"మేడాపురంలో ఉగాదిని మేం జరుపుకున్నంత బాగా మరెక్కడా జరుపుకోరు," అంటారు పసల కొండన్న. 82 ఏళ్ళ ఈ రైతు ప్రతి ఏటా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వచ్చే తెలుగువారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్‌లోని తన గ్రామంలో ఎలా జరుపుకుంటారో గర్వంగా చెపుతుంటారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని మేడాపురం అనే ఈ గ్రామంలో షెడ్యూల్డ్ కులాల సముదాయంవారు ఈ వేడుకలకు నాయకత్వం వహించి జరిపిస్తుంటారు.
ఉగాదికి ముందునాటి రాత్రి దేవుని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుపోవడంతో పండుగ ప్రారంభమవుతుంది. ఒక గుహ నుండి ఆలయం వరకు విగ్రహం చేసే ప్రయాణాన్ని భక్తులు ఎంతో నిరీక్షణతోనూ ఉత్సాహంతోనూ చూస్తారు. 6,641 మంది జనాభా (జనగణన 2011) ఉన్న మేడాపురం గ్రామంలో, అల్ప సంఖ్యాకులైనప్పటికీ, ఆలయ సంరక్షకులైన ఎనిమిది కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించే ఒక చిన్న ఎస్సీ సముదాయం ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
ఉగాది రోజున, రంగురంగుల అలంకరణలు చేసిన వాహనాలతో గ్రామం కళకళలాడుతూ ఉంటుంది. ఈ వాహనాలను పండుగ వేడుకలకు గుర్తుగా ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. సాముదాయక సమాజ భావనకూ, రాబోయే సంవత్సరానికి ఆశీర్వాదాలకూ గుర్తుగా భక్తులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. వాహనాల ఊరేగింపు ముగియగానే మధ్యాహ్నం నుంచి పంజు సేవ మొదలవుతుంది. ఈ ఆచారం కోసం, ఇందులో పాల్గొనేవారు ముందురోజు రాత్రి వాహనాలు ఊరేగింపు చేసిన మార్గాన్ని శుద్ధి చేయడానికి అదే మార్గంలో ఊరేగింపుగా సాగుతారు.
విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకురావడానికి సంబంధించిన మొత్తం కథను తిరిగి ప్రదర్శిస్తూ ఈ పండుగ, మాదిగ సముదాయపు పోరాటాలను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి