"నా కుటుంబం మాత్రమే నన్ను ఒప్పుకోవడానికి సందేహించింది, జాలరులు కాదు. పడవల యజమానులు నన్ను కైరాసి గా [అదృష్టం తెచ్చేవారు] చూస్తారు," అంటారు మనీషా. "వాళ్ళు నన్ను తిరస్కరించలేదు. నేనెవరినో వారు పట్టించుకోరు. వాళ్ళ చేపలను అమ్మిపెట్టడమే వారికి కావలసింది," చేపల వేలంపాటదారైన ఈ ట్రాన్స్ మహిళ సంతోషంగా చెప్పారు.
కడలూరు పాత పట్నం ఓడరేవులో పనిచేస్తోన్న 30 మంది మహిళా వేలంపాటదారులలో 37 ఏళ్ళ మనీషా కూడా ఒకరు. “నేను బిగ్గరగా పిలవగలను కాబట్టి నేను ఎక్కువ ధరను పొందగలను. చాలా మంది నా నుండి చేపలు కొనాలనుకుంటారు,” కొనుగోలుదారులను పిలుస్తున్నప్పుడు ఇతర అమ్మకందారుల కంటే బిగ్గరగా వినిపిస్తోన్న స్వరంతో అన్నారామె.
లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకోవాడానికి చాలా కాలం ముందునుంచే మనీషా చేపల వేలంపాటదారుగానూ ఎండు చేపల వ్యాపారిగానూ ఉన్నారు. ఈ జీవనోపాధి వలన ఆమె ప్రతిరోజూ పడవ యజమానులతోనూ, జాలరులతోనూ వ్యవహరించవలసివస్తుంది. "వారికి ఎలాంటి సమస్య లేదు. ఇతరులకంటే నేను చేపలను చాలా బాగా వేలం వేస్తాను."
పడవ యజమానుల నైతిక మద్దతు లేనట్లయితే తనకు 2012లో శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉండేదికాదని ఆమె అన్నారు. వారిలో ఆమె సన్నిహిత స్నేహితుడు, ఆంతరంగికుడు కూడా ఉన్నారు. శస్త్రచికిత్స ప్రక్రియ ముగిసిన వెంటనే ఆమె అతనిని స్థానిక గుడిలో పెళ్ళి చేసుకున్నారు.
17 సంవత్సరాల వయస్సులో మనీషా అప్పుడే వృద్ధి చెందుతోన్న ఎండు చేపల వ్యాపారం ఉన్న ఒక విక్రేత వద్ద పనిచేయడం ప్రారంభించింది. ఆ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న తర్వాత, తరువాతి పదేళ్ళలో తానే సొంతంగా వ్యాపారం పెట్టుకుంది. “ఈ వ్యాపారం ద్వారా నేను చాలా పరిచయాలను ఏర్పరచుకోగలిగాను. వారిలో కొందరు చేపలను ఎండలో ఎండబెట్టటం కాకుండా, వేలం వేయాలని కోరారు. నేను మెల్లగా ఆ పనిలో చేరాను.”
చేపల వేలం హక్కులను పొందాలంటే, పడవ యజమానులకు ముందుగానే డబ్బు చెల్లించాలి. వేలం నిర్వహించేవారిలో దాదాపు 90 శాతం మంది మహిళలే ఉంటారు. “నేను నాలుగు పడవలకు వేలం పాడుతున్నాను. ఆ పడవలన్నీ రింగుల వలలను ఉపయోగిస్తాయి. ఒక్కొక్కరికి మూడు-నాలుగు లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా ఇచ్చి మొదలుపెట్టాను. నా దగ్గర కొంత పొదుపుచేసిన మొత్తం ఉంది, కానీ నా స్నేహితుల దగ్గర కూడా అప్పు చేయాల్సి వచ్చింది,” అన్నారు మనీషా. "ఎండు చేపల వ్యాపారం ద్వారా, వేలంపాట ద్వారా వచ్చిన లాభాలను రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగించాను" అన్నారామె.
భారీ రింగుల వలలను ( సురుక్కువలై , లేదా కుదించిన భారీ సంచి వలలు) ఉపయోగించి పెద్ద పడవలు పట్టుకున్న చేపలు ఓడరేవులోకి వచ్చిన తర్వాత మనీషా వంటి వేలంపాటదారులకు పనిపడుతుంది. కొన్నిసార్లు ప్రధానంగా కుటుంబ యూనిట్‌లు నిర్వహించే నారతో దృఢంగా నిర్మించిన చిన్నపాటి పడవల సమూహాలు కూడా చేపలను పట్టుకొస్తాయి.
"చేపలు పాడైపోతే నేను వాటిని కోళ్ళకు దాణా కోసం ఎండబెడతాను. అలా కాకుండా మంచి చేపలు వచ్చినపుడు తినటానికి ఉపయోగపడే ఎండు చేపలను తయారుచేస్తాను," ఆమె వివరించారు. వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మనీషా తన వ్యాపారం అభివృద్ధయ్యేలా చూసుకుంటారు.
ఐదేళ్ళ క్రితం మనీషా చేపలను ఎండబెట్టే ప్రదేశాన్ని రాబోతోన్న ఓడరేవులో బోట్‌హౌస్ నిర్మాణం కోసమని స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు, తమ ఇళ్ళ దగ్గర మురికి, దుర్వాసనగా ఉందని కొంతమంది వ్యక్తులు చేసిన పిటిషన్‌తో సహా బెదిరింపులు ఎదురైనప్పటికీ ఆమె వ్యాపారం వాటి నుండి బయటపడగలిగింది. ఇప్పుడు వ్యాపారం నిర్వహించడానికి స్థలం లేకపోవడం, చేపలను భద్రపరచడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆమె దానిని మూసివే శారు.
*****
2020లో, కోవిడ్-19 వలన రవాణా, సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అంటే తక్కువ పడవలు బయటికి వెళ్ళి ఓడరేవులో దిగుతున్నాయి. తమిళనాడు మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ నిబంధనలను సవరించిన తర్వాత 2021లో భారీ సంచీ వలలపై నిషేధం విధించడంతో రెండో దెబ్బ తగిలింది. చదవండి: ఎండుతున్న చేపలు, క్షీణిస్తున్న సంపద
మనీషా 2019లో తన భర్త స్టీల్ పడవలో పెట్టుబడి పెట్టారు. "ఈ పడవలలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది మాకు రుణాలు ఇచ్చారు," అని చెప్పారామె. “మా వద్ద పడవలున్నాయి, నేను నాలుగు పడవలపై ఒక్కోదానిపై 20 లక్షలు పెట్టుబడి పెట్టాను, కానీ ప్రభుత్వం నిషేధం పెట్టడంతో, మా నుండి వాటిని ఎవరూ కొనుగోలు చేయరు. పడవలు చేపల వేటకు వెళ్ళకపోతే, మేం ఏమీ సంపాదించలేం. అలాంటప్పుడు మేం డబ్బులెట్లా తిరిగి చెల్లించగలం?”
అయితే, జనవరి 2023లో తమిళనాడు ప్రాదేశిక జలాలను దాటి, భారీ సంచీ వలలతో చేపల వేటను సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే షరతులకు లోబడి ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో మాత్రమే చేయాలి. కడలూరులో భారీ రింగుల వలల సాంకేతికత చుట్టూ ఉన్న మత్స్యసంబంధ వివాదాల కారణంగా, మనీషా వేలం వేసే పడవలు ఇప్పుడు పుదుచ్చేరిలో దిగవలసి వచ్చింది. ఆమె తన ఆభరణాలను (105 సవర్లు) అమ్మి, తన మూడు గదుల కాంక్రీట్ ఇంటిని బ్యాంకుకు తాకట్టు పెట్టినప్పటికీ, ఇంకా చెల్లించవలసిన అప్పు నికరంగా రూ. 25 లక్షలు ఉంది.
వాస్తవానికి కడలూర్ పాత పట్నం వార్డ్‌లో 20 స్వయం సహాయక బృందాలు (ఎస్ఎచ్‌జి) ఉన్నప్పటికీ, అప్పు తీసుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ ఇవ్వడానికి ఆమె సిద్ధపడినప్పటికీ, ఆమె పెట్టుబడులన్నీ ప్రైవేట్ రుణాలు తీసుకొని పెట్టినవే. "నన్ను ఒప్పుకోవడానికి వాళ్ళంతా నిరాకరించారు," అన్నారామె. "నేను ట్రాన్స్‌జెండర్‌ని అవటం వలన ఒక్క బ్యాంక్ కూడా నాకు అప్పు ఇవ్వలేదు; వాళ్ళు నన్ను నమ్మలేదు."
బ్యాంక్ రుణం, కొంత ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉంటే తనకు సహాయంగా ఉండేదని ఆమె భావిస్తున్నారు. "ప్రభుత్వం దాదాపు 70 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు తిరుమణికుళిలో ఒంటి గది ఇళ్ళను ఇచ్చింది. కానీ అవన్నీ అడవి మధ్యలో, నీటి వసతి గానీ రవాణా సౌకర్యం గానీ లేని ప్రదేశంలో ఉన్నాయి. అక్కడికి ఎవరు వెళ్తారు? ఆ ఇళ్ళు చాలా చిన్నగా, దూరంగా ఒంటరిగా ఉన్నాయి. ఎవరైనా మమ్మల్ని చంపినా ఎవరికీ తెలియదు; మా అరుపులు కూడా ఎవరికీ వినిపించవు. మాకిచ్చిన ఇళ్ళ పట్టాలను మేం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాం."
*****
ఐదుగురు తోబుట్టువులలో చివరిగా మగబిడ్డగా పుట్టిన మనీషా, తనకు 15 ఏళ్ళ వయసు నుంచే సంపాదించడం మొదలెట్టింది. ఆమె తండ్రి కస్టమ్స్ అధికారి. పుదుచ్చేరికి సమీప గ్రామమైన పిళ్ళైచావడికి చెందిన ఈయనను కడలూర్ పాత పట్నం ఓడరేవులో నియమించారు. మనీషా తల్లి ఆమె తండ్రికి రెండవ భార్య. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఆమె అక్కడికి దగ్గరలోనే ఒక టీ దుకాణాన్ని నడిపేవారు.
మనీషా తండ్రి మొదటి భార్యాపిల్లలు అతని గ్రామంలోనే ఉంటారు. తాగుబోతు అయిన ఆయన కడలూర్‌లో ఉన్న ఈ రెండో భార్య కుటుంబానికి డబ్బులివ్వడం గానీ ఎలాంటి బాగోగులు చూడటం గానీ చేయలేదు. మనీషా పెద్దన్న సౌందరరాజన్ (50) తల్లికీ తోబుట్టువులకీ అండగా ఉండేందుకు తన 15 ఏళ్ళ వయసులోనే చేపలు పట్టడం ప్రారంభించారు. మనీషాకు ముగ్గురు అక్కలు- శకుంతల (45), షకీలా (43), ఆనంది (40). శకుంతల చేపల వ్యాపారం చేస్తారు, మిగిలినవారంతా పెళ్ళిళ్ళు చేసుకొని తమ సంసారాలు నడుపుకుంటున్నారు.
తోబుట్టువులందరూ తమ 15వ ఏటనుంచే పనులు చేయటం ప్రారంభించారు. మనీషా తల్లి, అక్కలిద్దరూ ఓడరేవు దగ్గర టీ, చిరుతిండి అమ్మేవారు. అందరిలోకీ చిన్నదైన మనీషా తన తల్లి ఏ పని చేయమంటే ఆ పని చేసేది. 2002లో మనీషా 16 ఏళ్ళ వయసులో కడలూర్‌లోని భారత సాంకేతిక సంస్థ (ఐటి ఐ)లో చేరి వెల్డింగ్‌లో ఒక సంవత్సరం కోర్స్ పూర్తిచేసింది. ఆమె ఒక వెల్డింగ్ వర్క్‌షాప్‌లో నెలపాటు పని కూడా చేసింది కానీ ఆమెకు ఆ పని నచ్చలేదు.
ఒక ఎండుచేపల కంపెనీలో పనిచేసేటప్పుడు ఆమె రోజుకు రూ. 75 సంపాదించేది. చేపలను తలపై పెట్టుకొని మోసుకుపోవటం, వాటిని శుభ్రం చేయటం, ఉప్పు పట్టించటం, ఎండబెట్టడం ఆమె పని.
ఎండుచేపల వ్యాపారాన్ని నడిపేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత, 2006 ప్రాంతాలలో, 20 ఏళ్ళ మనీషా తానే సొంతంగా చేపలను ఎండబెట్టడం మొడలుపెట్టింది. ఈ పనికోసం ఆమె చెట్లతో నిండివున్న ఒక బహిరంగ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంది. ఆమె అక్కలిద్దరి పెళ్ళిళ్ళ తర్వాత అప్పులు పేరుకుపోయాయి. అప్పుడే మనీషా రెండు ఆవులను కొని, చేపల వ్యాపారంతో పాటు ఆవు పాలను అమ్మటం కూడా మొదలుపెట్టింది. ఇప్పుడామెకు చేపల వేలంపాట, వాటిని అమ్మటంతో పాటు ఐదు ఆవులు, ఏడు మేకలు, 30 కోళ్ళు ఉన్నాయి.
*****
తనకు పదేళ్ళ వయసు నుంచే తాను పుట్టిన జెండర్ పట్ల ఆమెకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, మనీషా తాను సంపాదించడం ప్రారంభించిన యుక్తవయసులో మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె తన తల్లి కోసం, అక్కల కోసం నగలు చీరలు కొన్నప్పుడు తనకోసం కూడా కొన్ని ఉంచుకునేది. 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆమె లింగ-స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
ఆమె తనతోటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో కలిసి తిరగటం ప్రారంభించింది. ఆమె స్నేహితులలో ఒకరు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ముంబై వెళ్ళారు. ఆమె అక్కడే పదిహేనేళ్ళు నివాసముండి, తిరిగి కడలూర్ వచ్చారు. ఆమె మనీషాకు సహాయం చేస్తానన్నా కూడా మనీషాకు తన కుటుంబాన్ని విడిచిపెట్టి ముంబైకి వెళ్ళాలనిపించలేదు.
బదులుగా ఆమె కడలూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక మానసిక వైద్యుడి నుండి, న్యాయవాది నుండి సర్టిఫికేట్‌లను ఇవ్వవలసి వచ్చింది, ఈ ప్రక్రియను ఎందుకు చేయించుకోవాలనుకుంటుందో కారణాల గురించి అధికారులను ఒప్పించవలసి వచ్చింది. ఆమె తన వ్యాపారాల నుండి సంపాదించిన డబ్బుతో ఈ శస్త్రచికిత్స కోసం డబ్బు చెల్లించి, ఈ ప్రక్రియ కొనసాగేలా చూసుకుంది.
ఈ మార్పిడి ప్రక్రియ జరుగుతోన్న సంవత్సరాలలో మనీషాకు ఆమె కుటుంబంతో సంబంధం చెడిపోయింది. ఆమె తన కుటుంబం నివసించే ఇంటి పక్కనే తన కోసం కట్టుకున్న ఇంటిలో నివసిస్తున్నా కూడా, శస్త్రచికిత్స తర్వాత చాలా సంవత్సరాలు ఆమె తల్లి, తోబుట్టువులు ఆమెతో మాట్లాడలేదు. తీవ్రంగా కలత చెందిన ఆమె తల్లి తినడం కూడా మానేశారు. తాను చూసిన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు చేస్తున్నట్లు వీధుల్లో భిక్షం అడుక్కోకూడదని ఆమె మనీషాకు తెలిసేలా చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం మనీషా తల్లికి పేగు క్యాన్సర్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. ఆమెకు శస్త్రచికిత్స, వైద్యం చేయటం కోసం మనీషాయే రూ. 3 లక్షలు చెల్లించారు, అప్పుడే వారిమధ్య రాజీ కుదిరింది. ఒక సంవత్సరం తర్వాత ఆమె తల్లి మరణించారు. కానీ మనీషా తన తల్లి పట్ల చూపించిన శ్రద్ధ, ఆమె తోబుట్టువులతో ఆమె సంబంధం తిరిగి మామూలు కావడానికి సహాయపడింది.
చాలామంది లింగమార్పిడి వ్యక్తులు అందరిలాగే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల వారు దూషణలకు, దాడులకు గురవుతారని మనీషా నొక్కి చెప్పారు. "నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు తలుపు తెరవడానికి కూడా భయపడతాను," అన్నారామె. “నా అక్కలు విడిగానే ఉన్నప్పటికీ దగ్గరలోనే నివసిస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి