"మాలాంటి ముసలివాళ్ళకు పింఛనులు ఎవరిస్తారు? ఎవరూ ఇవ్వరు," ఒక ఎన్నికల ర్యాలీలో కుర్చీలో కూర్చొని ఉన్న ఒక పెద్దవయసు వ్యక్తి పెద్ద గొంతుతో ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థి జవాబిచ్చాడు, " తావూ , నీకు పింఛను వస్తుంది. తాయి కి కూడా నెలకు రూ. 6000 పింఛను వస్తుంది." ఈ మాటలు వింటోన్న మరో వృద్ధుడు తన తలపాగాను తీసి ఆశీర్వదిస్తున్నట్లుగా తన ప్రసంగాన్ని ముగిస్తోన్న ఆ అభ్యర్థి తలపై ఉంచారు. ఈ ఉత్తర భారత రాష్ట్రంలో అలా చేయడం ఆ వ్యక్తిని గౌరవించడానికి గుర్తు.

2024 లోక్ సభ ఎన్నికలలో తన నియోజకవర్గమైన రోహ్‌తక్‌లో ప్రచారం చేస్తోన్న ఆ అభ్యర్థి దీపేందర్ హుడ్డా. ప్రజలు విన్నారు. వారిలో కొంతమంది ప్రశ్నలు వేశారు, తమ మనసులో ఉన్న ఆలోచనలను పంచుకున్నారు.

(తాజా పరిస్థితి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన దీపేందర్ హుడ్డా ఆ స్థానాన్ని 7,83,578 వోట్లతో గెల్చుకున్నారు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.)

*****

సంస్కరణ పేరుతో రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నించిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?" అని మే 25వ తేదీన జరగబోయే పోలింగ్ కంటే ముందే, మే నెల ప్రారంభంలో క్రిషన్ PARIని అడిగారు. మేం రోహ్‌తక్ జిల్లా, కలానౌర్ బ్లాక్‌లోని నిగానా అనే గ్రామంలో ఉన్నాం. ఇది పంట కోతల కాలం. గోధుమ పంట కోతలు పూర్తయ్యాయి, రైతులు రాబోయే వరి పంటకాలం కోసం తమ పొలాలను సిద్ధం చేసుకుని వానలు పడటం కోసం ఎదురుచూస్తున్నారు. కనుచూపు మేరలో ఒక్క మబ్బు కూడా కనిపించనందున రోడ్లపైనున్న దుమ్ము, మండుతున్న పొలాల నుండి వచ్చే పొగ గాలిలో స్వేచ్ఛగా కలిసిపోయాయి.

ఇక్కడి ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతోంది; ఎన్నికల జ్వరం కూడా పెరిగిపోతోంది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే నలబై ఏళ్ళు దాటిన క్రిషన్ అక్కడికి దగ్గరగా ఉన్న ఒక ఇంటిలో పనిచేస్తున్నారు. వారం రోజులు సాగే ఆ పనికి ఆయనకు రోజుకు రూ. 500 చొప్పున వస్తుంది. ఆయన రోజువారీ కూలి పనులు కూడా చేస్తుండటంతో పాటు ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు. రోహ్‌తక్ జిల్లాలోని ఈ ప్రాంతంలోని ప్రజల్లో ఎక్కువమంది తమ జీవనం కోసం పొలం పనుల మీద, నిర్మాణస్థలాలలో పనుల పైన, ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ (మహాత్మా గాంధీ దేశీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) పనులపైనా ఆధారపడతారు.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

నిగానాకు చెందిన దినసరి కూలీ క్రిషన్ (ఎడమ). 'సంస్కరణ పేరుతో రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నించిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?' అని అడుగుతారాయన. రోహ్‌తక్ జిల్లాలోని ఈ ప్రాంతంలోని ప్రజల్లో ఎక్కువమంది పొలం పనుల మీద, నిర్మాణస్థలాలలో పనుల పైన, ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ పనులపైనా ఆధారపడతారు

ఆయన ఇంటికి వెళ్ళే దారిలో మేమొక కూడలి ప్రదేశాన్ని చేరుకున్నాం. "రైతులు, కార్మికులు ఒక కూడలిలో ఉన్నారు," అన్నారు క్రిషన్. " సామ్ దాన్ దండ్ భేధ్ ఉపాయాల ద్వారా నాలుగు వేపుల నుంచి తాపులు తింటున్నారు." ఇక్కడ క్రిషన్ కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పాలనలో కీలక సూత్రాలుగా నిర్దేశించిన సామ దాన భేద దండోపాయాల గురించి చెప్తున్నారు. చాణక్యుడిగా కూడా పిలిచే కౌటిల్యుడు మూడవ శతాబ్దం, బిసిఇలో జీవించిన భారతీయ ఉపాధ్యాయుడు, వ్యూహకర్త, రాజ సలహాదారు.

