దాదాపు ప్రతి భారతీయ రైతుకు తెలిసిన కొద్దిపాటి ఆంగ్ల పదాలలో 'స్వామినాథన్ రిపోర్ట్', 'స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్' అనేవి ఉంటాయి. ఆ నివేదిక ప్రధానంగా చేసిన సిఫారసు ఏమిటో కూడా వారికి తెలుసు: కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి) = సమగ్ర ఉత్పత్తి ధర + 50 శాతం (C2 + 50 శాతం అని కూడా అంటారు).
ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కేవలం ప్రభుత్వం, అధికార యంత్రాంగం, లేదా సైన్స్ సంస్థల్లోనే కాకుండా - రైతుల కోసం జాతీయ కమిషన్ (ఎన్‌సిఎఫ్) నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న లక్షలాది మంది రైతుల హృదయాల్లో కూడా ప్రధానంగా నిలిచివుంటారు.
ఈ నివేదిక పేరేదైనా, భారతీయ రైతులైతే దీనిని 'స్వామినాథన్ నివేదిక' అనే పిలుస్తారు. ఎందుకంటే ఆయన అధ్యక్షత వహించిన ఎన్‌సిఎఫ్ నివేదికలకు ఆయన ఇచ్చిన భారీ సహకారం, వాటిపై ఆయన వేసిన ప్రభావం ఎన్నటికీ చెరిగిపోనిది.
ఈ నివేదికల కథ చూస్తే యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు రెండూ వీటికి ద్రోహం చేసినవీ, వీటిని అణచిపెట్టినవే. ఈ నివేదికలలో మొదటిది 2004 డిసెంబర్‌లోనూ, ఐదవదీ చివరిదీ 2006 అక్టోబర్ ప్రాంతాల్లోనూ వచ్చాయి. మనకు ఎంతో అవసరమైన వ్యవసాయక సంక్షోభం గురించిన చర్చ కోసం పార్లమెంటులో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడాన్ని అటుంచి, కనీసం ఒక గంటపాటు దీనిగురించి శ్రద్ధగా చర్చించినది కూడా ఎన్నడూ జరగలేదు. మొదటి నివేదికను సమర్పించి ఇప్పటికి 19 సంవత్సరాలయింది.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వామినాథన్ నివేదికను, ముఖ్యంగా దాని కనీస మద్దతు ధర ఫార్ములా సిఫారసును త్వరితగతిన అమలు చేస్తామని వారు చేసిన వాగ్దానం కూడా వారు అధికారంలోకి రావడానికి కొంతమేరకు తోడ్పడింది. అయితే ఆ వాగ్దానాన్ని అమలుచేయడానికి బదులుగా, అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం ఇది మార్కెట్ ధరలను వక్రీకరిస్తుంది కాబట్టి దీనిని అమలుచేయటం సాధ్యం కాదని పేర్కొంటూ త్వరత్వరగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
ఈ నివేదికలు చాలా ‘రైతు అనుకూలమైనవి’ అని ఈ ప్రభుత్వాలు వాదిస్తుండటానికి, ఈ రెండు కూటముల (యుపిఎ, ఎన్‌డిఎ) ప్రభుత్వాలు భారతీయ వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండటమే కారణం కావచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఒక సానుకూలమైన బ్లూప్రింట్(వివరణాత్మక పథకం)ను ఈ నివేదిక అందించింది. మనం వ్యవసాయ రంగంలో అభివృద్ధిని రైతుల ఆదాయవృద్ధి పరంగా కొలవాలి తప్ప, కేవలం పెరిగిన ఉత్పత్తితో కాదు అని నమ్మి, ఈ కమిషన్‌కు భిన్నమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలనుకున్న వ్యక్తి అధ్యక్షుడు కావటం వలన.
వ్యక్తిగతంగా, ఆయన గురించి నాకున్న మరపురాని జ్ఞాపకం 2005 నాటిది, ఆయన ఎన్‌సిఎఫ్ అధ్యక్షుడుగా ఉన్నప్పటిది. విదర్భను సందర్శించవలసిందిగా అప్పుడు నేనాయనకు విజ్ఞప్తి చేశాను. అప్పుడు ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు కొన్ని సమయాలలో రోజుకు 6-8 చొప్పున కూడా జరుగుతున్నాయి. మీడియా ద్వారా మనకు విషయాలు తెలియకపోయినప్పటికీ, ఆ సమయంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉండాలో అంతగానూ ఉన్నాయి. (2006లో, విదర్భ ప్రాంతంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఆరు జిల్లాల్లో కొనసాగుతోన్న ఆత్మహత్యల పరంపరను కవర్ చేస్తున్నవారిలో విదర్భ వెలుపలి నుండి కేవలం ఆరుగురు జర్నలిస్టులు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో, ముంబైలో జరుగుతోన్న లాక్మే ఫ్యాషన్ వీక్‌ను 512 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులతో పాటు దాదాపు 100 మంది జర్నలిస్టులు రోజువారీ పాస్‌ల ద్వారా కవర్ చేశారు. ఇందులో అపహాస్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఫ్యాషన్ వీక్ ఇతివృత్తమైన నూలు బట్ట - అక్కడికి ఒక గంట విమాన ప్రయాణం దూరంలో ఆ పత్తిని పండించిన పురుషులు, మహిళలు, పిల్లలు ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో తమ ప్రాణాలను తీసుకుంటుండగా - సొగసైన ర్యాంప్‌పై ప్రదర్శించబడింది.)
ఇక 2005కి తిరిగి వస్తే, విదర్భను సందర్శించవలసిందని మా జర్నలిస్టులం చేసిన విజ్ఞప్తికి ప్రొఫెసర్ స్వామినాథన్ ఎవరూ ఊహించనంత వేగంగా ప్రతిస్పందించారు; తన ఎన్‌సిఎఫ్ బృందంతో కలిసి చాలా త్వరగా అక్కడికి చేరుకున్నారు.
ఆయన సందర్శనతో అప్రమత్తమైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం, ఆయనను ప్రభుత్వాధికారులతో, సాంకేతిక నిపుణులతో అనేక చర్చలు చేయటం, వ్యవసాయ కళాశాలల్లో వేడుకలలో పాల్గొనటం వంటి మరెన్నో కార్యక్రమాలలో తలమునకలుగా ఉంచేందుకు ఆయనకు గైడెడ్ టూర్ అందించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వారు కోరుకున్న ప్రదేశాలను సందర్శిస్తానని మర్యాదాపూర్వకంగా చెప్పిన ఆయన, నాతో పాటు జైదీప్ హర్దీకర్ వంటి తోటి జర్నలిస్టులతో కలిసి, మేం అడిగిన ప్రదేశాలను సందర్శించి, ఆయా ప్రదేశాలలో మాతో గడుపుతానని కూడా చెప్పారు. చెప్పిన విధంగా చేశారు కూడా.
వర్ధాలో మేం ఆయనను శ్యామ్‌రావ్ ఖతాళే ఇంటికి తీసుకువెళ్ళాం. ఆ ఇంట్లో రైతు పనిచేసే ఆయన కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం అక్కడకు చేరడానికి కొన్ని గంటల ముందే శ్యామ్‌రావ్ మరణించారని తెలుసుకున్నాం. అనారోగ్యంతో, ఆకలితో, కొడుకులను పోగొట్టుకున్న దుఃఖాన్ని తట్టుకోలేక ఆయన మరణించారు. ఆ వ్యక్తి చనిపోయాడంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పర్యటనను మళ్ళించేందుకు ప్రయత్నించింది. అయితే స్వామినాథన్ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించేందుకు వస్తానని పట్టుబట్టి అక్కడు వచ్చారు.
ఆ తర్వాత కొన్ని ఇళ్ళకు వెళ్ళినపుడు, తమ జీవితాలను ముగించుకున్న వారి కుటుంబాల గురించి వింటూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ విషయాలపై మన అత్యుత్తమ మేధావులలో ఒకరైన విజయ్ జావంధియా ఆధ్వర్యంలో వర్ధాలోని వాయ్ఫడ్లో జరిగిన బాధిత రైతుల చిరస్మరణీయ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఒక సమయంలో, ఆ సమూహంలోంచి ఒక వృద్ధ రైతు లేచి నిలబడి, ప్రభుత్వం తమను ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆగ్రహంతో అడిగారు. మా మాట వినబడాలంటే మేం ఉగ్రవాదులుగా మారాలా? అన్నారు. ఆ మాటలకు చాలా బాధపడిన ప్రొఫెసర్ ఆ రైతుతో, ఆయన స్నేహితులతో చాలా ఓపికగానూ, అవగాహనతోనూ మాట్లాడారు.
స్వామినాథన్‌కు అప్పటికే 80 ఏళ్ళు దాటాయి. ఆయన సత్తువ, నెమ్మదితనం, దయాగుణాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన అభిప్రాయాలనూ పనినీ తీవ్రంగా విమర్శించే వ్యక్తులతో ఆయన ఎంత నిజాయితీగా వ్యవహరిస్తారో కూడా మేం గమనించాం. వారు చేసిన కొన్ని విమర్శలను ఆయన ఎంతో ఓపికగా వినటమే కాక స్వీకరిస్తారు కూడా. నాకు తెలిసి, తనకు వ్యక్తిగతంగా చెప్పిన విషయాలను బహిరంగంగా చెప్పడానికి తన విమర్శకులను తాను నిర్వహించే సెమినార్‌కో, లేదా వర్క్‌షాప్‌కో అంత త్వరగా ఆహ్వానించినవారు మరెవ్వరూ లేరు.
తన స్వంత పనిలో వైఫల్యాలను, లోపాలను దశాబ్దాల వెనుకకు తిరిగి చూడగలగడం, గుర్తించడం అనేవి ఖచ్చితంగా ఈ మనిషికున్న అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి. హరిత విప్లవం వలన రసాయనిక ఎరువుల, పురుగుమందుల వాడకం విపరీతంగా నియంత్రణలో లేకుండా పెరిగిపోవడం తాను ఎదురుచూడనిదీ, ఊహించలేనిదీ అని ఆయన దిగ్భ్రాంతితో చెప్పారు. దశాబ్దాలు గడిచేకొద్దీ ఆయన జీవావరణ, పర్యావరణాల పట్ల, నీటి వనరుల వినియోగం, దుర్వినియోగాల పట్ల మరింత సున్నితంగా మారారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన బిటి లేదా జన్యుమార్పిడి పంటలను ఎటువంటి నియంత్రణ లేకుండా, నిర్లక్ష్యంగా వ్యాప్తి చెందించడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.
మాన్‌కొంబు సాంబశివన్ స్వామినాథన్ నిష్క్రమణతో భారతదేశం తన అగ్రగామి వ్యవసాయక శాస్త్రవేత్తనే కాక ఒక గొప్ప ఆలోచనాపరుడ్నీ, ఒక శ్రేష్ఠమైన మానవుడినీ కోల్పోయింది.
ఈ కథనం మొదట సెప్టెంబర్ 29, 2023న ది వైర్లో ప్రచురితమైంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి