నర్క్ హై యే (ఇది నరకం).”

తన గ్రామం వెంబడి, పారిశ్రామిక వ్యర్ధాలతో కలుషితమై ప్రవహిస్తున్న బుడ్డా నాలా గురించి కశ్మీరా బాయి వివరిస్తున్నారు. ఆమె ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న సత్లజ్ నదిలోకి అది ప్రవహిస్తుంది.

ప్రస్తుతం మలి నలభైలలో ఉన్న కశ్మీరా బాయి, తాగునీటి అవసరాల కోసం తన గ్రామ ప్రజలు ఒకప్పుడు ఆధారపడిన స్వచ్ఛమైన నదిని గుర్తు చేసుకున్నారు. లుధియాణాలోని కూమ్‌కలాఁ గ్రామంలో ఉద్భవించిన బుడ్డా నాలా , కశ్మీరా బాయి గ్రామమైన వలీపూర్ కలాఁ పక్కన ఉన్న సత్లజ్‌ నదిలో కలిసే ముందు, 14 కిలోమీటర్లు లుధియాణా గుండా ప్రవహిస్తుంది.

అసీఁ తాఁ నర్క్ విచ్ బైఠే హా (మేము నరకంలో కూర్చున్నాం). వరదలు వచ్చినప్పుడల్లా నల్లని మురుగునీరు మా ఇళ్ళలోకి ప్రవేశిస్తుంది. రాత్రంతా పాత్రలలో ఉంచితే గనుక, ఆ నీరు పసుపు రంగులోకి మారుతుంది,” అన్నారామె.

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

ఎడమ: లుధియాణాలోని కూమ్‌కలాఁ  గ్రామంలో ఉద్భవించిన బుడ్డా నాలా, లుధియాణా గుండా 14 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అటుపై, అది వలీపూర్ కలాఁ గ్రామం వద్ద సత్లజ్‌లో కలుస్తుంది. కుడి: ‘వరదలు వచ్చినప్పుడల్లా మురుగునీరు మా ఇళ్లలోకి ప్రవేశిస్తుంది’ వలీపూర్ కలాఁకు చెందిన కశ్మీరా బాయి తెలిపారు

ఆగస్ట్ 24, 2024న, కలుషిత జలాల వల్ల ప్రభావితమైన ప్రజల పట్ల ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల నలుమూలల నుండి వందలాది మంది ప్రజలు లుధియాణాకి తరలివచ్చారు. ‘ కాళే పాణీ దా మోర్చా ’ (కలుషితనీటికి వ్యతిరేకంగా నిరసన) బ్యానర్ కింద, సత్లజ్ నదీ ప్రాంత బాధితులందరూ ఏకమయ్యారు.

‘బుడ్డా దరియా (నది) ను కాపాడండి! సత్లజ్‌ను కాపాడండి!’

బుడ్డా నాలా కాలుష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ నిరసన కొత్తదేం కాదు. దానిని శుభ్రం చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ఈ తంతు దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. మొదటి ప్రాజెక్ట్ – క్లీన్ రివర్ సత్లజ్ కార్యాచరణ ప్రణాళిక –1996లో ప్రారంభమయింది; అందులో భాగంగా, జమాల్‌పూర్, పట్టియాఁ, బల్లోకే గ్రామాలలో మూడు మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టిపిలు) ఏర్పాటు చేయబడ్డాయి.

2020లో, పంజాబ్ ప్రభుత్వం, బుడ్డా నాలా కోసం రూ.650 కోట్లతో రెండేళ్ళ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జమాల్‌పూర్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, అలాగే బుడ్డా నాలా పునరుజ్జీవనం కోసం రూ.315 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఆయన గత ప్రభుత్వాన్ని నిందించారు కూడా.

ఒకపక్క నిందారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి; సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏమీ చేయలేదని కశ్మీరా బాయి తెలిపారు. లుధియాణాలోని కార్యకర్తలు ఈ సమస్యను పదే పదే పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే, కోట్లు ఖర్చు చేసినప్పటికీ నాలా కలుషితమయ్యే ఉంది; ప్రతిసారీ ప్రజలు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి నెలకొంది.

మాన్సా జిల్లాలోని అహ్మద్‌పూర్ కి చెందిన అరవై ఏళ్ళ మల్కీత్ కౌర్ కూడా నిరసనలో పాల్గొన్నారు. “కలుషిత నీరు, భూమిలోకి ఇంకుతున్న పరిశ్రమల వ్యర్థాల కారణంగా మమ్మల్ని పలు అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. నీరు జీవితానికి ప్రాథమిక అవసరం. మనకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండాలి,” అన్నారామె.

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

ఎడమ: ఆగస్టు 24, 2024న, నిరసన మార్చ్ – ‘కాళే పాణీ దా మోర్చా’ (మురుగునీటికి వ్యతిరేకంగా నిరసన) – జరిగింది. బుడ్డా నాలా లుధియాణా గుండా ప్రవహించి, సత్లజ్ నదిలో కలిసే ఒక కాలానుగుణ జల ప్రవాహం. కుడి: రాజస్థాన్ నుండి కూడా కొంతమంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

ఎడమ: ‘నల్ హై లేకిన్ జల్ నహీ’ (కుళాయి ఉంది కానీ నీరు లేదు) అని రాసివున్న పోస్టర్‌తో ఒక కార్యకర్త. కుడి: మాన్సా జిల్లాలోని అహ్మద్‌పూర్ నుండి నిరసనలో పాల్గొ నడానికి వచ్చిన మల్కీత్ కౌర్ (ఎడమవైపు నుండి నాల్గవ వ్యక్తి). ‘కలుషిత నీరు, భూమిలోకి ఇంకుతున్న పరిశ్రమల వ్యర్థాలే ఇన్ని అనారోగ్య సమస్యలకు కారణం. నీరు జీవితానికి ప్రాథమిక అవసరం. స్వచ్ఛమైన నీరు మనకి అందుబాటులో ఉండాలి,’ అన్నారామె

వలీపూర్ కలాఁ గ్రామ ప్రజలందరూ భూగర్భ జలాలపై ఆధారపడ్డారని, బోర్లు 300 అడుగులకు పడిపోయాయని, అవి తవ్వేందుకు రూ.35,000 నుండి 40,000 ఖర్చవుతోందని కశ్మీరా బాయి తెలిపారు. అయినప్పటికీ, వారికి స్వచ్ఛమైన నీరు దొరకడం లేదన్నారు. అయితే, శుద్ధమైన తాగునీటి కోసం, ఈ గ్రామాలలో నివసించే సంపన్నులు తమ ఇళ్లలో వాటర్ ఫిల్టర్లు పెట్టుకున్నారని, వాటిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సివస్తుందని ఆమె వివరించారు.

అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ళ బల్జీత్ కౌర్, హెపటైటిస్-సి కారణంగా ఒక కొడుకుని కోల్పోయారు. “నా కొడుకులిద్దరూ హెపటైటిస్-సి బారినపడ్డారు. ఒకడు చనిపోయాడు,” తన గ్రామంలోనూ, సమీప గ్రామాలలో కూడా చాలామంది రోగులు ఉన్నారని కౌర్ చెప్పారు.

భటిండాలోని గోణియాణా మండికి చెందిన 45 ఏళ్ళ రాజ్‌విందర్ కౌర్ ఇలా అన్నారు: “మేం ఇప్పటికైనా మేల్కొనకపోతే, మా తరువాతి తరాలకు మంచి జీవితం గడిపే అవకాశం ఉండదు. అందుకే మేం నిరసన చేపట్టాం. పర్యావరణ కాలుష్యం కారణంగా, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి ఉన్నారు. సత్లజ్ జలాలను కలుషితం చేసే ఈ కర్మాగారాలను మూసివేయాలి. ఇవి మూతపడితేనే మన తరువాతి తరాలు రక్షించబడతాయి.”

లుధియాణాలో ‘కాళే పాణీ దా మోర్చా’లో పాల్గొన్న మరో కార్యకర్త, బీబీ జీవన్‌జోత్ కౌర్, ఇలా అన్నారు: “ ఏ సాడ్డీ హోండ్ డి లడాయి హై (ఇది మా ఉనికి కోసం చేస్తున్నపోరాటం). ఇది తరువాతి తరాన్ని రక్షించడానికి చేస్తున్న పోరాటం,”

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

ఎడమ: హెపటైటిస్-సి కారణంగా, బల్జీత్ కౌర్ తన కుమారుల్లో ఒకరిని కోల్పోయారు. కుడి: ‘మేం ఇప్పటికైనా మేల్కొనకపోతే, మా తరువాతి తరాలకు మంచి జీవితం గడిపే అవకాశం ఉండదు. అందుకే మేం నిరసన చేపట్టాం,’ భటిండాలోని గోణియాణా మండికి చెందిన రాజ్‌విందర్ కౌర్ (గులాబీ దుపట్టాలో) అన్నారు

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

ఎడమ: ‘ఆవో పంజాబ్ దే దరియావాన్ దే జెహ్రీ కాళే పర్దూషన్ ను రోకియే’ (పంజాబ్ నదుల విషపూరిత కాలుష్యాన్ని అరికడదాం, రండి!) అని రాసివున్న బ్యానర్‌తో నిరసనలో పాల్గొన్నకార్యకర్తలు. కుడి: ‘40 ఏళ్లుగా పరిశ్రమలు మన నదులను కలుషితం చేస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని’ వ్యవసాయ నిపుణులైన దేవీందర్ శర్మ నిరసన వద్ద మాట్లాడుతూ అన్నారు

అమన్‌దీప్ సింగ్ బైన్స్, ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఒక కార్యకర్త. “సమస్య మూలకార ణాన్ని పరిష్కరించ టంలేదు. దానిని శుద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. అయితే, పరిశ్రమల వ్యర్థాలను ఆ నీటి వనరులో విడుదల చేయడానికి అసలు ఎందుకు అనుమతిస్తోంది? కాలుష్య కారకాలు దరియా (నది)లోకి ప్రవేశించ నేకూడదు కదా,” అన్నారాయన.

“అద్దకం (డైయింగ్) పరిశ్రమను మూసివేయాలి" అని లుధియాణాకు చెందిన ఈ న్యాయవాది అభిప్రాయపడ్డారు.

లుధియాణాలో దాదాపు 2,000 పారిశ్రామిక ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లు, 300 అద్దకపు యూనిట్లు ఉన్నాయి. బుడ్డా నాలా కాలుష్య విషయంలో, అవి ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. లుధియాణాకు చెందిన పారిశ్రామికవేత్త, బాదీష్ జిందల్, PARIతో మాట్లాడారు. “పంజాబ్ పాయిజన్స్ పొసెషన్ అండ్ సేల్ రూల్స్-2014 ప్రకారం, ఏ పరిపాలనా వ్యవస్థ అయినా, విషపూరిత రసాయనాల అమ్మకం-కొనుగోలు రికార్డును నిర్వహించాలి. కానీ అలాంటి రికార్డులు ఏవీ ఏ పరిపాలనా వ్యవస్థ వద్ద లేవు.”

పరిశ్రమలు, నీటి శుద్ధి ప్రక్రియ అయిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్‌ఎల్‌డి)ను సక్రమంగా పాటించాలని కూడా ఆయన చెప్పారు, “పరిశ్రమల వ్యర్థాలు – అవి శుద్ధి చేసినవైనా, శుద్ధి చేయనివైనా – బుడ్డా నాలా లోకి మళ్ళించకూడదు," అని ఆయన అన్నారు.

కాలుష్యకారక పరిశ్రమలను పూర్తిగా మూసివేయాలని వ్యవసాయ నిపుణులైన దేవీందర్ శర్మ పిలుపునిచ్చారు. PARIతో మాట్లాడుతూ, “నలభై ఏళ్ళుగా పరిశ్రమలు మన నదులను కలుషితం చేస్తున్నా ఎవరికీ ఏమీ పట్టడం లేదు. ఇలాంటి మురికి పరిశ్రమలను మనమెందుకు స్వాగతిస్తున్నాం? కేవలం పెట్టుబడి కోసమా? పర్యావరణ భద్రత, ప్రజారోగ్యంపై కూడా ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి,” అన్నారు.

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

(ఎడమ నుండి కుడికి) నారంగ్ సింగ్, దవిందర్ సింగ్, జగ్జీవన్ సింగ్, విశాఖా సింగ్ గరేవాల్. వీరు కలుషిత జలాల వల్ల ప్రభావితమైన వలీపూర్ కలాఁ (కుడి) గ్రామస్థులు

PHOTO • Arshdeep Arshi
PHOTO • Arshdeep Arshi

లుధియాణాలో దాదాపు 2,000 పారిశ్రామిక ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లు, 300 అద్దకపు యూనిట్లు ఉన్నాయి. బుడ్డా నాలా కాలుష్య విషయంలో, అవి ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. లుధియాణా జిల్లాలోని ఘౌఁస్‌పూర్ గ్రామం (కుడి) వెంబడి ప్రవహిస్తున్న బుడ్డా నాలా

బుడ్డా నాలా లోకి ఎలాంటి ద్రవాన్ని – శుద్ధి చేసిన వ్యర్థాలను/నీటిని కూడా – విడుదల చేయకూడదని అద్దకపు పరిశ్రమలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని కార్యకర్తలు వెల్లడించారు. తాజాగా, ఎన్జీటీ విచారణలో వెలుగులోకి వచ్చిన పత్రాలలో ఈ విషయం వెల్లడైంది. అయితే, దీనిపై గత 10-11 ఏళ్ళుగా పంజాబ్ కాలుష్య నియంత్రణా బోర్డు (PPCB) ఎందుకు మౌనం వహించిందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

“కాలుష్యకారక పరిశ్రమలను త్రిపుర నిషేధించగలిగినప్పుడు, పంజాబ్ ఎందుకు చేయడం లేదు?” అని పంజాబ్ కార్యకర్తలు అడుగుతున్నారు.

*****

లుధియాణా దిగువ గ్రామాల గుండా ప్రవహిస్తున్నప్పుడు బుడ్డా నాలా లోని స్వచ్ఛమైన జలాలు చిక్కటి నలుపు రంగులోకి మారతాయి. ఈ జలాలే చిమ్మచీకటి నలుపులో కనిపిస్తుండే సత్లజ్‌లో కలుస్తాయి. అటుపై జిడ్డులా మారిన ఈ ద్రవం పాకిస్తాన్‌లోకి, ఆ తర్వాత అరేబియా సముద్రంలోకి ప్రవేశించే ముందు, రాజస్థాన్ వరకూ ప్రవహిస్తుంది. రెండు నదులు సంగమించే హరికే పత్తన్ (బ్యారేజ్) దగ్గర బియాస్ -సత్లజ్ నదీ జలాల మధ్యనున్న వ్యత్యాసాన్ని ఉపగ్రహ చిత్రాలు చాలా స్పష్టంగా చూపుతున్నాయి.

PHOTO • Courtesy: Trolley Times
PHOTO • Courtesy: Trolley Times

సమస్య మూలకారణాన్ని పరిష్కరించకుండా, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులతో ప్రభుత్వం ముందుకు వస్తోందని, కానీ పరిశ్రమల వ్యర్థాలను నదీ జలాలలోకి విడుదల చేయడానికి వీలు కల్పిస్తోందని కార్యకర్తలు చెపుతున్నారు. కుడి: సత్లజ్‌లోకి ప్రవేశిస్తున్న బుడ్డా నాలా (2022లో తీసిన ఫోటో)

ఆగస్టు 13, 2024న, బుడ్డా నాలా కాలుష్య స్థితిపై తన ప్రతిస్పందనగా (PARI వద్ద ఆ కాపీ ఉంది), నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సమాధానమిచ్చింది. నగరంలోని మూడు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (CETPలు)లో “పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన పర్యావరణ క్లియరెన్స్‌లో నిర్దేశించబడిన షరతులకు అనుగుణంగా వ్యర్థాల శుద్ధీకరణ జరగడం లేదని గుర్తించినట్లు పేర్కొంది.

తత్ఫలితంగా, ఆగస్టు 12, 2024న, “పర్యావరణ పరిహారాన్ని విధించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని” PPCB కి ఆదేశాలు జారీ చేసినట్లు NGT కి CPCB తెలియజేసింది. బుడ్డా నాలా లో ప్రవహించే నీరు సాగుకు పనికిరాదని PPCB తన మునుపటి నివేదికలో అంగీకరించింది. “ఇది వ్యవసాయానికే పనికిరానప్పుడు తాగడానికి పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా?” అని కార్యకర్తలు వాదించారు.

బుడ్డా నాలా ను పూడ్చివేయాలన్న తమ ప్రణాళికను నిరసన మార్చ్ నిర్వాహకులు సెప్టెంబర్ 15న ఒక ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు, తర్వాత అది అక్టోబర్ 1, 2024కి వాయిదా పడింది. ఈ చివరి హెచ్చరిక తరువాత, సెప్టెంబర్ 25న, బుడ్డా నాలా లోకి మూడు CETPల నుండి శుద్ధి చేయబడిన వ్యర్థాల విడుదలను వెంటనే నిలిపివేయాలని PPCB ఆదేశించింది. అయితే, నివేదికల ప్రకారం, అటువంటి చర్య ఏదీ జరగలేదు.

అక్టోబర్ 1న, నాలా ను పూడ్చి వేసే బదులు, లుధియాణాలోని ఫిరోజ్‌పూర్ రోడ్డులో, కార్యకర్తలు ఒక బైఠాయింపు నిర్వహించారు. డిసెంబర్ 3, 2024లోపు తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు.

“ప్రతీసారీ ఎవరో ఒకరు వచ్చి బుడ్డా నాలా నుండి శాంపిల్స్ తీసుకుంటారు కానీ, హుండా కుచ్ నహీ (ఏమీ జరగదు). ఈ కాలుష్యాన్నైనా అరికట్టాలి, లేదా మన తరవాతి తరం జీవించేలా స్వచ్ఛమైన నీటినైనా అందించాలి,” ప్రభుత్వ సర్వేలు, వాగ్దానాలతో విసిపోయిన బల్జీత్ కౌర్ అన్నారు.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Arshdeep Arshi

عرش دیپ عرشی، چنڈی گڑھ کی ایک آزاد صحافی اور ترجمہ نگار ہیں۔ وہ نیوز ۱۸ پنجاب اور ہندوستان ٹائمز کے ساتھ کام کر چکی ہیں۔ انہوں نے پٹیالہ کی پنجابی یونیورسٹی سے انگریزی ادب میں ایم فل کیا ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Arshdeep Arshi
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

کے ذریعہ دیگر اسٹوریز Y. Krishna Jyothi