నా జీవితమంతా నేను జంతుసంరక్షణ చేస్తూనేవున్నాను. ఇదే మా పని; రాయీకాలుగా మేం జంతువులకు సేవ చేస్తాం
నా పేరు సీతాదేవి, నా వయసు 40 ఏళ్ళు. చరిత్రాత్మకంగా మా సముదాయం జంతుసంరక్షణను - ప్రధానంగా ఒంటెలను, ఇటీవలి కాలం నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలను - బాధ్యతగా తీసుకుంది. మేం రాజస్థాన్‌లో పాలీ జిల్లాలోని జైతారణ్ బ్లాక్‌లో ఉన్న కుర్కీ గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉండే తారామగరీ శివారుగ్రామంలో నివసిస్తున్నాం
నాకు హరిరామ్ దేవాసీతో (46) వివాహమయింది. మేం మా ఇద్దరు కుమారులైన సవాయి రామ్ దేవాసీ, జామతా రామ్ దేవాసీలతో పాటు వారి భార్యలైన ఆచూ దేవి, సంజూ దేవిలతో కలిసి నివసిస్తున్నాం. ఆచూ, సవాయి దంపతుల 10 నెలల కుమారుడు, మా అమ్మ శాయరీ దేవి (64), కూడా మాతోనే ఉంటారు.
నేను గానీ, నా కోడళ్ళలో ఎవరైనా గానీ తయారుచేసిన ఒక కప్పు మేక పాల టీతో ఉదయం 6 గంటలకు నా రోజు మొదలవుతుంది. ఆ తర్వాత మేం వంట చేసి, మా గొర్రెలనూ మేకలనూ ఉంచే బాడా (పశువుల చావడి)కి వెళ్తాం. ఇక్కడ నేను బురదగా ఉండే మట్టి నేలను ఊడ్చి శుభ్రం చేసి, జంతువుల పెంటికలను సేకరించి, తరువాతి ఉపయోగం కోసం ఒక పక్కన పెడతాను.
బాడా మా ఇంటి వెనుక భాగంలో ఉంటుంది, ఇందులో మా 60 గొర్రెలూ మేకలూ నివసిస్తాయి. ఇందులోనే ఉన్న ఒక చిన్న ఆవరణలో మా గొర్రెపిల్లలనూ, మేకపిల్లలనూ ఉంచుతాం. బాడాలో ఒక చివరన పొడి మేతను - ఎక్కువగా ఎండిన గ్వార్ (గోరు చిక్కుడు) దుబ్బులు - నిల్వ చేస్తాం. గొర్రెలు, మేకలతో పాటు మాకు రెండు ఆవులు కూడా ఉన్నాయి. వాటి కోసం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర విడిగా ఒక చావడి ఉంది.