కానీ ఇక్కడ క్రిషన్ మాట్లాడుతున్నది ఆధునిక చాణక్యుడి గురించి!

"దిల్లీ సరిహద్దులో సంభవించిన 700 మందికి పైగా రైతుల మరణాలకు అధికార పార్టీ [బిజెపి] బాధ్యత తీసుకోవటంలేదు," అని 2020లో జరిగిన చారిత్రాత్మక రైతుల నిరసనలను ప్రస్తావిస్తూ, అనేక విమర్శలను ఎదుర్కొని, ఒక సంవత్సరం తర్వాత బిజెపి వెనక్కు తీసుకున్న వ్యవసాయ చట్టాలను ఖండిస్తూ అన్నారతను.

"లఖింపూర్ ఖేరీలో టేనీ (బిజెపి నాయకుడి కొడుకు) రైతులను ఎలా తొక్కించేశాడో గుర్తుందా? యే మార్నే మేఁ కంజూసి నహీ కర్తే [చంపే విషయానికి వస్తే వాళ్ళేమీ లోభించరు]." ఉత్తరప్రదేశ్‌లో 2021లో జరిగిన సంఘటన ఆయన మనసులో ముద్రించుకుపోయింది.

లైంగిక వేధింపులకు పాల్పడిన తన సొంత శాసనసభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై బిజెపి ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆయనలాంటి వ్యక్తులకు ఎంతమాత్రం నచ్చలేదు. “సాక్షి మలిక్, ఇంకా చాలామంది ప్రఖ్యాత రెజ్లర్లు గత సంవత్సరం కొత్త దిల్లీలో నెలల తరబడి నిరసనలు చేశారు. ఒక మైనర్‌తో సహా పలువురు మహిళలను లైంగికంగా వేధించినందుకు అతన్ని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు,” అన్నారాయన.

మహిళలపై హింసను కట్టడి చేస్తామని 2014లో బిజెపి వాగ్దానం చేసింది. "ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయాయి?" క్రిషన్ ప్రశ్నించారు. "స్విట్జర్‌లాండ్ నుంచి నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి మన అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని వాగ్దానం చేశారు. చివరకు మాకు దక్కింది ఆకలి, బత్తెం (రేషన్)."

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా, నిగానా గ్రామానికి చెందిన 42 ఏళ్ళ శ్రామిక మహిళ బబ్లీ (ఎడమ). 'పదేళ్ళ క్రితం జీవితం ఏమంత సుఖంగా లేదు, కానీ అప్పుడు ఇప్పుడున్నంత కష్టంగా అయితే లేదు,' అంటారామె. 2024 సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయమని అభ్యర్థిస్తోన్న ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా ప్రకటన బోర్డు (కుడి)

ఇంటి వద్ద ఆయన వదినగారైన బబ్లీ అప్పుడే చుల్హా (పొయ్యి) మీద ఉదయపు ఆహారం తయారుచేయటాన్ని ముగించారు. ఆమె భర్త ఆరేళ్ళ క్రితం కాలేయ వ్యాధితో చనిపోయారు. అప్పటి నుండి 42 ఏళ్ళ బబ్లీ ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ ప్రదేశాలలో పనిచేస్తున్నారు.

"నాకు ఒక పూర్తి నెల పని దొరకటమే కష్టంగా ఉంది. ఒకవేళ పని చేసినా కూడా సమయానికి డబ్బు చెల్లించరు. డబ్బులు ఇచ్చినా కూడా అది ఎంత తక్కువగా ఉంటుందంటే, దానితో ఇల్లు గడుపుకోవటం చాలా కష్టం," అంటారామె. 2024 మార్చి నెలలో ఆమె ఏడు రోజులు పనిచేశారు, కానీ ఆమెకు రావలసిన రూ. 2,345 ఇంతవరకూ చెల్లించనే లేదు.

గత నాలుగేళ్ళలో హరియాణాలో ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ కింద అందుబాటులో ఉండే పని గణనీయంగా తగ్గిపోయింది . 2020-21లో ఈ చట్టం కింద వాగ్దానం చేసిన ప్రకారం రాష్ట్రంలోని 14,000 కుటుంబాలకు 100 రోజుల పని లభించింది. 2023-2024లో ఆ సంఖ్య 3,447కి పడిపోయింది. రోహ్‌తక్ జిల్లాలో, 2021-22లో 1,030 కుటుంబాలకు 100 రోజుల పని లభించగా, 2023లో కేవలం 479 కుటుంబాలకు మాత్రమే లభించింది.

'పదేళ్ళ క్రితం జీవితం ఏమంత సుఖంగా లేదు, కానీ అప్పుడు ఇప్పుడున్నంత కష్టంగా అయితే లేదు,' అంటారు బబ్లీ.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ఈ ఎన్నికలలో ధరల పెరుగుదల చాలా కీలకమైన సమస్య అని కేశూ ప్రజాపతి (కుడి) అంటారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో వంటపని చేసే రామ్‌రతి (కుడి) తనకు వచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదని చెప్పారు

నిగానా నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కహ్‌నౌర్‌లో, ధరల పెరుగుదల ఈ ఎన్నికలలో అత్యంత ముఖ్యమైన అంశంగా కేశూ ప్రజాపతి భావిస్తున్నారు. కేశూ (44) ఇళ్ళలో, భవనాలలో నేలపై పలకలను అమర్చే పని చేస్తారు. అతను ఉప్పు, పంచదార వంటి ప్రధాన వస్తువుల ధరలను బట్టి ద్రవ్యోల్బణాన్ని లెక్కవేస్తారు. రోహ్‌తక్‌లోని కార్మిక సంఘమైన భవన్ నిర్మాణ్ కారిగర్ మజ్దూర్ యూనియన్ సభ్యుడు, దినసరి కూలీ అయిన కేశూ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం లీటలు పాల ధర రూ. 30-రూ. 35 ఉండేదని,  ఇప్పుడది రూ. 70 అయినదని; అప్పుడు రూ. 16 ఉన్న కిలో ఉప్పు, ఇప్పుడు రూ. 27 అయిందని అన్నారు.

“రేషన్ మన హక్కు. ఇప్పుడది ప్రభుత్వం వేసే భిక్ష లాగా అనిపిస్తోంది, దాని కోసం మనం వంగి వంగి నమస్కారాలు చేయాలి." ప్రస్తుతం, పసుపు కార్డు ఉన్నవారికి ఐదు కిలోల గోధుమలు, ఒక కిలో చక్కెర, వంట నూనె లభిస్తుండగా, గులాబీ రంగు కార్డు ఉన్నవారికి నెలకు 35 కిలోల గోధుమలు లభిస్తున్నాయి. "గతంలో ప్రభుత్వం రేషన్‌ మీద కిరోసిన్‌ ఇచ్చేది. ఇప్పుడది నిలిపివేశారు. ఎల్‌పిజి [లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్] సిలిండర్‌లను రీఫిల్ చేయించుకోవడం కష్టం. మాకు చనా [పచ్చి సెనగపప్పు], ఉప్పు కూడా వచ్చేవి,” అన్నారతను. అయితే, ఇప్పుడు వాటి సరఫరా లేదు.

వస్తువుల జాబితాలో ఇక ఉప్పు లేకపోవడంతో, "ఇప్పుడు కనీసం మేం 'హమ్నే సర్కార్ కా నమక్ నహీ ఖాయా ' [మేం ప్రభుత్వం ఉప్పును తినలేదు కాబట్టి ఇప్పటి పాలనలో ఉన్న ప్రభుత్వానికి విశ్వాసంగా ఉండాల్సిన అవసరం లేదు] అని చెప్పగలం," అన్నారాయన.

హరియాణాలోని 'డబుల్ ఇంజన్' ప్రభుత్వమే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. అయితే కహ్‌నౌర్ ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా ఉన్న రామ్‌రతి వంటివారికి ఆ ప్రభుత్వం పెద్దగా ఏం చేయలేదు. రామ్‌రతి (48) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తారు. "అంత వేడిలో, మంటల ముందు ఒక నిమిషం కూడా భరించలేనంతటి వేడిలో, నేను నెలకు 6,000 రోటీలు చేస్తాను." ఈ పనికి ఆమెకు నెలకు రూ. 7,000 వేతనంగా ఇస్తారు. తాను పడే శ్రమలో సగానికి చెల్లింపులేమీ ఉండవని ఆమె భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం వలన ఆరుగురున్న ఆమె కుటుంబాన్ని నిర్వహించడం చాలా కష్టం అవుతోంది. ఇంకా ఆమె తాను ఇంటిలో చేసే పనిని లెక్క కట్టడం లేదు. "నేను సూర్యుని పగటి వేళల కంటే ఎక్కువ సమయమే పని చేస్తాను," అని ఆమె చెప్పారు.

PHOTO • Amir Malik

గత నాలుగేళ్ళలో హరియాణాలో ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ కింద అందుబాటులో ఉండే పని గణనీయంగా తగ్గిపోయింది. రోహ్‌తక్ జిల్లాలో, 2021-22లో 1,030 కుటుంబాలకు 100 రోజుల పని లభించగా, 2023లో కేవలం 479 కుటుంబాలకు మాత్రమే లభించింది. ఎడమ నుంచి కుడికి: హరీశ్ కుమార్, కలా, పవన్ కుమార్, హరి చంద్, నిర్మల, సంతోష్, పుష్ప

"నేను మందిర్ [రామాలయం]కు వోటు వేయను. ఆ కశ్మీర్ విషయంలో కూడా నేను చేసేదేమీ లేదు," అంటారు హరీశ్ కుమార్. బిజెపి సాధించానని సగర్వంగా చెప్పుకునే ఈ రెండు విషయాలు - అయోధ్యలో ఆలయ ప్రారంభం, (జమ్ము కశ్మీర్‌కు సంబంధించి) రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయటం - ఈ దినసరి కూలీ పై ఎలాంటి ప్రభావాన్ని వేయలేదు.

కహ్‌నౌర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని మకరౌలీ కలాఁలో రోడ్డు నిర్మాణ పనుల్లో హరీశ్ తీరికలేకుండా ఉన్నారు. దారుణమైన ఉక్కపోతలో హరీశ్‌తో పాటు మరికొంతమంది స్త్రీపురుషులు పని చేస్తుండగా భారీ వాహనాలు ఆ పక్కగా వెళుతున్నాయి. మహిళలు ఒకదాని తర్వాత మరొకటి కాంక్రీట్ దిమ్మెలను ఎత్తి, అందిస్తుంటారు. పురుషులు ఎరుపు, బూడిదరంగు, పసుపు రంగుల దిమ్మెలను కలిపి నున్నని రోడ్డును తయారుచేస్తారు.

హరీశ్ కలానౌర్ తహసీల్‌ లోని సంపల్ గ్రామానికి చెందినవారు. ఈ పని చేసినందుకు ఆయనకు రోజుకు రూ. 500 లభిస్తాయి. "ద్రవ్యోల్బణం వేగాన్ని మా రోజువారీ వేతనం అందుకోలేకపోతోంది. మజబూరీ మేఁ మెహనత్ బేచ్నే కో మజ్దూరీ కెహతే హైఁ [తప్పనిసరి పరిస్థితులలో తమ శ్రమను అమ్ముకోవటం ద్వారా మాత్రమే జీవనం సాగించేవారే శ్రామికులు]."

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

నున్నని రోడ్డును తయారుచేయటం కోసం రోహ్‌తక్ తహసీల్‌లోని మకరౌలీ కలాఁ వద్ద మహిళా దినసరి కూలీలు కాంక్రీటు దిమ్మెలను పైకి ఎత్తుతుంటారు. నిర్మల (కుడి) ఇతరుల్లాగానే మాడ్చివేసే వేసవికాలపు ఎండలో పనిచేయాలి

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ట్రాక్టర్ నుంచి సిమెంటు కట్టలను ఎత్తుతోన్న హరీశ్, పవన్ (ఎర్ర చొక్కా). వీరు కహ్‌నౌర్‌కు 30 కిలోమీటర్ల దూరాన ఉన్న మకరౌలీ కలాఁలో ఒక రహదారి నిర్మాణ పనిలో ఉన్నారు

మధ్యాహ్న భోజనం ముగించిన తర్వాత, కాంక్రీట్ కలిపే పనికి తిరిగివెళ్ళాలి కాబట్టి అతను త్వరపడ్డారు. భారతదేశంలోని దాదాపు తన తోటి పనివారందరిలాగే, అతను కూడా ఈ ఉగ్రమైన వాతావరణంలో తక్కువ జీతానికి అధిక శ్రమ చేస్తున్నారు. "నేను పని మొదలుపెట్టిన రోజున, డబ్బు సంపాదిస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారని అనుకున్నాను. ఈ రోజు వరకు, నేను ఇప్పటికీ ఆ కాస్త గౌరవం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను,” అని ఆయన చెప్పారు.

"వేతనం పెంచాలనేది ఒక్కటి మాత్రమే మా డిమాండ్ కాదు. మేం సమానత్వాన్ని కూడా కోరుకుంటున్నాం."

ఒక శతాబ్దం క్రితం, కలానౌర్ తహసీల్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మైలురాయి సందర్భాన్ని చూసింది. కలానౌర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మహాత్మా గాంధీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌లు ప్రసంగించారు. నవంబర్ 8, 1920న, రోహ్‌తక్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఈ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మైలురాయిగా నిరూపితమయింది

2024లో, రోహ్‌తక్ ప్రజలు మళ్ళీ ఒక కూడలిలో నిలిచి ఉన్నారు. ప్రజాస్వామ్యంతో తమ దేశం చేసే ప్రయత్నంలో, మనుగడ కోసం తాము చేసే పోరాటంలో మరో మలుపు కోసం వారు ఎదురు చూస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Amir Malik

عامر ملک ایک آزاد صحافی، اور ۲۰۲۲ کے پاری فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Amir Malik
Editor : Medha Kale

میدھا کالے پونے میں رہتی ہیں اور عورتوں اور صحت کے شعبے میں کام کر چکی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں مراٹھی کی ٹرانس لیشنز ایڈیٹر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز میدھا کالے
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli