నా జీవితకాలమంతా
చూపు మేరలో ఒడ్డు కానరాక,
రాత్రింబవళ్ళూ నావను నడుపుతూనేవున్నా.
అంత విశాలమైనదీ మహాసాగరం
మరో వంక తుఫానులు;
నేను ఒడ్డు చేరే గతిని
ఇక్కడ ఏ ఒక్కటీ సూచించటంలేదు
కానీ నా వల్ల కాదు
ఈ పడవకోలను వదిలెయ్యలేను
అవును, ఆయన పోరాటాన్ని ఆపలేదు. తాను ఓడిపోయే యుద్ధంలో ఊపిరితిత్తుల కేన్సర్‌తో జీవితపు చివరి క్షణాల వరకూ పోరాటం చేశారు.
చాలా నొప్పిగా ఉండేది. ఊపిరితీసుకోవడానికి ఆయన తరచుగా కష్టపడేవారు. కీళ్ళు నెప్పేట్టేవి. రక్తహీనత, బరువు తగ్గిపోవటం, ఇంకా ఎన్నో రుగ్మతలుండేవి. పూర్తిగా శక్తంతా లాగేసినట్లయి ఎక్కువసేపు కూర్చోలేకపోయేవారు. అయినా వజేసింగ్ పార్గి తన ఆసుపత్రి గదిలో మమ్మల్ని కలవటానికీ, జీవితం గురించీ కవిత్వం గురించీ మాతో మాట్లాడటానికీ అంగీకరించారు.
దాహోద్‌లోని ఇటావా గ్రామంలో ఒక పేద భిల్ ఆదివాసీ సముదాయంలో - ఆధార్ కార్డ్ ప్రకారం - 1963లో పుట్టిన ఆయన పట్ల జీవితం ఎన్నడూ దయ చూపించలేదు.
ఛిస్కా భాయ్, చతుర బెన్‌ల పెద్దకుమారుడిగా పెరిగిన తన అనుభవాల సారాన్ని ఆయన పదే పదే ఒకే మాటలో చెప్పారు, అదేదో మకుటంలాగా, "పేదరికం... పేదరికం." కొద్దిసేపు విరామం. తన కళ్ళ ముందు మొండిగా కదలాడే ఆ చిన్ననాటి చిత్రాలను వదిలించుకోలేక లోతుకుపోయిన కళ్ళను రుద్దుకుంటూ ఆయన తన ముఖం తిప్పుకున్నారు. "ఇంట్లో తిండి కోసం తగినంత డబ్బు ఎప్పుడూ ఉండేది కాదు."
బతుక్కి ముగింపు ఉంటుంది
ఈ రోజువారీ అలవాటుకు లేదు
ఒక రొట్టె కొలత
భూమి కన్నా ఎంతో పెద్దది
ఆకలితో అలమటించేవాళ్ళు,
వాళ్ళు మాత్రమే ఎరుగుదురు
ఒక రొట్టె విలువ ఎంతో
అది నిన్ను ఏ చీకటిలోకి తీసుకుపోతుందో
దాహోద్‌లోని కైౙర్ నర్సింగ్ హోమ్‌లో ఉపశాంతి కోసం చికిత్స తీసుకుంటూ, తన ఆసుపత్రి పడక మీదున్న వజేసింగ్ పార్గీ ఆయన కవితలను మాకోసం చదివి వినిపించారు
"నేనిలా చెప్పకూడదు, కానీ మేం గర్వంగా చెప్పుకోగలిగిన తల్లిదండ్రులు మాకు లేరు," వజేసింగ్ చెప్పుకున్నారు. తీవ్రమైన వేదన, అవమానాలతో అసలే బలహీనంగా ఉన్న ఆయన దేహం మరింతగా కుంచించుకుపోయినట్టయింది, "ఇటువంటి మాటలు మాట్లాడకూడదని నాకు తెలుసు, కానీ అవలా బయటికి వచ్చేశాయనుకుంటాను." దాహోద్‌లోని కైౙర్ మెడికల్ నర్సింగ్ హోమ్‌లో ఉన్న ఆ చిన్న గదిలో ఒక మూలన, సుమారు 85 ఏళ్ళ వయసుండే వృద్ధురాలైన ఆయన తల్లి, ఒక రేకు ఎత్తుపీట మీద కూర్చొనివున్నారు. ఆమెకు సరిగా వినిపించదు. "నా తల్లిదండ్రులెప్పుడూ కష్టపడుతుండటాన్నే నేను చూశాను. మా అమ్మానాన్నలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు." ఆయన ఇద్దరు చెల్లెళ్ళు, నలుగురు తమ్ముళ్ళు, తల్లిదండ్రులు వారి గ్రామంలో మట్టి, ఇటుకలతో కట్టిన ఒక ఒంటిగది ఇంటిలో నివసించారు. వజేసింగ్ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇటావాను వదిలి అహమ్మదాబాద్‌కు వచ్చినప్పుడు కూడా థల్‌తేజ్ చాఁల్‌లో ఒక గోడకు ఉన్న చిన్న అద్దె గుంతలో నివసించేవారు. ఆయన సన్నిహిత స్నేహితులు కూడా ఆయన్ని కలవడానికి చాలా అరుదుగా తప్ప వెళ్ళని ప్రదేశమది.
నేను నిలుచుంటే,
పైకప్పు తగులుతుంది
తిన్నగా నిఠారైతే
గోడ తాకుతుంది
ఏదోలాగ నా జీవితకాలం గడిపా
ఇక్కడే, బంధీగా
నాకు సాయపడింది
నా అలవాటు
నా తల్లి గర్భంలో ముడుచుకుని దాగిన నా అలవాటు.
లేమి గురించిన ఈ కథ వజేసింగ్ ఒక్కరిదే కాదు; ఈ కవి కుటుంబం నివసించే ఈ ప్రాంతంలో పేదరికం చాలాకాలంగా సాధారణమైపోయి ఉన్నదే. దాహోద్ జిల్లా జనాభాలో 74 శాతం మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు, వారిలో 90 శాతం మంది వ్యవసాయంలోనే ఉన్నారు. కానీ వారికున్నవి చాలా కొద్దిపాటి ఉత్పాదకతనిచ్చే చిన్న చిన్న భూభాగాలు కావటం; ఎక్కువగా కరవు పీడిత మెట్ట భూములు కావటంతో వారికి సరిపోయినంత అదాయం రాదు. తాజాగా నిర్వహించిన బహుముఖ పరిమాణాత్మక పేదరిక సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో పేదరికం రేటు రాష్ట్రంలోనే అత్యధికంగా 38.27 శాతంగా ఉంది.
" ఘనీ తక్లీ కరీన్ మోటా కరియా సా ఎ లోకున్ ధంధా కరీ కరీన్ ," తల్లిగా తన జీవితాన్ని గురించి చెప్తూ అన్నారు వజేసింగ్ తల్లి చతురా బెన్. " మజూరి కరేన్, ఘెర్నూ కరేన్, బిఝనూ కరేన్ ఖవ్డాయూ సా . (నేను చాలా శ్రమతో కూడిన పని చేశాను. ఇంట్లో పనిచేసుకున్నాను, ఇతరుల ఇళ్ళల్లో పనులు చేశాను, ఏదో ఒకటి చేసి వారికి తినటానికి సమకూర్చేదాన్ని)" కొన్నిసార్లు వాళ్ళు జొన్న అంబలి మీదే బతికిన రోజులున్నాయి, ఆకలితోనే బడికి వెళ్ళేవాళ్ళు. పిల్లలను పెంచటం అంత తేలికైన పనేమీ కాదని అంటారామె.
గుజరాత్‌లో అణగారిన వర్గాల గొంతులు వినిపించడానికి అంకితమైన నిర్ధార్ పత్రికకు 2009లో రెండు భాగాలుగా రాసిన తన జ్ఞాపకాలలో వజేసింగ్, విశాల హృదయమున్న ఒక ఆదివాసీ కుటుంబం గురించి రాశారు. ఆ సాయంత్రం తమకు అతిథులుగా ఉన్న కొంతమంది చిన్న పిల్లల ఆకలి తీర్చడం కోసం జొఖో దామొర్, అతని కుటుంబం తాము ఆకలితో మిగిలిపోయారు. ఆ పిల్లల్లో ఐదుగురు బడి నుంచి ఇంటికి వెళ్తూ భారీ వర్షంలో చిక్కుకొని జొఖో ఇంట్లో ఆశ్రయం పొందిన ఆ సంఘటన గురించి మాట్లాడుతూ, " భాదర్వో మాకెప్పుడూ ఆకలితో నిండిన నెలే," అన్నారు వజేసింగ్. భాదర్వో గుజరాత్‌లో ప్రబలంగా వాడుకలో ఉన్న హిందూ విక్రమ్ సంవత్ కేలండర్‌లో పదకొండవ నెల. అది గ్రెగోరియన్ కేలండర్‌లో సెప్టెంబర్ నెలతో సమానం.
"ఇంట్లో నిలవ ఉంచిన తిండి గింజలు అయిపోతాయి; పొలంలో వున్నవి ఇంకా కోతకు సిద్ధం కావు, అంచేత పొలాలు పచ్చగా ఉన్నప్పటికీ ఆకలికి మాడటమే మాకు గతి. ఆ నెలల్లో రోజులో రెండు పూటలా పొయ్యి వెలగటమనేది చాలా అరుదుగా కొన్ని ఇళ్ళల్లో మాత్రమే మీరు చూడగలరు. అంతకు ముందరి ఏడాది కరవు వచ్చివుంటే, వేయించిన లేదా ఉడకబెట్టిన మహువా (ఇప్ప పువ్వు) మీదే అనేక కుటుంబాలు ప్రాణాలు నిలబెట్టుకుంటాయి. దారుణమైన పేదరికం మా సముదాయానికి పుట్టుకతో వచ్చిన శాపం.
అయితే ఇప్పటి తరానికి భిన్నంగా అప్పటి ప్రజలు ఆకలితో చనిపోవడానికైనా సిద్ధపడేవారు కానీ తమ ఇళ్ళనూ, తమ గ్రామాలనూ విడచి పనికోసం వెతుక్కుంటూ ఖేడా, వడోదరా, అహమ్మదాబాద్ వంటి ప్రదేశాలకు వలస వెళ్ళేవారుకాదని వజేసింగ్ చెప్పారు. విద్యకు సముదాయంలో పెద్దగా విలువనిచ్చేవారు కాదు. "మేం పశువులను కాయడానికి వెళ్ళినా, బడికి వెళ్ళినా అంతా ఒకటే. మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే - పిల్లలు చదవటం రాయటం నేర్చుకుంటే చాలని. అంతే. బాగా చదువుకొని ప్రపంచాన్ని ఏలాలని ఎవరికుంటుందిక్కడ!"
అయితే, వజేసింగ్‌కు కలలుండేవి - చెట్లతో పాటు పైపైకి ఎదగాలనీ, పక్షులతో ముచ్చటపెట్టాలనీ, మాయ రెక్కలతో సముద్రాల మీదుగా ఎగిరిపోవాలనీ. ఆయనకు ఆశలుండేవి - దేవతలు తనను కష్టాల నుంచి గట్టెక్కిస్తారనీ, సత్యం గెలుపునీ, అబద్ధాల ఓటమినీ చూడాలనీ, దేవుడు సాత్వికుల పక్షానే ఉండాలనీ - అచ్చం తాతయ్య చెప్పిన కథల్లోలా జరగాలని. కానీ జీవితం ఆ కల్పిత కథలకు సరిగ్గా విరుద్ధంగా మారిపోయింది.
అయినప్పటికీ, ఆ ఆశ
తాత చిన్నతనంలో నాలో నాటిన ఆశ -
అద్భుతం కూడా సాధ్యమేననే ఆశ -
దృఢంగా పాతుకుపోయింది.
ఈ సహించ వీలుకాని జీవితాన్ని
నేను జీవించే కారణం, అదే
ఈ రోజుకి, ప్రతి రోజుకీ
ఏదైనా మలుపు తిప్పే అద్భుతం జరగబోతోందనే ఆశతో
జీవితం పట్ల ఉన్న ఈ ఆశే ఆయన్ని తన జీవితాంతం విద్య కోసం పోరాడేలా చేసింది. దాదాపు యాదృచ్ఛికంగా ఆయన చదువు మార్గంలోకి అడుగుపెట్టగానే, తీవ్రమైన కాంక్షతో ఆ మార్గం వెంట ఆయన సాగిపోయారు- బడికి వెళ్ళేందుకు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం నడవ్వలసివచ్చినా, వసతిగృహంలో ఉండాల్సివచ్చినా, ఆకలితో నిద్రపోవాల్సివచ్చినా, తిండి కోసం ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవలసివచ్చినా, ప్రిన్సిపాల్ కోసం ఒక సీసా మద్యాన్ని కొనవలసివచ్చినా. తన గ్రామంలో హయ్యర్ సెకండరీ పాఠశాల లేకపోయినా, దాహోద్ వేళ్ళేందుకు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోయినా, దాహోద్‌లో అద్దెకు ఉండేందుకు డబ్బు లేకపోయినా, ఆయన తన విద్యను వదలకుండా కొనసాగేలా చూసుకున్నారు. ఖర్చులు గడుపుకోవటం కోసం భవన నిర్మాణ పనులకు వెళ్ళటం, రాత్రులు రైల్వే ప్లాట్‌ఫామ్ మీద గడపటం, ఆకలితో నిద్రపోవటం, నడక సాగించటం, బోర్డ్ పరీక్షలకు హాజరు కావడానికి ముందు పబ్లిక్ స్నానశాలలను ఉపయోగించటం- ఈ పనులన్నీ ఆయన చదువుకోవటం కోసమే చేశారు.
జీవితంలో ఓడిపోకూడదని వజేసింగ్ నిశ్చయించుకున్నారు:
నేను జీవిస్తూ ఉండగా తరచూ
తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది
గుండె ఒక్క క్షణం లయ తప్పుతుంది
నేను కూలబడిపోయేవాడిని.
అయినా చలించక, ప్రతిసారీ
చావుని చెంత చేరనివ్వని
రగులుతున్న సంకల్పం
నాలో పెరుగుతూవస్తుంది
అప్పుడే, నా అంతట నేనే నిలదొక్కుకుంటాను
మళ్ళీ మళ్ళీ జీవించడానికి సిద్ధంగా.
గుజరాతీ భాషలో పట్టభద్రత (బి.ఎ.) కోసం నవజీవన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరినప్పుడే నిజమైన చదువులోని ఆనందాన్ని ఆయన పొందగలిగారు. పట్టభద్రుడయ్యాక మాస్టర్స్‌లో చేరేందుకు నమోదు చేసుకున్నారు. ఎమ్.ఎ. మొదటి ఏడాది తర్వాత బి.ఎడ్. చదవాలనే ఉద్దేశ్యంతో దాన్ని వదిలేశారు. ఆయనకు డబ్బు అవసరం ఉంది, ఉపాధ్యాయుడు కావాలనుకున్నారు. బి.ఎడ్. పూర్తయిన కొద్దికాలానికే, అనుకోకుండా ఒక పోరాటం మధ్యలోకి వెళ్ళటంతో అప్పటి యువ ఆదివాసీ అయిన వజేసింగ్ దవడనూ, మెడనూ చీల్చుకుంటూ ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఏడేళ్ళ పాటు జరిగిన చికిత్స, 14 సర్జరీలు, తీర్చలేని అప్పుల తర్వాత కూడా ఆయన కోలుకోలేకపోయారు. ఈ గాయం వలన వజేసింగ్ స్వరం కూడా దెబ్బతిన్నది. ఆ విధంగా ఈ ప్రమాదం ఆయన జీవితాన్నే మార్చివేసింది.
అది దెబ్బ మీద దెబ్బ. అసలే నోరులేని సమాజంలో పుట్టిన ఈయనకు వ్యక్తిగతంగా లభించిన స్వరం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆయన ఉపాధ్యాయుడు కావాలనే తన స్వప్నాన్ని వదులుకొని కాయకష్టానికి దిగారు. సర్దార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్‌లో కాంట్రాక్టు పని, ఆ తరువాత ప్రూఫ్ రీడింగ్ వైపు మొగ్గు చూపవలసి వచ్చింది. ప్రూఫ్ రీడర్‌గా తాను చేసిన పని ద్వారానే వజేసింగ్ తన మొదటి ప్రేమ అయిన భాషతో తిరిగి కలిశారు. రెండు దశాబ్దాలకు పైగా వచ్చిన అనేక రచనలను ఆయన చదవగలిగారు.
ఆయన పరిశీలనలేమిటి?
"భాష గురించి నేనేమనుకుంటానో మీతో స్పష్టంగా చెప్తాను," అంటూ ఎంతో ఉత్సాహంగా ఆయన మాట్లాడారు. "గుజరాతీ సాహిత్యజీవులు భాష పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. పదాల వాడకం పట్ల కవులు ఎంతమాత్రం సున్నితత్వాన్ని చూపించరు; వారిలో ఎక్కువమంది గౙల్స్ మాత్రమే రాస్తారు, వారు శ్రద్ధ చూపేది భావావేశం గురించే. అదే ముఖ్యమని వారనుకుంటారు. పదాలదేముంది; అవి అక్కడే ఉంటాయి." పదాల గురించిన ఈ సూక్ష్మ అవగాహన, వాటి అమరిక, కొన్ని అనుభవాలను వ్యక్తీకరించే వాటి శక్తి - వీటిని వజేసింగ్ తన స్వంత కవితలలోకి తీసుకువచ్చారు. ఆయన కవిత్వం ప్రధాన స్రవంతి సాహిత్యం ప్రశంసించని, గుర్తించని రెండు సంపుటాలుగా సంకలనం చేసివుంది.
"మరింత నిలకడగా రాసివుండాలని ఊహిస్తున్నా," తనను ఎన్నడూ ఒక ఎంచదగిన కవిగా ఎందుకు పరిగణించలేదో ఆయన హేతుబద్ధంగా చెప్పారు. “నేను ఒకటి రెండు కవితలు రాస్తే ఎవరు పట్టించుకుంటారు? ఈ రెండు సంకలనాలు ఇటీవలివి. నేను కీర్తి కోసం రాయలేదు. క్రమం తప్పకుండా కూడా రాయలేకపోయాను. చాలా సీరియస్‌గా కూడా రాయలేదని నాకు అనిపిస్తోంది. ఆకలి మా జీవితాలలో అల్లుకుపోయింది, కాబట్టి నేను దాని గురించి రాశాను. ఇది ఒక సహజమైన వ్యక్తీకరణ మాత్రమే.” మా సంభాషణ అంతటా ఆయన తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు - ఎవరినీ నిందించడానికి ఇష్టపడలేదు, పాత గాయాలను తెరవడానికి ఇష్టపడలేదు, తనకు రావలసిన పేరు గురించి చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. కానీ ఆయనకు స్పష్టంగా తెలుసు…
ఎవరో ఖచ్చితంగా
మా వంతు కాంతిని మింగేశారు,
మేం ఎల్లకాలం
ఆ సూర్యునితో పాటు సజీవంగా మండుతున్నప్పటికీ
మా బతుకుల్లో
ఏ ఒక్కటీ వెలగదు.
ప్రూఫ్ రీడర్‌గా ఆయన వృత్తిగత జీవితం పక్షపాతం, ఆయన నైపుణ్యాలను తక్కువగా అంచనా వేయటం, ఆయన పట్ల భేదభావంతో వ్యవహరించటం వంటి వాటితో గడిచింది. ఒక మీడియా సంస్థ ప్రవేశ పరీక్షలో ఆయన 'ఎ' గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, 'సి' గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించినవారికి ఇచ్చేదానికంటే కూడా తక్కువ వేతనం ఉండే ఉద్యోగాన్ని ఆయనకు ఇవ్వజూపారు. వజేసింగ్ చాలా కలతపడ్డారు; ఆ నిర్ణయం వెనుక ఉన్న మూలసూత్రాలను ఆయన ప్రశ్నించారు. చివరకు ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు.
అహ్మదాబాద్‌లో ఆయన వివిధ మీడియా సంస్థలతో చిన్న చిన్న కాంట్రాక్టులపై అతి తక్కువ వేతనానికి పనిచేశారు. వజేసింగ్‌ను మొదటిసారి కలిసేటప్పటికి కిరీట్ పర్మార్ అభియాన్ కోసం రాస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, “2008లో నేను అభియాన్‌లో చేరినప్పుడు, వజేసింగ్ సంభావ్ మీడియాలో పనిచేస్తున్నారు. అధికారికంగా అతను ఒక ప్రూఫ్ రీడర్, కానీ అతనికి మనం ఒక కథనాన్ని ఇస్తే, అతను దానిని సవరించగలడని మనకు తెలుసు. ఆయన ఆ కథనానికి నిర్మాణాన్నీ, ఆకృతినీ అందించడానికి దాని కంటెంట్‌తో పనిచేసేవారు. భాష విషయంలోనూ ఆయన పనితీరు అద్భుతం. కానీ ఆయన తన యోగ్యతకు తగిన గౌరవాన్ని పొందలేదు, ఆయనకు అర్హమైన అవకాశం కూడా రాలేదు," అన్నారు.
ఆయన సంభావ్‌లో ఉండగా నెలకు రూ. 6,000 మాత్రమే సంపాదించేవారు. ఆ డబ్బు ఆయన కుటుంబ సంరక్షణకు, ఆయన తమ్ముళ్ళ, చెల్లెళ్ళ చదువులకు, అహమ్మదాబాద్‌లో ఆయన జీవనం గడపడానికి ఏమాత్రం సరిపోయేది కాదు. దాంతో ఆయన ఇమేజ్ ప్రచురణలతో స్వతంత్రంగా పనిచేయటం మొదలుపెట్టారు. కార్యాలయంలో పగటిపూట ఎన్నో గంటలు పనిచేసివచ్చిన తర్వాత ఇంటి వద్ద ఈ పనిని చేసేవారు.
"మా తండ్రిని కోల్పోయినప్పటి నుంచి ఆయన నాకు తండ్రే తప్ప అన్న కాడు," వజేసింగ్ చిన్న తమ్ముడైన ముకేశ్ పార్గి (37) అన్నారు. "ఎంతో గడ్డుకాలంలో కూడా నా చదువుకయిన ఖర్చునంతా వజేసింగ్ భరించాడు. థల్‌తేజ్‌లో ఒక కూలిపోయిన చిన్న గదిలో ఆయన నివాసముండటం నాకు గుర్తుంది. ఆ గదికి పైనున్న రేకుల కప్పు మీద రాత్రంతా కుక్కలు పరుగెడుతుండటాన్ని మేం విన్నాం. ఆయన సంపాదించే ఐదారువేల రూపాయలతో తన బాగోగులు చూసుకోవటమే ఆయనకు కష్టంగా ఉండేది, కానీ మా చదువుల కోసం ఆయన వేరే పనులు కూడా చేసేవాడు. ఆ విషయాన్ని నేనెన్నడూ మర్చిపోను."
గత ఐదారేళ్ళుగా వజేసింగ్ అహమ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రూఫ్ రీడింగ్ పనిలో చేరారు. "నా జీవితంలో ఎక్కువ భాగం నేను కాంట్రాక్ట్ పనులే చేశాను. సిగ్నెట్ ఇన్ఫోటెక్ నేను ఇటీవలనే చేరిన కంపెనీ. గాంధీజీకి చెందిన నవజీవన్ ప్రెస్‌తో వాళ్ళకు ఒప్పందం ఉండటంతో చివరికి నేను వారు ప్రచురించే పుస్తకాలకు పనిచేస్తున్నాను. నవజీవన్ కంటే ముందు నేను ఇతర ప్రచురణ సంస్థలకు కూడా పనిచేశాను," అన్నారు వజేసింగ్. "కానీ గుజరాత్‌లోని ఏ ప్రచురణ సంస్థలో కూడా ప్రూఫ్ రీడర్‌కు శాశ్వత స్థానం లేదు."
వజేసింగ్ స్నేహితుడూ రచయితా అయిన కిరీట్ పర్మార్‌తో జరిగిన ఒక సంభాషణ లో ఆయన "గుజరాత్‌లో మంచి ప్రూఫ్ రీడర్లు దొరకటం కష్టం. ఇందుకు వారికిచ్చే పారితోషికం చాలా తక్కువగా ఉండటం ఒక కారణం. ప్రూఫ్ రీడర్ భాషకు సంరక్షకుడు, స్నేహితుడూ కూడా. మనం అతని పనిని గౌరవించి తగినంత పారితోషికం ఇవ్వకపోతే ఎలా? మనం అంతరించిపోతోన్న జీవజాతిగా మారిపోతున్నాం. అయితే దీనివలన ఎవరికి నష్టం, గుజరాతీ భాషకు తప్ప," అన్నారు. గుజరాత్ మీడియా సంస్థల ఘోర స్థితిని వజేసింగ్ చూశారు. వారు భాషను గౌరవించరు, ప్రూఫ్ రీడర్ అవ్వాలంటే ఎవరైనా ఆ భాషలో చదవగలిగి, రాయగలిగితే వాళ్ళకు అదే చాలు.
"ఈ సాహిత్య లోకంలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన ఏమిటంటే, ప్రూఫ్ రీడర్‌కు ఎలాంటి జ్ఞానం, శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత ఉండవని," అంటారు వజేసింగ్. మరోవైపు ఆయనే గుజరాతీ భాషకు సంరక్షకుడిగా మిగిలారు. "గుజరాతీ విద్యాపీఠ్ సార్థ్ జోడణీ కోశ్ (ఒక ప్రసిద్ధ నిఘంటువు)లో చేర్చేందుకు 5,000 కొత్త పదాలను అనుబంధంగా చేర్చింది," అంటూ కిరీట్ భాయ్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. "అందులో భయంకరమైన తప్పులున్నాయి- అక్షరక్రమంలోనే కాకుండా వాస్తవికతకు, వివరాలకు సంబంధించిన లోపాలు కూడా ఉన్నాయి. వజేసింగ్ వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేసి, వాటి జవాబుదారీతనం గురించి వాదించాడు. ఈ రోజున గుజరాత్‌లో వజేసింగ్ చేసినంత పనిని మరెవ్వరూ చేయగా నేను చూడలేదు. రాష్ట్ర బోర్డు పాఠశాలల 6,7,8 తరగతుల పాఠ్య పుస్తకాలలో తాను కనిపెట్టిన తప్పులను గురించి కూడా ఆయన రాశాడు." అన్నారు కిరీట్.
అంతటి ప్రతిభ, సామర్థ్యాలున్నప్పటికీ వజేసింగ్ జీవించేందుకు ఈ ప్రపంచం శత్రుపూరితంగానే మిగిలిపోయింది. అయినప్పటికీ ఆయన ఆశను గురించీ, సానుకూల దృక్పథం గురించీ రచనలు చేశారు. తనకున్న వనరులతోనే తాను జీవించాలని ఆయనకు తెలుసు. ఆయన చాలా కాలం క్రితమే దేవునిపై నమ్మకాన్ని పోగొట్టుకున్నారు.
నేను పుట్టాను
ఒక చేతిలో ఆకలితో
మరో చేతిలో శ్రమతో
ఓ దేవుడా!
నిన్ను పూజించేందుకు
మూడో చెయ్యిని ఎక్కడనుంచి తేవాలో చెప్పు!
వజేసింగ్ జీవితంలో దేవుడి స్థానంలో తరచుగా కవిత్వం వచ్చి చేరింది. ఆయన 2019లో ఆగియాను అజవాళున్ (మిణుగురుల వెలుతురు), 2022లో ఝాకళ్నా మోతి (మంచుబిందువుల ముత్యాలు) అనే రెండు కవితా సంకలనాలను, మరికొన్ని కవితలను తన మాతృభాష అయిన పంచమహాలీ భీలీ లో ప్రచురించారు.
జీవితమంతా అన్యాయం, దోపిడీ, వివక్ష, లేమితో నిండివున్నా ఈ జీవిత చరమాంకంలో అతని కవితల్లో పగ గానీ, కోపం గానీ ఉండవు. ఫిర్యాదులు లేవు. “నేను ఎక్కడ ఫిర్యాదు చేయాల్సుంటుంది? సమాజానికా? మనం సమాజానికి ఫిర్యాదు చేయలేం; అది మన గొంతులు నొక్కేస్తుంది,” అని ఆయన చెప్పారు.
కవిత్వం ద్వారా వజేసింగ్ వ్యక్తిగత పరిస్థితులకు అతీతంగా ఎదగడానికి, మానవ స్థితికి సంబంధించిన వాస్తవిక సత్యాన్ని అనుసంధానించే అవకాశాన్ని కనిపెట్టారు. ఆయన ఉద్దేశ్యంలో వర్తమానంలో ఆదివాసీ, దళిత సాహిత్యాలు విఫలం కావటానికి వాటికి విస్తృతి లేకపోవడమే కారణం. “నేను కొంత దళిత సాహిత్యాన్ని చదివాను. అందులో పెద్దగా మానవ సంబంధాల విస్తృతి లేకపోవడాన్ని గమనించాను. అదంతా మాపై జరిగిన అఘాయిత్యాల గురించి ఫిర్యాదు చేయడమే. కానీ మేం అక్కడ నుండి ఎక్కడికి వెళ్తాం? ఆదివాసీల గొంతులు ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్నాయి. వాళ్ళు కూడా తమ జీవితాల గురించి చాలానే మాట్లాడుతున్నారు. పెద్ద ప్రశ్నలు మాత్రం ఎప్పుడూ తలెత్తవు, ” అని ఆయన చెప్పారు.
దాహోద్‌కు చెందిన కవి, రచయిత ప్రవీణ్ భాయ్ జాదవ్ “నేను పెరుగుతోన్న వయసులో పుస్తకాలు చదివేవాడిని. మా సముదాయం నుంచి, మా ప్రాంతం నుంచి కవులెవరూ ఎందుకు లేరా అని ఆశ్చర్యపోయేవాడిని. 2008లోనే నేను ఒక సంకలనంలో వజేసింగ్ పేరును చూశాను. ఆ మనిషిని తెలుసుకోవడానికి నాకు నాలుగేళ్ళు పట్టింది! ఆ తర్వాత ఆయన నన్ను కలిసేలా చేయడానికి మరికొంత సమయం పట్టింది. ఆయన ముషాయిరాల కవి కాదు. ఆయన కవితలు మా అట్టడుగువర్గాలవారి నొప్పి గురించి, జీవితాల గురించి మాట్లాడతాయి," అన్నారు.
కళాశాలలో ఉన్న సంవత్సరాల్లోనే వజేసింగ్'కు కవిత్వం చెప్పడం వచ్చింది. అందుకోసం తీవ్రమైన వెతుకులాటకు కానీ, శిక్షణకు గానీ ఆయనకు సమయం లేకపోయింది. "రోజంతా కవిత్వం నా మనసులో తిరుగుతూనే ఉండేది. అవి ఒకోసారి పదాలకు లొంగే, మరికొన్నిసార్లు తప్పించుకుపోయే నా ఉనికికి చంచలమైన వ్యక్తీకరణలు. అందులో చాలా భాగం చెప్పకుండానే మిగిలిపోయింది. ఏ సుదీర్ఘ ప్రక్రియనూ నేను నా మనసులో ఉంచుకోలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైన రీతిని ఎంచుకున్నాను. ఇంకా అనేక కవితలు రాయకుండానే మిగిలిపోయాయి."
గత రెండేళ్ళుగా ప్రాణాంతక అనారోగ్యమైన ఊపిరితిత్తుల కేన్సర్ రాయకుండానే మిగిలిపోయిన కవితల దొంతరకు మరింత జోడించింది. వజేసింగ్ జీవితాన్నీ, అన్ని బాధలను ఎదుర్కొంటూ కూడా ఆయన సాధించిన విజయాలనూ చూసినప్పుడు ఆయన రాయకుండా మిగిలిపోయినవేమిటో మనకు అర్థమవుతుంది. కేవలం తనకోసమే కాక, తన సముదాయం కోసం ఆయన నిలిపివుంచిన ‘మినుకుమినుకుమంటోన్న మిణుగురుల కాంతి’ రాయకుండానే మిగిలిపోయింది. ఎలాంటి రక్షణనిచ్చే ఆల్చిప్ప లేకుండానే ఆయన చేతిలో వికసించిన ‘మంచుబిందువుల ముత్యాలు’ అలా రాయకుండానే మిగిలిపోయాయి. క్రూరమైన, దయలేని ప్రపంచంలో కరుణనూ, సహానుభూతినీ నిలుపుకొన్న స్వరం అద్భుత లక్షణాలు రాయకుండానే మిగిలిపోయాయి. మన భాషకు చెందిన ఉత్తమ కవుల జాబితాలో వజేసింగ్ పార్గీ పేరు కూడా రాయకుండానే మిగిలిపోయింది.
కానీ వజేసింగ్ విప్లవ కవి కాదు. ఆయనకు మాటలు మెరుపులు కూడా కాదు.
నేనిక్కడ వేచి చుస్తూ పడి ఉన్నా
నా వైపుగా దూసుకొచ్చే ఆ ఒక్క గాలిదెబ్బ కోసం
నేనొక బూడిద కుప్పనైతేనేమి!
రగిలే జ్వాలనైతే కాను, నేను
గడ్డి పరకను కూడా కాల్చలేను.
కానీ నేను ఖచ్చితంగా వారి కళ్ళలోకి చొచ్చుకుపోతా
విసిగిస్తా
వారిలో ఒక్కరైనా
తన కళ్ళను ఎర్రబడేంతగా రుద్దుకునేలా చేస్తా.
ఇప్పుడు, మన కళ్ళకు గుచ్చుకునే, మన మనస్సాక్షిని కదిలించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రచురితం కాని 70 కవితలను మనకోసం మిగిల్చి వెళ్ళారు. మనం కూడా ఆ గాలిదుమారం కోసం ఎదురు చూద్దాం.
ఝూలడి*
నా చిన్నప్పుడు,
బాపా నాకోసం ఒక ఝూలడి తెచ్చాడు
కాని అది ఒక్క ఉతుక్కే ముడుచుకుపోయింది
రంగు విడిచింది,
దారాలన్నీ విడిగా ఊడొచ్చాయి
నాకదింక నచ్చలేదు
నేను కోపంతో మొండికేశా -
నేనీ ఝూలడిని తొడుక్కోను.
మా నా తల నిమిరింది
దగ్గరికి తీసుకొని బుజ్జగించింది,
'అది చిరిగే వరకు తొడుక్కో బిడ్డా,
తర్వాత మనం కొత్తది కొందాం, సరేనా?'
ఆనాడు నేను వద్దనుకున్న ఝూలడి లాగా
ఈనాడు నా కాయం వేలాడుతోంది
మేనంతా ముడతలు
కరిగిపోతోన్న కీళ్ళు
నా ప్రతి శ్వాసకూ కంపిస్తున్నా
నా మనసు కలతపడుతోంది-
నాకింక ఈ దేహం వద్దు!
ఈ శరీరపు పట్టును విడిచే ప్రయత్నం చేసేటప్పుడు
అమ్మనూ ఆమె తీపి పలుకులనూ గుర్తుచేసుకున్నా-
'అది చిరిగే వరకు తొడుక్కో బిడ్డా!'
అది పోయాక...
ప్రచురించని ఆయన గుజరాతీ కవిత నుంచి అనువాదం.
*ఝూలడి ఆదివాసీ సముదాయాలలోని పిల్లలు ధరించే ఒక సంప్రదాయక కుట్టుపని చేసిన పై వస్త్రం.
తన మరణానికి కొద్ది రోజుల ముందు మాతో మాట్లాడినందుకు రచయిత వజేసింగ్ పార్గీకి రచయిత తన అపారమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కథనాన్ని నివేదించేందుకు సహాయపడిన ముకేశ్ పార్గీకి, కవి, సామాజిక కార్యకర్త కాంజీ పటేల్‌కు, నిర్ధార్ సంపాదకుడు ఉమేశ్ సోలంకికి, వజేసింగ్ స్నేహితుడు, రచయిత కిరీట్ పర్మార్‌కు, గలాలియావాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైన సతీష్ పర్మార్‌కు కూడా ధన్యవాదాలు.
ఈ కథనంలో ఉపయోగించిన కవితలన్నీ వజేసింగ్ పార్గీ గుజరాతీలో రాసినవే. ఈ కవితలను ప్రతిష్ఠ పాండ్య ఆంగ్లంలోకి అనువాదం చేశారు.
అనువాదం:
కవితలు: నిహారికా రావ్ కమలం
పాఠ్యభాగం: సుధామయి సత్తెనపల్లి