మేం ఆమెను కలిసేటప్పటికి ఆమె వయసు 104 సంవత్సరాలు. తనకు సహాయం చేయటం కోసం అన్నట్టు ముందుకు వస్తోన్న చేతులను అసహనంగా తోసివేస్తూ ఆమె తన గదిలోంచి బయటకు వచ్చారు. తన చేతికర్రను ఆసరాగా తీసుకోవటం మినహా, భవానీ మహతో ఎవరి సహాయాన్నీ కోరటం గానీ, తీసుకోవటం గానీ చేయలేదు. ఆ వయసులో కూడా ఆమె సొంతంగా నడుస్తున్నారు, నిలబడుతున్నారు, కూర్చుంటున్నారు. ఏదైనా ఉందీ అంటే, పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా, చెపువా గ్రామంలో నివసించే ఆమె విస్తారమైన ఉమ్మడి కుటుంబంలోని తరతరాలు తమ జీవితాలకు, భవిష్యత్తుకు కేంద్రంగా ఉన్న రైతు, గృహిణి అయిన ఆమె పైనే ఎక్కువగా ఆధారపడ్డాయి.

స్వాతంత్ర్య సమరయోధురాలు భవానీ మహతో 2024, ఆగస్టు 29-30 అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలోనే ప్రశాంతంగా కనుమూశారు. ఆమె వయసు 106 సంవత్సరాలు. ఆమె కూడా వెళ్ళిపోవడంతో, నా పుస్తకం ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ (నవంబర్ 2022, పెంగ్విన్ ప్రచురణ) లోని 16 మంది స్వాతంత్ర్య సమరయోధులలో కేవలం నలుగురు మాత్రమే ప్రస్తుతం జీవించివున్నట్టయింది. ఒక విధంగా చెప్పాలంటే, అనేకమంది అసాధారణ స్వాతంత్ర్య సమరయోధులలో కూడా భవానీ మరింత విశిష్టమైనవారు. వీరందరి ఇంటర్వ్యూలు PARI స్వాతంత్ర్య సమరయోధుల గ్యాలరీ లో ఉన్నాయి. ఆమె ఒక్కరే, కొన్ని గంటల పాటు సాగిన మా సంభాషణలో, ఆ వీరోచిత పోరాటంలో తన పాత్ర లేనేలేదని గట్టిగా ఖండించినవారు. "అసలా పోరాటంలో గానీ, అలాంటి మరేదానిలోనైనా నేనేం చేశాను?" మార్చి 2022లో మేం మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఆమె మమ్మల్ని ప్రశ్నించారు. చదవండి: భవానీ మహాతో విప్లవాన్ని పోషించిన వేళ

1940లలో వచ్చిన అతిపెద్ద బెంగాల్ క్షామం రోజుల్లో ఆమెకీ భారం మరింత ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో ఆమె పడిన కష్టాలు ఊహలకు అందేవి కావు

వీడియో చూడండి: భవానీ మహతో - పురూలియాకు చెందిన అసాధ్యురాలైన స్వాతంత్ర్య సమరయోధ

నిజానికి ప్రముఖుడైన ఆమె భర్త, గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు బైద్యనాథ్ మహతో కంటే కూడా ఆమెకు దానితో చాలా సంబంధం ఉంది. మన్ బజార్ బ్లాక్‌లోని ఆమె ఇంటికి మేం వెళ్ళడానికి 20 సంవత్సరాల ముందే బైద్యనాథ్ మరణించారు. తాను స్వాతంత్ర్య సమరయోధురాలిని కానని ఆమె గట్టిగా ఖండించినప్పుడు నేను, నా సహోద్యోగి స్మితా ఖటోర్ ఉలిక్కిపడ్డాం. ఆవిడ అలా ఎందుకు చెప్పారో గుర్తించడానికి మాకు కొన్ని గంటల సమయం పట్టింది.

ఆమె అలా చెప్పటంలో 1980 నాటి స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన పథకంలో నిర్వచించిన 'స్వాతంత్ర్య సమరయోధులు' అనే అవగాహనకు నిజాయితీగా కట్టుబడి ఉన్నారు. వలసవాద వ్యతిరేక పోరాటంలో మహిళలనూ, వారి చర్యలనూ విస్తారంగా మినహాయించిన నిర్వచనం అది; ఇది ప్రధానంగా జైలులో ఉన్న సమయం చుట్టూ కేంద్రీకృతమై ఉంది - తద్వారా అజ్ఞాత విప్లవోద్యమంలోని విశాల అంశాలను కూడా మినహాయించింది. మరింత అధ్వాన్నం ఏమిటంటే వారు నేరస్థులుగా ప్రకటించబడ్డారని 'రుజువు' అడిగింది. అంటే, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులుగా నిరూపించుకోవటం కోసం బ్రిటిష్ రాజ్ నుండి ధృవీకరణ కోరడం!

అయితే ఆమె జీవితాన్ని మరో వైపు నుంచి చూడడం, మరో విధంగా చర్చించడం మొదలుపెట్టినప్పుడు భవానీ చేసిన వైభవోపేతమైన త్యాగానికి మేం చకితులమయ్యాం. పురూలియా అడవులలో దాగివున్న అజ్ఞాత విప్లవకారులకు ఆహారాన్ని అందించడంలో ఆమె చూపిన సాహసం. ఒకే సమయంలో 25 మందికి పైగా ఉన్న తన కుటుంబానికి చేయడమే కాకుండా, 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విప్లవకారులకు వంట చేయడం, ఆహారాన్ని అందించడం. అలాగే, 1942-43లో బెంగాల్ కరువు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆ ఆహారాన్ని పండించడం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఇది ఎంతటి గొప్ప, ప్రమాదాలతో కూడుకొన్న దోహదం!

భవానీ దీ , మీరు చేసిన మాయాజాలం మా జ్ఞాపకాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటుంది.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

2022లో పి. సాయినాథ్ ఆమెను కలిసినప్పుడు భవానీ వయస్సు 101 నుంచి 104 ఏళ్ళ మధ్య ఉంది. 70ల వయస్సులో ఉన్న తన కుమారుడు శ్యామ్ సుందర్ మహతోతో (ఎడమ)

PHOTO • Courtesy: the Mahato family

1980లలో తన భర్త బైద్యనాథ్ మహతో, సోదరి ఊర్మిళతో భవానీ మహతో (మధ్యలో). కుటుంబానికి సంబంధించి అంతకుముందు నాటి ఫోటోలేవీ లేవు

PHOTO • Pranab Kumar Mahato

2024 ఎన్నికలలో వోటు వేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు భవానీ మహతో

PHOTO • P. Sainath

తన మనవడు (కింద కుడివైపున) పార్థసారథి మహతోతో సహా 13 మంది కుటుంబ సభ్యులతో భవానీ. ఈ ఫోటో తీసే సమయానికి కొంతమంది కుటుంబ సభ్యులు అక్కడ లేరు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli