స్వాతంత్య్ర పోరాటంలో కూడా కొన్ని సందర్భాల్లో అవకాశాలు పలచబడినట్లు కన్పించేవి. "మీరు జయించలేరు" అని మాతో చెప్పేవారు. మీరు ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యంతో పోరాడుతున్నారు తెలుసా? అని అడిగేవారు. అయినా అలాంటి హెచ్చరికలు, బెదిరింపులను పక్కకు నెట్టేసి మేము ముందుకొచ్చాం. పోరాడాం. అందుకే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం.
- ఆర్. నల్లకణ్ణు
*****
'పసుపు పచ్చడబ్బాలో వోటు వేయండి. శుభప్రదమైన మంజళ్ పెట్టి ని గెలిపించండి!' అన్న నినాదాలు అక్కడ మిన్నుముట్టాయి.
అవి 1937లో బ్రిటిష్ పాలన కింద ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన ప్రొవిన్షియల్ ఎన్నికల నినాదాలు.
డోలు కొడుతోన్న ఒక యువకుల బృందం ఆ నినాదాలు చేసింది. వారిలో చాలామందికి వోటు హక్కు లేదు. ఒకవేళ వోటు వేసే వయస్సున్నా వోటేయడానికి అర్హులు కాదు. వయస్సు వచ్చిన వారందరూ ఆ రోజుల్లో వోటు వేయడానికి అర్హులు కారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం భూమి, ఆస్తులు గలవారే వోటుకు అర్హులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ధనిక రైతులకు మాత్రమే వోటు హక్కు ఉండేది.
వోటు లేనివారు కూడా ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేసేవారు. అదేమీ విచిత్రంగా కన్పించేది కాదు.
జస్టిస్ పార్టీ పత్రిక జస్టిస్ 1935 జులైలో ధిక్కారం పైకి కన్పించకుండా తన తృణీకారం తెలియచేస్తూ ఇలా రిపోర్టు చేసింది:
"ఏ గ్రామానికైనా, పల్లెకయినా వెళ్ళండి, మీకు ఖద్దరు యూనిఫారాలు వేసుకున్న తుంటరి పిల్లలు కన్పిస్తారు. వారి చేతుల్లో త్రివర్ణ పతాకం ఉంటుంది. తలపై గాంధీ టోపీలుంటాయి. వారిలో 80 శాతం మంది వోటులేని కార్మికులు, వాలెంటీర్లు, వారికి ఎలాంటి ఆస్తి లేదు. కనుక వోటర్లు కాదు, వారు పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు..."
ఆర్. నల్లకణ్ణు 1937 ఉద్యమం నాటికి ఒక 12 సంవత్సరాల బాలుడు. ఇప్పుడాయన వయస్సు 97 (2022 నాటికి). ఆయన నాటి డ్రామా గురించి మాకు వివరిస్తూ పడి పడి నవ్వారు. ఆనాడు నిరసన తెల్పిన 'తుంటరి పిల్లకాయల్లో' తాను కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. "ఆ రోజుల్లో భూమి కలిగి, ఏడాదికి రూ. 10 లేదా అంతకు మించి పన్ను కట్టినవారికే వోటు హక్కు ఉండేది," అని నల్లకణ్ణు గుర్తు చేసుకొన్నారు. 1937 ఎన్నికలు వోటు హక్కును కొంత విస్తరించాయి. కానీ "జనాభాలో 15-20 శాతం మంది కంటే ఎక్కువమందికి వోటు కలిగి ఉండేందుకు అనుమతిలేదు," అన్నారతను. ఒకో నియోజకవర్గంలో 1000 నుండి 2000కు మించి ప్రజలు వోటు వేసేవారు కాదు."
నల్లకణ్ణు అప్పటి తిరునల్వేలి జిల్లా, శ్రీవైకుంటంలో పుట్టారు. ఇప్పుడు శ్రీవైకుంటం తాలుకా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉంది. తూత్తుకుడిని 1977 వరకు టూటికోరిన్ అని పిలిచేవారు.
నల్లకణ్ణు చిన్నతనం నుండే చురుగ్గా ఉండేవారు. "నా బాల్యంలో మా పట్టణానికి దగ్గరలో ఉండే తూత్తుకుడిలో మిల్లు కార్మికులు ఒకసారి సమ్మె చేశారు. హార్వే గ్రూపుకు చెందిన మిల్లు అది. ఆ సమ్మె పంజాలై (పత్తి మిల్లు) కార్మికుల సమ్మెగా ప్రసిద్ధి గాంచింది.
"సమ్మె చేసేవారికి మద్దతుగా మా పట్టణంలోని ప్రతి ఇంటి నుండి బియ్యం సేకరించి పెట్టెల్లో పెట్టి తూత్తుకుడిలోని కార్మికుల కుటుంబాలకు అందించేవారు. మాలాంటి చిన్న పిల్లలం ఇంటింటికీ తిరిగి బియ్యం సేకరించేవాళ్ళం." ప్రజలు పేదవారు, "కానీ ప్రతి ఇంటి నుండి ఏదో ఒక సాయం సమ్మెకు లభించింది. ఆ సమయంలో నా వయస్సు ఐదారు ఏళ్ళకు మించదు. సమ్మెలో ఉన్న కార్మికుల మీద ఇతరులు ప్రదర్శించిన సోదరభావం నా మీద చాలా ప్రభావం చూపింది. ఆ ప్రభావం వల్ల నేను చిన్నతనంలోనే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవాణ్ణి."
ఆయన్ని మేం మళ్లీ 1937 ఎన్నికల వైపుకు తెచ్చాం: మంజళ్ పెట్టి లేదా పసుపుపచ్చ పెట్టెకి వోటేయమని ఎందుకు అడిగారు?
"ఆ రోజుల్లో మద్రాసులో రెండే ప్రధాన పార్టీలు ఉండేవి," అన్నారతను. "ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది జస్టిస్ పార్టీ. ఎన్నికల్లో ఇప్పటిలా గుర్తులు లేవు. పార్టీలను ఏదో ఒక రంగు బ్యాలెట్ పెట్టె ద్వారా గుర్తించేవారు. మేమప్పుడు కాంగ్రెస్‌కు ప్రచారం చేశాం. దానికి పసుపు రంగు పెట్టె కేటాయించారు. జస్టిస్ పార్టీకి పచ్చయ్ పెట్టి (ఆకుపచ్చ పెట్టె) కేటాయించారు. ఆ సమయంలో వోటరు తాను ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడో గుర్తించడానికి అదే ఉత్తమ మార్గం."
అప్పుడు కూడా ఎన్నికల్లో నాటకాలు, వగైరాలు ఉండేవి. ఆ రోజుల్లో ది హిందూ ఎన్నికల ప్రచారంపై ఇలా రిపోర్టు చేసింది. "దేవదాసి ప్రచారకురాలు తంజావూర్ కాముకణ్ణమ్మాళ్... అందరినీ ‘నశ్యం పెట్టె’లో వోటు వేయమని అడిగారు!” ఆ రోజుల్లో నశ్యం డబ్బాలు మామూలుగా బంగారు, పసుపు రంగుల్లో ఉండేవి. ది హిందూ కూడా ఆ వార్తకు "పసుపు రంగు పెట్టెలను నింపండి" అంటూ శీర్షిక పెట్టింది.
"అప్పుడు నా వయస్సు 12 ఏళ్ళే కనుక నేను వోటు వేయలేకపోయాను," అన్నారు నల్లకణ్ణు. "కానీ నేను బయటకు వెళ్ళి సాధ్యమైనంత గట్టిగా ప్రచారం చేశాను." మూడేళ్ళ తర్వాత, ఆయన ఎన్నికలకు మించి రాజకీయ ప్రచారాలలో భాగమయ్యారు. " పరై [ఒక రకమైన డోలు] కొడుతూ, గట్టిగా నినాదాలు ఇస్తూ."
అయినా ఆయన ఎంతో కాలం కాంగ్రెస్ మద్దతుదారుగా ఉండలేదు. "నేను 15 ఏళ్ళ వయస్సు నుండే భారత కమ్యూనిస్టు పార్టీ [సిపి ఐ]తో ఉన్నాను" అని మిత్రులు 'కామ్రేడ్ ఆర్ఎన్‌కె' అని పిలుచుకునే నల్లకణ్ణు చెప్పారు. అయితే పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి అతను ఇంకొన్నేళ్ళు వేచి ఉండాల్సివచ్చింది. ఆ తర్వాతి కొన్ని దశాబ్దాల్లోనే ఆర్ఎన్‌కె తమిళనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. ఆ పైన ఆయన మంజళ్ పెట్టి (పసుపురంగు పెట్టె)కి కాకుండా చెంగోడి (ఎర్ర జెండా) కోసం మద్దతు కోరుతూ ఉండేవారు. ఆయన విజ్ఞప్తి తరచుగా విజయవంతంగా నెరవేరేది.
*****
"తిరునల్వేలిలోని మా ప్రాంతంలో అప్పుడు ఒకే ఒక్క బడి ఉండేది కాబట్టి దాన్ని అందరూ ‘బడి’ అనే పిలిచేవారు, అదే దాని పేరు.”
నల్లకణ్ణు చెన్నైలోని తన చిన్న కార్యాలయంలో మాతో మాట్లాడారు. అదే ఆయన ఇల్లు కూడా. ఆయన పక్కనే ఉన్న ఒక ఓరమేజా బల్లపైన లెనిన్, మార్క్స్, పెరియార్‌ల చిన్న అర్ధాకృతి బొమ్మలు (శరీరం పైసగభాగం వరకు ఉండే బొమ్మలు) ఉన్నాయి. వాటి వెనుక, తమిళ విప్లవ కవి సుబ్రమణ్య భారతి పెద్ద రేఖాచిత్రం ఎదురుగా, కొంచం పెద్దగా బంగారు రంగులో ఉన్న అంబేద్కర్ అర్ధాకృతి బొమ్మ ఉంది. అలాగే పెరియార్ అర్ధాకృతి బొమ్మ వెనుక భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల ఫోటో ఆధారంగా గీసిన రేఖాచిత్రం ఉంది. వీటన్నిని పక్కన, 'తక్కువ నీరు వాడండి' అనే సందేశం ఉన్న ఒక కేలండర్ వేలాడుతోంది.
ఆ మొత్తం అద్భుత దృశ్యం, ఒక్క చూపులో ఆయన మేధో వికాస క్రమాన్నీ, చరిత్రనూ పట్టిచూపుతోంది. ఆ వ్యక్తితో మేం ఇప్పటికి మూడవసారి మాట్లాడుతున్నాం. అది 2022 జూన్ 25. మేం ఆయన్ని మొదటిసారి 2019లో ఇంటర్వ్యూ చేశాం.
"నాకు చాలా స్ఫూర్తినిచ్చిన కవి భారతియార్," అన్నారు నల్లకణ్ణు. "ఆయన కవితలు, పాటలు తరచూ నిషేధానికి గురయ్యేవి," అంటూ నల్లకణ్ణు మాకు భారతి రాసిన 'సుదందిర పళ్ళు' (స్వతంత్ర గీతం) నుండి కొన్ని పంక్తులు వినిపించారు. అది ఆ కవి రాసిన ఒక అద్భుతమైన పాట. "ఆయన ఆ పాటని 1909లో రాశారనుకొంటాను. అంటే స్వాతంత్ర్యం రావడానికి 38 ఏళ్ళకు ముందే ఆయన స్వాతంత్రోత్సవాన్ని జరుపుకొన్నారన్నమాట!"
మేం నృత్యం చేస్తాం, పాటలు పాడుతాం
మేం స్వాతంత్ర్యం పొందిన సంతోషంలో ఉన్నాం
మేం బ్రాహ్మణులను ‘అయ్యా’ అని పిలిచే కాలం వెళ్ళిపోయింది,
తెల్లవాళ్ళను 'ప్రభూ' అని పిలిచే రోజులూ గతించాయి,
మేం వేసే బిచ్చం తీసుకునేవారికి మేం సలాములు చేసే రోజులు పోయాయి,
మమ్మల్ని ఎగతాళి చేసేవారికి మేం సేవచేసే రోజులు పోయాయి.
అన్ని చోట్లా స్వాతంత్య్రం గురించే మాటలు...
భారతి 1921లో చనిపోయారు. అంటే నల్లకణ్ణు పుట్టడానికి నాలుగేళ్ళ ముందన్నమాట. ఆ పాట అంతకంటే ముందు రాసింది. అయినా ఆ పాట, అలాగే భారతి రాసిన ఇతర పాటలు నల్లకణ్ణును పోరాటానికి ఉత్తేజపరిచాయి. నల్లకణ్ణుకు 12 ఏళ్ళ వయస్సు రాకముందే భారతి రాసిన చాలా పాటలు తెలుసు. "బడిలో హిందీ పండితులైన పళవేశం చెట్టియార్ వల్ల నాకు కొన్ని పాటలు తెలిశాయి," అన్నారాయన. అయితే అవేవీ అధికారికంగా సిలబస్‌లో లేవు.
"కాంగ్రెస్ నాయకుడు ఎస్. సత్యమూర్తి మా బడిని సందర్శించినప్పుడు నాకు భారతియార్ రచనల పుస్తకం ఇచ్చారు. అది ఆయన రాసిన దేశీయ గీతమ్ (దేశీయ గీతాలు) సంకలనం." సత్యమూర్తి స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, కళా పోషకుడు. రష్యాలో జరిగిన 1917 అక్టోబర్ విప్లవాన్ని మొట్టమొదటిగా ప్రశంసించినవారిలో సుబ్రమణ్య భారతి ఒకరు. ఆ విప్లవాన్ని కీర్తిస్తూ ఆయన ఒక పాట కూడా రాశారు.
నల్లకణ్ణుకు సుబ్రమణ్య భారతి పట్ల ఉన్న ప్రేమ ద్వారా, ఎనిమిది దశాబ్దాలుగా ఆయన భాగంగా ఉన్న వ్యవసాయ, కార్మికవర్గ పోరాటాల్లో ఆయనకున్న దృష్టికోణం ద్వారా మనం ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం మంచిది.
అలా కాకుండా మరో పద్ధతిలో కా. ఆర్ఎన్‌కె గురించి చెప్పడం అసాధ్యం. నేను కలిసినవారిలో అత్యంత నిరాడంబరులైన వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. ఆయన మనకు చెప్పే గొప్ప సంఘటనలు, సమ్మెలు, పోరాటాలలో దేనిలోనైనా తనను తాను కేంద్ర స్థానంలో ఉంచుకోవడానికి సున్నితంగా, కానీ దృఢంగా నిరాకరిస్తారు. కొన్ని పోరాటాల నిర్వహణలో ఆయనది కీలక పాత్ర కావొచ్చు. కానీ మీరు ఆయన తన పాత్రను ఆ విధంగా చిత్రీకరించడమో లేదా వివరించడమో చేయడాన్ని ఎన్నటికీ చూడలేరు...
"మా రాష్ట్ర రైతాంగ ఉద్యమ స్థాపకుల్లో కామ్రేడ్ ఆర్ఎన్‌కె ఒకరు," అన్నారు జి. రామకృష్ణన్. 'జిఆర్' సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడైనప్పటికీ, 97 ఏళ్ళ ఈ సిపిఐ నాయకుడి పాత్ర గురించీ, చేసిన దోహదం గురించీ నిస్సంకోచంగా తన గౌరవాన్ని ప్రకటిస్తారు. "దశాబ్దాలుగా - యుక్తవయసులో ఉన్నప్పటి నుండి మొదలుకొని - శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్రమంతటా కిసాన్ సభకు పునాదులు వేసింది ఆయనే. అవే ఈ రోజుకు కూడా వామపక్షాల శక్తికి వనరులు. తమిళనాడు అంతటా నల్లకణ్ణు తన అవిశ్రాంత ప్రచారాలు, పోరాటాల ద్వారా దానిని రూపొందించడంలో సహాయపడ్డారు."
నల్లకణ్ణు పోరాటాలు రైతు ఉద్యమాలను వలసవాద వ్యతిరేక ఉద్యమాలతో చక్కగా జోడించాయి. అలాగే తమిళనాడులో ఆ సమయంలో సాగిన కీలకమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో కూడా. అవి 1947 తర్వాత కూడా బలంగా కొనసాగాయి. బ్రిటిష్‌వాడి నుండి స్వతంత్రం సాధించడం కోసం మాత్రమే కాక, మనం ఈ రోజున మర్చిపోయిన అనేక స్వేచ్ఛల కోసం ఆయన పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు.
"వారితో మేం రాత్రివేళల్లో పోరాడేవాళ్ళం, రాళ్ళు విసిరేవాళ్ళం - మాకున్న ఆయుధాలు అవే - వారిని తరిమి కొట్టేవాళ్ళం. కొన్నిసార్లు ఘోరమైన యుద్ధాలు జరిగేవి. 1940ల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో అలా తరుచుగా జరిగేది. మేమప్పుడు పిల్లలం, అయినా పోరాడేవాళ్ళం. పగలూ రాత్రీ మా తరహా ఆయుధాలతో. “
ఎవరితో పోరాడారు? ఎవరిని, ఎక్కడి నుండి తరిమి కొట్టారు?
"మా ఊరి దగ్గరి ఉప్పళం (ఉప్పు కయ్యలు). ఆ ఉప్పు కయ్యలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో ఉండేవి. అక్కడ పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా ఉండేవి. అన్ని మిల్లుల్లో జరుగుతున్నట్లుగానే అక్కడ కూడా చాలా దశాబ్దాల నుండి పోరాటాలు జరిగేవి. కార్మికుల నిరసన పోరాటాలకు ప్రజల నుండి మంచి మద్దతు ఉండేది."
పోలీసులు ఆ ఉప్పు కయ్యల యజమానులకు ఏజెంట్లుగా పనిచేసేవారు. అక్కడ ఒకసారి జరిగిన ఘర్షణలో ఒక పోలీసు సబ్ ఇన్సెక్టర్ చనిపోయాడు. అక్కడి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి జరిగింది. పోలీసులు ఒక సంచార గస్తీ దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ దళం పగటి పూట ఉప్పు కయ్యల దగ్గరికి వెళ్ళి, రాత్రికి మా గ్రామాల దగ్గర ఏర్పాటు చేసుకొన్న శిబిరానికి చేరుకొనేది. ఆ సమయంలో మేం వారితో ఘర్షణ పడేవారం." ఈ నిరసనలు, ఘర్షణలు రెండేళ్ళో, అంతకంటే ఎక్కువగానో అప్పుడప్పుడూ జరుగుతుండేవి. "అయితే, 1942లో క్విట్ ఇండియా పిలుపు సందర్భంగా అవి మరింత ఊపందుకున్నాయి."
బాలుడిగా ఉన్నప్పటి నుంచీ నల్లకణ్ణు ఈ కార్యకలాపాలలో పాల్గొనటం, ఆయన తండ్రి రామసామి తేవర్‌కు నచ్చేది కాదు. వ్యవసాయదారుడైన తేవర్‌కు నాలుగైదు ఎకరాల భూమి ఉండేది. ఆయనకు ఆరుగురు పిల్లలు. పిల్లవాడయిన ఆర్ఎన్‌కెను తండ్రి తరచూ శిక్షించేవారు. కొన్నిసార్లు అతనికి బడి ఫీజులు కూడా కట్టేవారు కాదు.
"జనం ఆయనతో అంటుండేవారు - 'మీ అబ్బాయి చదువుకోడా? ఎప్పుడూ బయటే ఉండి అరుస్తూ ఉంటాడు. చూడగా, అతను వెళ్ళిపోయి కాంగ్రెస్‌లో చేరినట్లున్నాడు,' అని". ‘బడి’లో ప్రతినెల 14వ తేది నుండి 24వ తేదీ లోపల ఫీజు చెల్లించాలి. "ఒకవేళ ఫీజు గురించి నేనాయన్ని అడిగితే ఆయన నా మీద అరిచేవాడు: 'బడి మానేసి మీ చిన్నాన్నలకు పొలం పనుల్లో సాయంచెయ్యి,' అంటూ."
"ఫీజు గడవు ముగుస్తుండగా ఆయనకు దగ్గరగా ఉండే ఎవరో ఒకరు ఆయనను శాంతపరిచేవారు. ఇకముందు నేను అప్పుడు చేస్తున్నట్టుగా మాట్లాడటం కానీ, పనులు చేయటంగానీ చేయనని ఆయనకు మాట ఇచ్చేవాళ్ళు. అప్పుడు మాత్రమే మా నాన్న ఫీజు కట్టేవాడు."
అయినప్పటికీ, "మా నాన్న నా జీవితాన్ని, నా పనులను ఎంతగా వ్యతిరేకిస్తే, అంతగా నా లోపల అసమ్మతి పెరుగుతూ వచ్చింది. మదురై హిందూ కాలేజీలో నేను తమిళంలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు వచ్చాను. అది నిజానికి తిరునల్వేలి జంక్షన్ దగ్గర ఉండేది. అయినా దాన్ని మదురై హిందూ కాలేజీ అనే పిలిచేవారు. అక్కడ నేను రెండేళ్ళే చదివాను. అంతకుమించి ముందుకు వెళ్ళలేకపోయాను."
కారణం ఏమిటంటే నిరసన కార్యక్రమాల్లో ఆయన తీరిక లేకుండా ఉండిపోయాడు. ప్రత్యేకించి - తనకున్న వినయం వల్ల చెప్పుకోకపోయినప్పటికీ - నిరసన ప్రదర్శనల్లో జనాన్ని సమీకరించటం కూడా మొదలుపెట్టాడు. ఆర్ఎన్‌కె చాలా వేగంగా యువనాయకుడిగా ఎదుగుతూ వచ్చాడు. అయితే తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఎన్నడూ కోరుకోని వినయశీలి ఆయన.
ఆయన పాల్గొన్న, నిర్వహించిన కార్యక్రమాలను ఒక వరుసలో చెప్పడం కష్టం. ఎందుకంటే వాటి సంఖ్య చాలా ఎక్కువ, పైగా అవి విభిన్న రంగాలకు చెందినవి.
స్వాతంత్య్ర పోరాటంలో తాను పాల్గొన్న ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే ఆయన వివరించారు: "క్విట్ ఇండియా ఆందోళన సాగుతున్నప్పుడు జరిగిన పోరాటాలు." అప్పుడాయనకు 17 ఏళ్ళు కూడా లేవు, కానీ అప్పటికే జరుగుతోన్న నిరసన కార్యక్రమాల్లో మాత్రం చాలా ముఖ్యమైనవాడు. తన వయసు 12-15 ఏళ్ళ మధ్య ఉన్నప్పుడే ఆయన క్రమంగా కాంగ్రెస్ భావాలను వదులుకొని కమ్యూనిస్టుగా మారారు.
ఎలాంటి నిరసన కార్యక్రమాల నిర్వహణకు సాయపడేవారు, లేదా పాల్గొనేవారు?
మొదట్లో, "మా దగ్గర రేకుతో తయారుచేసిన మెగాఫోన్లు ఉండేవి. గ్రామం కానీ పట్టణం కానీ, అక్కడ ఉండే బల్లలనీ కుర్చీలనీ, ఎన్ని తేగలిగితే అన్నిటిని, ఒక దగ్గరికి తీసుకొచ్చి పాటలు పాడేవాళ్ళం. ప్రధానంగా బల్లలు ఎందుకంటే, ఉపన్యాసకులు వాటిపై నిలబడి మాట్లాడేందుకు. జనం తప్పనిసరిగా సభకు వచ్చేవారనే సంగతిని మీరు మర్చిపోరాదు." మరోసారి, ప్రజలను సమీకరించడంలో తన పాత్ర గురించి ఆయన చాలా తక్కువగా చెప్పారు. ఏదేమైనా ఆయనవంటి పదాతి దళాల కృషి వల్లనే ఇదంతా సాధ్యపడింది.
"ఆ తర్వాత, జనం పెద్ద ఎత్తున కూడాక, జీవానందం వంటి వక్తలు బల్ల పైకి ఎక్కి ఆ పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడేవారు. అప్పట్లో మైకులు లేవు. నిజానికి ఆయనకు వాటి అవసరం లేదు కూడా. కొంతకాలం తర్వాత మాకు మంచి మైకులు, లౌడ్ స్పీకర్లు వచ్చేశాయి. వాటిలో చాలా ఇష్టమైనవి, మేం ‘షికాగో మైకులు’ అని పిలుచుకునే షికాగో రేడియా సిస్టమ్స్. అయితే, వాటిని తరచుగా భరించే స్తోమత మాకు ఉండేది కాదు," అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు.
బ్రిటిష్‌వారు విరుచుకుపడ్తున్న సమయంలో ఎలా పనిచేసేవారు?
"అలాంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయి. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (1946) తర్వాత కమ్యూనిస్టులపై నిర్బంధం మొదలైంది. అలాంటి దాడులు అంతకుముందు కూడా జరిగాయి. కొన్నిసార్లు బ్రిటిష్ అధికారులు ప్రతి గ్రామంలోని ప్రతి పార్టీ కార్యాలయాన్నీ సోదా చేసేవారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా అది కొనసాగింది, ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాక. మాకు కొన్ని బులెటిన్లు, పత్రికలు ఉండేవి. ఉదాహరణకు జనశక్తి లాంటివి. కాని మాకు సమాచారం అందించడానికి మరో మార్గం ఉండేది. అందులో కొన్ని, శతాబ్దాల కిందటి సంకేతాల పద్ధతి వంటివి.
"కట్టబొమ్మన్ (18వ శతాబ్దంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం నడిపిన చారిత్రక వ్యక్తి) కాలం నుంచి ప్రజలు తమ ఇంటి ముంగట వేపమండలను ఉంచే ఆచారం ఉండేది. అంటే ఆ ఇంట్లో ఎవరో మశూచితోనో మరో జబ్బుతోనే ఉన్నారనటానికి అది గుర్తు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్య సమావేశం జరుగుతోందనటానికి గుర్తుగా కూడా దాన్ని వాడేవారు.
“ఒకవేళ ఇంట్లో నుండి పసిబిడ్డ ఏడుపు విన్పిస్తే సమావేశం ఇంకా జరుగుతోందని అర్థం. గడప దగ్గర పచ్చిపేడ కన్పించినా సమావేశం ఇంకా జరుగుతున్నట్లు అర్థం. అక్కడున్న పేడ ఎండిపోయి కన్పిస్తే ప్రమాదం పొంచి ఉంది, వెళ్ళిపోవాలని అర్థం, లేదా సమావేశం ముగిసిందని కూడా.”
స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎన్‌కెకు చాలా ఎక్కువగా స్ఫూర్తినిచ్చినది ఏమిటి?
'కమ్యూనిస్టు పార్టీయే మాకు అన్నింటికంటే ఎక్కువ స్ఫూర్తినిచ్చినది.'
*****
'అరెస్టు అయినప్పుడు నేను మీసాలెందుకు తీసేశాను?' ఆర్ఎన్‌కె బిగ్గరగా నవ్వుతారు. "నేనెప్పుడూ అలా చేయలేదు. అసలు సంగతి, నా మొహాన్ని దాచుకోవాలని నేను వాటిని పెంచలేదు. అలాంటప్పుడు నేనసలు వాటినెందుకు పెంచాలి?
'అవేవీ కాదు. పోలీసులు వాటిని సిగరెట్‌తో కాల్చేశారు. మద్రాసు నగరానికి చెందిన ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి నన్ను పెట్టిన చిత్రహింసలో భాగంగా ఆ పని చేశాడు. అతను నా రెండు చేతులను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కట్టేశాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు గానీ ఆ కట్లు విప్పలేదు. తర్వాత చాలాసేపు తన లాఠీతో బాదాడు.'
స్వాతంత్య్ర యోధులందరిలాగే ఈయన కూడా ఆ సంఘటనను ఎటువంటి వ్యక్తిగత వైషమ్యం లేకుండా గుర్తుచేసుకున్నారు. తనను చిత్రహింసలు పెట్టిన వ్యక్తి పై ఆయనకు ఎలాంటి వైరభావం లేదు. ఆ తర్వాతి రోజుల్లో కూడా, ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌పై కక్ష తీర్చుకోవాలని ఆర్ఎన్‌కె ఎన్నడూ అనుకోలేదు. అలా చేయాలనే ఆలోచన అయనకు ఒక్కసారి కూడా రాలేదు.
'నిజానికిది 1948లో జరిగింది,' అన్నారతను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. 'మద్రాసు రాష్ట్రం సహా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. అది 1951 వరకు కొనసాగింది.
‘అయితే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కూడా జరిగాయని మీరు అర్థం చేసుకోవాలి. అందుకు మేం చాలా మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. 1947కి చాలా కాలం ముందే ప్రారంభమైన ఈ పోరాటాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయి.
‘స్వాతంత్ర్యోద్యమం, సామాజిక సంస్కరణలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు - వీటన్నిటినీ మేం ఒకచోటికి చేర్చాం. మేం పని చేసిన పద్ధతి అది. మెరుగైన, సమానమైన వేతనాల కోసం పోరాడాం. అంటరానితనం నిర్మూలన కోసమూ పోరాడాం. దేవాలయ ప్రవేశ ఉద్యమాల్లోనూ ముఖ్యమైన పాత్రను పోషించాం.
‘జమీన్‌దారీ వ్యవస్థ నిర్మూలన కోసం జరిగిన ఉద్యమం తమిళనాడులో జరిగిన చాలా పెద్ద ఉద్యమం. రాష్ట్రంలో అనేక ప్రముఖ జమీన్‌దారీలు ఉండేవి. మేం మిరాసుదారీ (వంశపారంపర్య హక్కు కింద అదుపులో ఉంచుకున్న భూమి), ఇనామ్‌దారీ (వ్యక్తులకు లేదా సంస్థలకు పాలకులు కేటాయించిన భూములు) పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడాం. ఆ పోరాటాల్లో అగ్రభాగాన ఉన్నది కమ్యూనిస్టులే. ఇక్కడ పెద్ద పెద్ద భూస్వాములతోనూ, వారి దగ్గర ఉండే ప్రయివేట్ సాయుధ గుండాలు, దుండగులతోనూ తలపడాల్సి వచ్చేది.
‘పుణ్ణియూర్ సాంబశివ అయ్యర్, నెడుమణమ్ సామియప్ప ముదలియార్, పూండి వాండయార్ వంటివాళ్ళు ఉండేవారు. వారు వేల ఎకరాల సారవంతమైన భూమిని తమకింద ఉంచుకున్నారు.’
మనం ఇప్పుడు చాలా ఆసక్తి కల్గించే చరిత్ర పాఠంలో ఉన్నాం. ఆ చరిత్ర సృష్టికి సాయపడిన వ్యక్తితో మాట్లాడుతున్నాం.
'స్వాతంత్ర్యోద్యమం, సామాజిక సంస్కరణలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు - వీటన్నిటినీ మేం ఒకచోటికి చేర్చాం. మెరుగైన, సమానమైన వేతనాల కోసం పోరాడాం. అంటరానితనం నిర్మూలన కోసమూ పోరాడాం. దేవాలయ ప్రవేశ ఉద్యమాల్లోనూ ముఖ్యమైన పాత్రను పోషించాం'
శతాబ్దాల కాలంనాటి బ్రహ్మదేయమ్ , దేవదాణమ్ అనే పద్ధతులు కూడా అమల్లో ఉండేవి.
‘బ్రహ్మదేయమ్ కింద పాలకులు ఉచితంగా బ్రాహ్మణులకు భూములు ఇచ్చేవారు. వారు ఆ భూమిని పాలించి, దాని నుంచి ప్రయోజనం పొందేవారు. వారెప్పుడూ నేరుగా వ్యవసాయం చేసేవారు కాదు, కానీ పంట మాత్రం వారికే వెళ్ళేది. ఇక దేవదాణమ్ కింద భూములను ఆలయాలకు కానుకగా ఇచ్చేవారు. కొన్నిసార్లు మొత్తంగా ఊరినే ఇచ్చేవారు. చిన్న కౌలు రైతులు, కూలీలు ఆ భూములపై అధికారం గల వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సివచ్చేది. వారికి ఎదురుతిరిగినవారిని భూముల నుండి బేదఖలు చేసేవారు.
‘ఈ సంస్థలు, మడమ్‌ల [మఠాలు] కింద ఆరు లక్షల ఎకరాల భూమి ఉండేది. బహుశా ఇప్పటికీ ఉండి ఉండవచ్చు. కాని వాటి అధికారాలు మాత్రం అలుపెరుగని ప్రజా పోరాటల వల్ల చాలావరకు కత్తిరించబడ్డాయి.
"తమిళనాడు జమీన్‌దారీ రద్దు చట్టం 1948 నుండి ఉనికిలోకి వచ్చింది. కాని ఆ జమీన్‌దార్లకు, బడా భూస్వాములకే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది తప్ప, వారి కోసం ఆ భూములను సాగుచేసిన ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ధనికులైన కౌలు రైతులు మాత్రం కొంత నష్టపరిహారాన్ని పొందారు. ఆ భూముల్లో పనిచేసిన పేదలకు ఏమీ దక్కలేదు. 1947-49 మధ్య కాలంలో దేవాలయ భూముల నుండి పెద్ద ఎత్తున బేదఖళ్ళు జరిగాయి. 'భూములపై హక్కు ఉన్నప్పుడే రైతుల జీవితాలు మెరుగుపడుతాయని' చెప్తూ రైతులకు భూములు దక్కడం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాం.
"ఇవీ మా పోరాటాలు - 1948 నుండి 1960 వరకు రైతులకు భూమిపై అధికారం కోసం పోరాటాలు నడిచాయి. ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి [రాజాజీ] భూస్వాముల వైపు, మఠాల వైపు నిలిచాడు. 'దున్నేవాడికే భూమి' అని మేం నినదించాం. పత్రాలు ఉన్నవారిదే భూమి అని రాజాజీ అన్నాడు. అయితే, మా పోరాటాల ద్వారా భూములపై గుడులకు, మఠాలకు ఉన్న సంపూర్ణ అధికారాల మీద దెబ్బకొట్టగలిగాం. వారి పంట కోతల నిబంధనలను, ఇతర ఆచారాలను ధిక్కరించాం. బానిసల్లా బతకడానికి నిరాకరించాం.
"వాస్తవానికి ఈ పోరాటాలన్నీ సామాజిక పోరాటాల నుండి విడదీయరానివి.
"ఒక రాత్రివేళ ఒక గుడి దగ్గర జరిగిన నిరసన ప్రదర్శన నాకు జ్ఞాపకం ఉంది. అన్ని గుడులకూ రథం పండుగలుంటాయి. అయితే, తాళ్ళతో రథాన్ని లాగేది మాత్రం రైతులే. రైతుల నుంచి భూములను లాక్కోవడాన్ని కొనసాగిస్తే, రైతులు ఎక్కడా రథాన్ని లాగరని మేం ప్రకటించాం. విత్తనాల కోసం కొంత ధాన్యాన్ని వెనక్కి తీసుకొనే మా హక్కును గురించి కూడా నొక్కిచెప్పాం."
ఇప్పుడాయన స్వాతంత్ర్యానికి ముందూ ఆ తర్వాతా జరిగిన కాలం మధ్య తిరుగాడుతున్నారు. ఒక స్థాయిలో అది తికమకగా అనిపించింది. మరోవైపు ఆ కాలపు సంక్లిష్టతను ముందుకు తెస్తోంది. అక్కడ సాధించాల్సిన స్వాతంత్ర్యాలు ఎన్నో ఉన్నాయని అర్థమవుతోంది. వాటిలో కొన్ని పోరాటాలు ఎప్పుడు మొదలయ్యాయో ఎప్పుడు ముగిశాయో ఆ తేదీలు స్పష్టంగా లేవు. ఆర్ఎన్‌కె వంటి వ్యక్తులు అలాంటి స్వాతంత్య్ర సాధనలో ధృఢంగా నిలిచారు.
“మేం కూడా, ఆ దశాబ్దాలలో కార్మికులను కొట్టడం, చిత్రహింసలు పెట్టడానికి వ్యతిరేకంగా పోరాడాం.
"1943 వరకు కూడా దళిత శ్రామికులను కొరడాలతో కొట్టేవారు. కొరడా దెబ్బల వలన అయిన గాయాలపై పేడనీళ్ళు పోసేవారు. తెల్లవారుఝామున కోడికూతతోనే, అంటే ఉదయం 4-5 గంటల కల్లా, వారు పనిలోకి వెళ్ళాలి. వారు మిరాసుదార్ల ఇంటి దగ్గర పశువులను కడగడానికి, ఆవు పేడ ఎత్తడానికి, ఆ తర్వాత పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళాలి. అప్పటి తంజావూరు జిల్లాలో తిరుత్తురైపూండి దగ్గర ఒక గ్రామం ఉండేది. అక్కడే మేం నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.
"అక్కడ కిసాన్ సభ నాయకుడైన శ్రీనివాసరావు నాయకత్వంలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. 'నువ్వు ఎర్రజెండా పట్టుకొన్నందుకు ఎవరైనా నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టాలి' అనే భావన ప్రదర్శనకారుల్లో ఉండేది. చివరికి తిరుత్తురైపూండి ముదలియార్లు, మిరాసుదార్లు ఇకపై తాము కూలీలను కొరడాతో కొట్టబోమని, పేడనీళ్ళు చల్లబోమని, ఇతర అనాగరిక ఆచారాలకు తలపడబోమని అంగీకరించి ఒప్పందంపై సంతకాలు పెట్టారు.
1940 నుండి 1960 వరకు, ఆ తర్వాత కూడా సాగిన ఆ పోరాటాల్లో ఆర్ఎన్‌కె ప్రధాన భూమిక పోషించారు. శ్రీనివాసరావు తర్వాత ఆయన తమిళనాడులో అఖిల భారత కిసాన్ సభ (AIKS) అధినేత అయ్యారు. 1947 తర్వాతి దశాబ్దాల్లో ఈ పదాతిదళ సైనికుడు రైతుల, కూలీల పోరాటాల్లో ఒక బలమైన సేనాధిపతిగా ఆవిర్భవించారు.
*****
వారిద్దరూ ఉత్తేజితులూ ఉద్విగ్నులూ కూడా. మేం సిపిఐ(ఎం) నాయకుడు, స్వాతంత్య్ర యోధుడు శంకరయ్య ఇంటివద్ద ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంటే, ఆయనతోనూ, నల్లకణ్ణుతోనూ కలిసి మాట్లాడుతున్నాం. ఎనభై ఏళ్ళ ఉద్యమ సహచరులైన వారిద్దరూ పలుకరించుకొన్నప్పుడు వ్యక్తమయిన భావోద్వేగం ఆ గదిలో ఉన్న మమ్మల్ని కూడా తాకింది.
అక్కడ ద్వేషం గానీ విచారం గానీ లేవా? 50 ఏళ్ళ క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలినప్పుడు ఇద్దరూ రెండు భిన్నమైన మార్గాలలో పయనించారు. అది స్నేహ పూర్వకంగా విడిపోవడం కాదు.
"అయితే మేమిద్దరం ఆ తర్వాత కూడా చాలా సమస్యలపై, అలాగే పోరాటాల్లోనూ కలిసి పనిచేశాం," అని నల్లకణ్ణు చెప్పారు. "పార్టీ చీలికకు ముందు ఒకరంటే మరొకరు ఎలా ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారు.".
"మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఇప్పటికీ ఒక పార్టీగానే ఉంటాం," అని చెప్పారు శంకరయ్య.
ప్రస్తుతం దేశంలో పెచ్చరిల్లుతోన్న మతోన్మాదం, ద్వేషపూరిత వాతావరణం పట్ల వారి స్పందన ఏమిటి? దేశం మనుగడ గురించి వారు భయపడుతున్నారా? ఏ దేశ స్వాతంత్ర్య సాధన కోసం వారు పనిచేశారో ఆ దేశం గురించి.
"స్వాతంత్ర్య పోరాటంలోనూ కొన్ని సమయాలు నిస్తేజంగా కనిపించాయి," అన్నారు నల్లకణ్ణు. "మీరు గెలవలేరని మాతో చెప్పేవారు. మీరు ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యంతో ఢీకొంటున్నారు. పోరాటాల నుండి దూరంగా ఉండమని మాలో కొన్ని కుటుంబాలకు హెచ్చరికలు వచ్చాయి. కాని మేం ఆ హెచ్చరికలకు, బెదిరింపులకు అతీతంగా ఎదిగాం, పోరాడాం. అందుకే మనం ఈ రోజున ఇలా ఉన్నాం."
విశాల ఐక్యతను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆ ఇద్దరూ చెప్పారు. గతంలో మాదిరిగా మనం ఇతరుల దగ్గరికి వెళ్లాలి, వారి నుండి నేర్చుకొని ముందుకుసాగాలి. "ఇఎంఎస్ (నంబూదిరిపాద్) కూడా తన గదిలో గాంధీ ఫోటోను ఉంచుకునేవారు," అని ఆర్ఎన్‌కె అన్నారు.
మనలో కోట్లాదిమందిని భయపెడుతోన్న రాజకీయ స్థితి గురించి వారిద్దరూ ఎలా ప్రశాంతంగా, ఆశాభావంతో ఉండగలుగుతున్నారు? నల్లకణ్ణు భుజాలు ఎగురవేశారు: "మేం ఇంతకంటే అధ్వాన్న పరిస్థితులను చూశాం."
తాజా కలం
స్వాతంత్ర్య దినోత్సవం, 2022 – అప్పటికే ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ పుస్తకం ముద్రణకు వెళ్ళింది. తమిళనాడు ప్రభుత్వం ఆర్ఎన్‌కెకు తగైసార్ తమిళర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇది రాష్ట్రానికి, తమిళ సమాజానికి గొప్పగా సేవలు అందించిన ప్రముఖ వ్యక్తి కోసం తమిళనాడు ప్రభుత్వం 2021లో స్థాపించిన ఉత్తమ బహుమతి. ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాకారాలపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, నగదు బహుమతి రూ. 10 లక్షలను ఆర్‌ఎన్‌కెకు అందజేశారు.
అనువాదం: ఎస్. వినయ్ కుమార్