ముందుగా ప్రారంభం నుంచి మొదలెడదాం...
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతదేశ వైవిధ్యం గురించి 2014 నుండి వివరిస్తూ వస్తోన్న ఐతిహాసిక వృత్తాంతం భారతీయ భాషలతో ప్రారంభమవుతుంది - గ్రామీణ ప్రాంతాలలోని 833 మిలియన్ల మంది ప్రజలు 86 విభిన్న లిపులను ఉపయోగిస్తూ, 700కు పైగా ఉన్న వివిధ భాషలలో మాట్లాడుతున్నారు. లిపులు లేని భాషలతో సహా ఈ భాషలన్నీ, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రంగా నిలిచివున్నాయి. అవి లేకుండా ప్రజల ఆర్కైవ్‌ను స్పష్టంగా వర్ణించడం అటుంచి, అసలు ఊహించలేం. PARIలో ప్రచురితమయ్యే ప్రతి ఒక్క కథా ప్రయాణంలో భారతీయ భాషల్లోని అనువాదాలు కీలక పాత్రను పోషిస్తాయి
“ఈ ఆర్కైవ్ జర్నలిజం రంగంలో అగ్రగామిగా ఉంది; ఇది అనువాదాన్ని సామాజిక న్యాయం అనే దృష్టి కోణం నుంచి చూస్తుంది" అని స్మితా ఖటోర్ చెప్పారు. "గ్రామీణ భారతీయులలో అధికసంఖ్యాకులు ఇప్పటికీ ఆంగ్ల భాషకు కాంతి సంవత్సరాల దూరంలో నివసిస్తున్నప్పటికీ, జ్ఞానాన్ని పెంపొందించటం, వ్యాప్తిచేయడం అనేది కేవలం ఆంగ్లం చదువుకున్న, ఆంగ్లం మాట్లాడేవారికి మాత్రమే చెందిన విశేషమైన హక్కుగా ఉండకుండా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది.”
పదాల సాంస్కృతిక సందర్భం, పదబంధాల సముచితత్వం, ఇంకా మరిన్ని విషయాల గురించి మా భాషా సంపాదకుల, అనువాదకుల బృందం తరచుగా తమ ఆలోచనలను పంచుకోవడం, చర్చించడం, సమాలోచన చేయడం జరుగుతుంటుంది. అటువంటి మరొక రోజు…
స్మిత : ఒడిశాలోని కురుంపురి పంచాయతీ నుండి తెలంగాణకు వలసవచ్చి, అక్కడి ఇటుక బట్టీలలో పనిచేస్తున్నవారు తనను చూసి చాలా సంతోషించిన సంగతిని పురుషోత్తం ఠాకూర్ తన కథనం లో వివరించిన ఒక సన్నివేశం గుర్తుందా? వారిలో ఒక పెద్దమనిషి అతనితో ఇలా అన్నారు: “చాలాకాలం తర్వాత నేను ఒడియా మాట్లాడే ఒక వ్యక్తిని కలిశాను. నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది!”
మరొకటి, తనకు అర్థంకాని భాషలో మాట్లాడే ఉపాధ్యాయులు, స్నేహితులు ఉన్న కొత్త బడికి అలవాటు పడటం వలస కూలీల పిల్లవాడైన రఘుకు అతి పెద్ద సవాలుగా మారటం గురించి జ్యోతి శినోలి మహారాష్ట్ర నుంచి నివేదించిన క థనం . ఈ కథలోని రఘు తల్లి గాయత్రి, "కేవలం మూడు వారాలపాటు చెన్నైలోని బడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు మా అబ్బాయి ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఇంకెప్పుడూ బడికి వెళ్ళటం తనకు ఇష్టంలేదని వాడు చెప్పాడు. బడిలో అందరూ మాట్లాడేది తనకేమీ అర్థం కాకపోవటంతో, అందరూ తనతో కోపంగా మాట్లాడుతున్నట్టుగా వాడికి అనిపించింది."
గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు భాషాపరమైన గుర్తింపు - ప్రత్యేకించి వారు జీవనోపాధిని వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చినప్పుడు - చాలా కీలకమైనది.
శంకర్ : కానీ స్మితా, కొన్నిసార్లు పదాలు కూడా వలసపోతాయి. చేతితో చేసే పరాగ సంపర్కం గురించి సెందళిర్ నివేదించిన కథనం పై నేను పనిచేస్తున్నప్పుడు, చేతితో పూల పరాగ సంపర్కాన్ని చేసే మహిళలు తాము చేస్తున్న పనికి క్రాస్ లేదా క్రాసింగ్ అనే ఆంగ్ల పదాన్ని వాడుతున్నారని తెలుసుకున్నాను. అలా ఒక ఆంగ్ల పదం వారు మాట్లాడే భాషలో చేరిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి పదాలను మనం చాలావాటిని వినవచ్చు.
