"నేను మొదటిసారి ఒక హంగుల్ ను చూసినపుడు ఎంతగా మంత్రముగ్ధుడినయ్యానంటే, అసలక్కడి నుంచి కదలలేకపోయాను," గుర్తుచేసుకున్నారు షబ్బీర్ హుస్సేన్ భట్. పుట్టుకతో కశ్మీరుకు చెంది, అంతరించిపోయే తీవ్ర ప్రమాదంలో ఉన్న ఈ జింకను ( సెర్వస్ ఎలఫస్ హంగ్లూ ) చూసేందుకు ఆయన అదే చోటుకు పదే పదే వచ్చేవారు.
దాదాపు 20 ఏళ్ళ తర్వాత కూడా 141 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ పార్కులోని జంతువులు, పక్షులు, పూల పట్ల తనకు ఎంతమాత్రం మోజు తగ్గలేదని షబ్బీర్ అన్నారు. "నాలో ఆ నెరుసును రగిలించినది హంగుల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను, అదేగాక హిమాలయాల నల్ల ఎలుగుబంటి కూడా."
పార్కు వద్ద ఆయనను ప్రేమగా 'దాచీగామ్ ఎన్‌సైక్లోపేడియా' అని చెప్తారు. "నేను ఇప్పటివరకూ ఈ ప్రాంతంలోని 400 జాతుల మొక్కలను, 200కు పైగా పక్షి జాతులను, దాదాపు మొత్తం జంతుజాతులను గుర్తించాను," అని ఆయన PARIతో చెప్పారు. ఈ పార్కులో కనిపించే ఇతర జంతువులలో కస్తూరి మృగం, హిమాలయాల గోధుమవన్నె ఎలుగుబంటి, మంచు చిరుత, బంగారు డేగ ఉన్నాయి.
![](/media/images/02a-IMG_1642-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG_1671-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
ఎడమ: జంతువులు తిరిగే తావులను చూపించేందుకు ఒక సందర్శకుల బృందాన్ని దాచీగామ్ నేషనల్ పార్క్ దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తోన్న షబ్బీర్. కుడి: పార్కు వద్ద సందర్శకులు
![](/media/images/3a-IMG_1-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
![](/media/images/3b-IMG_6-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
ఎడమ: దాచీగామ్ పార్కులోని సిందూర (ఓక్) చెట్ల మధ్య ఆడ హంగుల్‌ల సమూహం. కుడి: డగ్వర్ నదులు మార్‌సర్ సరస్సు ద్వారా పార్కులోకి ప్రవహిస్తాయి, ఇదే ఇక్కడి నీటి వనరు
షబ్బీర్ మొదటినుంచీ ఈ ఉద్యానవనంలో ప్రకృతి శాస్త్రవేత్తగా మొదలుపెట్టలేదు. నిజానికి ఆయన దాచీగామ్ నేషనల్ పార్క్‌లో పర్యాటకుల కోసం నడిపించే బ్యాటరీతో నడిచే వాహనాల డ్రైవర్‌గా మొదలయ్యారు. జ్ఞానం పెరిగేకొద్దీ గైడ్‌గా మారిన ఆయన ఇప్పుడొక ప్రసిద్ధ వ్యక్తి; 2006లో రాష్ట్ర వన్యప్రాణి విభాగంలో ఉద్యోగి అయ్యారు.
హంగుల్‌లు ఒకప్పుడు జంస్కార్ పర్వతాల మీద కనిపించేవి, అయితే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2009 నివేదిక ప్రకారం, వేట, దొంగతనంగా వేటాడటం, వాటి ఆవాసాలు విచ్ఛిన్నం కావటం, సంఖ్య క్షీణించిపోవటం వలన వాటి జనాభా 1947లో అంచనా వేసిన 2,000 నుండి 170-200కు దిగజారిపోయింది. అవి ఎక్కువగా దాచీగామ్ నేషనల్ పార్క్‌కు, కాశ్మీర్ లోయలోని మరికొన్ని అభయారణ్యాలకే పరిమితమయ్యాయని నివేదిక పేర్కొంది.
షబ్బీర్ పార్క్ నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ నగరంలోని నిశాత్ ప్రాంతానికి చెందినవారు. ఆయన తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కొడుకులతో సహా ఆరుగురు సభ్యులున్న తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యాటకులకూ, వన్యప్రాణుల ప్రేమికులకూ తోడుగా పార్క్‌లోనే ఉంటారు. "మీరు దాచీగామ్ పార్కును చూడాలనుకుంటే రోజులో ఎప్పుడైనా రావచ్చు, కానీ మీరు జంతువులను చూడాలనుకుంటే మాత్రం ఉదయాన్నే, లేదా సూర్యాస్తమయానికి ముందు రావాలి," అని అతను PARIతో చెప్పారు.
![](/media/images/04-IMG_5-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
పార్కులో ఒక పెద్దవయసు ఆడ హంగుల్
![](/media/images/05-IMG_21-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
నది వద్దకు వచ్చిన ఒక కశ్మీరీ హంగుల్
![](/media/images/06-IMG_17-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
పార్కులో కనిపిస్తోన్న హిమాలయాల నల్ల ఎలుగుబంటి
![](/media/images/07a-IMG-20-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
![](/media/images/07b-IMG_4-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
ఎడమ: హిమాలయాల బూడిదవన్నె లాంగూర్. కుడి: దాచీగామ్ నేషనల్ పార్కులో చెట్టుపై ఉన్న ఒక పసుపువన్నె మెడ మార్టెన్
![](/media/images/08-IMG_1659-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
పార్కులో ఉన్న అనేక పక్షులను సందర్శకులకు చూపిస్తోన్న షబ్బీర్
![](/media/images/09a-MBJKP14-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
![](/media/images/09b-IMG_16-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
ఎడమ: ఇండియన్ పారడైజ్ ఫ్లై క్యాచర్. కుడి: బూడిదవన్నె జిట్టంగి పిట్ట
![](/media/images/10a-Long_tailed_Shrike-MB-The_naturalist_o.max-1400x1120.jpg)
![](/media/images/10b-IMG_26-MB-The_naturalist_of_Dachigam.max-1400x1120.jpg)
ఎడమ:
పొడుగు తోక పైడికంటె. కుడి: వేరిగేటెడ్ లాఫింగ్ థ్రష్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి