ఆమె మాట్లాడుతున్నప్పుడు జబ్బుపడి పాలిపోయిన ముఖంపై నుదిటి మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒంగిపోయి, కుంటుతూ, కొన్ని వందల మీటర్ల దూరానికొకసారి ఆగిపోయి శ్వాసను భారంగా తీసుకుంటున్నారు. మృదువైన గాలి ఆమెను తాకగానే నెరసిన జుట్టు ముఖాన్ని కప్పేసింది.

ఇంద్రావతి జాదవ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలంటే నమ్మశక్యం కాదు.

మహారాష్ట్రలోని నాగపూర్ నగర శివారులలో ఉన్న మురికివాడలో నివసించే జాదవ్ క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి)తో బాధపడుతున్నారు. ఇది ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని నిరోధించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగజేయడంతో పాటు తరచుగా దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుంది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి. 'స్మోకర్స్ డిసీజ్'గా పిలిచే ఈ వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో 30 నుండి 40 శాతం వరకు పొగాకు లేదా ధూమపాన చరిత్ర కలిగిన రోగులే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.

జాదవ్ ఎన్నడూ సిగరెట్ ముట్టుకోలేదు, కానీ ఆమె ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా దెబ్బతింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పినదాని ప్రకారం చెక్క లేదా బొగ్గుతో మండే పొయ్యిమీద వంట చేయటం, గృహ వాయు కాలుష్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం ఏదీ ఆమెకు ఎప్పుడూ అందుబాటులో లేదు. "వంట చేయడానికి, నీళ్లు కాచటానికి మేం ఎప్పుడూ కట్టెల పొయ్యినీ లేదా బొగ్గుల పొయ్యినీ మాత్రమే వాడతాం. చులీవర్ జేవణ్ బన్‌వున్ మాఝీ ఫుప్పుసా నికామీ ఝాలీ ఆహెత్ (ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్లనే నా ఊపిరితిత్తులు పనికిరాకుండా పోయాయి)," అని వైద్యులు చెప్పిన దానినే తిరిగి చెప్పారామె. బయోమాస్‌తో (ఎండు కట్టెలు, పిడకల వంటివి) మండే పొయ్యి నుంచి వచ్చిన కాలుష్యం వల్ల ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి.

వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు అకాలంగా మరణిస్తున్నారని 2019 లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. పరిసరాల గాలి నాణ్యతలో గృహ వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన అంశమని తేల్చింది.

Indravati Jadhav has never had access to clean cooking fuel. She suffers from Chronic Obstructive Pulmonary Disease (COPD), a potentially fatal condition causing restricted airflow in the lungs, breathing difficulties and, most often, a chronic cough that may eventually damage the lungs
PHOTO • Parth M.N.

ఇంద్రావతి జాదవ్‌కు ఎన్నడూ శుభ్రమైన వంట ఇంధనం అందుబాటులో లేదు. ఆమె క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి)తో బాధపడుతున్నారు. ఇది ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని నిరోధించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగజేయడంతో పాటు తరచుగా దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుంది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి

చిఖలీ మురికివాడలోని పాంగుల్ మొహల్లాలో తన ఒంటి గది గుడిసె బయట ప్లాస్టిక్ కుర్చీపై అలసిపోయి కూర్చొనివున్న జాదవ్, తన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు.

ఆమె ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆమెకు శస్త్ర చికిత్స అవసరం, కానీ అది ప్రమాదకరం. ఆమె భర్త తరచూ మద్యం మత్తులో ఉండి 10-15 రోజులకు ఒకసారి మాత్రమే ఇంటికి వస్తుంటాడు.

ఆమెకు తన పిల్లలైన 13 ఏళ్ళ కార్తీక్, 12 ఏళ్ళ అనూ గురించే ఆందోళన ఎక్కువ. "నా భర్త ఏం చేస్తుంటాడో, ఇక్కడ లేనప్పుడు ఏం తింటాడో, ఎక్కడ పడుకుంటాడో అనే విషయాలు నాకు ఏమాత్రం తెలియవు," దీర్ఘంగా ఊపిరి పీల్చుకొంటూ చెప్పారామె. ఆమె అలా ఊపిరి తీసుకోవటం ఒక భారమైన నిట్టూర్పులా అనిపిస్తోంది. "నా పిల్లలు బడికి వెళుతున్నారా లేదా అని తెలుసుకునే శక్తి నాకు లేదు. నాకు ఏదైనా జరిగితే, నా పిల్లలు ఒక విధంగా అనాథలుగా మారతారు. అందుకే మేం ఆపరేషన్ ఇప్పుడే వద్దనుకున్నాం."

జాదవ్ చెత్తకుప్పలలో వ్యర్థాలను వేరుచేసి అందులో నుండి మరోసారి ఉపయోగించుకోగల వస్తువులను రీసైక్లింగ్ చేయడం కొరకు సేకరించేవారు. అలా సేకరించిన పదార్థాలను అమ్మడం వలన ఆమెకు నెలకు రూ. 2,500 వరకూ ఆదాయం లభించేది. ఒక సంవత్సరం క్రితం ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఎంతో కష్టపడి సంపాదించే ఆ కొద్దిపాటి ఆదాయం కూడా ఆమెకు లేకుండాపోయింది.

"ఒక నిండు సిలిండర్ కొనే ఖర్చు కూడా నేను భరించలేనిది," అని ఆమె చెప్పారు. సాధారణంగా గృహ అవసరాలకు ఉపయోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ ప్రతి రీఫిల్ ధర రూ. 1,000గా ఉంది. "నా ఆదాయంలో సగం వంట గ్యాస్‌పై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటిని ఎలా నడపాలి?" అన్నది ఆమె ప్రశ్న.

Jadhav seated outside her home in Nagpur city's Chikhali slum.
PHOTO • Parth M.N.
The pollution from her biomass-burning stove has damaged her lungs
PHOTO • Parth M.N.

ఎడమ: నాగపూర్ నగరంలోని చిఖలీ మురికివాడలో తన ఇంటి బయట కూర్చునివున్న జాదవ్. కుడి: బయోమాస్‌ను (ఎండుకట్టెలు, పిడకల వంటివి) ఉపయోగించి మండించే కట్టెల పొయ్యి నుంచి వచ్చే కాలుష్యం ఆమె ఊపిరితిత్తులను దెబ్బతీసింది

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 2021 నివేదిక ప్రకారం, ఆర్థిక కారణాల వల్ల శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేని అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల జనాభా, ప్రపంచ జనాభాలో 60 శాతంగా ఉంది.

ఒక విధంగా చెప్పాలంటే ఆసియాలోని 150 కోట్ల మంది ప్రజలు బయోమాస్‌ను (ఎండుకట్టెలు, పిడకల వంటివి) మండించి వంటచేయటంతో వెలువడిన పొగవల్ల అధిక స్థాయిలో విషపూరిత కాలుష్యాలకు గురవుతున్నారు. ఇది వారిని సిఒపిడి, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, ఇంకా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారినపడేలా చేస్తోంది

*****

మధ్య భారతదేశంలోని నాగపూర్ నగరం వెలుపల ఉన్న చిఖలీ మురికివాడ, ఈ కొనసాగుతున్న విషాదానికి సూక్ష్మప్రపంచం. ఇక్కడ దాదాపు ప్రతి మహిళ కళ్ళ నుంచి నీరు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో పాటు దగ్గుతో కూడా బాధపడుతుంటారు.

గుడిసెలు, రేకుల షెడ్డులతో ఉన్న ఈ నివాసస్థలంలో దాదాపు ప్రతి ఇంట్లో తిరగేసిన సి-ఆకారంలోని ఇటుకల అమరిక ఉంటుంది. పొయ్యిలా ఉపయోగపడే దీంట్లో ఎండు గడ్డి లేదా చిన్న చిన్న ఎండు కొమ్మలు కుదురుగా పేర్చి ఉంటాయి.

అన్నింటికంటే కష్టమైన పని పొయ్యిని రగిలించటం. ఒక అగ్గిపుల్ల, కొద్దిగా కిరోసిన్‌తో ఆ పని అయిపోదు. సన్నని ఊదురు గొట్టంలోకి ఒక నిమిషమో, అంతకంటే ఎక్కువో సమయం పాటు మంట అంటుకొని అది కొనసాగేంతవరకు స్థిరంగా, బలంగా ఊదుతూ ఉండాలి. దీనంతటికీ ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు చాలా అవసరం.

జాదవ్ ఇకపై పొయ్యిని వెలిగించలేరు. ఎందుకంటే ఊదురుగొట్టంలోకి ఆమె బలంగా గాలిని ఊదలేరు. 80 కోట్లమంది పైగా పేద భారతీయులకు చేరే ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆమెకు కూడా ఉచిత ఆహార ధాన్యం అందుతుంది. అయితే ఆ పొయ్యి మీద వంట చెయ్యడానికి ఆమె పొరుగువారి సహాయాన్ని కోరాలి. "కొన్నిసార్లు నా సోదరులు వాళ్ళ ఇళ్ళల్లో వంటచేసి నా కోసం భోజనం తీసుకొస్తారు," అని ఆమె తెలిపారు.

Jadhav can no longer fire up her stove. To cook a meal she has to request a neighbour to help with the stove. 'Sometimes my brothers cook food at their house and bring it to me,' she says
PHOTO • Parth M.N.

జాదవ్ ఇకపై పొయ్యిని వెలిగించలేరు. తన పొయ్యి మీద వంట చెయ్యడానికి ఆమె పొరుగువారి సహాయాన్ని కోరాలి. ‘కొన్నిసార్లు నా సోదరులు వాళ్ళ ఇళ్ళల్లో వంటచేసి నా కోసం భోజనం తీసుకొస్తారు,’ అని ఆమె తెలిపారు

ఆసియాలోని 150 కోట్ల మంది ప్రజలు బయోమాస్‌ను (ఎండుకట్టెలు, పిడకల వంటివి) మండించి వంటచేయటంతో వెలువడిన పొగవల్ల అధిక స్థాయిలో విషపూరిత కాలుష్యాలకు గురవుతున్నారు. ఇది వారిని సిఒపిడి, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, ఇంకా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారినపడేలా చేస్తోంది

ఈ పరిస్థితుల్లో పొయ్యిని వెలిగించే ప్రక్రియ సిఒపిడి, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ప్రధానంగా దోహదపడుతుందని నాగపూర్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ సమీర్ అర్బత్ చెప్పారు. "ఊదురుగొట్టంలోంచి ఒకసారి గాలిని ఊదిన తరువాత తిరిగి ఊదే ముందు అసంకల్పితంగా పొగను పీల్చుకోవలసి వస్తుంది. గొట్టానికి మరో చివరన ఉన్న బొగ్గు మసి, నల్లటి కార్బన్ పదార్థాలను అసంకల్పితంగానే లోపలికి పీల్చుకుంటారు," అని ఆయన చెప్పారు.

2030 నాటికి సిఒపిడి ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు మూడవ ప్రధాన కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2004లో అంచనా వేసింది. ఈ వ్యాధి 2019లోనే ఆ మైలురాయిని చేరుకుంది.

“వాయు కాలుష్యం అనేది మనకు ఇప్పటికే ఉన్న ఒక మహావిపత్తు. గత 10 సంవత్సరాలలో మేం చూసిన సిఒపిడి రోగులలో సగంమంది ధూమపానం చేయనివారే,” అని డాక్టర్ అర్బత్ చెప్పారు. "నగరాల చుట్టుపక్కల ఉన్న మురికివాడలలో గృహ కాలుష్యం కారణంగా ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇక్కడ ఎక్కువగా గాలి, వెలుతురు చొరబడని ఇళ్ళల్లో కట్టెల పొయ్యి మీద వంటచేస్తారు. కుటుంబం కోసం వంట చేసేవారు ఎక్కువగా మహిళలే కాబట్టి వారే ఎక్కువగా ప్రభావితమవుతారు,” అని ఆయన తెలిపారు.

65 ఏళ్ళ శకుంతలా లోంఢే సరిగ్గా మాట్లాడలేరు. రోజుకు రెండు మూడు గంటలసేపు కట్టెల పొయ్యి దగ్గర వచ్చే పొగను పీల్చుకుంటూ ఉంటానని ఆమె చెప్పారు. "నేను రోజుకు రెండుసార్లు నాకోసం, నా మనవడి కోసం భోజనం వండాలి. స్నానానికి నీళ్లు కాచుకోవాలి. మాకు గ్యాస్ కనెక్షన్ లేదు," అని ఆమె తెలిపారు.

దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడిన లోంఢే కుమారుడు 15 ఏళ్ళ క్రితం చనిపోయాడు. ఒకరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆమె కోడలు మరింక తిరిగి రాలేదు.

లోంఢే మనవడైన 18 ఏళ్ళ సుమిత్ డ్రమ్ములు కడిగే పనిచేస్తూ వారానికి రూ. 1,800 సంపాదిస్తాడు. అయితే అతడు తన నానమ్మకి ఏమాత్రం డబ్బు ఇవ్వడు. "నాకు డబ్బు అవసరమైనప్పుడు వీధుల్లో అడుక్కుంటాను, కాబట్టి గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశమే లేదు," అని ఆమె చెప్పారు.

Shakuntala Londhe, 65, has a speech impairment. She spends two to three hours a day inhaling smoke generated by the stove
PHOTO • Parth M.N.

65 ఏళ్ల శకుంతలా లోంఢే మాట లోపంతో బాధపడుతున్నారు. రోజుకు రెండు మూడు గంటల పాటు కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగను పీల్చుకుంటూ గడుపుతారు

ఆమెకు సహాయంగా ఉండే ఇరుగుపొరుగువారు, చుట్టుపక్కల గ్రామాల నుండి తాము కొట్టుకువచ్చే కట్టెలలో కొంత భాగాన్ని ఆమెకు ఇస్తుంటారు. తలపై కట్టెలమోపు భారంతో వారు ప్రతిరోజూ గంటకు పైగా నడుస్తారు.

పొయ్యి వెలిగించిన ప్రతిసారీ లోంఢేకు తల తిరుగుతున్నట్లుగా, మగతగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ పూర్తి చికిత్సను చేయించుకోలేదు. “నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళి తాత్కాలికంగా మెరుగవ్వటానికి మాత్రలు తెచ్చుకుంటాను,” అని ఆమె చెప్పారు.

ఆగస్ట్ 2022లో పిల్లల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కోసం పోరాడుతున్న వారియర్ మామ్స్ అనే దేశవ్యాప్త(pan-India) తల్లుల సముదాయం; నాగపూర్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ అయిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్; నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ - ఈ మూడు సంస్థలు సంయుక్త సహకారంతో సర్వేనూ, ఆరోగ్య శిబిరాలనూ నిర్వహించాయి. చిఖలీలో వారు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కొలమానమైన పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్‌ను (ఒక్కసారి వేగంగా గాలి వదలడం ద్వారా ఊపిరితిత్తుల నుండి బలవంతంగా బయటకు పంపించే గాలి పరిమాణం - PEFR) పరిశీలించారు.

350 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను సూచిస్తుంది. చిఖలీలో పరీక్షించిన 41 మంది మహిళల్లో 34 మందికి 350 కంటే తక్కువ స్కోరు వచ్చింది. పదకొండు మందికి 200 కంటే తక్కువ స్కోరు వచ్చింది. ఇది ఊపిరితిత్తుల బలహీనతను సూచిస్తుంది.

లోంఢే స్కోరు (150) మామూలుగా ఉండవలసిన దానిలో సగం కంటే కూడా తక్కువగా ఉంది.

నాగపూర్ నగరవ్యాప్తంగా ఉన్న మురికివాడల్లోని 1,500 కుటుంబాలను సర్వే చేసినప్పుడు వారిలో 43 శాతంమంది కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారని తేలింది. చాలామంది ఇళ్ళల్లోని పిల్లలను పొగ బారిన పడకుండా రక్షించడానికి బహిరంగ ప్రదేశంలో వండుతున్నారు. అయితే అక్కడి గుడిసెలన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండటంతో పొయ్యిల నుండి వచ్చే వాయు కాలుష్యం మొత్తం మురికివాడలో వ్యాపిస్తుంది.

Londhe feels lightheaded and drowsy each time she fires up the stove, but has never sought sustained treatment. 'I go to the doctor and get pills to feel better temporarily,' she says.
PHOTO • Parth M.N.
Wood for the stove is sold here at the village shop
PHOTO • Parth M.N.

ప్రతిసారీ పొయ్యి వెలిగించినప్పుడల్లా లోంఢేకు తల తిరుగుతున్నట్లుగా, మగతగా అనిపిస్తుంది, కానీ ఆమె ఎన్నడూ పూర్తి చికిత్స చేయించుకోలేదు. 'నేను డాక్టర్ వద్దకు వెళ్ళి తాత్కాలికంగా మెరుగవ్వటానికి మాత్రలు తెచ్చుకుంటాను,' అని ఆమె చెప్పారు. కుడి: గ్రామంలోని ఈ దుకాణం వద్ద పొయ్యిలోకి అవసరమైన కట్టెలను అమ్ముతారు

దేశంలోని పేదలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులో లేకపోవడం వల్ల తలెత్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 మే నెలలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎమ్‌యువై)ని ప్రారంభించారు. దీని ద్వారా పేద కుటుంబాలకు ఎల్‌పిజి సిలిండర్ కనెక్షన్లను మంజూరుచేశారు. ఈ పథకం 8 కోట్ల ఇళ్ళకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, సెప్టెంబర్ 2019లో ఈ లక్ష్యాన్ని సాధించిందనీ ఈ ప్రాజెక్ట్ వెబ్‌సైట్ చెబుతోంది.

అయితే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) ప్రకారం దేశంలోని 41 శాతానికి పైగా జనాభాకు ఇప్పటికీ స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులో లేదని తేలింది.

ఈ సౌకర్యం ఉన్నవారు కూడా ఎల్‌పిజి ఇంధనాన్ని ఉపయోగించరు. 14.2 కిలోల సిలిండర్ ధర మహారాష్ట్రలో రూ. 1,100 ఉండగా, దాన్ని మరలా నింపడానికి (రీఫిల్) రూ. 1,120 అవుతుంది. మొత్తం 93.4 మిలియన్ల పిఎమ్‌యువై లబ్ధిదారులలో కొద్ది శాతంమంది మాత్రమే క్రమం తప్పకుండా రీఫిళ్ళను కొనుగోలు చేయగలరని విస్తృతంగా నివేదించబడింది.

చిఖలీలో ప్రభుత్వ పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్ పొందిన 55 ఏళ్ళ పార్వతి కాకడే తాను ఎందుకు గ్యాస్ ఇంధనాన్ని ఉపయోగించడంలేదో వివరిస్తూ, "నేను పూర్తిగా కట్టెల పొయ్యి ఉపయోగించడం మానేస్తే నాకు ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంది. అంత ఖర్చు నేను భరించలేను. కాబట్టి అతిథులు వచ్చినప్పుడు, లేదా భారీ వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్‌ను వాడటం ద్వారా, ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు దాని వాడకాన్ని పొడిగిస్తాను," అన్నారు.

వర్షాకాలంలో తేమగా ఉండే కట్టెలతో అగ్గి రాజేయడానికి ఊదురుగొట్టంలోంచి గాలిని ఎక్కువసేపు బలంగా ఊదవలసివస్తుంది. మంట అంటుకోగానే ఆమె మనవళ్ళు తమ కళ్ళు నులుముకుంటూ ఏడ్వడం మొదలుపెడతారు. కాకడేకి శ్వాసకోశ ఆరోగ్య సమస్యల ప్రమాదాల గురించి తెలుసు కానీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయురాలు.

Parvati Kakade, 55, got an LPG connection under the government scheme. "I stretch it out for six months or so by using it only when we have guests over or when it is raining heavily,' she says
PHOTO • Parth M.N.

55 ఏళ్ల పార్వతి కాకడే ప్రభుత్వ పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్‌ పొందారు. ‘అతిథులు వచ్చినప్పుడు లేదా భారీ వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ వాడి ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు దాని వాడకాన్ని పొడిగిస్తాను,’ అని ఆమె చెప్పారు

“దాని గురించి నేనేమీ చేయలేను. మేం కనీస అవసరాలను కూడా తీర్చుకునే స్తోమత లేనివాళ్ళం," అని కాకడే చెప్పారు.

కాకడే అల్లుడైన 35 ఏళ్ళ బలిరామ్ మాత్రమే వారి కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు. వ్యర్థాలను సేకరించే అతను నెలకు రూ. 2,500 సంపాదిస్తారు. వారు ఇప్పటికీ ప్రధానంగా కట్టెలతోనే వంట చేసుకుంటారు. దానివల్ల ఉబ్బసం, బలహీనమైన ఊపిరితిత్తులు, క్షీణించిన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూనే ఉన్నారు.

"దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఏదైనా కండరాల బలహీనత, కండరాల క్షీణతకు కారణమవుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది," అంటారు డాక్టర్ అర్బత్. "రోగులు కుంచించుకుపోతారు. శ్వాస తీసుకోవడంలో ఉండే ఇబ్బందుల కారణంగా వారు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. అది వారిలో కుంగుబాటును కలిగించి, తమపై తాము నమ్మకాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది."

అర్బత్ వ్యాఖ్యలు జాదవ్‌ ఇప్పటి పరిస్థితిని సరిగ్గా వివరిస్తాయి.

మాట్లాడేటప్పుడు ఆమె గొంతు స్థిరంగా లేదు. ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నారు. ఆమె సోదరులు వారి భార్యలతో కలిసి పొరుగు రాష్ట్రంలో జరుగుతోన్న ఒక పెళ్ళికి వెళ్ళారు. తనని చూసుకునే పనిని వారికి తప్పించడం కోసం ఆమె ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. "ఎవరూ నాతో సూటిగా మాటల్లో చెప్పలేదు, కానీ నాలాంటి వారికోసం ఎవరైనా టిక్కెట్టు డబ్బులు ఎందుకు దండగ చేసుకుంటారు?" అని ఆమె వేదనతో కూడిన చిరునవ్వుతో అడుగుతారు. "నేను ఎందుకూ పనికిరాను."

ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి అందే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా పార్థ్ ఎం . ఎన్ . ప్రజారోగ్యం , పౌర హక్కులపై నివేదిస్తున్నారు . నివేదికలోని అంశాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ కు ఎలాంటి సంపాదకీయ నియంత్రణా లేదు

అనువాదం: నీరజ పార్థసారథి

Parth M.N.

پارتھ ایم این ۲۰۱۷ کے پاری فیلو اور ایک آزاد صحافی ہیں جو مختلف نیوز ویب سائٹس کے لیے رپورٹنگ کرتے ہیں۔ انہیں کرکٹ اور سفر کرنا پسند ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Parth M.N.
Editor : Kavitha Iyer

کویتا ایئر گزشتہ ۲۰ سالوں سے صحافت کر رہی ہیں۔ انہوں نے ’لینڈ اسکیپ آف لاس: دی اسٹوری آف این انڈین‘ نامی کتاب بھی لکھی ہے، جو ’ہارپر کولنس‘ پبلی کیشن سے سال ۲۰۲۱ میں شائع ہوئی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Kavitha Iyer
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Neeraja Parthasarathy