ఇది చాలా ఉత్తేజకరంగానూ, సవాలుగానూ ఉంటుంది. నా సొంత రాష్ట్రమైన కర్ణాటకకు సంబంధించి ఆంగ్లంలో నివేదించిన కొన్ని కథనాలను చదివినపుడు, అందులో వినిపించే శ్రామిక ప్రజల గొంతులు వారి పరిస్థితులకు తగినట్టుగా ఉన్నట్లు అనిపించేది కాదు. వారు ఒక పుస్తకంలో ఊహించిన పాత్రలలాగా అనిపించేవారు. వారిలో జీవం, వర్ణం లోపించేవి. అందువలన, నేను అనువాదం చేయడానికి కూర్చున్నప్పుడు, తరచుగా వ్యక్తులు మాట్లాడే విధానాన్ని తప్పనిసరిగా వింటాను. ఆ కథనం నిజంగా వారికి సంబంధించినదిగా ఉండేలా, ఒక నివేదించిన 'కళ'గా ఉండకుండా చూసుకుంటాను.
ప్రతిష్ఠ : ఈ ప్రక్రియ అన్నిసార్లూ సులభంగానూ సూటిగానూ ఉండదు. రిపోర్టర్లు తమ మాతృభాషలో రాసిన కథనాలతో నేను తరచుగా ఇబ్బందిపడుతుంటాను. గుజరాతీలోనో హిందీలోనో రాసిన కథనం చదివేందుకు చక్కగా ఉంటుంది. కానీ నేను దానిని ఎంతో విధేయతతో ఆంగ్లంలోకి అనువాదం చేసేటపుడు దాని నిర్వహణ, వాక్య నిర్మాణం, పదసరళి చాలా కల్పితమైనవిగా అనిపించవచ్చు. అటువంటి పరిస్థితులలో నా విధేయత ఎక్కడ ఉండాలా అని విస్మయం కలుగుతుంటుంది. కథనంలోని స్ఫూర్తికి విధేయంగా ఉండాలా, అనువాదంలో అట్టడుగు వర్గాల అనుభవాలను ఎత్తిపట్టేలా ఉండాలా, అసలు కథనం లిపికి, ఉపయోగించిన పదాలకు, నిర్మాణానికి కట్టుబడి ఉండాలా? భారతీయ భాషలో సవరించాలా, ఆంగ్ల భాషలోనా? చివరికది ఆలోచనలను మార్పిడి చేసుకోవటంగా, కొన్నిసార్లు ముందూ వెనకా వాదోపవాదాలుగా, మొత్తమ్మీద ఒక సుదీర్ఘ ప్రక్రియగా ముగుస్తుంది.
భాషల మధ్య అనుసంధానానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే మార్గాలుండటం వలన అనువాదం సాధ్యమవుతుంది. కానీ భాషకు సంబంధించిన చిత్రాలు, శబ్దాలు, పదసరళి, విజ్ఞాన భండారాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, ఆ భాష సాంస్కృతిక ప్రపంచం, దాని ప్రత్యేక లక్షణం - ఇవన్నీ నేను PARIతో కలిసి పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే తెలుసుకోగలిగాను. ఒకే కథనాన్ని రెండు భాషలలో రెండు పాఠాంతరాలుగా (వెర్షన్స్) మేం తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి వేర్వేరు కథనాలుగా కాకుండా, ఒక పాఠాంతరాన్ని నేను అనువాదం అని పిలవడానికి సంకోచించేటంత భిన్నంగా ఉంటాయి.
జాషువా : ప్రతిష్ఠా దీ, అనువాదం అంటే ఎప్పుడూ నవసృజన - అనుసృజన చేయటమే కదా? నేను తిరుగలి పాటలపై బంగ్లా భాషలో పనిచేస్తున్నప్పుడు నిజానికి నేను చేస్తున్నది అనుసృజన. ఒవీ లను (ద్విపదలు) నా మాతృభాషలోకి నవసృజన చేయటం నన్ను బలవంతంగా పదే పదే ఛందస్సునూ వాడుకభాషనూ నేర్చుకునేలా, విడిచిపెట్టేలా చేస్తోంది. కవిలా ఉండటాన్ని చాలా కష్టంగా భావిస్తుండేవాణ్ణి, కానీ కవిత్వాన్ని అనువదించడమే చాలా కష్టం!
