అబ్దుల్ కుమార్ మాగరే చివరిగా పట్టూ ను నేసి 30 ఏళ్ళవుతోంది. ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే కఠినమైన కశ్మీర్ శీతాకాలాలను తట్టుకుని నిలబడగల ఈ ఉన్ని బట్టను నేసే చిట్టచివరి నేతకారులలో ఈయన కూడా ఉన్నారు.

"నేను ఒక్కరోజులో 11 మీటర్ల బట్టను నేసేవాడిని," చాలావరకూ కంటిచూపును కోల్పోయిన 82 ఏళ్ళ అబ్దుల్ గుర్తుచేసుకున్నారు. గదిలోంచి బయటకు వెళ్ళడానికి ఆయన ఒక చేత్తో గోడను తడుముతూ ముందుకు సాగారు. " అపరిమితంగా నేత పని చేయటం వలన నాకు 50 ఏళ్ళ వయసప్పుడు నా కంటిచూపు బలహీనపడింది."

అబ్దుల్ దావర్ గ్రామంలో నివసిస్తుంటారు. ఈ గ్రామానికి కనుచూపు దూరంలో గురేజ్ లోయలోని హబా ఖాతూన్ శిఖరం ఉంది. మొత్తం 4,253 జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న ఈ గ్రామం బండీపురా జిల్లాలో ఉంది. ప్రస్తుతం పట్టూ ను నేస్తున్న నేత కార్మికులు లేరని ఆయన మాతో చెప్పారు. “దాదాపు ఒక దశాబ్దం క్రితం వరకూ, చలికాలంలో, ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ వసంత ఋతువులోనూ వేసవిలోనూ అమ్మడం కోసం బట్టలు నేసేవారు."

అబ్దుల్, అతని కుటుంబం శ్రీనగర్‌లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించేందుకు నేసే దుస్తులలో ఫెరన్ (సంప్రదాయ గౌను వంటి పై వస్త్రం), దుపాఠీ (కంబళి), మేజోళ్ళు (సాక్స్), చేతి తొడుగులు (గ్లోవ్స్) ఉన్నాయి.

అయితే, అబ్దుల్‌కు తన పని పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఈ రోజు దానిని నిలబెట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే, ఆ పనికి కావలసిన ముడి పదార్థమైన ఉన్ని, ప్రస్త్తుతం సులభంగా అందుబాటులో ఉండటంలేదు. అబ్దుల్ వంటి నేతకారులు గొర్రెలను పెంచుతూ, తాము పెంచే జంతువుల నుండి పట్టూ నేయడానికి అవసరమైన ఉన్నిని పొందేవారు. సుమారు 20 సంవత్సరాల క్రితం, అతని కుటుంబానికి దాదాపు 40 నుంచి 45 గొర్రెలు ఉండటం వలన ఉన్ని సులభంగానూ చౌకగానూ లభించేదని ఆయన చెప్పారు. "మేం మంచి లాభాలను సంపాదించేవాళ్ళం," అని అతను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆరు గొర్రెలు మాత్రమే ఉన్నాయి.

Left: Abdul Kumar Magray at his home in Dawar
PHOTO • Ufaq Fatima
Right: Dawar village is situated within view of the Habba Khatoon peak in the Gurez valley
PHOTO • Ufaq Fatima

ఎడమ: దావర్‌లోని తన ఇంటిలో అబ్దుల్ కుమార్ మాగరే. దావర్ గ్రామం గురేజ్ లోయలోని హబా ఖాతూన్ శిఖరానికి కనుచూపు దూరంలో ఉంది.

Left: Sibling duo Ghulam and Abdul Qadir Lone are among the very few active weavers in Achura Chowrwan village.
PHOTO • Ufaq Fatima
Right: Habibullah Sheikh, pattu artisan from Dangi Thal, at home with his grandsons
PHOTO • Ufaq Fatima

ఎడమ: గులామ్, అబ్దుల్ కాదిర్ లోన్ సోదర ద్వయం అఛురా చౌర్వన్ గ్రామంలో ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తోన్న కొద్దిమంది నేతకారులలో ఒకరు. కుడి: మనవలతో కలిసి తన ఇంట్లో ఉన్న డంగీ థల్ గ్రామానికి చెందిన పట్టూ కళాకారుడు హబీబుల్లా షేఖ్

బాండీపూర్ జిల్లా, తులైల్ లోయలోని డంగీ థల్ గ్రామానికి చెందిన హబీబుల్లా షేఖ్, అతని కుటుంబం దశాబ్దం క్రితమే పట్టూ వ్యాపారాన్ని విడిచిపెట్టారు. అతనిలా అంటారు, “ఇంతకుముందు గొర్రెలు మేపుకునే సంస్కృతి ఉండేది. ప్రతి ఇంటిలోనూ కింది అంతస్తులో కనీసం 15-20 గొర్రెలు ఆ కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవి.”

కానీ ఇప్పుడది మారిపోయిందని 70 ఏళ్ళ గులామ్ కాదిర్ లోన్ అన్నారు. బాండీపూర్ జిల్లా, అఛురా చౌర్వన్ (షాహ్ పోరా అని కూడా పిలుస్తారు) గ్రామంలో ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తోన్న కొద్దిమంది నేతకారులలో ఈయన కూడా ఒకరు. "గత దశాబ్ద కాలంలో గురేజ్ వాతావరణం మారిపోయింది. చలికాలాలు చాలా తీవ్రంగా మారాయి. ఇది గొర్రెలకు ముఖ్య ఆహారమైన గడ్డి పెరుగుదలను ప్రభావితం చేసింది. దాంతో జనాలు పెద్ద పెద్ద గొర్రెల మందలను పెంచడం మానేశారు."

*****

పట్టూను నేయటం మొదలుపెట్టినపుడు అబ్దుల్ కుమార్ వయసు దాదాపు పాతికేళ్ళు. "నేను మా నాన్నకు సహాయం చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ చేస్తూ కాలక్రమేణా ఈ కళలో మంచి నైపుణ్యం సంపాదించాను." ఈ కళ ఆయన కుటుంబంలో తరతరాల వారసత్వంగా వస్తూ ఉంది, కానీ ఆయన ముగ్గురు కొడుకులలో ఎవరూ ఈ కళను చేపట్టలేదు. పట్టూ మేఁ ఆజ్ భీ ఉత్నీ హీ మెహనత్ హై జిత్నీ పెహెలే థీ, మగర్ అబ్ మునాఫా నా హోనే కే బరాబర్ హై (పట్టూకు ఇంతకుముందు చేసినంత శ్రమే ఇప్పటికి కూడా అవసరం, కానీ లాభాలు మాత్రం ఏమీ ఉండటంలేదు)," అని ఆయన వివరిస్తారు.

అబ్దుల్ నేతను ఆరంభించిన మొదట్లో మీటర్ పట్టూ బట్ట రూ. 100కు అమ్ముడయ్యేది. సమయంతో పాటు ధరలు కూడా పెరిగాయి. ఈ రోజుల్లో ఒక మీటర్ ధర రూ. 7000గా ఉంది. అయితే తుది ఉత్పత్తి ధర అధికంగా ఉన్నప్పటికీ, ఏడాది అంతా గొర్రెల పెంపకానికి అయ్యే ఖర్చులు పట్టూ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కంటే స్థిరంగా ఎక్కువగా ఉండటం వలన నేత కార్మికులకు వచ్చే లాభాలు నామమాత్రం మాత్రమే.

పట్టూ నేత ఖచ్చితత్వంతో కూడిన ఒక కళ. ఒక దారాన్ని తప్పుగా ఉంచడం వల్ల కూడా మొత్తం భాగం గందరగోళమైపోతుంది. మళ్ళీ దాన్ని కొత్తగా ప్రారంభించాల్సిందే,” అని అబ్దుల్ చెప్పారు. "(కానీ) అంత కష్టపడి పని చేసినందువల్ల దాని విలువ దానికుంటుంది. ఎందుకంటే గురేజ్ వంటి అతి శీతల ప్రాంతంలో ఈ ఉన్ని బట్ట ఇచ్చే వెచ్చదనం సాటిలేనిది."

A wooden spindle (chakku) and a hand-operated loom (waan) are two essential instruments for pattu artisans
PHOTO • Ufaq Fatima
A wooden spindle (chakku) and a hand-operated loom (waan) are two essential instruments for pattu artisans
PHOTO • Courtesy: Ufaq Fatima

పట్టూ నేతకారులకు ఒక చెక్క కదురు (చక్కూ), చేతితో నడిపించే మగ్గం (వాన్) అతి ముఖ్యమైన రెండు పనిముట్లు

The villages of Achura Chowrwan (left) and Baduab (right) in Kashmir’s Gurez valley. Clothes made from the woolen pattu fabric are known to stand the harsh winters experienced here
PHOTO • Ufaq Fatima
The villages of Achura Chowrwan (left) and Baduab (right) in Kashmir’s Gurez valley. Clothes made from the woolen pattu fabric are known to stand the harsh winters experienced here
PHOTO • Ufaq Fatima

కశ్మీర్‌కు, గురేజ్ లోయలోని అఛురా చౌర్వాన్ (ఎడమ), బడూఅబ్ (కుడి) గ్రామాలు. ఉన్ని పట్టూ బట్టతో తయారుచేసిన దుస్తులే ఇక్కడి తీవ్రమైన శీతాకాలాలను తట్టుకొని నిలబడగలవు

ఉన్నిని దారంగా మార్చడానికి సుమారు ఒక మనిషి చేతి పరిమాణంలో ఉండే చక్కూ అని పిలిచే చెక్క కదురును ఈ నేతపనివారు ఉపయోగిస్తారు. చక్కూ అనేది కొక్కెం ఆకారంలో ఉండి, రెండు చివరలూ సన్నగా కూచిగా ఉంటాయి. ఈ కదురుతో తీసిన దారాన్ని స్థానికంగా వాన్ అని పిలిచే మగ్గంపై వస్త్రంగా నేస్తారు.

పట్టూ బట్టను నేయడమనేది ఎన్నడూ ఒక మనిషే చేయగలిగిన పని కాదు. తరచుగా మొత్తం కుటుంబమంతా ఈ ప్రక్రియలో పాల్గొంటారు. సాధారణంగా గొర్రెలనుంచి పురుషులు ఉన్నిని తీస్తే, ఆ ఉన్నిని మహిళలు దారంగా మలుస్తారు."ఇంటి పనులు చేయడంతో పాటు ఈ ప్రక్రియలోని అతి కష్టమైన భాగాన్ని వాళ్ళు చేస్తారు," అని అన్వర్ లోన్ పేర్కొన్నారు. మగ్గం లేదా వాన్ మీద పనిచేయడం కుటుంబంలోని పురుషుల పనిగా ఉంటుంది.

దర్ద్-శీన్ సముదాయానికి చెందిన 85 ఏళ్ళ జూనీ బేగమ్ ఆ లోయలో పట్టూ ను నేయగల అతికొద్దిమంది మహిళలలో ఒకరు. "నాకు తెలిసిన పని ఇదొక్కటే," స్థానిక శీనా భాషలో మాట్లాడుతూ అన్నారామె. ఆమె కొడుకైన 36 ఏళ్ళ ఇస్తియాక్ లోన్ ఆమె మాటలను మాకోసం అనువాదం చేశారు.

" పట్టూ వ్యాపారం ఇప్పుడు ఆగిపోయింది కానీ నేను అప్పుడప్పుడూ ఖోయీహ్ (మహిళలు సంప్రదాయంగా తలపై ధరించేది) వంటి వాటిని కొన్ని నెలలకోసారి తయారుచేస్తుంటాను." తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని జూనీ బేగమ్ గొర్రె ఉన్నిని - శీనా భాషలో పష్ అంటారు - చక్కూ ఉపయోగించి దారంగా మార్చే ప్రక్రియను చూపించారు. "ఈ కళ నాకు మా అమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియను నేను చాలా ఇష్టపడతాను," అంటారామె. "నా చేతులు చేయగలిగినంత కాలం నేను ఈ పనిని చేస్తూనే ఉండాలనుకుంటాను."

గురేజ్ లోయలోని పట్టూ నేతకారులు దర్ద్-శీన్ (దర్ద్ అని కూడా అంటారు) సముదాయానికి చెందినవారు. జమ్మూ కశ్మీర్‌లో ఈ సముదాయం షెడ్యూల్డ్ తెగల కింద జాబితా చేసివుంది. లోయకు దాదాపు సమాంతరంగా నడిచే నియంత్రణ రేఖకు అటు నుంచి ఇటు రెండుగా విభజించబడిన ఈ సముదాయం, పట్టూ సంప్రదాయాన్ని పంచుకుంటుంది. డిమాండ్ పడిపోవడం, రాజ్యం మద్దతు లేకపోవడం, వలసల కారణంగా ఈ కళ క్షీణించిపోతున్నందుకు చింతిస్తోంది.

Left: Zooni Begum with her grandson at her home in Baduab.
PHOTO • Ufaq Fatima
Right. She shows us a khoyeeh, a traditional headgear for women, made by her
PHOTO • Ufaq Fatima

ఎడమ: బడూఅబ్‌లోని తన ఇంటిలో తన మనవడితో జూనీ బేగమ్. కుడి: తాను తయారుచేసిన, మహిళలు సంప్రదాయంగా తలపై ధరించే ఖోయీహ్‌ను ఆమె మాకు చూపిస్తున్నారు

Zooni Begum demonstrates how a chakku is used to spin loose wool into thread
PHOTO • Ufaq Fatima
Zooni Begum demonstrates how a chakku is used to spin loose wool into thread
PHOTO • Ufaq Fatima

విడి ఉన్నినించి చక్కూ ఉపయోగించి దారం ఎలా తీయాలో చూపిస్తోన్న జూనీ బేగమ్

*****

దావర్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడూఅబ్ గ్రామంలో నివసించే అన్వర్ లోన్ వయసు తొంబై దాటింది. తాను 15 ఏళ్ళ క్రితం నేసిన ఒక పట్టూ కంబళిని బయటకు తీస్తూ ఆయన, "నేను ఉదయం ఎనిమిది గంటలకు పని మొదలుపెట్టి సాయంత్రం నాలుగు గంటలకు ముగించేవాడిని. తర్వాత వృద్ధుడనయ్యాక కేవలం మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే నేయగలిగేవాడిని." ఒక మీటరు బట్టను నేయడానికి అన్వర్‌కు ఒక రోజంతా పడుతుంది.

అన్వర్ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నుంచి పట్టూ ను అమ్మడాన్ని ప్రారంభించారు. "స్థానిక స్థాయిలోనూ, గురేజ్‌కు అవతల కూడా గిరాకీ ఎక్కువగా ఉండటంతో నా వ్యాపారం బాగా వృద్ధిచెందింది. గురేజ్ లోయను సందర్శించిన అనేకమంది విదేశీయులకు నేను పట్టూ ను విక్రయించాను."

అఛురా చౌర్వాన్ (లేదా షాహ్ పొరా) గ్రామంలో, చాలామంది పట్టూ వ్యాపారాన్ని విడిచిపెట్టారు, అయితే తోబుట్టువులైన గులామ్ కాదిర్ లోన్ (70), అబ్దుల్ కాదిర్ లోన్(71)లు మాత్రం ఇప్పటికీ ఎంతో ఉత్సాహంతో ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ముమ్మరమైన చలికాలంలో ఈ లోయకు కశ్మీర్‌లోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, అనేక కుటుంబాలు కిందికి వలస పోయినప్పుడు కూడా, ఈ సోదరులు అక్కడే ఉండి నేయడాన్ని ఎంచుకుంటారు.

"నేను ఎప్పుడు ఈ నేతను మొదలుపెట్టానో ఖచ్చితంగా చెప్పలేను కానీ చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టాను," చెప్పారు గులామ్. నేతలో మేం చార్‌ఖానా , చష్మ్-ఎ-బుల్‌బుల్ వంటి ఎన్నో రకాల ఆకృతులను నేసేవాళ్ళం.

చార్‌ఖానా ఒక రంగురంగుల నమూనా, అయితే చష్మ్-ఎ-బుల్‌బుల్ అనేది బుల్‌బుల్ పక్షి కంటిని పోలి ఉంటుందని చెప్పే ఒక క్లిష్టమైన నేత. జాగ్రత్తగా రూపొందించిన ఈ పట్టూ నేతలు మెషిన్‌తో తయారుచేసిన బట్ట కంటే చాలా గట్టివి.

Left: Anwar Lone showing the woven blanket he made 15 years ago.
PHOTO • Ufaq Fatima
Right: Abdul Qadir with a charkhana patterned fabric
PHOTO • Ufaq Fatima

ఎడమ: తాను 15 ఏళ్ళ క్రితం నేసిన నేత దుప్పటిని చూపిస్తోన్న అన్వర్ లోన్. కుడి: చార్‌ఖానా నమూనాతో నేసిన బట్టతో అబ్దుల్ కాదిర్

Left: Ghulam Qadir wears a charkhana patterned pheran, a gown-like upper garment.
PHOTO • Ufaq Fatima
Right: The intricate chashm-e-bulbul weave is said to resemble the eye of a bulbul bird. It is usually used to make blankets
PHOTO • Ufaq Fatima

ఎడమ: చార్‌ఖానా నమూనాలో నేసిన గౌను వంటి పై వస్త్రం, ఫెరన్‌ను ధరించిన గులామ్ కాదిర్. కుడి: సంక్లిష్టమైన చష్మ్-ఎ-బుల్‌బుల్ నేత బుల్‌బుల్ పక్షి కంటిని పోలివుంటుందని చెప్తారు. దీనిని సాధారణంగా కంబళ్ళు తయారుచేసేందుకు ఉపయోగిస్తారు

" వక్త్ కే సాత్ పెహనావే కా హిసాబ్ భీ బదల్ గయా (కాలంతో పాటు దుస్తులు ధరించే విధానాలు కూడా మారాయి)," అంటారు గులామ్. "కానీ పట్టూ మాత్రం 30 ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది." ఈ రోజుల్లో తమకు లాభాలు రావటంలేదని, ఏడాదికోసారి షాపింగ్ చేసే స్థానికులకు విక్రయిస్తామనీ ఈ సోదరులు చెప్పారు.

ఈ కళను నేర్చుకోవడానికి అవసరమైన సత్తువ, ఓపిక ఇప్పటి యవకులకు లేదని అబ్దుల్ కాదిర్ అన్నారు. "వచ్చే పదేళ్ళలో పట్టూ తన ఉనికిని కోల్పోతుందని నేను నమ్ముతున్నాను," విచారంగా అన్నారు అబ్దుల్. "దీనికి కొత్త ఆశ, ఆవిష్కరణ అవసరం. ఇది ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుంది," అని ఆయన చెప్పారు.

దావర్ మార్కెట్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న అబ్దుల్ కుమార్ కుమారుడు రెహమాన్, నేత పని ఇంకెంత మాత్రం ఆచరణసాధ్యం కాదని చెప్పారు. "దానికోసం చేసే కృషి, వచ్చే లాభం కంటే ఎక్కువగా ఉంటుంది," అని ఆయన చెప్పారు. "ప్రజలకు ఇప్పుడు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పెహలే యా తో పట్టూ థా యా జమీన్‌దారీ (ఇంతకుముందు పట్టూ, లేదంటే భూ యాజమాన్యం ఉండేవి).”

గురేజ్ ఒక మారుమూల, సరిహద్దు ప్రాంతం. అధికారుల దృష్టిని ఆకట్టుకోలేదు. అయితే కొత్త ఆలోచనలు అంతరించిపోతోన్న ఈ కళకు కొత్త జీవం పోసి, మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయ వనరుగా మారవచ్చునని ఇక్కడి నేతకారులు అంటున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ufaq Fatima

کشمیر کی رہنے والی افق فاطمہ ڈاکیومینٹری فوٹوگرافر اور قلم کار ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Ufaq Fatima
Editor : Swadesha Sharma

سودیشا شرما، پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں ریسرچر اور کانٹینٹ ایڈیٹر ہیں۔ وہ رضاکاروں کے ساتھ مل کر پاری کی لائبریری کے لیے بھی کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Swadesha Sharma
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli