ఆమె ఇంటి కిటికీ నుండి బయటికి చూస్తే, కనుచూపు మేరా మొత్తమంతా నీరే. ఈ సంవత్సరం వచ్చిన వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రూపాలీ పెగు సుబన్‌సిరి నదికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో నివసిస్తున్నారు. ఇది బ్రహ్మపుత్రా నదికి ముఖ్యమైన ఉపనది, ఏటా అస్సామ్‌లోని విస్తారమైన భూములను వరదతో ముంచెత్తుతుంటుంది.
చుట్టుపక్కలంతా నీరే ఉన్నా, తాగు నీరు దొరకటం ఒక పెద్ద సమస్య అంటారామె. ఆమె స్వగ్రామమైన అస్సామ్‌లోని లఖింపూర్ జిల్లా, బొర్‌దుబి మలువాల్‌లో తాగునీరు కలుషితమైపోయింది. "మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేతి పంపులన్నీ వరదనీటిలో మునిగిపోయాయి," రూపాలి వివరించారు.
రోడ్డుకు దగ్గరగా ఉన్న చేతి పంపు నుండి నీరు తెచ్చుకోవటానికి ఆమె దోనెపై ఆధారపడతారు. నీరు నింపుకునే మూడు పెద్ద స్టీలు పాత్రలను తీసుకొని, పాక్షికంగా మునిగివున్న రోడ్డు వైపుకు దోనెపై వెళ్తారు రూపాలీ. వరదలో మునిగివున్న గ్రామం గుండా దోనెను నడుపుకుంటూ వెళ్ళటానికి ఆమె ఒక పొడవైన వెదురుకర్రను ఉపయోగిస్తారు. "మొనీ, రా వెళ్దాం!" ఈ ప్రయాణాల్లో తరచుగా తనతోపాటు వచ్చే పొరుగింటామెను పిలుస్తారామె. పాత్రలలో నీరు నింపుకోవడానికి స్నేహితులిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటారు.
కొంతసేపు చేతిపంపు కొట్టిన తర్వాత, శుభ్రమైన నీరు రావటం మొదలయింది. "మూడు రోజుల నుంచీ వాన లేదు, అందుకే మాకు మంచినీళ్ళు వచ్చాయి," ఊరట చెందినట్టుగా సన్నగా నవ్వుతూ అన్నారు రూపాలీ. నీరు తీసుకురావడాన్ని మహిళల పనిగా చూస్తారు. దాంతో, నది పొంగినప్పుడు అది మహిళలకు మరింత భారంగా మారుతుంది.
చేతి పంపు నుంచి మంచినీరు రానప్పుడు,"మేం వీటిని మరిగించి తాగుతాం," తన ఇంటిచుట్టూ నిలిచివున్న మురికినీటిని చూపిస్తూ చెప్పారు 36 ఏళ్ళ వయసున్న రూపాలీ.
ఇక్కడ నివాసముండే అందరి ఇళ్ళకులాగే రూపాలీ వెదురు ఇల్లు కూడా వరదలను తట్టుకోగలిగేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. స్థానికంగా చాంగ్ ఘర్ అని పిలిచే ఈ ఇళ్ళను వరదను నిరోధించడానికి వీలుగా వెదురు ఊతకోలలను నిలబెట్టి, వాటిపైన కడతారు. రూపాలీ ఇంటి వాకిలిని తమ ఇంటిగా మార్చుకున్న బాతులు తమ అరుపులతో అక్కడి నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్నాయి.
రూపాలీ మరుగుదొడ్డికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ దోనె ఆమెకు ఉపయోగపడుతుంది. ఆమె ఇంట్లో ఒకప్పుడు మరుగుదొడ్డి (వాష్‌రూమ్) ఉండేది, కానీ ఇప్పుడు అది నీట మునిగిపోయింది. "మేం నది వైపుగా చాలా దూరం వెళ్ళవలసివుంటుంది," అని ఆమె చెప్పారు. రూపాలీ ఆ ప్రయాణాలను చీకట్లో చేస్తారు.
జీవనమే కాక, ఇక్కడ ఎక్కువగా నివసించే మైసింగ్ సముదాయంవారి జీవనోపాధులపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. "మాకు 12 బీఘాల భూమి ఉంది, అందులో మేం ధాన్యం పండిస్తాం. కానీ ఈ ఏడాది మాత్రం మా పంటలన్నీ మునిగిపోయి, సర్వస్వం పోగొట్టుకున్నాం," అన్నారు రూపాలీ. ఆమె భూమిలోని కొంత భాగాన్ని నది ఇప్పటికే స్వాహా చేసేసింది. "వరద నీరు తీసేసిన తర్వాత మాత్రమే ఈ సంవత్సరం నది మా పొలాన్ని ఎంత మింగేసిందో మాకు అర్థమవుతుంది," అన్నారామె.
రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఉన్న మైసింగ్ ప్రజల సంప్రదాయ వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేయటం కుదరకపోవటంతో అనేకమంది బతుకుతెరువు కోసం బలవంతంగా వలసపోవలసివచ్చింది. 2020 నాటి ఈ అధ్యయనం ప్రకారం, లఖింపూర్ నుంచి బయటకు వలసవెళ్ళినవారి శాతం 29గా ఉంది. ఇది దేశీయ సరాసరి వలసల కంటే మూడు రెట్లు ఎక్కువ. రూపాలీ భర్త మానుస్, తమ ఇద్దరు పిల్లలను - ఒక అమ్మాయి, ఒక అబ్బాయి - ఇంటినీ చూసుకోవటానికి ఆమెను వదిలి, కాపలాదారుగా పనిచేయడానికి హైదరాబాదుకు వలసవెళ్ళారు. నెలకు రూ. 15,000 సంపాదించే మానుస్, రూ. 8,000-10,000 వరకూ ఇంటికి పంపిస్తారు.
ఏడాదిలో ఆరు నెలలపాటు తమ ఇళ్ళన్నీ నీటిలో మునిగి ఉండటం వలన పని దొరకటం చాలా కష్టంగా ఉందని రూపాలీ చెప్పారు. "పోయిన సంవత్సరం మాకు ప్రభుత్వం నుండి పోలిథిన్ షీట్లు, రేషన్ వంటి కొంత సహాయం అందింది. కానీ ఈ ఏడాది అలాంటిదేమీ లేదు. మా దగ్గర డబ్బులున్నట్లయితే, మేం కూడా వెళ్ళిపోయేవాళ్ళం," విచారంగా అన్నారు రూపాలీ.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి