ప్రతి ఉదయం ఆకిఫ్ ఎస్.కె. హేస్టింగ్స్‌లోని ఒక వంతెన కింద ఉండే తన నివాసమైన ఝోప్డీ (గుడిసెవంటి తాత్కాలిక నిర్మాణం)ని వదిలి కొల్‌కతాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన విక్టోరియా మెమోరియల్‌కి వెళ్తాడు. దారిలో అతను రాణి, బిజిలీలను కూడా తనతోపాటు తీసుకువెళ్తాడు.
రాణి, బిజిలీ అని అతను పేర్లు పెట్టుకున్న ఆ రెండు తెల్ల గుర్రాలే ఈ శీతాకాలంలో అతనికి జీవనోపాధి. " అమీ గాడీ చలాయ్ (నేను బగ్గీని నడుపుతాను)," అంటాడు ఆకిఫ్. అతను హేస్టింగ్స్‌కు దగ్గరలోని గుర్రాలదొడ్డిలో తన గుర్రాలను కట్టేసి ఉంచి, ఉదయం 10 గంటల సమయమప్పుడు వాటిని విక్టోరియా - సెంట్రల్ కొల్‌కతాలో చుట్టూ బహిరంగ మైదానం ఉన్న ఈ పాలరాతి భవనాన్ని స్థానికులు పిలిచే పేరు - దగ్గరకు తెస్తాడు. బ్రిటిష్ చక్రవర్తిని విక్టోరియా రాణి జ్ఞాపకార్థంగా కట్టిన ఈ ప్రదేశాన్ని 1921లో ప్రజలు సందర్శించేందుకు తెరిచారు.
ఆకిఫ్ ప్రతిరోజూ అద్దెకు తీసుకునే బగ్గీ, విక్టోరియా మెమోరియల్ వద్ద విస్తరించివున్న క్వీన్స్ వే అనే ప్రదేశంలో నిలిపి ఉంటుంది. వరుసగా నిలిచివున్న 10 బగ్గీలలోంచి తన బగ్గీని చూపిస్తూ "ఆ బంగారు రంగుది నాదే," చెప్పాడు ఆకిఫ్. అక్కడ నిలిపివున్న చాలా బగ్గీలు ఒకే రంగులో ఉండి, అనేక పూల, పక్షుల బొమ్మలతో అలంకరించి రాజ రథాలలాగా కనిపిస్తున్నప్పటికీ, మెరిసిపోయే ఆకిఫ్ బగ్గీ వాటిలో ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్రిటిష్ రాజ్ కాలం నాటి జీవితపు ఛాయలు చూడాలనుకునేవారికోసం అతను ప్రతిరోజూ దాదాపు రెండు గంటల పాటు తన బగ్గీని శుభ్రంచేసి, మెరుగుపెడతాడు.
అప్పటికే వీధిలో విక్టోరియా మెమోరియల్ గేట్ల దగ్గర ఒక చిన్న గుంపు పోగైవుంది. "పాత రోజుల్లో ఇక్కడ రాజులు నివాసముండేవారు, బగ్గీల మీద ఈ చుట్టూ తిరుగుతుండేవారు. ప్రస్తుతం జనం ఆ రోజుల అనుభూతిని పొందటానికి విక్టోరియాను చూసేందుకు వస్తారు," 2017 నుంచి బగ్గీని తోలటం ప్రారంభించిన ఆకిఫ్ చెప్పాడు. "ఎంతకాలం విక్టోరియా [మెమోరియల్] ఉంటే అంతకాలం ఈ గుర్రపు బగ్గీలు కూడా ఉంటాయి." అదేవిధంగా అతని వంటి బగ్గీలు తోలేవారికి పని కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 50 బగ్గీల వరకూ నడుస్తున్నాయి.
శీతాకాలం వచ్చింది. తన రోజును ఆరుబయట గడిపేందుకు కొల్‌కతా నగరం ఆయత్తమవుతోన్న సమయాన ఆకిఫ్ తీరికలేకుండా ఉంటాడు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో. ఈ సీజన్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆ తర్వాత వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువమంది జనం ఆరుబయట సవారీలకు వస్తారని అతను చెప్పాడు
మెమోరియల్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై ఉన్న అనేక చిరుతిళ్ళు, టీ అమ్మే దుకాణాల దగ్గర మేం కూర్చున్నాం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, బగ్గీలను తోలేవాళ్ళు కూడా ఈ దుకాణాలలో తింటుంటారు.
మాకు కొంచెం దూరంగా నిలబడివున్న రాణి, బిజిలీలు గమేర్ భూషి [గోధుమ పొట్టు], బిచాలీ , దానా [గింజలు], ఘాస్ [గడ్డి] తింటూ అప్పుడప్పుడూ తలలు విదిలిస్తున్నాయి. అవి తమ కడుపు నింపుకున్నాక, ఆధునిక రథం సిద్ధమైన తర్వాత, తమ పనిలోకి వెళ్తాయి. తమ గుర్రాలకు ఆహారం ఇవ్వడం, వాటిని శుభ్రం చేయడం బగ్గీ తోలేవారి జీవనోపాధికి చాలా కీలకమైన విషయం. "ఒక గుర్రాన్ని పెంచిపోషించడానికి రోజుకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది," అని ఆకిఫ్ చెప్పాడు. గింజలు, గడ్డితో పాటు వాటికి బిచాలీ (ఎండు వరిగడ్డి) కూడా తినిపిస్తాడు. అతను దానిని కిదిర్‌పూర్ సమీపంలోని వాట్‌గంజ్‌లో ఉన్న ఒక దుకాణం నుండి కొంటాడు.
మధ్యాహ్నంవేళకు అతని కోసం అతని అక్కగారు వండి పంపిన భోజనం కూడా వస్తుంది.
మేం ఆ ఉదయం ఆకిఫ్‌ను కలిసేవేళకు రద్దీ ఇంకా ప్రారంభం కాలేదు. అడపాదడపా ఒక యాత్రికుల బృందం బగ్గీలను సమీపించగానే బగ్గీవాలాలందరూ ఈ రోజు మొదటి బేరం కోసం వారి చుట్టూ చేరుతున్నారు.
"ఒక్కో మంచిరోజు నాకు మూడు నాలుగు సవారీలు దొరుకుతాయి," రాత్రి 9 గంటలవరకూ పనిచేసే ఆకిఫ్ అన్నాడు. విక్టోరియా మెమోరియల్ గేట్ల వద్ద ప్రారంభమై, రేస్ కోర్స్ దాటి, ఫోర్ట్ విలియమ్ దక్షిణ ద్వారం నుండి మలుపు తీసుకునే వరకూ ఈ సవారీ దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఒక్కో సవారీకి ఇక్కడి బగ్గీవాలాలు రూ. 500 తీసుకుంటారు.
"ప్రతి వంద రూపాయలకు నేను పాతిక రూపాయలు సంపాదిస్తాను," అంటాడు ఆకిఫ్. మిగిలినవి బగ్గీ సొంతదారుకు వెళ్తాయి. రోజు బాగుంటే, ఈ సవారీల వలన రూ. 2,000-3,000 వరకూ వస్తాయి.
అయితే దీని నుండి సంపాదించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. "పెళ్ళి బృందాలు బగ్గీలను అద్దెకు తీసుకున్నప్పుడు" ఇది సాధ్యపడుతుంది. వరుడిని బగ్గీలో తీసుకువెళ్ళేందుకు అయ్యే ఖర్చు, వేదిక ఎంత దూరంలో ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. నగరం లోపలే అయితే, దాని ధర 5,000-6,000 రూపాయల మధ్య ఉంటుంది.
“వరుడిని వేదిక వద్దకు తీసుకెళ్లడమే మా పని. అక్కడకు చేరుకున్న తర్వాత మేం మా గుర్రం, బగ్గీలను తీసుకుని వెనక్కు తిరిగి వచ్చేస్తాం,” అని ఆకిఫ్ చెప్పాడు. కొన్నిసార్లు వాళ్ళు కొల్‌కతా వెలుపలకు కూడా ప్రయాణిస్తుంటారు. ఆ విధంగా ఆకిఫ్ తన గుర్రపుబగ్గీతో మేదినీపూర్, ఖరగ్‌పూర్‌లకు వెళ్లాడు. "నేను హైవేపై ఒకే ఊపున రెండు-మూడు గంటలపాటు బగ్గీని నడిపించాను. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకున్నాను," చెప్పాడతను. రాత్రివేళల్లో హైవే పక్కనే ఆగి, గుర్రాలను విప్పేసి బగ్గీలో పడుకునేవాడు.
"సినిమా షూటింగుల కోసం కూడా బగ్గీలను అద్దెకు తీసుకుంటారు," చెప్పాడు ఆకిఫ్. కొన్నేళ్ళ క్రితం ఒక బెంగాలీ టివి సీరియల్ షూటింగ్ కోసం అతను 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్‌పూర్‌కు వెళ్ళాడు. కానీ పెళ్ళిళ్ళు, షూటింగులు స్థిరమైన ఆదాయాన్నిచ్చే వనరులు కావు. ఇక్కడ పని లేనప్పుడు అతను సంపాదన కోసం వేరే పనులు వెతుక్కోవాల్సిందే.
ఆకిఫ్ ఈ రెండు గుర్రాలతో అక్టోబర్ 2023 నుండి పని చేస్తున్నాడు. “నేను ఈ పనిలోకి వచ్చిన మొదట్లో మా అక్క [వివాహిత] కుటుంబంలోని గుర్రాలతో పార్ట్‌టైమ్ పని చేశాను,” అని 22 ఏళ్ళ ఈ యువకుడు చెప్పాడు. మధ్యలో కొంతకాలం వేరొకరి క్రింద కూడా పనిచేసిన ఆకిఫ్, ఇప్పుడు తిరిగి తన అక్కగారి కుటుంబానికి చెందిన బగ్గీలతోనే పనిచేస్తున్నాడు.
ఆకిఫ్‌తో సహా ఈ బగ్గీలు తోలేవారెవ్వరికీ వీటిని నడపటం, గుర్రాల సంరక్షణను చూడటమే పూర్తికాలపు పని కాదు.
"నేను ఇళ్ళకు రంగులు వేయటంలో శిక్షణ పొందాను. అదీగాక బడాబజార్‌లో ఉన్న నా స్నేహితుడి బట్టల దుకాణంలో పనిచేస్తుంటాను," అన్నాడు ఆకిఫ్. "మా నాన్న ఒక రంగ్ మీస్తిరి (ఇళ్ళకూ భవనాలకూ రంగులు వేసే కార్మికుడు). ఆయన నేను పుట్టకముందే 1998లో కొల్‌కతాకు వచ్చారు." అంతకుముందు వాళ్ళు నివసించిన బారాసాత్‌లో అతని తండ్రి కూరగాయలు అమ్మేవారు. అతని తల్లిదండ్రులు, పెళ్ళి అయిన తర్వాత కాస్త మంచి సంపాదన కోసం ఆకిఫ్ అత్త నివసిస్తోన్న నగరానికి వచ్చారు. "మా అత్తకు కొడుకులు లేకపోవటంతో ఆమే నన్ను పెంచింది," అన్నాడు ఆకిఫ్. అతని తల్లిదండ్రులైన అలాఉద్దీన్ షేక్, సయీదాలు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసాత్‌లో ఉన్న తమ పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ అల్లాఉద్దీన్ అలంకరణ వస్తువులు అమ్మే ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు.
ఆకిఫ్ ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడు; అతని తమ్ముడు వాళ్ళ అక్కగారి కుటుంబంతోనే కలిసివుంటాడు, అప్పుడప్పుడూ అక్కగారి అత్తవారికి చెందిన బగ్గీని నడుపుతుంటాడు.
పని కొరత ఒక్కటే బగ్గీవాలాలు ఎదుర్కొనే సమస్య కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు టిప్పుల కోసం అతన్ని అడుగుతుంటారు: "నేను ప్రతిరోజూ సుమారు 50 రూపాయలు చెల్లించాల్సిందే," అని ఆకిఫ్ చెప్పాడు. గుర్రపు బగ్గీలను నిషేధించాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) దాఖలు చేసిన పిటిషన్ గురించి మీరు విన్నారా అని మేం అతనిని అడిగినప్పుడు, అతనిలా సమాధానమిచ్చాడు: “ప్రతి నెలా ఎవరో ఒకరు వచ్చి గుర్రాలను ఉపయోగించడం మానేయాలని మాకు చెబుతుంటారు. 'అన్ని బగ్గీలను మీరే కొని మాకు డబ్బులు ఇవ్వొచ్చుకదా?' అని మేం వాళ్ళను అడుగుతుంటాం. ఈ గుర్రాలే మాకు జీవనాధారం."
గుర్రపు బగ్గీల స్థానంలో ఎలక్ట్రిక్ బగ్గీలు ఏర్పాటు చేయాలని ఫేటా పిటిషన్‌లో పేర్కొన్నారు. "గుర్రాలు లేకపోతే మీరు దానిని ఘోడార్ గాడీ [గుర్రపు బండి] అని ఎలా పిలుస్తారు?" ఈ యువ బగ్గీవాలా నవ్వుతూ అడిగాడు
"గుర్రాలను సరిగ్గా చూసుకోనివాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు." ఒప్పుకున్నాడు ఆకిఫ్. "కానీ నేను వాటిని చాలా బాగా చూసుకుంటాను. వాటినలా చూస్తేనే తెలిసిపోతుంది, వాటినెంత బాగా చూసుకుంటున్నానో!"
అనువాదం: సుధామయి సత్తెనపల్లి