లూకోర్ కొథా నుహునివా
బతొత్ నాంగల్ నససివా

[జనం మాట వినొద్దు
బాట పక్కన నాగలికి సానపెట్టొద్దు]

అస్సామీ భాషలోని ఈ లోకోక్తి ఎవరి పనిపై వారు దృష్టి పెట్టడం ప్రాముఖ్యాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది.

ఈ లోకోక్తి తనకు, వ్యవసాయం కోసం ఖచ్చితత్వంతో సాధనాలను తయారుచేసే తన పనికి వర్తిస్తుందని కొయ్య పని చేసే హనీఫ్ అలీ అన్నారు. ఈయన రైతుల కోసం నాగళ్ళను తయారుచేస్తారు. సెంట్రల్ అస్సామ్‌లోని దరంగ్ జిల్లాలో అతని చుట్టుపక్కల ఉండే వ్యవసాయ భూమిలోని మూడింట రెండు వంతుల భూమిలో వ్యవసాయ పనుల కోసం ఈ అనుభవజ్ఞుడైన హస్తకళాకారుడు తయారుచేసిన అనేక ఉపకరణాలను ఉపయోగిస్తారు.

"నేను నాంగల్ [నాగలి], చోంగో [గుంటుక], జువాల్ [కాడి], హాత్ నైంగ్లే [చేతి గొర్రు], నైంగ్లే [గొర్రు], ధేహి [కాలితో తొక్కే దంపుడు యంత్రం], ఇటామగుర్ [కొయ్యసుత్తి], హార్‌పాత్ [ఎండబెట్టిన వరిని కుప్పగా చేయడానికి ఉపయోగించే వెదురుబొంగుకు జోడించిన అర్ధ వృత్తాకారపు కొయ్య పనిముట్టు] వంటి అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను తయారుచేస్తాను," అంటూ చెప్పుకొచ్చారాయన.

స్థానిక బెంగాలీ మాండలికంలో కాఠోల్ అనీ, అస్సామీలో కొఠాల్ అని పిలిచే పనసచెట్టు కలపను ఆయన ఇష్టపడతారు. ఈ చెట్టు కలపను తలుపులు, కిటికీలు, మంచాల తయారీలో ఉపయోగిస్తారు. తాను కొనుగోలు చేసిన కలపను వృథా చేయలేననీ, ప్రతి దుంగ నుండి వీలైనన్ని ఎక్కువ పనిముట్లను తయారుచేస్తానని హనీఫ్ చెప్పారు.

నాగళ్ళు ఖచ్చితత్వంతో కూడిన పనిముట్లు. " చెక్కపై గీసిన గుర్తులను నేను ఒక్క అంగుళం కూడా తప్పనివ్వకూడదు, అలా జరిగిందంటే నేనొక పనిముట్టును కోల్పోయినట్టే," అన్నారతను. అలా జరిగితే వచ్చే నష్టం రూ. 250-300 వరకూ ఉంటుందని ఆయన అంచనా.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: తాను తయారుచేసిన ఒక కాడిని పట్టుకొనివున్న నాగళ్ళ శిల్పి హనీఫ్ అలీ. నాగలికి కట్టే రెండు ఎద్దులు లేదా దున్నపోతుల అమరిక సరిగ్గా ఉండేందుకు వాటి మూపురాలపై ఈ కాడిని ఉంచుతారు. కుడి: నాగలి భాగాలను సూచిస్తోన్న చిత్రపటం

అతని ఖాతాదారులు ఎక్కువగా జిల్లాలోని సన్నకారు రైతులు, ఇళ్ళల్లో ఎద్దులున్నవారు. వాళ్ళు తమ భూమిలో బహుళ పంటలు పండిస్తారు. కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, నూల్-కోల్ , బటానీ, మిరపకాయలు, సొరకాయ, గుమ్మడికాయ, క్యారెట్లు, కాకరకాయలు, టమోటాలు, దోసకాయలు వంటి కూరగాయలతో పాటు ఆవాలు, వరి కూడా పండిస్తారు.

"ఎవరికైనా నాగలి అవసరమైనప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తారు," అరవైల వయసులో ఉన్న అనుభవజ్ఞుడైన ఈ శిల్పి అన్నారు. "15-10 ఏళ్ళ క్రితం వరకూ ఈ ప్రాంతంలో రెండే ట్రాక్టర్లు ఉండేవి, భూమిని దున్నటానికి ప్రజలు నాగళ్ళపై ఆధారపడేవారు," ఆయన PARIతో చెప్పారు.

ఇప్పటికీ అప్పుడప్పుడూ కొయ్య నాగలిని వాడే కొద్దిమందిలో అరవయ్యేళ్ళు దాటిన ముకద్దాస్ అలీ ఒకరు. "నాకు అవసరమైనప్పుడల్లా నా నాగలికి మరమ్మత్తులు చేయించుకోవడానికి హనీఫ్ దగ్గరకు వస్తుంటాను. ఇతనొక్కడే పాడైనవాటిని చక్కగా సరిచేసి ఇచ్చేది. తన తండ్రికిలాగే ఇతను కూడా నాగళ్ళను పరిపూర్ణంగా తయారుచేస్తాడు."

అయితే, మరొక నాగలిని తాను కొనగలనో లేనో చెప్పలేనని అంటారు అలీ. "ఎద్దులు చాలా ఖరీదైపోయాయి, వ్యవసాయ కూలీలు దొరకటం కూడా అంత సులభం కాదు. మరొకటేమిటంటే ట్రాక్టర్ కంటే నాగలితో దున్నటానికి ఎక్కువ సమయం పడుతుంది," పనిభారాన్ని తగ్గించుకోవటం కోసం రైతులు ట్రాక్టర్లకూ, విద్యుత్ నాగళ్ళకూ ఎందుకు వెళ్ళాల్సివస్తుందో వివరించారాయన.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: తన వెదురు ఇంటి బయట నాగలి విడిభాగాల పక్కన కూర్చొనివున్న హనీఫ్ అలీ. అందులోని ఒక కొయ్య ముక్కతో ఆయన ఒక చేతి గొర్రును తయారుచేస్తారు. కుడి: కుడీ లేదా నాగలి పిడిని పట్టుకొని ఉన్న హనీఫ్. దున్నేవారికి నాగలి ముఖ్యభాగం సులభంగా పట్టుకునేంత పొడవుగా లేనప్పుడు కుడీని ఆ భాగానికి జతచేస్తారు

*****

హనీఫ్ రెండవతరానికి చెందిన శిల్పి; ఆయన చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఈ పనిని నేర్చుకున్నారు. "నేను కొద్దిరోజులు మాత్రమే బడికి వెళ్ళాను. నా తల్లికిగానీ, తండ్రికిగానీ చదువు పట్ల ఆసక్తి లేదు, నాక్కూడా బడికి వెళ్ళాలనిపించేది కాదు," అన్నారతను.

అందరి గౌరవాన్ని పొందే నైపుణ్య శిల్పి అయిన తన తండ్రి హోలు షేక్‌కి చాలా చిన్నతనం నుండే ఆయన పనిలో సాయం చేయటం మొదలుపెట్టారు. " బాబాయే సారా బొస్తీర్ జొన్నే నాంగల్ బనైతో. నాంగల్ బనాబర్ బా ఠీక్ కొర్బార్ జొన్నే ఆంగొర్ బరిత్ ఐతో షొబ్ ఖేతియోక్ [మా నాన్న ఊరివాళ్ళందరి కోసం నాగళ్ళు తయారుచేసేవాడు. నాగళ్ళు చేయించుకోవడానికో, వాటికి మరమ్మత్తులు చేయించుకోవడానికో ప్రతివారూ మా ఇంటికే వచ్చేవారు]."

హనీఫ్ తన తండ్రికి సాయం చేయడం మొదలుపెట్టాక, ఆయన తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగలిని తయారుచేయడానికి అవసరమైన ఖచ్చితమైన గుర్తులను కొయ్యపై వేసేవారు. “మీరు ఖచ్చితంగా ఏ ప్రదేశంలో రంధ్రాలు చేయాలో తెలుసుకోవాలి. దూలం సరైన కోణంలో మురికాఠ్ (నాగలి దుంప)కు జోడించబడిందో లేదో నిర్ధారించుకోవాలి,” పనిచేస్తోన్న కొయ్యముక్కపై తన కుడి చేతిని నడిపిస్తూ చెప్పారు హనీఫ్.

నాగలి మరీ వంకరలుగా ఉంటే, ఎవరూ దానిని కొనరని అతను వివరించారు. ఎందుకంటే అప్పుడు మట్టి నాగలి కర్రులోకి ప్రవేశించి, ఒక ఖాళీని సృష్టించి, పనిని నెమ్మదిగా సాగేలా చేస్తుంది.

“ఎక్కడ గుర్తు పెట్టాలో నాకు తెలుసు. నువ్వింకేమీ అందోళన పడవద్దు," అని తన తండ్రికి చెప్పడానికి తగినంత నమ్మకాన్ని సంపాదించడానికి హనీఫ్‌కు ఒక సంవత్సరం పట్టింది.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: అనుభవజ్ఞుడైన ఈ నాగలి శిల్పి తలుపులు, కిటికీలు, మంచాలను తయారుచేయడానికి కూడా ఉపయోగించే పనస చెట్టు కలపను ఇష్టపడతారు. తాను కొనే కలపను వృథా చేయగల స్తోమత తనకు లేకపోవటంతో, ప్రతి దుంగ నుంచి వీలైనన్ని ఎక్కువ పనిముట్లను తయారుచేస్తానని హనీఫ్ చెప్పారు. కుడి: దుంగపై కోత పెట్టడానికి ఎక్కడెక్కడ ఖచ్చితమైన గుర్తులు పెట్టాలో ఆయన సూచిస్తారు

'హోలూ మీస్త్రీ 'గా ప్రసిద్ధి చెందిన తన తండ్రితో పాటు వెళ్ళటం ప్రారంభించారాయన. ఆయన తండ్రి దుకాణదారుడిగానూ, హుయ్‌తెర్‌ గానూ - ప్రత్యేకించి నాగలి తయారీ వడ్రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి - రెండు పాత్రలూ నిర్వహిస్తారు. వాళ్ళు తమ నాగళ్ళను భుజాలపై ఒక కర్రకు వేలాడదీసుకుని ఇంటింటికీ ఎలా వెళ్ళేవారో ఆయన గుర్తుచేసుకున్నారు.

వయసు మళ్ళుతోన్న తన తండ్రితో కలిసి కొన్నేళ్ళపాటు పనిచేసిన తరువాత, ఆరుగురున్న కుటుంబంలో ఏకైక కుమారుడైన తనపై, తన అక్కచెల్లెళ్ళ వివాహ బాధ్యత పడిందని హనీఫ్ చెప్పారు. "జనాలందరికీ ఇప్పటికే మా ఇల్లు తెలుసు. మా నాన్న అన్ని ఆర్డర్‌లను పూర్తిచేయలేకపోతుండటంతో, నేను నాగళ్ళను తయారుచేయడం ప్రారంభించాను."

ఇదంతా నాలుగు దశాబ్దాల క్రితంనాటి సంగతి. ప్రస్తుతం హనీఫ్ ఒంటరిగా, తనవంటి అనేకమంది బెంగాలీ మూలాలున్న ముస్లిములు నివాసముండే నంబర్ 3 బారువాఝార్ గ్రామంలో నివాసముంటున్నారు. ఆ ఒంటిగది ఇల్లే ఆయన నివాసమూ, కార్యశాల కూడా. ఈ ప్రాంతం దల్‌గాఁవ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వెదురు పైకప్పుతో ఉండే అతని ఒంటి గది ఇంట్లో అక్కడక్కడా అమర్చిన ఒక చిన్న మంచం, కొన్ని వంట పాత్రలు - అన్నం వండడానికి ఒక కుండ, ఒక చట్టి, రెండు స్టీల్ పళ్ళాలు, ఒక గ్లాసు - ఉన్నాయి.

"మా నాన్న, నేను చేసే పని స్థానిక ప్రజలకు చాలా అవసరమైననది," తన పొరుగున ఉన్న అనేకమంది రైతుల గురించి మాట్లాడుతూ చెప్పారాయన. తనలాగే ఒంటిగది ఇళ్ళలో నివసించే ఐదు కుటుంబాలు పంచుకునే ప్రాంగణంలో కూర్చొనివున్నారాయన. మిగిలిన ఇళ్ళు అతని సోదరికి, అతని చిన్న కొడుకుకు, అతని మేనల్లుళ్ళకు చెందినవి. ఆయన సోదరి రైతుల పొలాలలో కూలీ పనులు, వారి ఇళ్ళల్లో ఇంటిపనులు చేస్తుంటారు; ఆయన మేనల్లుళ్ళు తరచుగా పని కోసం దక్షిణాది రాష్ట్రాలకు వలసపోతుంటారు.

హనీఫ్‌కు తొమ్మిదిమంది పిల్లలున్నారు, కానీ వారిలో ఎవరూ ఇప్పుడు గిరాకీ తగ్గిపోతోన్న ఈ పనిలో లేరు. "సంప్రదాయ నాగలి ఎలా ఉంటుందో ఈ యువ తరం గుర్తించలేదు," అని ముకద్దాస్ అలీ మేనల్లుడు అఫాజ్ ఉద్దీన్ చెప్పారు. 48 ఏళ్ళ ఈ రైతు, నీటిపారుదల సౌకర్యం లేని తన ఆరు బీఘాల భూమిలో 15 ఏళ్ళ క్రితమే నాగలిని ఉపయోగించడం మానేశారు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

హనీఫ్ దరంగ్ జిల్లా, దల్‌గాఁవ్ నియోజకవర్గంలోని నంబర్ 3 బారువాఝార్ గ్రామంలో ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ ప్రాంతం ఆయన వంటి అనేకమంది బెంగాలీ మూలాలున్న ముస్లిములకు ఆవాసం

*****

“నేను ఇళ్ళ మధ్య నుంచి సైకిల్‌ తొక్కుతూ తిరిగేటప్పుడు, కోణాలుగా వంపు తిరిగిన కొమ్మలతో ఉన్న పెద్ద చెట్లు కనిపిస్తే, ఆ చెట్టును నరికివేసేటపుడు నాకు తెలియజేయమని ఆ ఇంటి యజమానిని అడుగుతాను. కోణాలుగా వంపుతిరిగి, దృఢంగా ఉండే చెట్టు కొమ్మలతో మంచి నాగలి తయారవుతుందని నేను వారికి చెప్తుంటాను,” అంటూ ఆయన స్థానిక ప్రజలతో తనకున్న పరిచయాన్ని గురించి వెల్లడించారు.

స్థానిక కలప వ్యాపారులు కూడా తమ దగ్గర ఒక వంపు తిరిగిన దుంగ ఉంటే, ఆయనను కలుస్తారు. ఆయనకు సాల్ ( షోరియా రోబస్టా ), శీషు (ఇండియన్ రోజ్‌వుడ్ - ఇరిడి), తితాచఁపా ( మిచెలియా చంపాకా - మనోరంజనం), శిరీష్ ( అల్బెజియా లెబెక్ - దిరిసెన) లేదా స్థానికంగా లభించే ఏ ఇతర కలపకు చెందినదైనా ఏడు అడుగుల పొడవున్న దూలం, 3x2 అంగుళాల వెడల్పు గల చెక్క పలక అవసరం.

“చెట్టుకు 25-30 సంవత్సరాల వయస్సు ఉండాలి. అప్పుడే నాగలి, కాడి, గొర్రులు చాలాకాలం పాటు నిలుస్తాయి. సాధారణంగా దృఢంగా పెరిగిన చెట్టు బోదెలు, కొమ్మలు దుంగలుగా పనికొస్తాయి,” అని ఆయన రెండు భాగాలుగా నరికిన ఒక కొమ్మను PARIకి చూపించారు.

ఆగస్ట్ మధ్యలో PARI ఆయనను కలిసినప్పుడు ఆయన కొయ్యలోని ఒక భాగాన్ని నాగలిదుంపగా మలుస్తున్నారు "నేను ఒక నాగలిదుంపను తయారుచేయడమే కాకుండా రెండు హాత్‌నైంగలే (కొయ్యతో చేసిన చేతి గొర్రులు)లను తయారుచేయగలిగితే, ఈ దుంగ ద్వారా నేను అదనంగా 400 - 500 రూపాయలు సంపాదించవచ్చు," అని ఆయన తాను రూ. 200లకు కొనుగోలు చేసిన కోణీయ ఆకారపు చెక్క వైపు చూపిస్తూ చెప్పారు.

“నేను ప్రతి కొయ్యముక్క నుండి వీలైనన్ని ఎక్కువ భాగాలను ఉపయోగించాలి. అంతే కాదు, దాని ఆకారం ఖచ్చితంగా రైతులకు అవసరమైన విధంగానే ఉండాలి,” అని ఆయన చెప్పారు. నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా ఈ పని చేస్తున్న ఆయనకు, నాగలికి అత్యంత ప్రజాదరణ పొందిన పరిమాణం 18-అంగుళాల లాడములు (నాగలిని స్థిరంగా నిలిపి ఉంచడానికి) 33-అంగుళాల నాగలిదుంప అని ఆయనకు తెలుసు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: వంపు తిరిగిన బలమైన కొమ్మలకోసం హనీఫ్ దగ్గరలోని గ్రామాలలో వెతుకుతుంటారు. చెట్లు నరికినప్పు అటువంటి కొమ్మలు కనిపిస్తే గ్రామస్థులు, కలప వ్యాపారులు ఆయనకు సమాచారమిస్తారు. నాగలిదుంపను చేయడానికి ఉపయోగించే దుంగను ఆయనిక్కడ చూపిస్తున్నారు. కుడి: ఆయన తన పనిముట్లను తన ఇంటిలోని ఎత్తైన కొయ్య అరుగుపై ఉంచుతారు

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లు ఖచ్చితత్వంతో కూడిన సాధనాలు. నాగలిదుంపలో మేడిని బిగించటానికి సరిపోయేలా రంధ్రం చేయాల్సిన కోణీయ బిందువును ఇక్కడ హనీఫ్ చూపిస్తున్నారు. రంధ్రం ఖచ్చితంగా లేకుంటే, నాగలి చాలా వంకరగా మారవచ్చు. కుడి: దుంగ పైభాగంలోనూ, పక్కభాగాల్లోనూ చెక్కడానికి ఆయన తన 20 ఏళ్ళ వయసున్న బాడిసను, 30 ఏళ్ళ వయసున్న గొడ్డలిని ఉపయోగించారు

ఆయనకు సరైన కొయ్య దుంగ దొరికిన తర్వాత నరకడానికీ, చెక్కడానికీ, ఆకృతినివ్వడానికీ, వంపుతిప్పడానికీ అవసరమైన ఉపకరణాలను దగ్గర పెట్టుకొని, సూర్యోదయానికి ముందే పనిని ప్రారంభిస్తారు. ఆయన ఇంట్లోని ఎత్తైన చెక్క అరుగు మీద కొన్ని ఉలులు, ఒక బాడిస, రెండు రంపాలు, ఒక గొడ్డలి, చేతితో ఉపయోగించే ఒక చిత్రిక, కొన్ని తుప్పు పట్టిపోతోన్న ఇనుపకడ్డీలు కూడా ఉన్నాయి.

రంపం సాదాగా ఉండే వైపును ఉపయోగించి ఆయన, ఖచ్చితమైన కోత కోయడానికి కొయ్యపై గుర్తులు పెడతారు. తన చేతిని ఉపయోగించి దూరాన్ని కొలుస్తారు. గుర్తులు పెట్టడం పూర్తయిన తర్వాత, ఆయన తన 30 ఏళ్ళ వయసున్న గొడ్డలితో దుంగ పక్కభాగాలను చెక్కుతారు. "అప్పుడు నేను ఎగుడుదిగుడుగా ఉండే పైభాగాన్ని సమానంగా చేయటానికి టెష్షా [గొడ్డలిని పోలివుండే బాడిస]ను ఉపయోగిస్తాను," అని ఈ నిపుణుడైన వడ్రంగి చెప్పారు. మట్టిని ఇరువైపులా సులభంగా పెళ్ళగించే విధంగా ఖచ్చితమైన వక్రతతో ఉండేలా నాంగల్ లేదా నాగలిదుంపను చెక్కాలి.

"లాడముల ప్రారంభ స్థానం [భూమిపై జారుతూ పోయే భాగం] ఆరు అంగుళాల వరకూ ఉంటుంది. ఇది క్రమంగా వెడల్పులో 1.5 నుండి 2 అంగుళాల వరకు తగ్గుతూపోతుంది," అని ఆయన చెప్పారు. లాడముల మందం 8 లేదా 9 అంగుళాలు ఉండాలి, అది చెక్కలోకి బిగించే చోట కూచిగా రెండు అంగుళాలు ఉండాలి.

నాగేటికర్ర లాడమును ఫాల్ లేదా పాల్ అని పిలుస్తారు. దీనిని 9-12 అంగుళాల పొడవు, 1.5-2 అంగుళాల వెడల్పుతో, రెండు చివరలా పదునైన అంచులతో ఉండే ఇనుప కడ్డీతో తయారుచేస్తారు. "రెండు అంచులు పదునుగా ఉంటాయి, ఎందుకంటే ఒక చివర అరిగిపోతే, రైతు మరొక చివరకు మార్చుకోవచ్చు." హనీఫ్ తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేసిమారీ మార్కెట్‌లోని స్థానిక కమ్మరిచేత లోహానికి సంబంధించిన పనులు చేయించుకుంటారు.

దుంగ పక్క భాగాలను చెక్కి, ఆకృతిలోకి మలచడానికి గొడ్డలి, బాడిసను ఉపయోగించి కనీసం ఐదు గంటలపాటు పనిచేయాలి. ఆ తర్వాత దాన్ని చేతి చిత్రికతో మృదువుగా చేయాలి.

నాగలి ముఖ్యభాగం సిద్ధమైన తర్వాత, నాగలి మేడిని బిగించడానికి సరిపోయే రంధ్రం చేయాల్సిన చోట హుయ్‌తెర్ ఖచ్చితమైన గుర్తును వేస్తారు. హనీఫ్ ఇలా అంటారు, “ఈ రంధ్రం ఈష్ [మేడి] పరిమాణానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి, ఎందుకంటే దున్నుతున్నప్పుడు అది వదులు కాకూడదు. ఇది సాధారణంగా 1.5 లేదా 2 అంగుళాల వెడల్పు ఉంటుంది.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: ఆరు నెలల వయసున్న ఒక దుంగను చెక్కుతోన్న హనీఫ్. ఈ దుంగను నరికి, ఎగుడుదిగుడుగా ఉన్న పక్క భాగాలను సరిగ్గా చెక్కడానికి కనీసం ఒక్క రోజు పడుతుంది. కుడి: తన ఇంటి బయట పనిలోంచి కొద్దిగా విరామం తీసుకుంటోన్న నిపుణుడైన శిల్పి

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: నాగలిదుంప, దాని మేడిని సైకిల్‌పై పెట్టుకున్న హనీఫ్. కొన్నిసార్లు కాడి, చేతిగొర్రులు కూడా సైకిల్‌పై పెట్టుకొని మార్కెట్‌కు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారాయన. కుడి: సోమవారాలు జరిగే వారపు సంతలో హనీఫ్

నాగలి ఎత్తును సర్దుబాటు చేయడానికి హనీఫ్ మేడి పైభాగంలో ఐదు నుండి ఆరు వరకు గాడిగుర్తులు వేస్తారు. భూమిని ఎంత లోతులో తవ్వాలో అనేదానిని బట్టి రైతులు ఈ గుర్తులను ఉపయోగించి నాగలిని సర్దుబాటు చేసుకుంటారు.

కోత యంత్రంతో కొయ్యను కోయటం చాలా ఖర్చుతోనూ, శ్రమతోనూ కూడుకున్న విషయమని హనీఫ్ అంటారు. "నేను ఒక దుంగను 200 రూపాయలకు కొంటే, దానిని కోసే మనిషికి మరో 150 రూపాయలు ఇస్తాను." నాగలిని తయారుచేయటానికి రెండు రోజులు పడుతుంది. అది గరిష్టంగా రూ. 1200కు అమ్ముడుపోతుంది.

నాగళ్ళ కోసం కొంతమంది హనీఫ్‌ను నేరుగా కలుస్తారు. అయితే ఆయన తన ఉత్పత్తులను అమ్ముకోవటానికి దరంగ్ జిల్లోలోని లాల్‌పూల్ బాజార్, బేసిమారీ బాజార్ వారపు సంతలకు కూడా వెళ్తుంటారు. "ఒక నాగలి, దాని ఉపకరణాల కోసం ఒక రైతు రూ. 3,500 నుండి 3,700 వరకూ చెల్లించాలి," పెరిగిపోతోన్న ఖర్చులను భరించలేక తన కొనుగోలుదారులు తగ్గిపోయారనీ, ఎక్కడో ఒక రైతు నాగలిని అద్దెకు తీసుకుంటారనీ ఆయన చెప్పారు. "సంప్రదాయంగా నాగళ్ళతో దున్నే పద్ధతిని ట్రాక్టర్లు భర్తీ చేశాయి."

అయినా హనీఫ్ ఆగిపోవటంలేదు. మర్నాడు తన సైకిల్‌పై నాగలినీ, కుడీ (నాగలి పిడి)ని పెట్టుకుని సిద్ధపడతారు. "ట్రాక్టర్లు భూమిని నాశనం చేయటం ముగిసిపోయాక... జనం మళ్ళీ నాగలి తయారీదారు దగ్గరకే వస్తారు," అన్నారాయన.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఒక ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mahibul Hoque

محب الحق آسام کے ایک ملٹی میڈیا صحافی اور محقق ہیں۔ وہ پاری-ایم ایم ایف فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Mahibul Hoque
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli