నెలల తరబడి ఉడికించిన భరించరాని వేడిమి తర్వాత మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోకి ఎట్టకేలకు చలికాలం ప్రవేశించింది. తన విధి నిర్వహణలో భాగంగా నైట్ షిఫ్ట్‌కు వెళ్ళేందుకు సిద్ధపడుతోన్న దామిని (అసలు పేరు కాదు) ఆ సావకాశాన్ని ఆస్వాదిస్తున్నారు. “నేను పిఎస్ఒ (పోలీస్ స్టేషన్ అధికారి)గా విధి నిర్వహణలో ఉన్నాను. ఆయుధాలను, వాకీ-టాకీలను జారీ చేయటం నా బాధ్యత," చెప్పారామె.

డ్యూటీలో ఉండగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అలియాస్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఎచ్ఒ/పిఐ) తన వాకీ-టాకీ కోసం పోలీస్ స్టేషన్ నుండి చార్జ్ చేసివున్న బ్యాటరీలను తీసుకురమ్మని ఆమెను అడిగాడు. అతని అధికారిక నివాసం స్టేషన్ ఆవరణలోనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత, అలాంటి పనుల కోసం ఆమెను తన ప్రాంగణానికి పిలిపించుకోవడం ప్రోటోకాల్‌కు విరుద్ధమే అయినప్పటికీ, అదొక ఆనవాయితీ. "అధికారులు తరచుగా పరికరాలను తమ ఇళ్ళకు తీసుకువెళుతుంటారు... అదీగాక మేం మా పై అధికారుల ఆదేశాలను పాటించాలి," అని దామిని వివరించారు.

దాంతో, తెల్లవారుఝాము 1.30 సమయంలో దామిని పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇంటికి వెళ్ళారు.

లోపల ముగ్గురు వ్యక్తులు కూర్చునివున్నారు: పిఐ, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఠాణా క ర్మచారి ( చిన్న చిన్న పాక్షిక-అధికారిక పనులు చేయించుకోవటం కోసం పోలీసు స్టేషన్‌ నియమించుకొనే ఒక పౌర వాలంటీర్‌ ). "నేను వారిని పట్టించుకోకుండా, వాకీ-టాకీ బ్యాటరీలను మార్చడానికి గదిలో ఉన్న బల్ల వైపుకు తిరిగాను," నవంబర్ 2017 నాటి ఆ రాత్రిని గుర్తుచేసుకుంటూ ఆమె ఇబ్బందిపడుతూ చెప్పారు. ఆమె వెనుక, అకస్మాత్తుగా తలుపులు బిగించిన శబ్దం వినబడింది. “నేను ఆ గదిలోంచి బయటకు రావాలనుకున్నాను. నా శక్తి అంతటితో ప్రయత్నించాను, కాని ఇద్దరు వ్యక్తులు నా చేతులను గట్టిగా పట్టుకుని, నన్ను మంచం మీదకి తోసి... ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారం చేశారు."

తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో దామిని నీరు నిండిన కళ్ళతో తూలుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి, తన బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరారు. "నా మెదడు మొద్దుబారిపోయింది. నేను ఆలోచిస్తున్నాను... నా కెరియర్ గురించీ, నేను సాధించాలనుకున్న దాని గురించీ. ఇక ఇప్పుడు ఇది?" అన్నారామె.

PHOTO • Jyoti

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం చాలా కాలంగా తీవ్రమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వ్యవసాయం ద్వారా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు దూరమయ్యాయి. పోలీసు వంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించదగినవిగా ఉన్నాయి

*****

తనకు గుర్తున్నంత వరకూ దామిని సీనియర్ ప్రభుత్వ అధికారిణి కావాలనుకున్నారు. ఆమె సంపాదించిన మూడు డిగ్రీలు - ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ లా - ఆమె అభిలాషకు, కృషికి నిదర్శనం. "నేనెప్పుడూ అగ్రశ్రేణి విద్యార్థినినే... ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో కానిస్టేబుల్‌గా చేరి, ఆ తర్వాత పోలీస్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధపడాలని అనుకున్నాను," అని ఆమె చెప్పారు

2007లో దామిని పోలీసు శాఖలో ఉద్యోగంలోకి ప్రవేశించారు. మొదటి కొద్ది సంవత్సరాలు ఆమె ట్రాఫిక్ విభాగంలోనూ, మరఠ్వాడా పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గానూ పనిచేశారు. "నేను సీనియారిటీని సంపాదించటం కోసం, ప్రతి కేసు ద్వారా నా నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి చాలా కష్టపడి పనిచేసేదాన్ని," దామిని గుర్తుచేసుకున్నారు. ఆమె ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికీ, పురుషాధిపత్యం మెండుగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఆమెకు కలిగిన అనుభవాలు ఆమెను నిరుత్సాహపరిచేవి.

"మగ సహోద్యోగులు తరచుగా పరోక్షంగా అవహేళనలు చేస్తారు. ప్రత్యేకించి కులం ఆధారంగానే కాకుండా, మామూలుగా చేసేలా జెండర్ ఆధారంగా కూడా," దళిత సామాజికవర్గానికి చెందిన దామిని చెప్పారు. "ఒకసారి ఒక ఉద్యోగి నాతో ఇలా చెప్పాడు: 'తుమ్హీ జర్ సాహెబాంచ్యా మర్జీప్రమాణే రాహిల్యాత్ తర్ తుమ్హాలా డ్యూటీ వగైరే కమీ లగేల్. పైసే పన్ దేవు తుమ్హాలా ' (అయ్యగారు చెప్పినట్టు చేస్తే, నీకు తక్కువ డ్యూటీలు పడతాయి, డబ్బులు కూడా ముడతాయి)." ఆ ఉద్యోగి ఎవరో కాదు, ఆమెపై అత్యాచారం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఠాణా కర్మచారి . ఇతను స్టేషన్‌లో పాక్షిక-అధికారిక పనులు చేయడంతో పాటు, పోలీసుల తరపున వ్యాపారాల నుండి ' వసూలీ ' (చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లేదా వేధింపుల బెదిరింపులతో అక్రమ వసూళ్ళు) చేయటం; పిఐ వ్యక్తిగత నివాసానికి, లేదా హోటళ్ళుకు లాడ్జీలకు సెక్స్ వర్కర్లను, మహిళా కానిస్టేబుళ్ళను "తీసుకెళ్ళి"నందుకు వసూళ్ళు చేసేవాడని దామిని చెప్పారు.

"మేం ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా మా పై అధికారులు సాధారణంగా మగవాళ్ళై ఉంటారు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు," అన్నారు దామిని. మహిళా ఉన్నాతాధికారులకు కూడా స్త్రీద్వేషం, వేధింపులనేవి కొత్తేమీ కాదు. మహారాష్ట్ర మొదటి మహిళా కమిషనర్‌గా గుర్తింపు పొందిన విశ్రాంత ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి డాక్టర్ మీరణ్ చడ్డా బోర్వాణ్‌కర్ మాట్లాడుతూ, భారతదేశంలో మహిళా పోలీసు సిబ్బందికి పని పరిసరాలు ఎప్పుడూ సురక్షితంగా ఉండవని అన్నారు. "పనిప్రదేశాలలో లైంగిక వేధింపులనేవి వాస్తవం. కానిస్టేబుల్ స్థాయిలో ఉండే మహిళలు వీటిని ఎక్కువగా ఎదుర్కొంటారు. కానీ సీనియర్ మహిళా అధికారులను కూడా విడిచిపెట్టరు. వాటిని నేను కూడా ఎదుర్కొన్నాను,” అని ఆమె చెప్పారు.

మహిళలను పనిప్రదేశాలలో లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి 2013లో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నిరోధం, నిషేధం, నివారణ) చట్టం ను రూపొందించారు. యజమానులు ఈ చట్టాన్ని గురించి అవగాహన పెంపొందించే బాధ్యత వహించాలి. “పోలీస్ స్టేషన్లు ఈ చట్టం కిందకు వస్తాయి, అవి చట్టం నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇక్కడ 'యజమాని'గా ఉండే ఎస్ఎచ్ఒ లేదా పిఐ చట్టం అమలును నిర్ధారించే బాధ్యత వహిస్తారు,” అని బెంగళూరులోని ఆల్టర్నేటివ్ లా ఫోరమ్‌లో పనిచేసే న్యాయవాది పూర్ణ రవిశంకర్ నొక్కి చెప్పారు. దామిని విషయంలో పిఐకి వ్యతిరేకంగా జరిగినట్టుగానే, పనిప్రదేశంలో వచ్చే వేధింపుల ఫిర్యాదులను నిర్వహించడానికి ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) ఏర్పాటును చట్టం తప్పనిసరి చేస్తుంది. కానీ డాక్టర్ బోర్వాణ్‌కర్ ఒక వాస్తవాన్ని మన ముందుంచుతున్నారు: “ఐసిసిలు తరచుగా కాగితంపై మాత్రమే ఉంటాయి.”

లోక్‌నీతి-ప్రోగ్రామ్ ఫర్ కంపారిటివ్ డెమోక్రసీ, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) ద్వారా 2019లో నిర్వహించిన ఒక సర్వే, స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా పేరుతో మహారాష్ట్రతో సహా 21 రాష్ట్రాల్లోని 105 ప్రదేశాల్లో 11,834 మంది పోలీసు సిబ్బందిని ఇంటర్వ్యూ చేసింది. వీరిలో దాదాపు నాల్గవ వంతు (24 శాతం) మహిళా పోలీసు సిబ్బంది తమ కార్యాలయంలో లేదా అధికార పరిధిలో ఇటువంటి కమిటీలు లేవని నివేదించినట్లు ఆ సర్వే వెల్లడించింది. పాక్షికంగానే ఏమిటి, మహిళా పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న వేధింపుల సంఖ్యను లెక్కించడమే ఒక సవాలుగా ఉంది.

"మాకెప్పుడూ ఈ చట్టం గురించి చెప్పనూలేదు, అలాంటి కమిటీ కూడా ఎక్కడా లేదు," దామిని స్పష్టంచేశారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 'మహిళ మర్యాదను భంగపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం చేయటం' (ఇప్పుడు సవరించిన భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 354; కొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ సెక్షన్ 74కి సమానం) కేటగిరీ కింద పనిచేసే చోట, లేదా కార్యాలయ ప్రాంగణంలో లైంగిక వేధింపుల కేసులపై 2014 నుండి డేటాను సేకరిస్తోంది. 2022లో, భారతదేశం మొత్తంగా ఈ విభాగంలో కనీసం 422 మంది బాధితులను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నమోదు చేసింది. ఇందులో మహారాష్ట్రకు చెందినవారు 46 మంది ఉన్నారు - బహుశా ఇది తక్కువ అంచనా కావచ్చు.

*****

ఆ నవంబర్, 2017 రాత్రి దామిని ఇంటికి చేరుకున్నప్పుడు, ఆమె మనస్సు ప్రశ్నలతో సతమతమవుతోంది. బయటకు మాట్లాడటం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోననీ, పనిప్రదేశంలో రోజు తర్వాత రోజు తనపై అత్యాచారం చేసినవారి ముఖాలను చూడాలనే భయం. "ఇది [అత్యాచారం] నా సీనియర్‌లు తీసుకునే దుర్మార్గపు చొరవలకు లొంగకపోవటం వలన జరిగిందా... తర్వాత నేనేం చేయాలి, అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను," అని దామిని గుర్తుచేసుకున్నారు. నాలుగైదు రోజుల తర్వాత, దామిని ధైర్యం తెచ్చుకుని పనికి వెళ్ళారు. కానీ జరిగిన సంఘటన గురించి ఏమీ మాట్లాడకూడదని, ఏమీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. “నేను చాలా కలతపడ్డాను. ఇలాంటప్పుడు ఎవరైనా ఏమి చేయాలో నాకు తెలుసు [సంఘటన జరిగిన సమయంలో తప్పకుండా చేయించాల్సిన మెడికల్ టెస్ట్ వంటివి], కానీ... నాకు తెలియదు," దామిని సంకోచించారు.

అయితే, ఒక వారం గడిచాక, ఒక రాత పూర్వక ఫిర్యాదుతో ఆమె మరఠ్వాడా జిల్లాలలోని ఒక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ (ఎస్‌పి)ను కలిశారు. అయితే ఆ ఎస్‌పి ఆమెను ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేయమని చెప్పలేదు. అందుకు బదులుగా దామిని ఇంతకుముందు భయపడిన పరిణామాలను ఎదుర్కోవటం మొదలయింది. "నేను పనిచేసే పోలీస్ స్టేషన్ నుంచి సర్వీస్ రికార్డును తీసుకురమ్మని ఎస్‌పి అడిగాడు. నా సర్వీస్ రికార్డులో, నా నడవడిక సరైంది కాదని, పని చేస్తుండగా అసభ్యకరంగా ప్రవర్తించానని, ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఐ రాశాడు," అని దామిని చెప్పారు.

కొన్ని రోజుల తర్వాత దామిని ఎస్‌పికి రెండవ ఫిర్యాదు లేఖ రాసినా అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. "నా పై అధికారులను కలవాలని నేను ప్రయత్నం చేయని రోజు లేదు. అదే సమయంలో నాకు కేటాయించిన విధులను నేను నిర్వర్తిస్తూనే ఉన్నాను," అని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఇంతలో ఈ అత్యాచారం వలన నేను గర్భవతిని అయినట్లుగా నాకు తెలిసింది."

ఆ తర్వాతి నెలలో ఆమె ఒక నాలుగు పేజీల రాతపూర్వక ఫిర్యాదును పోస్ట్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎస్‌పికి పంపించారు. అత్యాచారం జరిగిన రెండు నెలల తర్వాత 2018 జనవరిలో ఒక ప్రాథమిక విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. "ఈ విచారణాధికారిగా ఒక మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్‌పి) ఉన్నారు. నేను నా గర్భధారణ నివేదికలను ఆమెకు సమర్పించినప్పటికీ, ఆమె వాటిని తన పరిశోధనలతో జతచేయలేదు. లైంగిక వేధింపులు జరగలేదని నిర్ధారిస్తూ ఎఎస్‌పి నివేదిక ఇవ్వటంతో జూన్ 2019లో నన్ను సస్పెండ్ చేశారు, తదుపరి విచారణ నిలిచిపోయింది,” అని దామిని చెప్పారు.

PHOTO • Priyanka Borar

'మేం ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా మా పై అధికారులంతా సాధారణంగా మగవాళ్ళై ఉంటారు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు,' అంటారు దామిని. మహిళా పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ స్త్రీద్వేషం, వేధింపులనేవి కొత్తేమీ కాదు

ఇదంతా జరుగుతున్న కాలంలో దామినికి ఆమె కుటుంబం నుంచి మద్దతు లభించలేదు. ఈ సంఘటన జరగటానికి ఏడాది ముందు, 2016లో ఆమె తన భర్తతో విడిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్ళు, ఒక సోదరుడు ఉన్న కుటుంబంలో పెద్దదానిగా పుట్టిన ఆమె, విశ్రాంత కానిస్టేబుల్ అయిన తన తండ్రి, గృహిణి అయిన తన తల్లి తనకు అండగా ఉంటారని ఆశించారు. "కానీ నిందితుల్లో ఒకరు మా నాన్నను రెచ్చగొట్టారు... నేను స్టేషన్‌లో లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నాననీ... నేను 'ఫాల్తూ' (పనికిరానిది) అనీ... అలాంటి నేను వారిపై ఫిర్యాదులు చేసి ఈ గందరగోళంలోకి దించకూడదనీ," చెప్పారామె. తండ్రి తనతో మాట్లాడటం మానేయడంతో, ఆమె దిగ్భ్రాంతిచెందారు. "దీన్ని నమ్మడం చాలా కష్టం. కానీ నేను దాన్ని పట్టించుకోకూడదనుకున్నాను. ఇంకేం చేయాలి?"

పరిస్థితులను మరింత దిగజార్చడానికన్నట్టు, దామినికి తాను నిరంతరం నిఘా కింద ఉన్నట్లుగా అనిపించేది. “నిందితులు, ముఖ్యంగా కర్మచారి నన్ను ప్రతిచోటకూ అనుసరించేవాడు. నేనెప్పుడూ హెచ్చరికగా ఉండాల్సివచ్చేది. నిద్రపోలేను, సరిగ్గా తినలేను. నా మనసు, శరీరం పూర్తిగా అలసిపోయాయి.”

అయినప్పటికీ ఆమె పట్టుదలను వీడలేదు. 2018, ఫిబ్రవరిలో, ఆమె జిల్లాలోని ఒక తాలూకాలో ఉన్న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (JMFC) కోర్టును ఆశ్రయించారు. ఒక పబ్లిక్ సర్వెంట్‌కు వ్యతిరేకంగా న్యాయపరమైన సహాయాన్ని పొందేందుకు ఆమెకు తన ఉన్నతాధికారుల నుండి అనుమతి లభించకపోవడం వలన ఆమె కేసును కొట్టివేశారు (ఇప్పుడు సవరించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం, కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత లేదా బిఎన్ఎస్ఎస్ ప్రకారం సెక్షన్ 218కి సమానం). ఒక వారం తర్వాత ఆమె మరో దరఖాస్తు దాఖలు చేయటంతో, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌ను ఆదేశించింది.

"మూడు నెలలకు పైగా భంగపాటుకూ నిరుత్సాహానికీ గురైన తర్వాత వచ్చిన కోర్టు ఉత్తర్వులు నా మనోధైర్యాన్ని పెంచాయి," అంటూ దామిని ఆ క్షణాన్ని గుర్తుచేసుకున్నారు. కానీ ఇది కొద్దికాలానికి మాత్రమే. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత, నేరం జరిగినట్లు ఆరోపించిన ప్రదేశాన్ని-పిఐ నివాసాన్ని- పరిశీలించారు. దామిని పిఐ ఇంటికి వెళ్ళిన రాత్రి గడిచి మూడు నెలలు దాటిపోవటంతో సహజంగానే ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఎలాంటి అరెస్టులు జరగలేదు.

అదే నెలలో దామినికి గర్భస్రావం కావటంతో, బిడ్డను కోల్పోయారు.

*****

దామిని కేసులో చివరిగా 2019 జులైలో విచారణ జరిగి ఐదేళ్ళకు పైగా గడిచింది. సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ఆమె తన కేసును ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) వద్దకు తీసుకెళ్ళేందుకు పదే పదే ప్రయత్నించారు, కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఒక రోజు ఆమె అతని అధికారిక వాహనం ముందు నిలబడి దాన్ని ఆగేలా చేసి, తన కథనాన్ని వివరించారు. "నాపై తీసుకున్న అన్ని అన్యాయమైన చర్యలను వరుసగా వివరిస్తూ నేను ఆయనకు విజ్ఞప్తి చేసాను. ఆ తర్వాత నన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు,” అని దామిని గుర్తుచేసుకున్నారు. ఆమె 2020, ఆగస్టులో తిరిగి పోలీసు శాఖలో చేరారు.

ఈరోజు ఆమె మరఠ్వాడా ప్రాంతంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివాసముంటున్నారు. విశాలంగా పరచుకొన్న ప్రకృతిలో, కొన్ని పొలాలూ కొందరు మనుషులూ తప్ప, ఆమె ఇల్లు ఒక్కటే ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది.

PHOTO • Jyoti

తనకు గుర్తున్నంత వరకూ తానొక సీనియర్ ప్రభుత్వ అధికారిని కావాలని, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో సురక్షితమైన భవిష్యత్తును కలిగి ఉండాలని దామిని కోరుకున్నారు

"నేనిక్కడ భద్రంగా ఉన్నట్టు భావిస్తాను. ఎవరో కొంతమంది రైతులు తప్ప ఎవరూ ఈ వైపుకు రారు," రెండవ పెళ్ళి ద్వారా తనకు కలిగిన ఆరు నెలల పాపను ఉయ్యాల ఊపుతున్న ఆమె తెరపిన పడ్డట్టు ధ్వనిస్తూ చెప్పారు. "నేనెప్పుడూ ఆదుర్దాపడుతూనే ఉండేదాన్ని, కానీ ఈమె పుట్టినప్పటి నుండి మరింత రిలాక్స్ అయ్యాను." ఆమె భర్త ఆమెకు అండగా ఉంటారు. ఈ చిన్న పాప పుట్టినప్పటి నుండి తన తండ్రితో కూడా ఆమె సంబంధం మెరుగుపడింది.

తనపై అత్యాచారం జరిగిన పోలీస్ స్టేషన్‌లో ఆమె పనిచేయటం లేదు. అదే జిల్లాలోని మరో స్టేషన్‌లో ఇప్పుడామె హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె లైంగిక దాడికి గురైన వ్యక్తి అనే సంగతి ఆమె సహోద్యోగులిద్దరికి, దగ్గరి స్నేహితులకు మాత్రమే తెలుసు. ఆమె పని ప్రదేశంలో - ప్రస్తుతం, ఇంతకుముందు - ఆమె ఇప్పుడు ఎక్కడ నివాసముంటున్నారో ఎవరికీ తెలియదు. అయినా కూడా తాను సురక్షితంగా ఉన్నట్టు ఆమెకు అనిపించదు.

"నేను బయటకు వెళ్ళినప్పుడు, యూనిఫామ్‌లో లేనప్పుడు నా ముఖాన్ని వస్త్రంతో కప్పుకుంటాను. ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళను. నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటాను. వాళ్ళెవరూ నా ఇంటికి రాకూడదు," అంటారు దామిని.

ఇదేమీ ఊహించుకుంటోన్న ముప్పు కాదు.

నిందితుడు కర్మచారి తరచూ తన కొత్త కార్యాలయానికి, లేదా పోలీసు చెక్‌పోస్టులకు వచ్చి తనను కొట్టేవాడని దామిని ఆరోపించారు. "ఒకసారి, జిల్లా కోర్టులో నా కేసు విచారణ జరుగుతున్న రోజున, బస్టాప్‌లో అతను నన్ను కొట్టాడు." కొత్తగా తల్లి అయిన ఆమెకు ఇప్పుడున్న ప్రధాన ఆందోళన తన కుమార్తె భద్రత గురించి. "వాళ్ళు ఆమెను ఏదైనా చేస్తే?" తన బిడ్డను మరింత దగ్గరగా పట్టుకుంటూ ఆందోళనగా అడుగుతారామె.

ఈ రచయిత 2024 మే నెలలో దామినిని కలిశారు. మరాఠ్వాడా మండే ఎండలు ఒకవైపున, దాదాపు ఏడేళ్ళపాటు న్యాయం కోసం చేసిన సుదీర్ఘ పోరాటం, బయటకు మాట్లాడినందుకు హాని జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు; ఆమె సంకల్పం మరింత బలోపేతమైంది. “నేను నిందితులందరినీ కటకటాల వెనుక చూడాలనుకుంటున్నాను. మాలా లఢాయాచ్ ఆహే (నేను పోరాడాలనుకుంటున్నాను).”

ఈ కథనం, భారతదేశంలో లైంగిక, జెండర్-ఆధారిత హింస (SGBV) నుండి బయటపడిన వారి సంరక్షణ కోసం సామాజిక, సంస్థాగత, నిర్మాణాత్మక అడ్డంకులపై దృష్టి సారించే దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఇది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండియా అందించిన ప్రేరణలో భాగం.

గుర్తింపును కాపాడటం కోసం హింస నుంచి బయటపడిన వ్యక్తుల, వారి కుటుంబ సభ్యుల పేర్లను మార్చాం.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jyoti

جیوتی پیپلز آرکائیو آف رورل انڈیا کی ایک رپورٹر ہیں؛ وہ پہلے ’می مراٹھی‘ اور ’مہاراشٹر۱‘ جیسے نیوز چینلوں کے ساتھ کام کر چکی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jyoti
Editor : Pallavi Prasad

پلّوی پرساد ممبئی میں مقیم ایک آزاد صحافی، ینگ انڈیا فیلو اور لیڈی شری رام کالج سے گریجویٹ ہیں۔ وہ صنف، ثقافت اور صحت پر لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pallavi Prasad
Series Editor : Anubha Bhonsle

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli