమతలేక, పూర్తిగా వానల మీద ఆధారపడ్డారు. కానీ ఆ వానలెప్పుడూ అవకతవకగానే కురుస్తాయి. "ఇప్పుడింక చినుకులు పడవు," అన్నాడు విజయ్. “అయితే పూర్తిగా వర్షాలు ఉండవు లేదంటే వరదలు వస్తాయి. వాతావరణంలోని ఈ అనిశ్చితి, నిర్ణయాలు తీసుకునే మా సమర్థతపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అది చాలా కలవరపెడుతుంది, అదే మా నాన్నను పిచ్చివానిగా మార్చింది,” అని అతను చెప్పాడు.

PHOTO • Parth M.N.

' ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అది చాలా కలవరపెడుతుంది, అదే మా నాన్నను పిచ్చివానిగా మార్చింది,’ అని విజయ్ అనిశ్చిత వాతావరణం, పంట నష్టాలు, పెరుగుతున్న అప్పులు, మానసిక ఒత్తిళ్లే తన తండ్రి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయని వివరించాడు

నిరంతర అనిశ్చితి, చిట్టచివరికి నష్టాలు ఈ ప్రాంతంలోని రైతుల మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలు. ఈ ప్రాంతం ఇప్పటికే తీవ్ర వ్యవసాయ సంక్షోభానికి , ఆందోళనకరమైన సంఖ్యలో రైతుల ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందింది.

భారతదేశంలో, 2021లో దాదాపు 11, 000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్లలో 13 శాతం మంది మహారాష్ట్రకు చెందినవారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. భారతదేశంలో ఆత్మహత్యల ద్వారా మరణించినవారి సంఖ్యలో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.

అయినా అధికారిక సంఖ్యలు చెప్పేదానికంటే సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పినట్లు, "ప్రతి ఆత్మహత్యతో పాటు, మరో 20 మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడే అవకాశం ఉంది."

ఘనశ్యామ్ విషయానికొస్తే, అనిశ్చిత వాతావరణం కారణంగా కుటుంబానికి క్రమం తప్పకుండా నష్టాలు రావడంతో చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. "మా పొలాన్ని నిలబెట్టుకోవడానికి మా నాన్న ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి నుండి అప్పు తీసుకున్నారని నాకు తెలుసు," అని విజయ్ చెప్పాడు. " కాలక్రమేణా వడ్డీ పెరిగిపోతున్నందున అప్పును తిరిగి చెల్లించాలనే ఒత్తిడి ఆయనపై చాలా ఎక్కువగా ఉండేది."

గత 5 నుండి 8 సంవత్సరాల కాలంలో వచ్చిన కొన్ని వ్యవసాయ రుణ మాఫీ పథకాలలో అనేక లొసుగులున్నాయి. ఏ ఒక్క పథకంలోనూ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల విషయాన్ని పేర్కొనలేదు. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి రైతుల మెడకు గుదిబండగా మారింది. “మేం ఎంత డబ్బు బాకీ ఉన్నామో మా నాన్న ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చనిపోవడానికి ముందు, గత రెండేళ్ళలో విపరీతంగా తాగేవారు,” అని విజయ్ చెప్పాడు.

PHOTO • Parth M.N.

ఘనశ్యామ్ మరణానికి రెండు సంవత్సరాల ముందు, 2020 మే నెలలో, ఆయన భార్య కల్పన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండటంతో ఆమె కూడా ఒత్తిడికి లోనయ్యారు

విపరీతంగా మద్యాన్ని సేవించడం అనేది మానసిక కుంగుబాటు లక్షణమని యవత్మాల్‌లోని మానసిక సామాజిక కార్యకర్త ప్రఫుల్ కాప్సే(37) అంటారు. "చాలా ఆత్మహత్యల వెనుక మానసిక పరిస్థితులుంటాయి," అని ఆయన అంటారు. "అయితే ఇదంతా గుర్తించకుండానే అయిపోతుంది. ఎందుకంటే దీనికి సహాయం కోసం ఎక్కడికి వెళ్లాలో రైతులకు తెలీదు."

ఘన్‌శ్యామ్ చివరకు తన జీవితాన్ని అంతం చేసుకునే ముందు తీవ్రమైన రక్తపోటు, ఆందోళన, ఒత్తిడితో తీవ్రంగా ఇబ్బంది పడడాన్ని ఆయన కుటుంబం గమనించింది. వారికి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఆందోళన, ఒత్తిడితో పోరాడుతున్నది ఆయనొక్కరు మాత్రమే కాదు. రెండు సంవత్సరాల క్రితం మే 2020లో ఆయన భార్య కల్పన, 45 సంవత్సరాల వయస్సులో ఎలాంటి ఆరోగ్య సమస్యా లేకుండా, అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.

"ఆమె వ్యవసాయ భూమిలో పనినీ, ఇంటి పనినీ కూడా చూసుకునేది. పంట నష్టాల కారణంగా, కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. మా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో ఆమె చాలా ఆందోళన చెందింది,” అని విజయ్ చెప్పాడు. "అంతకన్నా వేరే కారణమేదీ నాకు తోచడం లేదు."

కల్పన మరణంతో ఘనశ్యామ్‌ పరిస్థితి మరింత దిగజారింది. "మా నాన్న ఒంటరిగా అయిపోయారు. ఆమె చనిపోయాక ఆయన తనలోకి తాను మరింత ముడుచుకుపోయారు," అని విజయ్ చెప్పాడు. "నేను ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ ఆయన ఎప్పుడూ తన భావాలను నాతో పంచుకునేవారు కాదు. ఆయన నన్ను కాపాడడానికి ప్రయత్నించారని నేను అనుకుంటున్నాను."

తీవ్రమైన వాతావరణ అంశాలు, అనూహ్యమైన శీతోష్ణస్థితి సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్‌డి), భయం, డిప్రెషన్ ఎక్కువగా ఉన్నాయని కాప్సే అంటారు. "రైతులకు ఇతర ఆదాయ వనరులేమీ ఉండవు. చికిత్స జరగనప్పుడు ఒత్తిడి బాధగా మారుతుంది, చివరికి అది కుంగుబాటుకు దారితీస్తుంది. ప్రారంభ దశలో, కుంగుబాటుకు కౌన్సెలింగ్‌తో చికిత్స చేయవచ్చు. కానీ తరువాతి దశలలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు, మందులు వాడటం అవసరమవుతుంది," అని ఆయన చెప్పారు.

నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం భారతదేశంలో మానసిక రుగ్మతల విషయానికి వస్తే, సమస్య వచ్చినపుడు 70 నుండి 86 శాతం వరకు ఆ విషయంలో కలుగజేసుకోవడమే లేదు. 2018 మే నెలలో అమల్లోకి వచ్చిన మానసిక ఆరోగ్య పరిరక్షణ చట్టం 2017 ను ఆమోదించాక కూడా, మానసిక రుగ్మతతో పోరాడుతున్న వ్యక్తులకు అవసరమైన సేవలను అందుబాటులోకి తేవడం, అందించడం ఒక సవాలుగానే మిగిలిపోయింది.

PHOTO • Parth M.N.

యవత్మాల్‌లోని వడ్‌గాఁవ్‌లోని తన ఇంట్లో ఉన్న సీమ. 2015 జూలై నెలలో, 40 ఏళ్ల వయసున్న ఆమె భర్త సుధాకర్ పురుగుమందు తాగి జీవితాన్ని ముగించిన నాటి నుంచి ఆమె తమ 15 ఎకరాల వ్యవసాయ భూమిని సొంతంగా సాగుచేస్తున్నారు

యవత్మాల్ తాలూకాలోని వడ్‌గాఁవ్‌ గ్రామంలో నివసించే సీమా వాణి (42) అనే రైతుకు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం గురించి గానీ, ఆ చట్టం కింద అందుబాటులో ఉన్న సేవల గురించి గానీ ఏ మాత్రమూ తెలియదు. 2015 జూలై నెలలో, 40 ఏళ్ల వయసున్న ఆమె భర్త సుధాకర్ పురుగుమందు తాగి జీవితాన్ని ముగించిన నాటి నుంచి ఆమె తమ 15 ఎకరాల వ్యవసాయ భూమిని సొంతంగా సాగుచేస్తున్నారు.

"నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా కాలమైంది," అని ఆమె చెప్పారు. “నేను చాలా తాణ్ (ఒత్తిడి)తో జీవిస్తున్నాను. నా గుండె చాలాసార్లు వేగంగా కొట్టుకుంటుంటుంది. పోతాత్ గోలా యేతో , పంటల కాలంలో నా కడుపులో ఏదో ఉండచుట్టుకున్నట్టు బాధగా ఉంటుంది’’

ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైన 2022, జూన్ నెల చివరి నాటికి సీమ పత్తిని నాటారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కోసం రూ. లక్ష ఖర్చుచేసి, మంచి దిగుబడిని ఆశించి 24 గంటలు శ్రమించారు. ఆమె తన లక్ష్యమైన, లక్షకు పైగా లాభాన్ని సాధించడానికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో, సెప్టెంబరు మొదటి వారంలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాల వలన ఆమె మూడు నెలల కష్టం కొట్టుకుపోయింది..

“నేను కేవలం రూ. 10,000 విలువైన పంటను మాత్రం కాపాడుకోగలిగాను,” అని ఆమె చెప్పారు. “వ్యవసాయం ద్వారా లాభాలు ఆర్జించడం పక్కన పెడితే, నేను పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకోవడానికి కూడా కష్టపడుతున్నాను. మేం వ్యవసాయ భూమిని నెలల తరబడి కష్టపడి సాగు చేస్తాం, కానీ కేవలం రెండు రోజుల్లో అంతా నాశనమైపోతుంది. నేను దీనిని ఎలా భరించాలి? సరిగ్గా ఇదే పరిస్థితి నా భర్త ప్రాణాలు తీసింది." సుధాకర్ మరణం తరువాత, సీమకు వ్యవసాయ భూమితో పాటు ఒత్తిడి కూడా వారసత్వంగా వచ్చింది.

"ఇంతకుముందరి పంటకాలంలో కరవు కారణంగా మేం  డబ్బును కోల్పోయాం," ఆమె సుధాకర్ చనిపోవడానికి ముందరి సమయం గురించి చెప్పారు. “జూలై 2015లో ఆయన తీసుకున్న పత్తి విత్తనాలు నకిలీవి అని తేలినప్పుడు, ఆయనకు చివరి ఆశ కూడా అడుగంటింది. అదే సమయంలో మా కూతురి పెళ్ళి కూడా చేయాల్సి వచ్చింది. ఆయన ఒత్తిడిని భరించలేకపోయారు. అదే ఆయనను మరణం వైపుకు నెట్టేసింది."

తన భర్త కాలక్రమేణా నిశ్శబ్దంగా మారడాన్ని సీమ చూశారు. ఆయన అన్ని విషయాలను తనలోనే దాచుకునేవారు, కానీ ఆయన అంతటి విపరీతమైన చర్యకు పాల్పడతారని ఆమె ఊహించలేదు. "గ్రామస్థాయిలోనైనా మాకు కొంత సహాయం అందుబాటులో ఉండాలి కదా?" అని ఆమె అడుగుతున్నారు.

PHOTO • Parth M.N.

తన పంటలో మిగిలిన పత్తితో సీమ

మానసిక ఆరోగ్య పరిరక్షణ చట్టం 2017 ప్రకారం సీమ కుటుంబానికి మంచి నాణ్యమైన కౌన్సెలింగ్, థెరపీ చికిత్సలు లభించాలి. మానసిక చికిత్సా గృహాలు, ఆశ్రయం, సహాయంతో కూడిన వసతి సులభంగా అందుబాటులో ఉండాలి.

సామాజిక స్థాయిలో, 1996లో ప్రవేశపెట్టిన డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (డిఎమ్ఎచ్‌పి) ప్రకారం ప్రతి జిల్లాకు ఒక సైకియాట్రిస్ట్, ఒక క్లినికల్ సైకాలజిస్ట్, ఒక సైకియాట్రిక్ నర్సు, ఒక సైకియాట్రిక్ సామాజిక కార్యకర్త ఉండాలి. అదనంగా, తాలూకా స్థాయిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తికాల క్లినికల్ సైకాలజిస్ట్ లేదా, సైకియాట్రిక్ సామాజిక కార్యకర్త ఉండాలి.

కానీ యవత్మాల్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిఎచ్‌సి)లో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేది ఎంబిబిఎస్ చదివిన వైద్యులే. పిఎచ్‌సిలో అర్హత కలిగిన సిబ్బంది లేరని యవత్మాల్ డిఎమ్ఎచ్‌పి కోఆర్డినేటర్ డాక్టర్ వినోద్ జాదవ్ అంగీకరించారు.

"వాళ్ళ (ఎంబీబీఎస్ డాక్టర్) స్థాయిలో కేసును నిర్వహించలేనప్పుడు మాత్రమే దానిని జిల్లా ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది," అని ఆయన అన్నారు.

తన గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని కౌన్సెలింగ్ సేవలను గురించి సీమ తెలుసుకున్నప్పటికీ, వాటిని పొందాలంటే మాత్రం, వెళ్ళి రావడానికి ఒక రెండు గంటల బస్సు ప్రయాణం చేసేందుకు సిద్ధపడాలి. ఇక అందుకయ్యే ఖర్చు గురించి చెప్పనవసరం లేదు.

"ఈ సహాయం పొందడానికి గంటసేపు బస్సు ప్రయాణం చేయడమంటే అది ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కౌన్సెలింగ్ కేంద్రాలను సందర్శించాలి కదా," అని కాప్సే అన్నారు. తమకు సహాయం అవసరమని ప్రజలను అంగీకరించేలా చేయడమే సమస్య అయినప్పుడు, దానికి తోడు ఇది మరో కొత్త సమస్య అవుతుంది.

మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు డిఎమ్ఎచ్‌పి ఆధ్వర్యంలోని తమ బృందం యవత్మాల్‌లోని 16 తాలూకాలలో ప్రతి ఏటా ఔట్‌రీచ్ క్యాంపును నిర్వహిస్తుందని జాదవ్ చెప్పారు. "మా వద్దకు రమ్మని అడగడానికి బదులు వాళ్ళు ఉన్న చోటికే వెళ్లడం మంచిది. మాకు తగినన్ని వాహనాలు గానీ నిధులు గానీ లేవు, కానీ మేం చేయగలిగినంతా చేస్తున్నాం.’’

రాష్ట్ర డిఎమ్ఎచ్‌పికి గత మూడేళ్ళలో రెండు ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసిన నిధులు దాదాపు రూ. 158 కోట్లు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్‌లో 5.5 శాతం, అంటే దాదాపు రూ. 8.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

మహారాష్ట్ర డిఎమ్ఎచ్‌పికి కుంచించుకుపోతున్న బడ్జెట్ దృష్ట్యా, చాలామంది విజయ్‌లు, సీమలు అటువంటి శిబిరాలను సందర్శించే అవకాశం చాలా తక్కువ.

PHOTO • Parth M.N.

ఆధారం: సమాచార హక్కు చట్టం, 2005 కింద కార్యకర్త జితేంద్ర ఘాడ్గే సేకరించిన సమాచారం ఆధారంగా

PHOTO • Parth M.N.

ఆధారం: ఆరోగ్య శాఖ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా

గత కొన్ని సంవత్సరాలుగా ఈ శిబిరాల సంఖ్య తగ్గింది. అదే సమయంలో కరోనా వలన ఒంటరితనం, ఆర్థిక కలహాలు, మానసిక దుర్బలత్వం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. మానసిక ఆరోగ్యం కోసం సహాయం అవసరమయ్యే వ్యక్తుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తున్న ధోరణి ఆందోళన కలిగిస్తోంది.

"ఈ శిబిరాల వల్ల చాలా కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతారు. శిబిరాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా, రోగులు మాత్రం మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉంటుంది" అని యవత్మాల్‌కు చెందిన మానసిక వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ చక్కర్వార్ చెప్పారు. "ప్రతి ఆత్మహత్య వ్యవస్థ వైఫల్యానికి గుర్తు. ప్రజలు రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని తీసుకోరు. ఇది అనేక ప్రతికూల సంఘటనల ఫలితం,” అని ఆయన చెప్పారు.

రైతుల జీవితాలలో ఈ ప్రతికూల సంఘటనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి.

తండ్రి ఘనశ్యామ్ మరణించిన ఐదు నెలల తర్వాత విజయ్ మరోత్తర్ తన వ్యవసాయ భూమిలో మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ఉన్నాడు. సెప్టెంబరు 2022 నాటి భారీ వర్షం కారణంగా అతని పత్తి పంట చాలావరకు కొట్టుకుపోయింది. ఇది జీవితంలో అతను వేసిన మొదటి పంట. అతనికి దారి చూపడానికి గానీ మద్దతు ఇవ్వడానికి గానీ తల్లిదండ్రులు లేరు. తన సమస్యలతో తానే పోరాడాలి.

నీటిలో మునిగిపోయిన తన వ్యవసాయ భూమిని మొదటిసారిగా చూసినప్పుడు, దానిని రక్షించడానికి అతను కనీసం వెంటనే రంగంలోకి దిగలేకపోయాడు. ఏమీ చేయలేని స్థితిలో అలా చూస్తూ నిలబడ్డాడు. తన మెరిసే తెల్లటి దూది శిథిలావస్థకు చేరుకుందని తెలుసుకోవడానికి అతనికి కొంచెం సమయం పట్టింది.

"నేను పంటపై దాదాపు 1.25 లక్షలు (రూపాయలు) పెట్టుబడి పెట్టాను" చెప్పాడు విజయ్. “నేను దానిలో చాలా వరకు పోగొట్టుకున్నాను. కానీ నేను నిలదొక్కుకోవాలి, ఓటమిని అంగీకరించకూడదు."

ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి అందే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా పార్థ్ ఎం.ఎన్. ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదిస్తున్నారు. ఈ నివేదికలోని అంశాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు ఎలాంటి సంపాదకీయ నియంత్రణా లేదు.

మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే లేదా, ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే, దయచేసి కిరణ్ అనే జాతీయ హెల్ప్‌లైన్‌ 1800-599-0019 (24/7 టోల్ ఫ్రీ)కి లేదా మీకు సమీపంలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనికైనా కాల్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల గురించి, సేవల గురించి సమాచారం కోసం, దయచేసి SPIF’s mental health directory ని సందర్శించండి.

అనువాదం: రవి కృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna