"బడ్జెట్ అంతా పెద్ద మొత్తాలకు సంబంధించినది. ప్రభుత్వానికి పౌరుడిగా నా విలువ సున్నా!"

సర్కారీ బడ్జెట్’ అన్న మాటలు వినగానే చాంద్ రతన్ హల్దార్ తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించటం లేదు. “ఏం బడ్జెట్? ఎవరి బడ్జెట్? ఇది పెద్ద బూటకం తప్ప మరొకటి కాదు!" 53 ఏళ్ళ చాంద్ రతన్ కొల్‌కతాలోని జాదవ్‌పూర్‌లో రిక్షా లాగుతుంటారు.

"అనేక బడ్జెట్లు, అనేక పథకాల తర్వాత కూడా మేం దీదీ [ముఖ్యమంత్రి మమతా బెనర్జీ] నుంచి గానీ, మోదీ [ప్రధానమంత్రి] నుంచి గానీ ఒక ఇంటిని పొందలేకపోయాం. మేం ఇప్పటికీ టార్పాలిన్ పైకప్పూ, వెదురు కంచెతో కట్టిన గుడిసెలోనే నివాసముంటున్నాం. అదికూడా ఒక అడుగు లోతున భూమిలోపలికి కుంగిపోయింది," కేంద్ర బడ్జెట్ గురించిన ఆశలు మరింత లోతుకు కుంగిపోయినట్టుగా అన్నారు చందూ దా .

పశ్చిమ బెంగాల్‌లోని సుభాష్‌గ్రామ్ పట్టణానికి చెందిన భూమి లేని చాంద్ రతన్, తెల్లవారుజామున శియాల్‌దాకు వెళ్ళే లోకల్ రైలులో జాదవ్‌పూర్ చేరుకుంటారు. అక్కడ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళే వరకు పని చేస్తారు. “మా లోకల్ రైళ్లతో పాటే బడ్జెట్‌లు వస్తాయి, వెళ్తాయి. ఇప్పుడు నగరానికి రావడం చాలా కష్టంగా మారింది. మా ఖాళీ కడుపుల మీద తన్నుతోన్న అలాంటి బడ్జెట్ వల్ల ఉపయోగం ఏమిటి?" అని అడుగుతారాయన.

PHOTO • Smita Khator
PHOTO • Smita Khator

ఎడమ: పశ్చిమ బెంగాల్‌లోని సుభాష్‌గ్రామ్ పట్టణానికి చెందిన చాంద్ రతన్ హల్దార్ రిక్షా లాగే పని చేయడానికి ప్రతిరోజూ కొల్‌కతాకు వస్తారు. 'మా లోకల్ రైళ్లతో పాటు బడ్జెట్లూ వస్తాయి, వెళ్తాయి. ఇప్పుడు నగరానికి రావడం చాలా కష్టంగా మారింది,' అంటారాయన. కుడి: కణితి లేచిన తన కాలును చూపుతోన్న చాంద్ రతన్

చుట్టూ ఉండే ఇతరులు ఆప్యాయంగా చందూ దా అని పిలుచుకునే ఈయన, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం గేట్ నంబర్ 4 ఎదురుగా ప్రయాణీకుల కోసం వేచి ఉంటారు. ఒకప్పుడు 20 కంటే ఎక్కువ వాహనాలతో సందడిగా ఉండే ఈ రిక్షా లైన్, ఇప్పుడు అతని రిక్షాతో సహా కేవలం మూడు రిక్షాలతో మిగిలిపోయింది. ఆయన రోజుకు రూ. 300-500 వరకూ సంపాదిస్తారు.

"నేను నాలుగు దశాబ్దాలకు పైగా పని చేస్తున్నాను. నా భార్య వేరొకరి ఇంట్లో కష్టం చేస్తుంది. ఎన్నో కష్టాలు పడి మేం మా ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాం. ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదు. ఎప్పుడూ ఒక్క పైసా దొంగతనం చేయలేదు, ఏ మోసమూ చేయలేదు. ఇప్పటికీ రోజుకు రెండు పూటలా తిండి తినలేకపోతున్నాం. ఈ 7, 10, లేదా 12 లక్షల [రూపాయలు] గురించి మాట్లాడే మాటల వల్ల మాకేమైనా ఉపయోగం ఉంటుందని మీరనుకుంటున్నారా?

"పెద్ద మొత్తాలలో డబ్బులు సంపాదించేవారికే బడ్జెట్ మినహాయింపులు ఇస్తుంది. వ్యాపారం పేరుతో బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయేవాళ్ళను ప్రభుత్వం ఏమీ చేయదు. కానీ నావంటి ఒక పేద రిక్షావాడు ఎప్పుడైనా తప్పు దోవలో వెళ్తూ పట్టుబడితే, మా రిక్షాను జప్తు చేసుకుంటారు, పోలీసులకు లంచాలు ఇవ్వలేకపోతే మమ్మల్ని వేధిస్తారు," అని ఆయన PARIతో చెప్పారు.

ఆరోగ్య సంరక్షణా రంగంలో ప్రతిపాదించిన బడ్జెట్ చర్యలను గురించి విన్న చందూ దా , తనలాంటి వ్యక్తులు కనీస ఆరోగ్య సంరక్షణను పొందేందుకు కూడా చాలాసేపు వరుసల్లో నిలబడి ఒక రోజంతా వేచి ఉండాల్సిరావటం గురించి ఎత్తిచూపారు. "మీరే చెప్పండి, నేను ఆసుపత్రికి వెళ్ళటానికి నా సంపాదనను వదులుకోవలసి వస్తే, చౌకరకం మందుల వలన ఉపయోగం ఏమిటి?" ఆయన కణితి లేచిన తన కాళ్ళలో ఒకదానిని చూపిస్తూ, "నేను దీని వలన ఇంకా ఎన్ని బాధలుపడాలో నాకు తెలియకుండా ఉంది," అన్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Smita Khator

اسمِتا کھٹور، پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) کے ہندوستانی زبانوں کے پروگرام، پاری بھاشا کی چیف ٹرانسلیشنز ایڈیٹر ہیں۔ ترجمہ، زبان اور آرکائیوز ان کے کام کرنے کے شعبے رہے ہیں۔ وہ خواتین کے مسائل اور محنت و مزدوری سے متعلق امور پر لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز اسمیتا کھٹور
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli