"నక్షత్రాలకు మా రబారీలు పెట్టుకున్న పేర్లు మీరు పిలిచే పేర్లకు భిన్నంగా ఉంటాయి," అన్నారు మశ్రూభాయి." తుమ్హారా ధ్రువ్ తారా, హమారా పరోదియా (మీ ధృవతార మా పరోదియా)".
మేం వర్ధా జిల్లా, దెనోడా గ్రామంలోని అతని డేరా- తాత్కాలిక నివాసం వద్ద వున్నాం. అది నాగపూర్ నుంచి 60 కిలోమీటర్లూ, అతని స్వస్థలమైన కచ్‌కు 1300 కిలోమీటర్ల దూరంలో వుంది.
ఆ రబారీ డేరా మీదికి సాయం సంజె వెలుగులు ప్రసరించడం ప్రారంభయింది. అది మార్చి నెల మొదలు, శీతాకాలం నుంచి వేసవికి మారే సమయం. సాయంత్రపు నారింజ వెలుగులు కాస్త ఎక్కువసేపు వుండే కాలం. అటవీ జ్వాలలా పూసే పలాశ్ లేదా కెసుడా ( బ్యూటియా మోనోస్పెర్మా - మోదుగు పూలు) పూల కుంకుమ రంగు నేలనంతా అలంకరిస్తోంది. రంగుల పండగ హోలీ దగ్గర్లోనే వుంది.
జనం అభిమానంగా మశ్రూ మామా అని పిలుచుకునే ఆయనా నేనూ విదర్భలో ఆ సాయంకాలపు నిర్మలాకాశాన్ని చూస్తున్నాం. పత్తి చేల మధ్యలో వేసివున్న అతని మంచం మీద కూర్చుని, భూమండలంలోని అన్ని విషయాల గురించీ మాట్లాడుకుంటున్నాం: నక్షత్రాలు, నక్షత్ర రాశులు, మారుతున్న వాతావరణం, పర్యావరణం, అతని ప్రజల, పశువుల, అనేక భావాలు, సంచారజీవుల మోటైన, కఠినమైన జీవితం, అతనికి తెలిసిన జానపద కథలూ గాథలూ, ఇంకా అనేకం.
రబారీల జీవితాలలో నక్షత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. రాత్రివేళల్లో వారికి నక్షత్రాలే మార్గదర్శనం చేస్తాయి. " సప్తర్షి మండలం అని మీరు పిలుచునే ఏడు నక్షత్రాల రాశి మాకు హరణ్ (జింక)," అని ఆయన వివరిస్తారు. "ఆ ఏడు నక్షత్రాలు తెల్లవారుఝామున వెలిసిపోతాయి. అయితే ఇంకా చీకటి వుండగానే అవి రాబోయే కొత్త ఉదయాన్ని, అది తెచ్చే కొత్త సవాళ్ళను, ఎన్నో సంభావ్యతలను గురించి చెప్తాయి," అన్నారు మశ్రూభాయి వేదాంత ధోరణిలో.
అరవయ్యేళ్ళకు పైబడిన వయసులో మంచి ఒడ్డూ పొడుగూ, బుర్ర మీసాలూ, నెరుస్తున్న తలా, వెడల్పాటి అరచేతులూ, అన్నిటినీ మించి పెద్ద మనసూ వున్న మశ్రూ మామ ఆ డేరా లోని అందరికన్నా వయసులో పెద్దవారు. ఆ డేరా లో ఆయనతో పాటు ఇంకో అయిదు కుటుంబాలున్నాయి. వాళ్ళు అక్కడికి వచ్చి రెండురోజులయింది. "మేం ఈ రోజు ఇక్కడ వున్నాం. మరో 15 రోజులు నాగపూర్ జిల్లాలో వుంటాం. వర్షాలు మొదలయ్యే సమయానికి మీరు మమ్మల్ని యవత్‌మాల్‌లోని పంధార్‌కావాడా దగ్గర కలుసుకోవచ్చు. మేం ఏడాది పొడుగునా మాకు పరిచయమున్న ప్రదేశాలలోనే తిరుగుతూ వుంటాం. పొలాల్లో బస చేస్తుంటాం," అని ఆయన నాతో అన్నారు.
ఏడాది పొడవునా అతని నివాసం ఆకాశం కింది బహిరంగ మైదానాల్లోనే.
*****
రబారీలు మొదటగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన పాక్షిక-పశుపోషక సముదాయానికి చెందినవారు. మశ్రూ మామ లాంటి చాలామంది కొన్ని తరాలుగా మధ్యభారతంలోని విదర్భని తమ స్వస్థలంగా చేసుకున్నారు. వాళ్ళు మేకలనూ గొర్రెలనూ ఒంటెలనూ పెద్ద పెద్ద మందలుగా పెంచుతుంటారు. కచ్‌లోనే వుండిపోయిన రబారీల్లో ఎక్కువమంది తమ పొలాల్లో పనిచేసుకుంటారు; మశ్రూ మామ లాంటివాళ్ళు ఎప్పుడూ సంచారం చేస్తూ శిబిరాల్లో వుంటారు.
మశ్రూ మామ అంచనా ప్రకారం విధర్భ, దాని పొరుగునే వున్న ఛత్తీస్‌గఢ్‌లలో దాదాపు 3000 డేరాలు వున్నాయి. ప్రతి డేరాకీ ఒక స్థిరమైన వలస పద్దతి ఉంటుంది. కానీ, నివాసం మాత్రం స్థిరంగా వుండదు.
వాళ్ళు అనేక జిల్లాల గుండా ప్రయాణిస్తుంటారు. తమ వలస మార్గంలో ప్రతి కొద్దిరోజులకు ఒకదగ్గర శిబిరాలు వేస్తుంటారు. ఒకేచోట ఎన్నాళ్ళుంటారో చెప్పడం కష్టం కానీ మొత్తం సీజన్లో 50 నుంచి 75 చోట్ల బస చేస్తారు. ఒక రోజు వర్ధా జిల్లాలోని ఒక గ్రామంలో వుంటే, మరుసటి రోజు యవత్‌మాల్ జిల్లాలోని వానీ దగ్గర వుంటారు. సీజన్‌ను బట్టీ, అక్కడున్న స్థానిక రైతులతో వారి సంబంధాలను బట్టీ ఒక్కో దగ్గర రెండురోజుల నుండి రెండు వారాల వరకూ వుంటారు.
రైతులకు, రబారీలకు ఒక సహజీవన సంబంధం వుంది. రైతులు రబారీల మందలని ఉచితంగా తమ పొలాల్లో తిరగనిస్తారు. వారికి అవసరంలేని కలుపునీ, పంట కోసేశాక మిగిలిన గడ్డినీ తిననిస్తారు. బదులుగా రబారీలు వారి పొలాల్లో వదిలిన తమ చిన్న జంతువుల పెంటతో వారి పొలాల్ని మరింత సారవంతమయ్యేలా చేస్తారు.
ఒక్కోసారి రైతుల పొలాల్లో తమ మేకల, గొర్రెల మందలను ఏప్రిల్ నుంచి జులై దాకా వుంచి వారి భూమిని సారవంతం చేసినందుకు రబారీలకు రైతులు డబ్బు కూడా చెల్లిస్తారు. వారు ఖచ్చితంగా ఎంత డబ్బు ఇస్తారు అనేది జంతువుల సంఖ్యపై ఆధారపడివుంటుంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి రెండు, మూడు లక్షలు ఉండొచ్చు. ఇది నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ అనే సంస్థ చేసిన, ఇంకా ప్రచురించని, పరిశోధనలో చెప్పిన విషయం. గొర్రెల, మేకల మందలు పొలాల్లో తిరిగితే వ్యవసాయ దిగుబడి చాలా బాగా పెరుగుతుంది.
వెయ్యి కన్నా ఎక్కువ పశువులు మామ సొంతం - అందుకే ఆయనకంత విలువ
మశ్రూ మామ ఒంటెల్లో మూడు అప్పుడే దగ్గర్లోని చిట్టడవి నుంచి వచ్చాయి. ఆ ఒంటెలు కచ్ఛి జాతివి. ఖారాయీ జాతివి కాదు. ఖారాయీ జాతి ఒంటెలు నీటిలో ఈదగలవు. మామకు బాగా నమ్మకస్తుడైన రామా వాటిని మేపడానికి తీసుకెళ్ళాడు. రామా జంతువుల బాగోగులను చూడ్డమేకాదు, వాళ్ళ తర్వాతి మజిలీని ఎంచుకోవడంలో కూడా సహాయం చేస్తాడు. మేం కూర్చుని మాట్లాడుకుంటున్న చోటినుంచి ఒంటెలు కనపడ్డంలేదు కానీ అవి చేసే శబ్దాలు మాత్రం అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గరనుంచి వినిపిస్తున్నాయి. సాయంత్రపు ఎండలో ఆ ఒంటెల నీడలు పొడుగ్గా కనిపిస్తున్నాయి.
వాళ్ళ డేరా కి ఎదురుగా కూత వేటు దూరంలో వున్న పత్తి పొలంలో అతని గొర్రెలు, మేకలు పచ్చటి తాజా ఆకులను మేస్తున్నాయి. ఈ డేరాల దగ్గర ఎప్పుడూ ఒక కుక్క ఉంటుంది. ఈ డేరా దగ్గర ఉండే కుక్క మోతీ, మేం కూర్చొని ఉన్న మంచం దగ్గర ఆడుకుంటోంది. ఆ మంచంపై రబారీ మహిళలు చేతితో నేసిన మెత్తటి జోహడ్ (దుప్పటి) పరిచివుంది.
*****
వర్షంపై ఆధారపడి, ఏడాదికి ఒక కారు మాత్రమే పండే మహారాష్ట్ర తూర్పు ప్రాంతపు చిన్న రైతుల పొలాలన్నీ ఇప్పుడు బీడుపడే వున్నాయి. పత్తి పంట కోత పూర్తయింది. చలికాలపు పంటలైన పెసర, అక్కడక్కడా కొంత గోధుమ, జొవర్ (తీపి జొన్న) లాంటి రబీ పంటలు కూడా చివరి దశలో ఉన్నాయి, ఇంకొక పక్షం రోజుల్లో చేతికి వచ్చేస్తాయి. ఇక్కడి పొలంలో మిగిలిన చివరి పచ్చని ఆకును కూడా అతని మేకలు, గొర్రెలు స్వాహా చేసేయడంతో, మశ్రూ మామ ఇంకో రెండు రోజుల్లో ఒక కొత్త పొలానికి తరలి వెళ్తున్నారు.
"నాకొక స్థిర నివాసమంటూ లేదు," అన్నారు మశ్రూ మామ . వర్షం వచ్చినప్పుడు డేరా లోని ఆడా మగా ఒక 15, 20 మంది అతని దగ్గర బంధువులు టార్పాలిన్ పట్టాలు కప్పిన చార్‌పాయ్ (మంచం) కింద తలదాచుకుంటారు. అతని ఒంటెల, గొర్రెల, మేకల మందలు వర్షంలో తడిసి, శుభ్రపడతాయి. "చలికాలాలూ, వర్షాలూ వాటిని మెత్తబరుస్తాయి, వేసవికాలపు వేడిగాలులు వాటిని దృఢంగా చేస్తాయి," అన్నారు మశ్రూ మామ . "రబారీలు నిజమైన వాతావరణ పరిరక్షకులు."
"మా జీవితాల్లో స్థిరంగా వున్నది ఒక్క అనిశ్చితి మాత్రమే. ఆ ఒక్కటి మాత్రమే స్థిరంగా ఉంది," నవ్వుతూ అన్నారాయన.
అతని డేరా నాగపూర్, వర్ధా, చంద్రపూర్, యవత్‌మాల్ జిల్లాల పరిసరాల్లో తిరుగుతూ ఉంటుంది. "రుతుపవనాలు మారిపోతున్నాయి. అడవులు అంతరించిపొయ్యాయి. ఒకప్పుడు పొలాల్లో వున్న చెట్లు నశించిపోయాయి." మశ్రూ మామ వ్యవసాయ సంక్షోభాన్నీ, అధ్వాన్నమైన రైతుల స్థితినీ దగ్గరగా చూశారు. విస్తృతమైన ఆర్థిక మార్పులు ఉన్నప్పటికీ, సంక్లిష్టమైన పర్యావరణ, వాతావరణ కారకాలు కూడా ఇందుకు ఒక పాత్ర పోషించాయని ఆయన చెప్పారు.
మశ్రూ మామ ఉద్దేశ్యంలో, పొలాలనూ నీటినీ అడవులనూ జంతువులనూ గందరగోళానికి గురిచేస్తోన్న ఈ మారిపోతున్న వాతావరణం ఒక చెడ్డ శకునం. వాళ్ళు ఇంతకుముందు వుండిన ప్రదేశాలు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కనిపించిన పచ్చని ఆకులనూ గడ్డినీ ఇప్పుడు చూడలేమని ఆయన వివరించారు. ఇది అతని మందలమీద ప్రభావం చూపిస్తోంది. “ దేఖియే! ప్రకృతీ మేఁ ప్రాబ్లమ్ హువా, తో ఆద్మీ కో పతా భీ నహీఁ చలేగా కీ అబ్ క్యా కర్నా హై (చూడండీ, ప్రకృతిలో ఏదైనా సమస్య ఉంటే, మానవులకు దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా తెలియటంలేదు),” అని అనుభవజ్ఞుడైన ఆ సంచారి చెప్పారు.
హైదరాబాద్‌లోని కబేళాలకు ఒంటెలను అక్రమంగా తరలిస్తున్నారని కొందరు రబారీలపై ఇటీవల వచ్చిన తప్పుడు ఆరోపణలను గురించి విచారంగా ప్రస్తావిస్తూ, "మా గురించి తెలియని వ్యక్తులు మాకు ఒంటెలతో ఉండే అనుబంధాన్ని గురించి అర్థంచేసుకోలేరు" అన్నారు. (చదవండి: పోలీసుల అదుపులో కచ్ఛ్ ఎడారి ఓడలు )
"ఒంటెలు మా ఓడలు, హమారా జహాజ్ హై , మా దేవతలు," అంటూ, "ప్రతి డేరాకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్తున్నప్పుడు వారి వస్తువులను, పిల్లలను మోసుకువెళ్లడానికి మూడు నాలుగు ఒంటెలు ఉంటాయి," అని అతను చెప్పారు.
మధ్య భారతదేశంలో వుండే రబారీల గురించి చాల తక్కువ పరిశోధన జరిగింది; ప్రభుత్వ ఏజెన్సీలు కూడా వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారనే విషయాన్ని గుర్తించరు. మశ్రూ మామ వర్ధా జిల్లాలో ఒక పొలంలో పుట్టారు. విదర్భలోని ఈ పొలాల్లోనే అతని పెళ్ళి జరిగింది, కుటుంబం పెరిగింది. ఇవన్నీ జరిగినా వీరందరి మధ్యా ఆయనొకరున్నారని ఎవరికీ తెలియదు.
ఆయన గుజరాతీ ఎంత బాగా మాట్లాడగలరో అంతే సునాయాసంగా విదర్భ పశ్చిమ ప్రాంతాల్లో మాట్లాడే మరాఠీ మాండలికమైన వర్‌హాడీని కూడా మాట్లాడగలరు. "ఒక రకంగా నేను వర్‌హాడీనే," అన్నారు మశ్రూ మామ . రబారీ పద్ధతిలో ఆయన ధరించే తెల్లటి దుస్తులు - కుచ్చుల చొక్కా, ధోవతి, తెల్లటి తలపాగా - వల్ల జనం ఆయన్ని స్థానికుడని అనుకోకపోవచ్చు. కానీ ఆయనలో స్థానిక సంస్కృతి పాదుకొనివుంది, అక్కడి ఆచారాలు సంప్రదాయాలు బాగా తెలుసు. అవసరమైతే స్థానిక యాసలో బూతులు కూడా మాట్లాడగలరు.
రబారీలు కచ్‌లోని తమ మూలాలకు దూరంగా బతుకుతున్నా, ఆ తెగ తమ సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా ఉంచుతోంది. వాళ్ళింకా కచ్‌లోని తమ బంధువులతో దగ్గరి సంబంధాలను కలిగివున్నారు. మశ్రూ మామ భార్య ప్రస్తుతం కచ్ జిల్లా అంజార్ బ్లాక్‌లోని భద్రోయీ గ్రామానికి వెళ్ళివున్నారు. ఆయన పెద్ద కూతుళ్ళిద్దరినీ అక్కడ నివసించే తమ తెగకే చెందినవారికిచ్చి వివాహం చేశారు.
" నయీ పీధీ యహా నహీ రెహనా చాహతీ (కొత్త తరం ఈ పొలాల్లో జీవించాలని అనుకోవటం లేదు)," అన్నారతను. డేరా లోని పిల్లలను బడికి పోయి చదువుకోవడానికీ, ఉద్యోగాలు వెతుక్కోవడానికీ తమ మిగతా కుటుంబం దగ్గరకి పంపుతున్నారు. " లోగ్ మెహనత్ భీ నహీ కర్ రహే; దౌడ్ లగీ హై (ఇప్పుడు జనం ఇంతకుముందులా కష్టపడి పనిచేయడంలేదు. పిచ్చిగా పరుగులు తీస్తున్నారు)," అన్నారు మశ్రూ మామ . ఆయన సొంత కొడుకు భరత్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి స్థిరమైన ఉపాధి కోసం వెతుక్కుంటూ ముంబైలోనే ఉన్నాడు.
ఆయన చిన్న కూతురు ఆయనతోనే వుంది. ఆమె డేరాలో వున్న మరో ఐదుగురు మహిళలతో కలసి రాత్రి భోజనం తయారుచేయడానికి ఉపక్రమిస్తోంది. దూరం నుంచి వినవచ్చే వాళ్ళ మాటలు జంతువుల పక్షుల అరుపులతో కలిసిపోయి వినిపిస్తున్నాయి. చుల్హా (పొయ్యి) వెలిగించి వుంది. అందులోంచి వచ్చే బంగరు రంగు వెలుతురు చుట్టూ కూర్చునివున్న ఆ మహిళల ముఖాలమీద ప్రతిఫలిస్తోంది. వాళ్ళంతా నల్లటి దుస్తులు ధరించివున్నారు.
మహిళలకు నలుపు రంగు, పురుషులకు తెలుపు రంగు దుస్తులే ఎందుకు?
ఆ సంప్రదాయం వెనక వున్న సతీ మా గాథను మశ్రూ మామ చెప్పారు. సతీ మా వారి సముదాయపు దేవత. యుగాల క్రితం రబారీలకూ, ఆక్రమణదారుడైన ఒక రాజుకీ మధ్య ఒక అందమైన రబారీ రాకుమారి కోసం యుద్ధం జరిగింది. ఆమె పట్ల ఆకర్షితుడైన రాజు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ తెగవాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. జైసల్మేర్ దగ్గర యుద్ధం జరిగింది. ఎంతో రక్తపాతం జరిగింది. చివరికి శాంతి స్థాపన కోసం రాకుమారి తనంతట తాను భూమాత ఒడిలోకి వెళ్ళిపోయింది. "మేం ఆమెకోసం సంతాపం పాటిస్తున్నాం" అన్నారు మశ్రూ. "ఇప్పటికీ."
చిమ్మ చీకటిగా ఉంది; భోజనం సిద్ధమైంది. మామూలుగా డేరా లోని అయిదారు కుటుంబాలు ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ సాయంత్రం మేం వచ్చినట్టుగా ఎవరైనా అతిథులు వస్తే మాత్రం అందరూ కలసి వండుకొని విందు చేసుకుంటారు. ఈ రోజు విందులోని ప్రత్యేక పదార్థం - గొర్రెపాలు, బెల్లం, గొర్రెపాల నెయ్యితో తయారుచేసిన బియ్యపు పాయసం; చపాతీ, మసాలా పప్పు, చావల్ (అన్నం), మజ్జిగ వున్నాయి.
మేం మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో భోజనాలకు కూర్చున్నాం.
అనువాదం: వి. రాహుల్జీ