భావవ్యక్తీకరణ, ఆలోచన, మనశ్చిత్రం (ఇమేజరీ), శబ్దసంపద, ప్రాస, లయ, రూపకాల సప్తకాన్ని అలాగే ఉంచుతూ ఎవరైనా మరాఠీ మౌఖిక సాహిత్యాన్ని ఎలా పునరుద్ధరించగలరు? గ్రామీణ గాయక-గేయరచయితల ప్రేరణతో కుల వ్యవస్థ, పితృస్వామ్యం, వర్గపోరాటాల తిరుగలిలో నలిగిపోతున్న దురదృష్టకరమైన గింజల వలె ప్రవహిస్తూ, ఒక స్త్రీలా ఆలోచించేలా నా కవిత్వాన్ని పురికొల్పుతున్నాను. ప్రతిసారీ తుసు, భాదు, కులో-ఝాడా గాన్ లేదా బ్రొతొకథ (వ్రతకథ) వంటి గ్రామీణ బెంగాల్‌లోని స్త్రీ సంగీత-కవితా మౌఖిక సంప్రదాయాల సొంత వర్ణపటలంలో నేను పర్యవసానాలను వెతుకుతాను.
ఇది ఒకే సమయంలో నిరాశ పుట్టించేదీ, అబ్బురపరచేదీ కూడా.
మేధ : మరింత సవాలుగా ఉండేదేమిటో నేనిప్పుడు మీకు చెప్తాను. అది హాస్యాన్ని అనువదించడం. సాయినాథ్ రచనలు! మావటివాడు, మృగోదరం చదివినప్పుడు నేను నవ్వు ఆపుకోలేకపోయాను, అదే సమయంలో తల గోక్కోడం కూడా ఆగలేదు. ఒక విధేయత గల ఏనుగైన పార్బతిపై కూర్చొనివున్న ముగ్గురు పురుషులు, ప్రేమగలిగిన ఆమె సంరక్షకుడు పర్భూతో కబుర్లు చెప్పుకునే మనోహరమైన చిత్రాన్ని ప్రతి పంక్తి, ప్రతి పదం, అద్భుతంగా సృష్టిస్తాయి. ఈ మృగానికి కడుపు నిండా ఆహారం ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
నేనప్పుడు వివరాలతో ఎటువంటి రాజీ పడకుండా, ఏనుగు సవారీ సాగుతోన్న లయనూ వేగాన్నీ అదే రీతిలో కొనసాగిస్తూ దాని సారాన్ని మరాఠీలోకి అనువాదం చేయాల్సివచ్చింది.
అనేక PARI కథనాల విషయంలో జరిగినట్టే ఇక్కడ కూడా శీర్షికతోనే సవాలు ఎదురయింది. చివరకు, ఈ దిగ్గజానికి ఆహారం ఇవ్వాలనే నిరంతర అవసరం, నన్ను ప్రతిరోజూ గ్రామం మొత్తం కలిసి పోషించాల్సి వచ్చిన ప్రసిద్ధ పాత్ర 'బకాసుర' వద్దకు వెళ్ళేలా చేసింది. కాబట్టి ఈ అనువాదానికి నేను మరాఠీలో ఈ శీర్షిక పెట్టాను: हत्ती दादा आणि बकासुराचं पोट (ఏనుగన్నయ్య, బకాసురుని పొట్ట)
బెల్లీ ఆఫ్ ది బీస్ట్, పండోరా బాక్స్, థియేటర్ ఆఫ్ ద ఆప్టిక్స్ వంటి పదబంధాలను అనువదించేటప్పుడు మన భాషా పాఠకులకు తెలిసిన పదాలను, భావనలను, పాత్రలను కనుక్కోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను.
ప్రతిష్ఠ: మరొక సంస్కృతికి చెందిన కవిత్వాన్ని అనువదించేటప్పుడు నేను అలాంటి స్వేచ్ఛను తీసుకోవడాన్ని గమనించాను. కానీ PARI కథనాలలో ఎవరైనా అలా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. ఎవరి కోసమని అనువదిస్తున్నామో ఆ పాఠకులే ఆ అనువాదం అర్థంలో కొంత భాగాన్ని నిర్వచిస్తారని నేను భావిస్తున్నాను.
'PARI అనువాదాలెన్నడూ భాషాసంబంధ కృత్యాలు కావు, లేదా ప్రతిదాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి పరిమితం చేయడంకాదు. అవి మనకు తెలిసిన ప్రపంచాలకు ఆవల ఉన్న సందర్భాలను చేరుకోవడం’ – పి. సాయినాథ్
కమల్జిత్ : పంజాబ్‌లో ఏం జరుగుతోందో చెప్తాను. అనువాదం చేసేటప్పుడు నా భాషా నియమాలను తిరగదిప్పాల్సిన సందర్భాలు ఉంటాయి! అలా చేయడం వల్ల నేను తరచూ విమర్శలకు గురవుతుంటాను.
ఉదాహరణకు, ఆంగ్ల కథనాలన్నింటిలో సామాజిక భేదాలతో సంబంధం లేకుండా వ్యక్తులందరికీ ఒకే విధమైన సర్వనామం ఉపయోగిస్తారు. అనేక ఇతర భారతీయ భాషలలో ఉన్నట్టే, పంజాబీలో కూడా వ్యక్తుల అంతస్తు, వయస్సు, వర్గం, సామాజిక స్థితి, లింగం, కులం- వీటన్నిటినిబట్టి సర్వనామాలు మారుతాయి. అందువలన, PARI కథను ఆంగ్లం నుండి పంజాబీకి అనువదిస్తున్నప్పుడు, నేను నా భాషకు చెందిన సామాజిక-భాషా నిబంధనలను అనుసరిస్తే, అది మన సైద్ధాంతిక విశ్వాసాలతో విబేధిస్తుంది.
అందుకే, అనువాద ప్రక్రియలో గురువు అయినా, రాజకీయవేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, పారిశుద్ధ్య కార్మికులైనా, పురుషుడైనా, ట్రాన్స్‌వుమన్ అయినా మనుషులందరినీ సమానంగా గౌరవించాలని మనం మొదటినుంచీ నిర్ణయం తీసుకున్నాం.
తరన్ తారన్లోని భూస్వాముల ఇళ్ళలో ఆవు పేడను ఎత్తిపోసే దళిత మహిళ మంజీత్ కౌర్ కథ ను మేం పంజాబీలో ప్రచురించినప్పుడు, “మీ భాషలో మంజీత్ కౌర్‌కి మీరు ఎందుకంత గౌరవం ఇస్తున్నారు? మంజీత్ కౌర్ ఇక్ మౙబీ సిఖ్ హన్. ఓహొ జిమిదారాఁ దే ఘరన్ దా గోహా చుక్దీ హన్? ” అని పాఠకుల నుండి నాకు సందేశాలు రావడం ప్రారంభించాయి. నేను భాషా నియమాలను పాటించకుండా ' హై ' స్థానంలో ' హన్ 'ని ఉపయోగించడంతో చాలామంది పాఠకులు నేను యంత్రానువాదం చేస్తున్నానని భావించారు.
దేవేశ్ : అర్రే! హిందీలో కూడా అట్టడుగు వర్గాల గురించి గౌరవంగా మాట్లాడే పదాలు లేవు. వారి గురించిన వాస్తవాలను అపహాస్యం చేయని పదాలను కనుక్కోవడం కష్టం. కానీ అనువాద ప్రక్రియ ఈ సమస్యను పరిష్కరించడానికి ఇతర భాషల నుండి స్ఫూర్తి పొంది, కొత్త పదాలను రూపొందించేలా చేస్తుంది.
ప్రకృతి, విజ్ఞానశాస్త్రం, జెండర్ లేదా లైంగికత, ఇంకా వైకల్యానికి సంబంధించిన సరైన పదాలను కనుక్కోవడంలో నాకు కూడా సమస్యలున్నాయి. హిందీ శబ్దకోశంలో కూడా తగినన్ని పదాలు లేవు. కొన్నిసార్లు భాషను గొప్పగా ప్రస్తుతించడంలో - స్త్రీలను దేవతలుగా వర్ణించడం లేదా వికలాంగులను ' దివ్యాంగులు 'గా పేర్కొనడం - ప్రాథమిక ప్రశ్నలు మాయమైపోతున్నాయి. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తుంటే ప్రజల పరిస్థితి గతం కంటే దారుణంగా ఉన్నట్టు కనిపిస్తుంది
కవితా అయ్యర్ కథనం , ‘ ట్యూబల్ లైగేషన్ చేయించుకోడానికి నేను ఒంటరిగా బయలుదేరాను ’ ను అనువదించేటప్పుడు, హిందీ భాషలో అపారమైన సాహిత్యం ఉన్నప్పటికీ, సాహిత్యేతర ప్రక్రియలలో ప్రజల బాధలను విశదంగా వర్ణించే పదాలు దాదాపు లేవని మనకు అర్థమవుతుంది. విజ్ఞానం, శాస్త్రం, వైద్యం, ఆరోగ్యం, సమాజానికి సంబంధించిన సమస్యలను వివరించే పదజాలం తగినంతగా అభివృద్ధిచెందలేదు.
స్వర్ణకాంత : భోజ్పురిది కూడా ఇదే కథ. ఇంకా ఘోరమని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ భాషలో రచయితల కంటే వక్తలే ఎక్కువమంది ఉన్నారు. విద్య నేర్చుకునే అధికారిక మాధ్యమం కాకపోవటంతో వైద్యం, ఇంజనీరింగ్, ఇంటర్నెట్, సోషల్ మీడియా మొదలైన కొత్త వృత్తులకు సంబంధించిన పదాలేవీ భోజ్‌పురిలో లేవు.
దేవేశ్, మీరు సూచించినట్లుగా ఎవరైనా కొత్త పదాలను రూపొందించవచ్చు, కానీ అది గందరగోళంగా ఉంటుంది. 'ట్రాన్స్‌జెండర్' వంటి పదాల కోసం మేం సంప్రదాయకంగా 'హిజ్రా ', ' చక్కా ', ' లౌండా ' వంటి పదాలను ఉపయోగిస్తాం. ఇవి ఆంగ్లంలో మనం ఉపయోగించే పదాలతో పోల్చి చూస్తే చాలా అభ్యంతరకరమైనవి. అదేవిధంగా మహిళా దినోత్సవం (Women's Day), మానసిక ఆరోగ్యం (mental health), చట్టాలు (Healthcare Act- ఆరోగ్య పరిరక్షణ చట్టం) లేదా విగ్రహాల పేర్లు, క్రీడా టోర్నమెంట్ల పేర్లు (Men's International World Cup - పురుషుల అంతర్జాతీయ ప్రపంచ కప్), మొదలైన పేర్లను అనువదించడం అసాధ్యం.
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ళ శివాని అనే మహాదళిత అమ్మాయి కులం, లింగ వివక్షలకు వ్యతిరేకంగా తన సొంత కుటుంబంతోనూ, బయటి ప్రపంచంతోనూ పోరాడుతోన్న కథ ను అనువదించడం నాకు గుర్తుకొస్తోంది. ఇలాంటి వివక్షాపూరిత పద్ధతుల గురించి నాకు చాలా దగ్గరగా తెలిసినప్పటికీ, నిజ జీవితం నుంచి వచ్చిన ఈ రకమైన కథలు ఎప్పుడూ చదవడానికి మనకు అందుబాటులో లేవని నాకు తెలుసు.
అనువాదాలు సముదాయపు మేధో, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని నేను నమ్ముతున్నాను.
నిర్మల్ : అలాగే ప్రామాణీకరించబడిన భాష లేకుండా పని చేస్తున్నప్పుడు కూడా. ఛత్తీస్‌గఢ్‌లోని ఐదు - ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య - భాగాలలో ఛత్తీస్‌గఢీ భాషకు రెండు డజన్లకు పైగా విభిన్న రూపాలున్నాయి. భాషకు ఒక ప్రామాణిక రూపం లేకపోవడం వలన ఛత్తీస్గఢీలోకి అనువదించటం ఒక సవాలుగా ఉంటోంది. ఒక నిర్దిష్ట పదాన్ని ఎంచుకోవడంలో ఒకోసారి చాలా గందరగోళపడుతుంటాను. నా జర్నలిస్ట్ స్నేహితుల, సంపాదకుల, రచయితల, ఉపాధ్యాయుల సహాయం కోరుతుంటాను, పుస్తకాలలో చూస్తాను.
సాయినాథ్ కథ, బహుమతులతో వచ్చే కాంట్రాక్టర్ల పట్ల జాగ్రత్త వహించండి పై పనిచేస్తున్నప్పుడు, సాధారణ వాడుకలో లేని అనేక ఛత్తీస్‌గఢీ పదాలు నాకు కనిపించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా ప్రాంతం జార్ఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఉరాఁవ్ ఆదివాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు మాట్లాడే ఛత్తీస్‌గఢీలో అడవులకు సంబంధించిన పదాలు సర్వసాధారణం. ఈ కథ అదే సముదాయానికి చెందిన ఒక మహిళపై కేంద్రీకరించినది కాబట్టి, నేను ఆ ఆదివాసులను కలిసేందుకు ప్రయత్నించాను. వారి ప్రాంతంలో వారు రోజువారీ జీవితంలో ఉపయోగించే పదాలను అనువాదంలో ఉపయోగించాను. అయితే, ఈ సముదాయపు ప్రజలు కురుఖ్లో మాట్లాడతారు.
ఒకప్పుడు దైనందిన జీవితంలో పాతుకుపోయిన సుకుడ్దుమ్, కౌవా, హాఁకా, హాఁకే, లాందా, ఫాందా, ఖేదా, అల్కర్హా వంటి పదాలు, ఈ సముదాయాలకు వారి నీరు, అడవులు, భూమి అందుబాటులో లేకుండాపోవటంతో, ఇప్పుడు వాడుకలో లేవని తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
'మన బ్రతుకుతెరువు, పర్యావరణం, ప్రజాస్వామ్యం మన భాషల భవిష్యత్తుతో చిక్కగా ముడిపడివున్నాయి. అవి తీసుకువచ్చే అపారమైన వైవిధ్యం ఎన్నడూ విలువైనదిగా అనిపించలేదు' – పి. సాయినాథ్
పంకజ్ : అనువాదకులు తాను అనువదిస్తున్న ప్రజల ప్రపంచంలోకి రావడం ఎంత ముఖ్యమో నేను గ్రహించాను. అరుష్ కథ పై పనిచేయడం, నాకు ఒక ట్రాన్స్‌జెండర్ పురుషుడు, ఒక స్త్రీ మధ్య ఉండే ప్రేమ తీవ్రత గురించి మాత్రమే కాక, వారి పోరాటంలోని సంక్లిష్టతను కూడా పరిచయం చేసింది. నేను అనువాదంలో సరైన పదాలను వాడటం కోసం ఆ పరిభాషల గురించి జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకున్నాను, ఉదాహరణకు, 'లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స'ని హైలైట్ చేస్తూ, బ్రాకెట్లలో 'రీఅసైన్మెంట్ సర్జరీ'ని ఉంచడం.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను సూచించేందుకు అవమానకరంగానూ, కించపరిచే విధంగానూ లేని కొన్ని పదాలను నేను కనుగొన్నాను: రూపాంతర్కామి పురుష్ లేదా రూపాంతర్కామి నారీ ; లింగస్థిరీకరణ అయివుంటే, వారిని రూపాంతరితో పురుష్ లేదా రూపాంతరితో నారీ అని పిలుస్తాం. అదొక అందమైన పదం. ఇంకా, లెస్బియన్ లేదా గే కోసం కూడా ఒక పదం ఉంది - సమకామి . కానీ ఇప్పటి వరకు క్వీర్ వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టే ప్రామాణిక పదం మావద్ద లేదు, కాబట్టి మేం ఆ పదాన్ని అదేవిధంగా మా భాష లిపిలో రాస్తున్నాం.
రాజాసంగీతన్ : పంకజ్, నేను కోవిడ్-19 ముమ్మరంగా ఉన్న సమయంలో సెక్స్ వర్కర్ల గురించి వచ్చిన మరొక కథ గురించి ఆలోచిస్తున్నాను. అది చదివి నేను చాలా కదిలిపోయాను. పేదల పట్ల ఒక వ్యవస్థీకృత అహంకారంతోనూ, ఉదాసీనతతోనూ ఉంటూ ఈ కొత్త వ్యాధిని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, సాధారణ భారతీయుల సమస్యలు అనేక రెట్లు పెరిగాయి. విశేషాధికారాలు కలిగినవారి జీవితం కూడా కష్టతరంగా మారిన ఈ సమయంలో, సమాజానికి వెలిగా ఉన్నవారిని గురించి పట్టించుకోవడానికి ఎవరున్నారు? ఆకాంక్ష నివేదించిన కామాఠీపుర కథనం మనల్ని ఇంతకు ముందెన్నడూ మన ఎరుకలోకి రాని ప్రజల బాధలకు ఎదురునిలిపింది.
వారు నివసించే, వారి కోసం క్లయింట్లు వచ్చే ఆ చిన్న చిన్న ఊపిరాడని గదులలోకి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బడులు మూసివేయడంతో, వారి చిన్నచిన్న పిల్లలను కూడా చేర్చవలసి వచ్చింది. ఈ కొత్త పరిస్థితి వలన కుటుంబంలోని పిల్లలకు ఏమవుతుంది? సెక్స్ వర్కర్‌గానూ, ఒక తల్లిగానూ ప్రియ తన స్వంత భావోద్వేగాలకూ, మనుగడ కోసం చేసే పోరాటానికీ మధ్య నలిగిపోతారు. ఆమె కుమారుడు విక్రమ్ తమ ఉనికిని చుట్టుముట్టిన చీకటి మధ్య తమ జీవితాలకు అర్థం తెలుసుకునేందుకు సతమతమవుతాడు.
కుటుంబం, ప్రేమ, ఆశ, ఆనందం, పోషణ - వీటి గురించిన ఆలోచనలు ఈ కథలో దిగ్భ్రాంతికరమైన రూపాలను తీసుకుంటాయి, కానీ ఆశ్చర్యకరంగా సామాజికంగా ఉండే అర్థాలనే నిలిపి ఉంచుతాయి. ఏమీ జరగదని తెలిసినా ఏదో జరుగుతుందని గట్టిగా ఆశపడే మానవులందరి అంతర్గత శోధనను అభినందించగలిగినప్పుడే నేను ఈ కథలను అనువదించగలిగాను.
సుధామయి : నేను అంగీకరించలేను. నేను వారి గురించిన కథనాలను అనువదించడం మొదలుపెట్టే ముందు వరకు నాకు LGBTQIA+ సముదాయాల గురించి అస్సలు ఏమీ తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే నేను వారన్నా, వారికి సంబంధించిన ఏ విషయమైనా చాలా భయపడేదాన్ని. ట్రాన్స్ సముదాయానికి చెందినవారిని రోడ్లపైనా, సిగ్నల్స్ దగ్గర చూసినప్పుడు, మా ఇళ్ళకు వచ్చినప్పుడు కూడా వారివైపు కళ్ళెత్తి చూసేందుకు కూడా భయమేసేది. వాళ్ళు ఏదో అసహజంగా ప్రవర్తిస్తారని అనుకునేదాన్ని.
ఆ కమ్యూనిటీకి సంబంధించిన కథలను అనువదించాల్సి వచ్చినప్పుడు నేను వారి గురించి తెలిసిన, ఆ పరిభాషకు న్యాయం చేయగలిగిన వ్యక్తుల కోసం వెతుక్కోవలసివచ్చేది. ఆ కథలను చదవడం, అర్థం చేసుకోవడం, ఆ తరువాత వాటిని పరిష్కరించటం వంటి ప్రక్రియల క్రమంలో నేను వారి గురించి తెలుసుకోగలిగాను, నా ట్రాన్స్‌ఫోబియా నుండి బయటపడ్డాను. ఇప్పుడు నేను వారిని ఎక్కడ, ఎప్పుడు చూసినా వారితో కొన్ని మాటలు, అది కూడా వారిపట్ల అభిమానంతో, మాట్లాడుతుంటాను.
ఒకరికున్న ప్రతికూల భావనలను వదిలించుకోవడానికీ, ఎదగడానికీ అనువాదం ఒక మార్గం అని నేనంటాను.
ప్రణతి : మేం అనువదించిన అనేక సాంస్కృతిక కథనాల గురించి నాకలా అనిపించింది. విభిన్న సాంస్కృతిక మూలాల నుండి వచ్చే కంటెంట్‌ను నిశితంగా చదవడం, జాగ్రత్తగా అనువదించడం ద్వారా వివిధ సాంస్కృతిక పద్ధతుల గురించి తెలుసుకోవడానికి అనువాదకులకు పుష్కలమైన అవకాశం ఉంది. అసలు భాషలో ఇచ్చిన కంటెంట్‌లోని సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం అత్యవసరం.
భారతదేశం వంటి పూర్వపు బ్రిటిష్ వలసలలో, ఆంగ్లం అనుసంధాన భాషగా మారింది. ఒక్కోసారి ప్రజల అసలు భాష తెలియనప్పుడు మనం ఆంగ్లంపైనే ఆధారపడి పనిచేస్తుంటాం. కానీ ప్రామాణికులైన అనువాదకులు, శ్రద్ధగా ఓపికగా వివిధ సాంస్కృతిక పద్ధతులను, చరిత్రలను, భాషలను నేర్చుకున్నప్పుడు మంచి ఫలితాలను అందించవచ్చు.
రాజీవ్ : నాకు ఎంత ఓపిక ఉన్నా, కొన్నిసార్లు నేను నా భాషలో సమానమైన పదాన్ని కనిపెట్టలేను, ప్రత్యేకించి కొన్ని నిర్దిష్ట వృత్తులకు సంబంధించిన కథను అనువాదం చేస్తున్నప్పుడు. ఆయా వృత్తులలో ఉపయోగించే పనిముట్లు, మొదలైనవాటన్నింటినీ సరైన పేర్లతో, కష్టతరమైన ఆ ప్రక్రియలను గురించి వివరంగా వివరించడం ఒక సవాలు. కశ్మీర్‌లోని నేతకారుల గురించి ఉఫక్ ఫాతిమా నివేదించిన కథ లో, చార్‌ఖానా, చష్మ్-ఎ-బుల్బుల్ వంటి నేత నమూనాల పేర్లను అనువదించడానికి నేను చాలా కష్టపడ్డాను. మలయాళంలో వాటికి సమానమైన పదాలు లేవు కాబట్టి నేను కొన్ని వివరణాత్మక పదబంధాలను ఉపయోగించడంతో ముగించాను. పట్టూ అనే పదం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కశ్మీర్లో, ఇది నేసిన ఉన్ని బట్ట అయితే, మలయాళంలో పట్టు అనేది ఒక సిల్క్ వస్త్రం.
కమర్ : ఉర్దూలో కూడా పదజాలం బలహీనమైన అంశం, ముఖ్యంగా PARIలో వాతావరణ మార్పు , మహిళల పునరుత్పత్తి హక్కుల పై వచ్చే కథనాలను అనువదించేటప్పుడు. హిందీ కథ కాస్త వేరేగా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత భాష; రాష్ట్ర ప్రభుత్వ మద్దతు కూడా దీనికి ఉంటుంది. వారికి ఈ భాషకే అంకితమైన సంస్థలు ఉన్నాయి. అందుకే ఉర్దూలా కాకుండా కొత్త పరిభాషలు త్వరగా ఈ భాషలోకి వస్తాయి. మేం అనువాదాలలో అనేక చోట్ల ఆంగ్ల పదాలను ఉపయోగించడాన్ని కొనసాగిస్తున్నాం.
ఉర్దూ ఒకప్పుడు ప్రముఖమైన భాష. ఢిల్లీ కళాశాల, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఉర్దూ గ్రంథాల అనువాదాలకు ప్రసిద్ధి చెందినవని చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ అధికారులకు భారతీయ భాషలలో శిక్షణ ఇవ్వడం, అనువాదాలను చేయించడం కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాల ప్రాథమిక ఉద్దేశ్యంగా ఉండేది. నేడు ఆ ప్రదేశాలన్నీ జీవాన్ని కోల్పోయాయి. ఉర్దూ, హిందీ భాషల మధ్య 1947 నుండి కొనసాగిన పోరాటాన్ని, ఉర్దూపై దృష్టి పూర్తిగా కనుమరుగవడాన్ని మనందరం చూశాం.
కమల్జిత్ : దేశ విభజన భాషా విభజనకు దారితీసిందని మీరు అనుకుంటున్నారా? ప్రజలు విడిపోయినప్పటికీ, భాషలు విడిపోగలవని నేను అనుకోవటంలేదు.
కమర్ : ఒకప్పుడు ఉర్దూ దేశమంతటికీ చెందిన భాష. అది దక్షిణాదిన కూడా ఉండేది. వారు దానిని దఖానీ (లేదా దక్కనీ) ఉర్దూ అని పిలిచేవారు. ఆ భాషలో రాసే కవులు ఉండేవారు, వారి రచనలు క్లాసికల్ ఉర్దూ సిలబస్‌లో భాగంగా ఉండేవి. కానీ ముస్లిమ్‌ల పాలన ముగిసిపోవడంతో అవన్నీ కూడా ముగిశాయి. ఆధునిక భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్‌లతో సహా హిందీ బెల్ట్ అని మనం పిలిచే ప్రదేశాలలో మాత్రమే ఉర్దూ జీవించి ఉంది.
ఇక్కడి ప్రజలకు పాఠశాలల్లో ఉర్దూను బోధించేవారు. అందుకు వారు హిందువులా, ముస్లిమ్లా అనేదానితో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. నాకు తెలిసిన హిందువులు, మీడియాలో పనిచేసే సీనియర్లు, తమకు ఉర్దూ తెలుసునని చెప్పేవారు. వారు తమ చిన్నతనంలో, పాఠశాలలో ఆ భాషను చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఉర్దూను నేర్పడం లేదు. ఏదైనా భాషను మీరు బోధించకుంటే ఆ భాష మనుగడ ఎలా సాగించగలదు?
ఇంతకుముందు ఉర్దూ చదివి ఉద్యోగం సాధించగలిగారు, కానీ ఇప్పుడలా కాదు. ఇప్పటికీ కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఉర్దూ మీడియా కోసం రాసేవాళ్ళు ఉండేవారు. కానీ 2014 తర్వాత ఆ వార్తాపత్రికలు కూడా నిధుల కొరత వలన మూతబడిపోయాయి. ప్రజలు ఈ భాషలో మాట్లాడతారు, కానీ ఈ భాషను చదవగలిగే, రాయగలిగే వారి సంఖ్య మాత్రం నాటకీయంగా పడిపోయింది.
దేవేశ్ : ఇది భాష, రాజకీయాల వాస్తవమైన విషాదకర గాథ కమర్ దా. అలాగయితే ఈరోజు మీరిక్కడ అనువదిస్తోన్న కథలను ఎవరు చదువుతున్నారు? మీ పనిలో మీరు ఏ అర్థాన్ని చూస్తున్నారు?
కమర్ : ఓహ్, నేను ఇందులో చేరిన వెంటనే జరిగిన PARI వార్షిక సమావేశానికి మొదటిసారి వచ్చానని చెప్పాను. ఇక్కడి ప్రజలు నా భాషను కాపాడుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని నాకు అర్థమయింది. అందుకే ఈ రోజున కూడా నేను PARIతో ఉన్నాను. ఇది కేవలం ఉర్దూ ఒక్కదాని గురించి మాత్రమే కాదు, అంతరించిపోతున్న ప్రతి భాషను అంతరించిపోకుండా, రద్దుకాకుండా కాపాడేందుకు ఆర్కైవ్ కట్టుబడి ఉంది.
ఈ కథనాన్ని PARI-భాషా బృందమైన దేవేశ్ (హిందీ), జాషువా బోధినేత్ర (బంగ్లా), కమల్జిత్ కౌర్ (పంజాబీ), మేధా కాళే (మరాఠీ), మొహమ్మద్ కమర్ తబ్రేజ్ (ఉర్దూ), నిర్మల్ కుమార్ సాహు (ఛత్తీస్‌గఢీ), పంకజ్ దాస్ (అస్సామీ), ప్రణతి పరీదా (ఒడియా), ప్రతిష్ఠా పాండ్య (గుజరాతీ), రాజాసంగీతన్ (తమిళం), రాజీవ్ చెలనాట్ (మలయాళం), స్మితా ఖటోర్ (బంగ్లా), స్వర్ణకాంత (భోజ్‌పురి), శంకర్ ఎన్. కెంచనూరు (కన్నడ), సుధామయి సత్తెనపల్లి (తెలుగు) రాశారు. స్మితా ఖటోర్, మేధా కాళే, జాషువా బోధినేత్రల సంపాదకీయ మద్దతుతో ప్రతిష్ఠా పాండ్య ఈ కథనానికి సంపాదకత్వం వహించారు. ఫోటో ఎడిటింగ్: బినయ్‌ఫర్ భరూచా.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి