"ఇదంతా ఒకే ఒక దారంతో మొదలై ఒకే ఒక దారంతో పూర్తవుతుంది," సన్నగా నవ్వుతూ అంటారు రేఖా బెన్ వాఘేలా. ఆమె గుజరాత్‌లోని మోటా టింబ్లా గ్రామంలోని తన ఇంటిలో ఒక సింగిల్ ఇక్కత్ పటోలు ను నేస్తూ తన చేనేత మగ్గం ముందు కూర్చునివున్నారు. "మొదట్లో మేం బాబిన్‌లోకి ఒక దారాన్ని చుడతాము, మళ్ళీ చివరిలో ఇప్పుడు అద్దకం వేసిన దారాన్ని బాబిన్‌లోకి పంపిస్తాం," పేక దారాలు సిద్ధం కావటానికీ, పడుగు దారాన్ని మగ్గంలోకి అమర్చడానికీ ముందు, పటోలా తయారీలో చోటుచేసుకునే అనేక ప్రక్రియలను గురించి వివరిస్తూ అన్నారు రేఖా బెన్.
ఆమె నివసించే సురేంద్రనగర్ జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన వణ్‌కర్‌వాసులలో చాలామంది పటోలు అని పిలిచే ప్రసిద్ధ పట్టు చీరల తయారీకి సంబంధించిన ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కానీ ఈనాడు లీంబడీ తాలూకా లో సింగిల్, డబుల్ ఇక్కత్ పటోలా నేస్తున్న ఏకైక దళిత మహిళ, 40 ఏళ్ళ వయసున్న రేఖా బెన్. (చదవండి: రేఖా బెన్ జీవితపు పడుగూ పేకా... )
సురేంద్రనగర్‌కు చెందిన పటోలా ను ' ఝాలావాడి’ పటోలా అంటారు. ఇవి పాటణ్‌లో తయారయ్యే వాటికంటే చవకైనవి. సహజంగా సింగిల్ ఇక్కత్ పటోలా నేతకు పేరొందిన ఝాలావాడ్‌లోని వణ్‌కర్లు (నేతకారులు) ఇప్పుడు డబుల్ ఇక్కత్ వస్త్రాన్ని కూడా నేస్తున్నారు. "సింగిల్ ఇక్కత్‌లో డిజైన్ పేక పోగులపైనే ఉంటుంది. డబుల్ ఇకత్‌లో డిజైన్ పడుగూ పేకా రెండింటిలోనూ ఉంటుంది," అన్నారు రేఖా బెన్, రెండు రకాల పటోలాల మధ్య ఉన్న తేడాను వివరిస్తూ.
నేత ప్రక్రియను జటిలం చేసేది డిజైన్. రేఖా బెన్ మరోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. "ఒక సింగిల్ ఇక్కత్ పటోలు కు 3500 పడుగు దారాలు, 13750 పేక దారాలు ఉంటాయి. అదే డబుల్ ఇక్కత్‌కు 2220 పడుగు దారాలు, 9870 పేక దారాలు ఉంటాయి," నాడెలోకి పేక దారం ఉన్న బాబిన్‌ను జారవిడుస్తూ చెప్పారామె.
బాబిన్‌ని చూడగానే నా కళ్ళ ముందు 55 ఏళ్ళ గంగా బెన్ పర్మార్ చిత్రం కదలాడింది. “మేం ముందుగా ఒక పెద్ద చెక్క పంటెకోల (స్పూల్) పైకి నూలుకండెను తీసుకుంటాం, అక్కడ నుండి దానిని ఒక రాట్నం సహాయంతో ఒక బాబిన్‌కి తీసుకుంటాం. రాట్నం లేకుండా మీరు బాబిన్‌కు చుట్టలేరు,” అని లీంబడీలోని ఘాఘరేటియా గ్రామంలో ఉన్న తన ఇంటిలో ఒక చీరపై పని చేస్తున్నప్పుడు చెప్పారామె.
"ఎక్కడికెళ్ళిపోయారు?" రేఖా బెన్ స్వరం నన్ను మళ్ళీ పటోలా దారాల గురించిన చర్చ వద్దకు తీసుకువచ్చింది. ఆ క్లిష్టమైన ప్రక్రియ గురించి ఆ రోజు ఆమె నాకు వివరించటం ఇది ఎన్నోసారో! "రాయండి," నా నోట్‌బుక్‌పైనే తన దృష్టిని పెట్టిన ఆమె ఆదేశించారు. నేను ఈ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకున్నానని నిర్ధారించుకోవడం కోసం ఆమె కొంతసేపు తన పనిని ఆపేస్తున్నారు.
నేను దశల ప్రక్రియను రాస్తున్నాను. డజను కంటే ఎక్కువ దశలతో, చాలా క్లిష్టంగా ఉండే ఈ ప్రక్రియ వారాల తరబడి కొనసాగుతుంది, నేతరి ఒక్కరే కాకుండా అనేకమంది కార్మికులు ఇందులో పాల్గొంటారు. పట్టు నూలుకండెతో మొదలై, చివరి దారం 252-అంగుళాల పొడవుండే పటోలా చీర నేతలోకి వెళ్ళడంతో ముగిసే ఈ ప్రక్రియ ఆరు నెలల శ్రమతో కూడుకున్న పని.
"ఏ దశలోనైనా ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా అది పటోలు ను పాడుచేస్తుంది," నిశ్చయంగా ప్రకటించారామె.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి