సంతోషి కోరీ, సొంత యాజమాన్యం కలిగివుండటం కలిగించే వింత అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. “రూంజ్ ఎఫ్‌బిఒ (ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్- FPO)ను స్థాపించాలని మా మహిళలమే నిర్ణయించుకున్నాం. మా గ్రామంలోని మగవాళ్ళందరూ అది మంచి ఆలోచన అని ఇప్పుడు అంగీకరిస్తున్నారు,” ఆమె నవ్వుతూ అన్నారు.
భైరాహా పంచాయతీలోని గుచారా కుగ్రామానికి చెందిన ఆమె ఒక దళిత రైతు. రూంజ్ మహిళా రైతు ఉత్పత్తిదారుల కోఆపరేటివ్ లిమిటెడ్‌లో సభ్యత్వం కోసం ఆవిడ రూ.1,000 రుసుము చెల్లించారు. జనవరి 2024లో పన్నా జిల్లాలో సభ్యత్వం తీసుకున్న 300 మంది ఆదివాసీ, దళిత, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతి) మహిళలలో ఈవిడ కూడా ఒకరు. అంతేకాకుండా, రూంజ్‌లోని ఐదుగురు బోర్డు సభ్యులలో సంతోషి కూడా ఒకరు. ప్రతి సమావేశంలో మాట్లాడటానికి, ప్రచారం చేయడానికి ఆమెను పిలుస్తుంటారు.
“ఇంతకుముందు, బిఛోలియా (వ్యాపారి) వచ్చి, పప్పుగా మార్చని మా అరహర్ దాల్ (కందులు)ను తక్కువ ధర ఇచ్చి కొనేవాడు. అదీగాక, అతనెప్పుడూ సమయానికి వచ్చేవాడు కాదు, పైగా మాకెప్పుడూ సకాలంలో డబ్బు ఇవ్వలేదు కూడా,” ఆమె PARIతో అన్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ 45 ఏళ్ళ మహిళ, తన కుటుంబానికి చెందిన రెండెకరాల వర్షాధార భూమిలో అరహర్ దాల్ పండిస్తున్నారు. మరో ఎకరం భూమిని కూడా కౌలుకు తీసుకున్నారు. మనదేశంలో 11 శాతం మంది మహిళలకు మాత్రమే సొంత భూమి ఉంది. మధ్యప్రదేశ్ ఇందుకు మినహాయింపేమీ కాదు.
రూంజ్ ఎఫ్‌పిఒను యమునా నదిలో కలిసే బాఘైన్‌కు ఉపనది అయిన రూంజ్ నది పేరు మీద స్థాపించారు. ఇది అజయ్‌గఢ్, పన్నా బ్లాకులలోని 28 గ్రామాలకు చెందిన మహిళా రైతుల సమష్టి. 2024లో ప్రారంభమైన ఇది ఇప్పటికే రూ. 40 లక్షలు టర్నోవర్‌ను సాధించింది. రాబోయే ఏడాదిలో దీనికి రెట్టింపు టర్నోవర్ సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
“మా గ్రామంలో దాదాపు అన్ని కుటుంబాలకు కనీసం 2-4 ఎకరాల పొలం ఉంది. మేమందరం జైవిక్ (సేంద్రీయ) పంటలనే పండిస్తున్నాం కనుక, కందులను పప్పు చేయటం కోసం ఒక యంత్రాన్ని కొనడానికి విరాళాలు సేకరిద్దామని అనుకున్నాం,” ఎఫ్‌పిఒ ఏర్పాటు వెనుక కారణాన్ని సంతోషి వివరించారు.
అజయ్‌గఢ్ ప్రాంతంలో పండించే అరహర్ దాల్ కు విస్తృతమైన గిరాకీ ఉంది. “రూంజ్ నది వెంబడి ఉన్న ధరమ్‌పుర్ ప్రాంతపు భూముల్లో పండించే దాల్ , దాని రుచికీ సువాసనకూ చాలా ప్రసిద్ధి చెందింది,” ప్రదాన్‌కు చెందిన గర్జన్ సింగ్ తెలిపారు. వింధ్యాచల్ కొండల మీదుగా ప్రవహించే ఈ నది వల్లనే వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన నేల ఇక్కడ ఉందని స్థానికులు చెబుతారు. ప్రదాన్ (PRADAN-Professional Assistance for Development Action), ఇక్కడి స్థానిక రైతులతో కలిసి పనిచేసే ఒక ప్రభుత్వేతర సంస్థ. కేవలం మహిళలు మాత్రమే ఉండే ఎఫ్‌పిఒను ఏర్పాటు చేయటంలో ఇది కీలక పాత్రను పోషించింది.
సంతోషి లాంటి రైతులు తమ పంటకు న్యాయమైన ధర పొందాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. “ఇప్పుడు మేం దానిని మా ఎఫ్‌పిఒకి ఇచ్చి, సమయానికి డబ్బును తీసుకోవచ్చు,” అన్నారామె. క్వింటాలు అరహర్ దాల్ రూ. 10,000కు అమ్ముడవుతోంది. అయితే, మే 2024లో, ఈ ధర రూ. 9,400కి పడిపోయింది. అయినప్పటికీ, తమ సమష్టి ద్వారా చేసే ప్రత్యక్ష మార్కెటింగ్ పద్ధతి వల్ల తమకు మంచి ధరే లభించిందని రూంజ్ సభ్యులు భావించారు.
తాము అనువంశిక విత్తనాలను మాత్రమే ఉపయోగిస్తామని, హైబ్రిడ్ రకాలు ఇక్కడెక్కడా కనిపించవని రూంజ్ సిఇఒ రాకేశ్ రాజ్‌పుత్ (ఇందులోని ఏకైక ఉద్యోగి) తెలియజేశారు. అతను 12 సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో తూకం యంత్రాలు, సంచులు ఉంటాయి; ప్రతి సంచిలోని పదార్థాలను తనిఖీ చేయడానికి ఒక పర్ఖీ (పరిశీలకుడు) ఉంటారు.
వచ్చే సంవత్సరానికి సభ్యత్వాన్ని ఐదు రెట్లు పెంచాలని రూంజ్ లక్ష్యంగా పెట్టుకుందనీ, అలాగే ఇప్పుడు పండిస్తున్న అరహర్ దాల్ మాత్రమే కాకుండా, శనగ, పశువుల మార్కెటింగ్ (బుందేల్‌ఖండి జాతికి చెందిన మేకలు), సేంద్రియ ఎరువులు, విత్తనాలు వంటి వైవిధ్యమైన ఉత్పత్తుల శ్రేణికి విస్తరించాలని కోరుకుంటున్నట్లు ప్రదాన్‌తో పనిచేసే సుగంధ శర్మ తెలిపారు. “మా రైతులకు ఇంటింటికీ కనెక్టివిటీ ఉండాలని మేం కోరుకుంటున్నాం.”
ఇంటి వెనుక ఉన్న చిన్న స్థలంలో తాను పండిస్తోన్న తీగజాతి కూరలను, ఇంకా వేరే కూరగాయలను సంతోషి మాకు చూపించారు; కుటుంబానికి చెందిన రెండు గేదెలను ఆమె భర్త మేతకు తీసుకెళ్ళారు. వాళ్ళంతా త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు.
“నేనెప్పుడూ వేరే ఏ దాల్ తినలేదు. నా పొలంలో పండించే దాల్ , బియ్య ఉడికినట్టే త్వరగా ఉడుకుతుంది, రుచికి మధురంగా ఉంటుంది,” ఆమె గర్వంగా చెప్పారు.
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి