అణగారిన వర్గాలకు ఫోటోగ్రఫీ ఎప్పుడూ అందుబాటులో లేదు. ఎందుకంటే, కెమెరా వారి స్తోమతకు మించిన వస్తువు కనుక. ఈ సమస్యను గుర్తించి, తరతరాలుగా అణచివేతకు గురవుతున్న, ప్రత్యేకించి దళితులు, మత్స్యకారులు, ట్రాన్స్ సముదాయం, మైనారిటీ ముస్లిమ్‌లు, ఇతర అణగారిన వర్గాలకు చెందిన యువతకు ఫోటోగ్రఫీ నేర్పించాలని నేను భావించాను.
తద్వారా, నా విద్యార్థులు వాళ్ళకి తెలిసిన, వాళ్ళ సొంత కథలను చెప్పాలనుకున్నాను. ఈ వర్క్‌షాప్‌లలో వాళ్ళు తమ రోజువారీ జీవితంలో జరిగే విషయాలను చిత్రీకరిస్తున్నారు. అవి వాళ్ళ సొంత కథలు; వాళ్ళ మనసుకి దగ్గరగా ఉండే కథలు. కెమెరాతో ఫోటోలు తీయడం వాళ్ళకి సంతోషాన్నిస్తోంది. అలా చిత్రీకరిస్తున్నప్పుడు ఫ్రేమింగ్ (framing), యాంగిల్స్ (angles) గురించి కూడా ఆలోచించమని చెబుతుంటాను.
వాళ్ళ జీవితాలను ప్రతిబింబించే ఈ ఛాయాచిత్రాలు చాలా భిన్నమైనవి.
వాళ్ళు నాకు తమ ఫోటోలు చూపించినప్పుడు, వాటి వెనక ఉండే రాజకీయాలు, పరిస్థితుల గురించి కూడా చర్చిస్తాను. వర్క్‌షాప్ తర్వాత, కొన్ని గంభీరమైన సామాజిక-రాజకీయ సమస్యల గురించి వాళ్ళకి కొంత అవగాహన కలుగుతుంది.
అయితే, వీరు తీసిన ఫొటోలన్నీ చాలావరకూ దగ్గర నుంచి (క్లోజ్-అప్) తీసినవే. తమ కుటుంబం, తమ ఇల్లు కావడంతో వాటిని వాళ్ళు మాత్రమే అంత దగ్గర నుండి చిత్రీకరించగలరు. బయటి వ్యక్తులను సహజంగానే దూరం పెడతారు. కానీ సబ్జెక్ట్‌లకు వాళ్ళపై నమ్మకం ఉంటుంది కనుక దూరం పెట్టరు.
భావసారూప్యత గల వ్యక్తుల సహాయంతో కొన్న కెమెరాలతో ఈ యువతకు నేను శిక్షణనిస్తున్నాను; డిఎస్ఎల్ఆర్ (DSLR) కెమెరాను ఎలా ఉపయోగించాలో తెలిస్తే, అది వృత్తిపరంగా కూడా వాళ్ళకు సహాయం చేస్తుంది.
వాళ్ళు తీసిన ఛాయాచిత్రాలను 'రీఫ్రేమ్డ్ - నార్త్ చెన్నై త్రూ ది లెన్స్ ఆఫ్ యంగ్ రెసిడెంట్స్' (Reframed – North Chennai Through the Lens of Young Residents) అన్న థీమ్‌తో సంకలనం చేశారు. బయటి వ్యక్తుల దృష్టిలో, ఉత్తర చెన్నై అంటే పారిశ్రామిక కేంద్రం మాత్రమేనన్న ఒక మూస చిత్రాన్ని బద్దలుకొట్టి, దాన్ని పునర్నిర్మించడంలో సమాజానికి ఒక హెచ్చరికగా పని చేస్తుంది ఈ సంకలనం.
మదురైలోని మంజమేడులో నివసించే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన పన్నెండు మంది యువతీయువకులు (16-21 ఏళ్ళు) ఈ పది రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల కోసం నిర్వహించిన మొట్టమొదటి వర్క్‌షాప్ ఇది. దీని ద్వారా పిల్లలు, తమ తల్లిదండ్రుల పని పరిస్థితులను మొదటిసారిగా తెలుసుకున్నారు. తమ కథలను ప్రపంచానికి తెలియజేయాలనే తపన వాళ్ళకి కలిగింది.
అలాగే, ఒడిశాలోని గంజామ్‌లో ఏడుగురు మత్స్యకార మహిళలకు, తమిళనాడులోని నాగపట్టిణంలో ఎనిమిదిమంది మత్స్యకార మహిళలకు కూడా నేను మూడు నెలల వర్క్‌షాప్ నిర్వహించాను. గంజామ్, నిరంతరం సముద్రపు కోతకు గురయ్యే ప్రాంతం. నాగపట్టిణం వలస కార్మికులు, మత్స్యకారులు ఎక్కువగా నివసించే తీరప్రాంతం; శ్రీలంక నావికా బలగాలు తరచూ వీరిపై దాడి చేస్తుంటాయి.
వారు తమ చుట్టూ చూసే అసాధారణమైన సవాళ్ళను ఛాయాచిత్రాలుగా తీసేందుకు ఈ వర్క్‌షాప్‌లు దారితీశాయి.
సిఎచ్. ప్రతిమ, 22
ఫీల్డ్ సిబ్బంది, దక్షిణ్ ఫౌండేషన్
పోడంపేట, గంజామ్, ఒడిశా
ఫోటోలు తీయడం వలన నా వర్గం ప్రజలు చేసే పని పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది; అలాగే, నన్ను వారికి మరింత దగ్గర చేసింది.
ఉప్పుకయ్యల దగ్గర పిల్లలు సరదాగా ఒకపడవను తిరగతిప్పుతున్న ఫోటో నాకిష్టమైన వాటిలో ఒకటి. ఒక క్షణాన్ని బంధించే శక్తి ఫొటోగ్రఫీకి ఉందని నేను గ్రహించాను.
ఒకసారి, నా మత్స్యకార సముదాయానికి చెందిన ఒక వ్యక్తి సముద్రపు కోత వల్ల దెబ్బతిన్న తన ఇంటి నుండి వస్తువులను సేకరిస్తున్న ఫొటో ఒకటి తీశాను. వాతావరణ మార్పుల వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తోన్న ఆ ఫొటోను తీసినందుకు నేను చాలా సంతోషపడ్డాను.
మొదటిసారి నాకు కెమెరా లభించినప్పుడు, నేను దాన్ని సరిగ్గా పట్టుకోగలనని అనుకోలేదు. ఒక భారీ యంత్రాన్ని మోస్తున్నట్లనిపించింది. అది నాకు పూర్తిగా ఒక కొత్త అనుభవం. నేను నా మొబైల్ ఫోన్‌లో సరదాగా ఫోటోలు తీస్తుండేదాన్ని. కానీ, ఛాయాచిత్రాల ద్వారా మన చుట్టూ ఉన్నవాళ్ళతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ, ఎన్నో కథలు చెప్పొచ్చని ఈ వర్క్‌షాప్ నాకు నేర్పించింది. మొదట్లో ఫొటోగ్రఫీకి సంబంధించిన సైద్ధాంతిక అంశాలు చాలా గందరగోళంగా అనిపించాయి. అయితే, ప్రత్యక్షంగా వర్క్‌షాప్‌లో పాల్గొని, కెమెరాతో ప్రయోగాలు చేసిన తరువాత, అన్నిటినీ క్లిక్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను వాస్తవ ప్రపంచానికి తరగతిలో నేర్చుకున్న సిద్ధాంతాన్ని అన్వయించగలను.
*****
పి. ఇంద్ర, 22
బి.ఎస్‌సి., భౌతికశాస్త్ర విద్యార్థి, డాక్టర్ అంబేద్కర్ ఈవినింగ్ ఎడ్యుకేషన్
సెంటర్
ఆరప్పాళయం, మదురై, తమిళనాడు
“మిమ్మల్ని, మీ పరిసరాలను, పనిలో ఉన్న మీ వాళ్ళను చిత్రీకరించండి.”
కెమెరాను నా చేతికి అందజేస్తూ పళని అన్న నాతో అలా అన్నాడు. నాకు చాలా ఆశగా ఉన్నా, వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి మొదట మా నాన్న అంగీకరించలేదు. ఎంతో బతిమిలాడిన తరువాత కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు ఆయనే నా ఫొటోగ్రఫీకి ప్రధానాంశం అయ్యాడు.
నేను పారిశుద్ధ్య కార్మికుల మధ్య జీవిస్తున్నాను. మా నాన్నకులాగే వాళ్ళు కూడా, అణచివేసే కుల వ్యవస్థ నిర్ణయించిన వారసత్వ ఉపాధి అనే ఊబిలో చిక్కుకున్నారు. మా నాన్న కూడా వాళ్ళలో ఒకడైనప్పటికీ, వర్క్‌షాపుకు వెళ్ళేవరకూ వాళ్ళ పని గురించీ, వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళ గురించీ నాకు తెలియదు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, పారిశుద్ధ్య కార్మికులుగా మాత్రం కాకూడదని మా టీచర్ ఎప్పుడూ మాతో చెబుతుండేవారు.
ఓ రెండు-మూడు రోజులు మా నాన్నతో పాటు పనికి వెళ్ళి, అదంతా చిత్రీకరణ చేసినప్పుడు ఆయన చేసే పనేంటో చివరకు నాకు అర్థమైంది. సరైన చేతి తొడుగులు, బూట్లు లేకుండానే గృహ వ్యర్థాలు, విషపూరిత వ్యర్థాలను తీసుకెళ్ళే పనులు చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను నేను అప్పుడే చూశాను. వాళ్ళు ఉదయం ఆరు గంటలకే పనికి వెళ్ళాలి. ఒక్క సెకను ఆలస్యం అయినా అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులు వాళ్ళతో అమానుషంగా ప్రవర్తిస్తారు.
నా కళ్ళతో గమనించని నా సొంత జీవితాన్ని నాకు చూపించింది నా కెమెరాయే. ఒక విధంగా ఇది మూడవ కన్ను తెరుచుకోవడం అనాలేమో! నేను మా నాన్నను ఫొటోలు తీస్తున్నప్పుడు, ప్రతిరోజూ తాను ఎదుర్కొనే కష్టాలను గురించీ, చిన్నతనం నుండి ఈ ఉద్యోగంలో తాను ఎలా చిక్కుకుపోయాడో ఆయన నాకు వివరించాడు. ఈ సంభాషణలు మా మధ్య బంధాన్ని మరింత బలపడేలా చేశాయి.
ఈ వర్క్‌షాప్ మా అందరి జీవితాల్లో ఒక పెద్ద మూలమలుపు.
*****
సుగం
థి(ధి) మాణిక్కవేల్, 27
జాలరి మహిళ
నాగపట్టిణం, తమిళనాడు
కెమెరా నా దృక్పథాన్ని మార్చేసింది. దానిని పట్టుకోగానే నేనొక స్వతంత్రురాలిని అనిపించింది; నా మీద నాకు నమ్మకం కలిగింది. అది నన్ను ఎంతోమందితో కలిసి మెలిగేలా చేసింది. నా జీవితమంతా నాగపట్టిణంలోనే సాగుతున్నప్పటికీ, నేను కెమెరాతో నౌకాశ్రయానికి వెళ్ళడం మాత్రం ఇదే మొదటిసారి.
తనకు ఐదేళ్ళ వయసన్నప్పటి నుండీ చేపలు పట్టడం మొదలుపెట్టిన నా తండ్రి మాణిక్కవేల్ (60)ను నేను చిత్రీకరించాను. ఉప్పునీళ్ళలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఆయన కాలి వేళ్ళు మొద్దుబారిపోయాయి; వాటిలో రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. కానీ, మమ్మల్ని పోషించడం కోసం ఆయన ఇప్పటికీ ప్రతిరోజూ చేపలు పడతాడు.
పూపతి అమ్మ(56), వెళ్ళపళ్ళం నివాసి. 2002లో శ్రీలంక నావికాదళ బలగాలు ఆమె భర్తను హతమార్చాయి. అప్పటి నుండి ఆమె చేపలను కొని, అమ్ముకుంటూ జీవిస్తున్నారు. నేను ఫోటో తీసిన మరో మత్స్యకార మహిళ పేరు తంగమ్మాళ్. ఆమె భర్త రుమాటిజంతో బాధపడుతున్నారు. వారి పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. ఇంటిని నడపటం కోసం ఆమె నాగపట్టిణం వీధుల్లో చేపలు అమ్ముతుంటారు. పళంగళ్ళిమేడుకు చెందిన మహిళలు రొయ్యల ఉచ్చులను ఉపయోగించీ, సముద్రం నుంచీ చేపలను పట్టుకుంటారు; నేను ఈ రెండు జీవనోపాధులను చిత్రీకరించాను.
మత్స్యకార గ్రామంలో పుట్టినప్పటికీ, ఒక నిర్దిష్ట వయసు వచ్చే వరకూ నేను సముద్ర తీరాన్ని చూడలేదు. నేను ఫోటోలు తీయడం మొదలుపెట్టిన తర్వాత మా సముదాయాన్ని గురించీ, మా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను గురించీ అర్థంచేసుకోగలిగాను.
ఈ వర్క్‌షాప్ నా జీవితంలో వచ్చిన అతిపెద్ద అవకాశాలలో ఒకటిగా నేను భావిస్తున్నాను.
*****
లక్ష్మి ఎమ్., 42
మత్స్యకార మహిళ
తిరుముల్లైవాసల్, నాగపట్టిణం, తమిళనాడు
ఫొటోగ్రాఫర్ పళని జాలరి మహిళలకు శిక్షణ ఇవ్వడానికి మా మత్స్యకార గ్రామమైన తిరుముల్లైవాసల్‌కు వచ్చినప్పుడు, ఏం ఫొటో తీస్తామో, ఎలా తీస్తామోనని మేమందరం భయపడ్డాం. కానీ, కెమెరా పట్టుకోగానే, మా ఆందోళనలన్నీ మాయమయ్యాయి; ఆత్మవిశ్వాసం పెరిగి, మాపై మాకు నమ్మకం ఏర్పడింది.
మొదటి రోజున మేమందరం కలిసి ఆకాశం, సముద్రం, ఇంకా చుట్టుపక్కల ఉన్న వస్తువులను చిత్రీకరించడానికి సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న మా గ్రామ పెద్ద మేమేం చేస్తున్నామంటూ ప్రశ్నించి మమ్మల్ని అడ్డుకున్నాడు. మేం చెప్పేది వినకుండా, ఫొటోలు తీయకుండా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన తరువాత, పక్కనే ఉన్న చిన్నకుట్టి అనే ఊరికి వెళ్ళినప్పుడు, ఎలాంటి అడ్డంకులు రాకూడదని ముందుగానే ఆ గ్రామ అధ్యక్షుని అనుమతి తీసుకున్నాం.
ఫొటోలు అస్పష్టంగా వచ్చినప్పుడు తిరిగి చిత్రీకరించాలని, మేం చేసే తప్పులను అర్థం చేసుకొని, వాటిని సరిదిద్దుకోవడానికి అది మాకు సహాయపడుతుందని పళని ఎప్పుడూ చెబుతుంటారు. వీటన్నిటి వల్ల, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు లేదా చర్యలు తీసుకోకూడదని నేను నేర్చుకున్నాను. ఇది చాలా ప్రోత్సాహాన్నిచ్చే అనుభవం.
*****
నూర్ నిషా కె., 17
B.Voc డిజిటల్ జర్నలిజం, లయోలా కళాశాల
తిరువొట్రియూర్, ఉత్తర చెన్నై, తమిళనాడు
మొదటిసారి నాకు కెమెరా ఇచ్చినప్పుడు, అది నా జీవితంలో తీసుకురాబోయే మార్పులేమిటో ఊహించలేదు. నా జీవితాన్ని, “ఫొటోగ్రఫీకి ముందు-తరువాత” అని రెండు భాగాలుగా చూడొచ్చు. నా చిన్న వయసులోనే మా నాన్నను కోల్పోయాను. అప్పటి నుండి, మమ్మల్ని పోషించడానికి మా అమ్మ చాలా కష్టపడుతోంది.
కెమెరా లెన్స్ ద్వారా, పూర్తిగా భిన్నంగా ఉండే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాడు పళని అన్న. మనం తీసే ఫొటోలు కేవలం ఛాయాచిత్రాలు మాత్రమే కాదని, అవి అన్యాయాన్ని ప్రశ్నించే పత్రాలు కూడా అవుతాయని నేను గుర్తించాను.
అతను తరచూ మాకు ఒకటే విషయం చెబుతాడు: "ఫొటోగ్రఫీని నమ్మండి. అది మీ అవసరాలను తీరుస్తుంది." అది నిజమని నాకు అర్థమైంది; మా అమ్మ పనికి వెళ్లలేని సమయాల్లో, ఇంటి ఖర్చులకు నేను కొంత డబ్బును సమకూర్చగలుగుతున్నాను.
*****
ఎస్. నందిని, 17
జర్నలిజం విద్యార్థి, ఎమ్.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్
వ్యాసర్‌పాడి, ఉత్తర చెన్నై, తమిళనాడు
మా ఇంటి దగ్గర ఆడుకునే పిల్లలే ఫొటోగ్రఫీలో నా మొదటి అంశాలు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, సంతోషంతో నిండిన వారి ముఖాలను క్లిక్ చేశాను. ప్రపంచాన్ని కెమెరా ద్వారా ఎలా చూడాలో నేర్చుకున్నాను. దృశ్యమానమైన భాషను సులువుగా అర్థం చేసుకోవచ్చని తెలుసుకున్నాను.
కొన్ని సమయాల్లో, ఫొటో తీసే క్రమంలో, మనం ఊహించని వాటిని ఎదుర్కొంటాం. అలాంటివి ఎదురైనప్పుడు, అక్కడి నుండి కదలడానికి నాకు మనసొప్పదు. ఫొటోగ్రఫీ నాకు ఆనందాన్నిస్తుంది – అది కుటుంబ సంబంధమైన ఆత్మీయత వలన కలిగే ఆనందం లాంటిది.
నేను డా. అంబేద్కర్ పగత్తరివు పాడసాలైలో చదువుతున్న రోజుల్లో, ఒకసారి మమ్మల్ని డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్‌కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలో అక్కడి ఫొటోలు నాతో సంభాషించాయి. మలాన్ని చేతులతో ఎత్తిపోసే పనిచేసే (మాన్యువల్ స్కావెంజర్) ఒక వ్యక్తి మరణాన్నీ, ఆ కారణంగా అతని కుటుంబంలో అలుముకున్న విషాదాన్నీ పళని అన్న డాక్యుమెంట్ చేశారు. ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను, వారికి కలిగిన నష్టాన్ని, దుఃఖాన్ని ఆ ఛాయాచిత్రాలు పదాలకందని భాషలో మాకు తెలియజేశాయి. అలాంటి ఫొటోలు తీయగల సామర్థ్యం మాకు కూడా ఉందని ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు.
ఆయన ఫొటోగ్రఫీ తరగతులు నిర్వహిస్తున్నప్పుడు మా పాఠశాల చేపట్టిన ఒక విహారయాత్రకు వెళ్ళడం వల్ల నేను హాజరు కాలేకపోయాను. అయితే, నేను తిరిగి వచ్చిన తరువాత, ఆయన నాకు ప్రత్యేకంగా ఫొటోగ్రఫీ నేర్పించారు; నన్ను ఫొటోలు తీయమని ప్రోత్సహించారు. అంతకుముందు వరకు కెమెరా ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ పళని అన్న నాకు నేర్పించారు. ఫొటోగ్రఫీ కోసం ఒక అంశాన్ని ఎలా వెతకాలో కూడా చెప్పి, ఆయన నాకు మార్గనిర్దేశం చేశారు. ఈ ప్రయాణంలో నేను ఎన్నో కొత్త దృక్కోణాలను, అనుభవాలను సంపాదించాను.
నా ఫొటోగ్రఫీ అనుభవమే నన్ను జర్నలిజాన్ని ఎన్నుకునేలా చేసింది.
*****
వి. వినోదిని, 19
విద్యార్థి, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్
వ్యాసర్‌పాడి, ఉత్తర చెన్నై, తమిళనాడు
నేనుండే ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా నాకు బాగా పరిచయమే. కానీ, నా కెమెరా లెన్స్ నుండి చూసినప్పుడు, నాకొక కొత్త దృష్టికోణం దొరికింది. “ఫొటోగ్రాఫులు మీరు ఎంచుకున్న అంశాల జీవితాన్ని సంగ్రహించాలని," పళని అన్న చెప్పారు. ఆయన తన అనుభవాలను మాతో పంచుకుంటున్నప్పుడు, ఫొటోగ్రాఫుల పట్ల, కథల పట్ల, వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమను చూడగలిగాం. అతనికి సంబంధించి నాకొక ఇష్టమైన జ్ఞాపకం ఉంది – తన బటన్ ఫోన్‌లో, మత్స్యకార మహిళ అయిన తన తల్లి ఫొటోను తీయడం.
దీపావళి రోజున నా మొదటి ఫొటో - మా పొరుగింటివారి కుటుంబ ఫొటో - తీశాను. అది చాలా బాగా వచ్చింది. ఆ తరువాత, నా ప్రజల కథల, అనుభవాల ద్వారా నా పట్టణాన్ని డాక్యుమెంట్ చేయడం మొదలుపెట్టాను.
ఫొటోగ్రఫీయే లేకపోతే, నన్ను నేను తెలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ దొరికుండేది కాదు.
*****
పి. పూంగొడి
మత్స్యకార మహిళ
సెరుత్తూర్, నాగపట్టిణం, తమిళనాడు
నాకు పెళ్ళయి 14 ఏళ్ళయింది. అప్పటి నుండి నా స్వగ్రామంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళలేదు నేను. కానీ నా కెమెరా నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్లింది. పడవలను సముద్రంలోకి తీసుకెళ్ళే విధానాన్నీ, చేపలు పట్టే ప్రక్రియనూ, మా సముదాయానికి మహిళలు చేసే సహకారం వంటి విషయాలను నేను చిత్రీకరించాను.
మామూలుగా ఫొటో తీయడంలో శిక్షణ ఇవ్వడం చాలా సులభం; కానీ, ఆ ఛాయాచిత్రాల ద్వారా కథలు చెప్పడంలో ఒక ఫొటోగ్రాఫర్‌కు శిక్షణనివ్వడం ఏమంత సులువైన సంగతి కాదు. మా కోసం పళని ఆ పని చేశాడు. శిక్షణలో భాగంగా, వ్యక్తుల ఫొటోలు తీసే ముందు వారితో ఎలా సత్సంబంఢాలు ఏర్పరచుకోవాలో నేర్పించాడు. దాంతో, వ్యక్తుల ఫొటోలు తీయగలననే నమ్మకం నాకు ఏర్పడింది.
జాలరులు చేసే అనేక పనులను – చేపలను పట్టి శుభ్రపరచడం, విక్రయించడం, వేలం వేయడం లాంటివి – నేను చిత్రీకరించాను. చేపలను అమ్మే మత్స్యకార మహిళల జీవనశైలిని చూసి, అర్థంచేసుకోవడానికి నాకు ఈ అవకాశం సహాయపడింది. నిండుగా చేపలున్న పెద్ద పెద్ద బుట్టలను వాళ్ళు తమ తలలపై బరువుగా మోస్తూ చేపలను అమ్ముతుంటారు.
కుప్పుస్వామిపై ఫొటో కథనం చేస్తున్నప్పుడు, ఆయన జీవితం గురించి తెలుసుకున్నాను – సరిహద్దు జలాల వెంట చేపలు పడుతున్నప్పుడు శ్రీలంక నావికాదళం అతనిపై కాల్పులు జరపడం గురించి. ఆ ఘటనలో ఆయన తన అవయవాలను, మాటను కోల్పోయారు.
బట్టలు ఉతకడం, తోటపని, శుభ్రం చేయటం లాంటి రోజువారీ పనులను చేసుకుంటున్నప్పుడు, నేను ఆయనను అనుసరించాను. తన కాళ్ళూచేతుల మీద ఆధారపడలేక ఆయన పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్నాను. అయినప్పటికీ, తన పనులన్నీ తనకు తానే చేసుకుంటున్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఉన్నట్టు నాకు కనిపించింది. అంగవైకల్యం కారణంగా బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం కోల్పోయానని ఆయన చింతించటంలేదు. అయితే, కొన్నిసార్లు మాత్రం ఏదో తెలియని శూన్యత ఆవరించటం వల్ల తను చనిపోవాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
అలాగే, జాలర్లు కవళ్ళను (ఒక రకమైన చేపలు) వేటాడే పద్ధతిపై ఒక ఫొటో సిరీస్ చేశాను. సాధారణంగా అవి వందల సంఖ్యలో వలల్లో చిక్కుకుంటాయి కాబట్టి వాటిని పట్టడం మత్స్యకారులకు పెద్ద సవాలుగా మారుతుంది. వలల నుండి ఆ చేపలను విడతీసి, ఐస్ బాక్సులలో భద్రపరచడానికి స్త్రీపురుషులిద్దరూ ఎలా కలిసి పనిచేస్తారో నేను డాక్యుమెంట్ చేశాను.
మహిళా ఫోటోగ్రాఫర్‌గా నాకు ఇదొక సవాలు. నేను మత్స్యకార మహిళను అయినప్పటికీ, “మీరు వాళ్ళనెందుకు ఫొటో తీస్తున్నారు? స్త్రీలు ఎందుకు ఫొటోలు తీయాలి?” అన్న ప్రశ్నలను ఎదుర్కోవాలి.
ప్రస్తుతం తనను తాను ఫొటోగ్రాఫర్‌గా గుర్తించుకుంటోన్న ఈ జాలరి మహిళ వెనుక ఉన్న ప్రధాన శక్తి – పళని అన్న.
*****
ప్రతి సంవత్సరం, ఒక్కో బృందానికి 10 మంది చొప్పున, రెండు ఫొటోగ్రఫీ వర్క్‌షాపులను నిర్వహించాలని పళని స్టూడియో భావిస్తోంది. వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారు తమ కథనాలను సమర్పించడానికి వారికి ఆరు నెలల వరకు గ్రాంట్ ఇస్తారు. అనుభవజ్ఞులైన ఫొటోగ్రాఫర్లను, జర్నలిస్టులను ఈ వర్క్‌షాపులను నిర్వహించేందుకు ఆహ్వానిస్తారు. వర్క్‌షాపుల్లో పాల్గొన్నవారు సమర్పించే కథనాలను వీరు సమీక్షించిన తర్వాత వాటిని ప్రదర్శిస్తారు.
అనువాదం: వై కృష్ణ జ్యోతి