మొదటిసారి దియా దాదాపు తప్పించుకుంది.

ఆమె బస్‌లో ఇబ్బందిపడుతూ కూర్చొని, అది నిండటానికి ఎదురుచూస్తోంది. సూరత్ నుండి ఝాలోద్‌కు టిక్కెట్ కొనుక్కుంది. అక్కడి నుంచి, గుజరాత్ సరిహద్దును దాటి రాజస్థాన్‌లోని కుశల్‌గఢ్‌లో ఉండే తన ఇంటికి చేరటానికి ఒక గంట ప్రయాణమేనని ఆమెకు తెలుసు.

అకస్మాత్తుగా తన వెనుకనుంచి రవి వచ్చినప్పుడు ఆమె కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆమె ప్రతిఘటించేలోపే, అతను ఆమె చేతిని పట్టుకొని బస్‌లోంచి కిందకు బరబరా ఈడ్చుకుపోయాడు.

బస్‌లో ఉన్న జనాలంతా సామాన్లు సర్దుకుంటూ, పిల్లలను చూసుకుంటూ తీరికలేకుండా ఉన్నారు. కోపంతో ఉన్న ఆ యువకుడిని గానీ, భయంతో వణికిపోతోన్న ఆ అమ్మాయిని గానీ ఎవరూ పట్టించుకోలేదు. "నాకు అరవటానికి కూడా భయమేసింది," అంది దియా. రవి కర్కశత్వం సంగతి ఇంతకుముందే అనుభవమైంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.

ఆ రాత్రి, గత ఆరు నెలలుగా ఆమెకు ఇల్లూ జైలూ కూడా అయిన ఆ నిర్మాణ స్థలానికి చేరిన తర్వాత, దియా నిద్రపోలేకపోయింది. ఆమె శరీరమంతా గాయాలే. రవి ఎంతగా ఆమెను కొట్టాడంటే ఆమె చర్మం అనేకచోట్ల చిట్లి కమిలిపోయి ఉంది. "అతను నన్ను పిడికిళ్ళతో గుద్దాడు," ఆమె గుర్తుచేసుకుంది. "ఎవరూ అతన్ని ఆపలేకపోయారు." మధ్యలో కల్పించుకోబోయిన మగవాళ్ళపై వాళ్ళు ఆమెపై కన్ను వేశారని ఆరోపించాడు. ఆ హింసను చూసి భయపడిన మహిళలు దూరంగా ఉండిపోయారు. ఎవరైనా జోక్యం చేసుకునే ధైర్యం చేసినా, 'మేరీ ఘర్‌వాలీ హై, తుం క్యోఁ బీచ్ మే ఆ రహే హో [ఆమె నా భార్య. నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటున్నావ్]?' అంటాడు రవి.

"నన్ను కొట్టినప్పుడల్లా, మలాము పట్టీ (గాయానికి కట్టు కట్టడం) కోసం నేను ఆసుపత్రికి వెళ్ళి 500 రూపాయలు ఖర్చుపెట్టాల్సివస్తుంది. ఒకోసారి రవి సోదరుడే డబ్బులిస్తాడు, తాను కూడా నాతోపాటు ఆసుపత్రికి వస్తాడు. ' తుమ్ ఘర్ పే చలే జా [నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో],' అంటాడు," చెప్పింది దియా. కానీ అదెలా జరుగుతుందో ఇద్దరికీ తెలియదు.

Kushalgarh town in southern Rajasthan has many bus stations from where migrants leave everyday for work in neighbouring Gujarat. They travel with their families
PHOTO • Priti David
Kushalgarh town in southern Rajasthan has many bus stations from where migrants leave everyday for work in neighbouring Gujarat. They travel with their families
PHOTO • Priti David

దక్షిణ రాజస్థాన్‌లోని కుశల్‌గఢ్ పట్టణంలో అనేక బస్‌స్టాండులున్నాయి. అక్కడి నుండి ప్రతిరోజూ పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రానికి అనేకమంది పని కోసం వలసపోతుంటారు. వారు తమ కుటుంబాలతో సహా ప్రయాణిస్తుంటారు

దియా, రవిలు రాజస్థాన్‌లోని బాంస్వారా జిల్లాకు చెందిన భిల్ ఆదివాసులు. ఈ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక పేదవాళ్ళున్న రెండవ ప్రాంతం అని 2023 బహుళ పరిమాణాత్మక దారిద్ర్య నివేదిక చెబుతోంది. చిన్న భూకమతాలు, నీటిపారుదల లేకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం, మొత్తంగా ఉన్న పేదరికం, జనాభాలో 90 శాతంగా ఉన్న భిల్ ఆదివాసుల కష్టాల వలసలకు కేంద్రంగా కుశల్‌గఢ్ తహసీల్‌ ను మార్చింది.

చాలామందికి లాగే, దియా రవిలు గుజరాత్‌లోని నిర్మాణ స్థలాలలో పని కోసం వలసవచ్చిన జంటలాగే కనిపిస్తారు. కానీ దియా వలస కూడా అపహరణే.

రెండేళ్ళ క్రితం 16 ఏళ్ళ దియా పొరుగునే ఉన్న సజ్జన్‌గఢ్‌లోని ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతుండే విద్యార్థిని. అప్పుడే ఆమె మొదటిసారిగా రవిని మార్కెట్‌లో కలిసింది. ఆ ఊరికే చెందిన ఒక ముసలామె అతని ఫోన్ నంబర్ రాసివున్న ఒక చిన్న కాగితం ముక్కని దియా చేతిలో పెట్టి, ఆ కుర్రాడు తనతో మాట్లాడాలనుకుంటున్నాడనీ, ఒకసారి ఉత్తినే మాట్లడమనీ దియాని బలవంతపెట్టింది.

దియా అతనికి కాల్ చేయలేదు. కానీ ఆ పై వారం అతను మార్కెట్‌కు వచ్చినప్పుడు, అతనితో కాసేపు మాట్లాడింది. " హమ్‌కో బాగీదౌరా ఘుమానే లే జాయేగా బోలా, బైక్ పే [బాగీదౌరా దాకా బైక్ మీద తిరిగేసి వద్దాం అన్నాడతను]. బడి వదలటానికి ఒక గంట ముందు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చెయ్యమని నాకు చెప్పాడు," దియా గుర్తుచేసుకుంది. ఆ మరుసటి రోజు అతను వేరే స్నేహితుడితో కలిసి ఆమె బడి బయట ఎదురుచూస్తూ కనిపించాడు.

"మేం బాగీదౌరా (ఒక గంట దూరంలో ఉంటుంది) వెళ్ళలేదు. మేం బస్‌స్టాండ్‌కు వెళ్ళాం. అతను నన్ను అహ్మదాబాద్ బస్ ఎక్కేలా చేశాడు," అన్నదామె. అది అక్కడికి 500 కిలోమీటర్ల దూరంలో, పక్క రాష్ట్రంలో ఉంది.

భయపడిపోయిన దియా ఎలాగో తన తల్లిదండ్రులకు కాల్ చేయగలిగింది. "మా చాచా (చిన్నాన్న) నన్ను తీసుకెళ్ళటానికి అహ్మదాబాద్ వచ్చాడు. కానీ ఇంటిదగ్గర ఉన్న స్నేహితుల ద్వారా ఈ వార్తను తెలుసుకున్న రవి, నన్ను సూరత్ లాక్కెళ్ళాడు."

ఆ తర్వాత అతను ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానపడటం సాగించాడు. హింస మొదలయింది. ఏదైనా కాల్ చేయటానికి ఫోన్ కోసం అడిగితే అది మరింత హింసకు దారితీసేది. తన కుటుంబంతో ఎలాగైనా మాట్లాడాల్సిందేనని పట్టుబట్టి, అతన్ని ఫోన్ కోసం అడుక్కున్న ఒక రోజును దియా గుర్తుచేసుకుంది, "అతడు నన్ను ఒకటో అంతస్తు మీద నుంచి కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తూ నేనక్కడ కుప్పగా పోసివున్న రాతిముక్కల మీద పడటంతో ఒళ్ళంతా కమిలిపోయింది," ఇంకా నొప్పిగా ఉన్న తన వీపు భాగాన్ని చూపిస్తూ ఆమె గుర్తుచేసుకుంది.

Left: A government high school in Banswara district.
PHOTO • Priti David
Right: the Kushalgarh police station is in the centre of the town
PHOTO • Priti David

ఎడమ: బాంస్వారా జిల్లాలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల. కుడి: పట్టణం నడిమధ్యన ఉన్న కుశల్‌గఢ్ పోలీస్ స్టేషన్

*****

దియాను ఎత్తుకెళ్ళిన సగతి తెలిసిన వెంటనే దినసరి కూలీగా పనిచేసే ఆమె తల్లి, 35 ఏళ్ళ కమల ఆమెను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. బాంస్వారా జిల్లా లోని ఒక పల్లెలో తన కుటుంబానికి చెందిన ఒక కచ్చా ఒంటి గది గుడిసెలో ఉంటోన్న ఆమె ఆపుకోలేకుండా ఏడుస్తూ ఇలా గుర్తుచేసుకున్నారు: " బేటీ తో హై మేరీ. అపనే కో దిల్ నహీఁ హోతా క్యా [ఆమె నా బిడ్డ. ఆమెను తిరిగి తెచ్చుకోవాలని నా మనసుకు ఉండదా]?

రవి దియాను తీసుకువెళ్ళిన కొన్ని రోజులకు కమల అతనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళలపై హింసకు సంబంధించిన కేసుల నమోదులో రాజస్థాన్‌ది మూడవ అతి పెద్ద స్థానం. అయితే ఈ నేరాలపై అభియోగ పత్రాలను (ఛార్జిషీటు) నమోదు చేయటంలో మాత్రం ఈ రాష్ట్రం రికార్డు అత్యల్పంగా 55 శాతం మాత్రమే ఉంది [దేశీయ నేర నమోదుల బ్యూరో (NCRB) ప్రచురించిన భారతదేశంలో నేరాలు 2020 ఆధారంగా]. కిడ్నాప్, ఎత్తుకెళ్ళటం వంటి సంఘటనలపై వచ్చే ప్రతి మూడు ఫిర్యాదులలో రెండు ఫిర్యాదులు పోలీసు కేసుగా నమోదు కావు. దియా విషయంలో కూడా అదే జరిగింది.

"వాళ్ళు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు," కుశల్‌గఢ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రూప్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. ఇందులో బాంజడియా - గ్రామలోని ఒక పురుషుల బృందం చట్టవిరుద్ధంగా నడిపించే న్యాయస్థానం  - జోక్యం చేసుకుందని కమల చెప్పారు. పోలీసుల ప్రమేయం లేకుండా ' ఓలి ' అడగటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి వారు కమల, ఆమె భర్త కిషన్ (దియా తల్లిదండ్రులు)లను ఒప్పించారు. ఇది భిల్లు ఆదివాసులలో అబ్బాయి కుటుంబం భార్యను తెచ్చుకోవటం కోసం డబ్బు చెల్లించే ఆచారం. (అయితే పురుషులు ఈ పెళ్ళినుంచి విడిపోయినప్పుడు, వాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం కోసం ఆ డబ్బును తిరిగి డిమాండ్ చేస్తారు.)

ఒకటి రెండు లక్షల రూపాయలు తీసుకుని దియాను ఎత్తుకుపోయినట్టుగా పెట్టిన పోలీసు కేసుని వెనక్కి తీసుకోమని తమను అడిగినట్టుగా ఆ కుటుంబం చెప్పింది. ఈ 'పెళ్ళి' అప్పుడు సామాజిక ఆమోదాన్ని పొందినట్టవుతుంది. దియాది పెళ్ళి వయసు కాకపోవటం, పెళ్ళికి ఆమె అనుమతి అవసరం అనే విషయాలను ఇక్కడ పూర్తిగా ఉపేక్షించారు. రాజస్థాన్‌లో 20-24 ఏళ్ళ వయసున్న వివాహిత మహిళలలో పావు వంతు మందికి వారికి 18 ఏళ్ళు రాకముందే వివాహమైపోయిందని 2019-2021 దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( NFHS-5 ) వారి ఇటీవలి తాజా నివేదిక తెలియచేస్తోంది.

టీనా గరాసియా కుశల్‌గఢ్‌లో పనిచేసే ఒక సామాజిక కార్యకర్త. స్వయంగా భిల్ ఆదివాసీ అయిన ఈమె దియా కేసు వంటివాటిని కేవలం లేచిపోయిన వధువుల కేసులుగా పోనివ్వదలచుకోలేదు. "మా దగ్గరకు వచ్చే చాలా కేసులలో, అమ్మాయిలు తమ ఇష్టానుసారం వెళ్ళిపోయారనే భావన నాకెప్పుడూ కలగలేదు. ఏదైనా ప్రయోజనం కోసమో, కనీసం ఆ సంబంధంలో ప్రేమ, సంతోషం కోసమో వెళ్ళారని కూడా అనిపించలేదు," అన్నారు బాంస్వారా జిల్లాలోని ఈ ఆజీవికా లైవ్లీహుడ్ బ్యూరో అధిపతి. గత దశాబ్ద కాలంగా ఈమె వలస మహిళలతో పనిచేస్తున్నారు.

"వారలా వెళ్ళిపోవటాన్ని నేను ఒక కుట్రగానూ, అక్రమరవాణా వ్యూహంగానూ చూస్తాను. వీరిలోనే అమ్మాయిలను ఇటువంటి సంబంధాలలోకి తీసుకువచ్చే మనుషులున్నారు," అమ్మాయిని పరిచయం చేసినందుకు కూడా డబ్బు చేతులు మారుతుందని టీనా అన్నారు. "ఒక 14-15 ఏళ్ళ అమ్మాయికి ఈ సంబాంధాల గురించీ, జీవితం గురించీ ఏం అవగాహన ఉంటుంది?"

ఒక జనవరి నెల ఉదయం, కుశల్‌గఢ్‌లో ఉండే టీనా కార్యాలయానికి, మూడు కుటుంబాలు తమ కూతుళ్ళను తీసుకొని వచ్చాయి. వారి కథలు కూడా దియా కథలాంటివే.

Left: Teena Garasia (green sweater) heads Banswara Livelihood Bureau's Migrant Women Workers Reference Center; Anita Babulal (purple sari) is a Senior Associate at Aaajevika Bureaa, and Kanku (uses only this name) is a sanghatan (group) leader. Jyotsana (standing) also from Aajeevika, is a community counselor stationed at the police station, and seen here helping families with paperwork
PHOTO • Priti David
Left: Teena Garasia (green sweater) heads Banswara Livelihood Bureau's Migrant Women Workers Reference Center; Anita Babulal (purple sari) is a Senior Associate at Aaajevika Bureaa, and Kanku (uses only this name) is a sanghatan (group) leader. Jyotsana (standing) also from Aajeevika, is a community counselor stationed at the police station, and seen here helping families with paperwork
PHOTO • Priti David

ఎడమ: టీనా గరాసియా (ఎరుపురంగు స్వెటర్‌లో) బంస్వారాలోని జీవనోపాధి బ్యూరో కింద వలస వచ్చిన మహిళా కార్మికుల కేంద్రానికి నాయకత్వం వహిస్తున్నారు. మధ్యలో: ఆజీవికా బ్యూరోలో సీనియర్ అసోసియేట్ అనితా బాబులాల్ (ఊదా రంగు చీరలో), కాంకు (ఆమె ఈ పేరు మాత్రమే ఉపయోగిస్తారు) ఒక సంఘటన్ (బృందం) నాయకురాలు. ఆజీవికాకే చెందిన జ్యోత్స్న (మట్టి రంగు జాకెట్‌తో నిలబడి ఉన్నవారు) పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కమ్యూనిటీ కౌన్సెలర్. ఇక్కడ ఆమె రాతపనిలో కుటుంబాలకు సాయం చేస్తున్నారు

16 ఏళ్ళకే పెళ్ళయిన సీమా పని కోసం తన భర్తతో కలిసి గుజరాత్ వలసవెళ్ళింది. "నేను ఎవరితోనైనా మాట్లాడితే అతను విపరీతంగా అసూయపడిపోతాడు. ఒకసారి నన్నెంత గట్టిగా కొట్టాడంటే, ఇప్పటికీ నాకు ఆ చెవి సరిగా వినపడదు," అంటుందామె.

"ఆ కొట్టడం చాలా భయంకరం. ఆ దెబ్బలు ఎంతగా తగులుతాయంటే, నేను నేల మీదనుంచి పైకి లేవలేకపోతాను. అప్పుడతను నన్ను కామ్‌చోర్ (పనిదొంగ) అంటాడు. అందుకని, నేను గాయాలతోనే పనిచేస్తాను," అందామె. ఆమె సంపాదనంతా నేరుగా అతనికే చేరుతుంది. "అతను కనీసం ఆటా (పిండి) కూడా కొనడు, మొత్తం తాగుడు మీదే ఖర్చుపెట్టేస్తాడు."

చివరకు చచ్చిపోతానని బెదిరించి ఆమె అతన్ని విడిచి రాగలిగింది. అప్పటినించీ అతను మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడు. "నేను గర్భవతిని. కానీ అతను మా పెళ్ళిని ముగిసిపోనివ్వడు, నా జీవిక కోసం డబ్బూ ఇవ్వడు," అంటుందామె. ఆమెను వదిలేసినందుకు ఆమె కుటుంబం అతనిపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను దాఖలు చేశారు. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం , 2005 సెక్షన్ 20.1 (డి),  తప్పనిసరిగా జీవికను అందించాలని చెబుతుంది. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125కి అనుగుణంగా ఉంటుంది.

మూడేళ్ళ బిడ్డకు తల్లి అయిన రాణి వయసు 19 ఏళ్ళు. ఆమె ప్రస్తుతం రెండవసారి గర్భంతో ఉంది. ఆమెను కూడా భర్త వదిలేశాడు, కానీ ఆమెకు తిట్లూ, తన్నులూ లేవు. "అతను ప్రతి రోజూ తాగేసి వచ్చి ఆమెను గందీ ఔరత్, రండీ హై (చెడ్డ మనిషి, వేశ్య) అని తిడుతూ తగవు మొదలుపెడతాడు," అంటుందామె

ఆమె ముందు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బంజాడియా మధ్యలో జోక్యం చేసుకోవటంతో దాన్ని వెనక్కు తీసుకుంది. వాళ్ళు ఆమె భర్త కుటుంబం ఆమెను సరిగ్గా చూసుకుంటామని వాగ్దానం చేస్తూ ఒక 50 రాపాయల స్టాంప్ కాగితం మీద ఒప్పందం రాసేలా మధ్యవర్తిత్వం వహించారు. ఒక నెల తర్వాత మళ్ళీ వేధింపులు మొదలైనా బంజాడియా పట్టించుకోలేదు. "నేను పోలీసుల దగ్గరకు వెళ్ళాను. కానీ ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదును నేను వెనక్కు తీసుకోవటం వలన సాక్ష్యం లేకుండాపోయింది," ఎన్నడూ బడికి వెళ్ళకపోయినా చట్టపరమైన విషయాలను నేర్చుకుంటోన్న రాణి చెప్పింది. భిల్లు మహిళలలో అక్షరాస్యతా రేటు 31 శాతం (షెడ్యూల్డ్ తెగల గణాంక వివరాలు, 2013)

ఆజీవికా బ్యూరో కార్యాలయం వద్ద ఆ బృంద సభ్యులు దియా, సీమా, రాణి వంటి మహిళలకు చట్టపరమైన, విస్తృతమైన సహాయాన్ని అందిస్తారు. వాళ్ళు శ్రామిక్ మహిళాఓఁ కా సురక్షిత్ ప్రవాస్ [మహిళా కార్మికులకు సురక్షితమైన ప్రవాసం] అనే చిన్న పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఇందులో వారు ఫోటోలను, గ్రాఫిక్‌లను ఉపయోగించి హెల్ప్‌ లైన్లు, ఆసుపత్రులు, లేబర్ కార్డుల వంటి మరికొన్నిటిని గురించి మహిళలకు సమాచారం అందించారు.

కానీ ఈ హింస నుంచి ప్రాణాలతో బయటపడినవారికి మాత్రం ఇది పోలీసు స్టేషన్లకు, న్యాయస్థానాలకు లెక్కలేనన్ని సార్లు తిరగటం, కనుచూపు మేరలో స్పష్టమైన ముగింపు లేని సుదీర్ఘమైన రహదారి. అదనంగా చిన్న పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తోడవటంతో, చాలామంది తిరిగి పనికోసం వలస వెళ్ళలేకపోతున్నారు.

The booklet, Shramak mahilaon ka surakshit pravas [Safe migration for women labourers] is an updated version of an earlier guide, but targeted specifically for women and created in 2023 by Keerthana S Ragh who now works with the Bureau
PHOTO • Priti David
The booklet, Shramak mahilaon ka surakshit pravas [Safe migration for women labourers] is an updated version of an earlier guide, but targeted specifically for women and created in 2023 by Keerthana S Ragh who now works with the Bureau
PHOTO • Priti David

శ్రామిక్ మహిళాఓఁ కా సురక్షిత్ ప్రవాస్ [మహిళా కార్మికులకు సురక్షితమైన ప్రవాసం] అనే ఈ చిన్న పుస్తకం ఇప్పటికే ఉన్న మెటీరియల్‌ను అప్‌డేట్ చేసి తయారుచేసినది. దీనిని ప్రస్తుతం బ్యూరోతో కలిసి పనిచేస్తోన్న కీర్తన ఎస్ రాగ్ 2023లో ప్రత్యేకించి మహిళలపైనే దృష్టిపెట్టి రూపొందించారు

Left: Menka, also from Aajeevika (in the centre) holding a afternoon workshop with a group of young girls, discussing their futures and more.
PHOTO • Priti David
Right: Teena speaking to young girls
PHOTO • Priti David

ఎడమ: మధ్యాహ్నంవేళ యువతుల బృందంతో ఒక వర్క్‌ షాప్ నిర్వహిస్తోన్న ఆజీవికాకు చెందిన మేనక (మధ్యలో), వారి భవిష్యత్తు గురించి, మరిన్నింటిని గురించో చర్చిస్తున్నారు. కుడి: యువతులతో మాట్లాడుతున్న టీనా

“అమ్మాయిలను ఇల్లు వదిలేసి వెళ్ళేలా ఒప్పించి తీసుకువెళ్ళిన కేసులను కూడా చూశాం. అప్పుడు వాళ్ళు ఒక పురుషుని నుండి మరొకరికి చేతులుమారతారు. దీన్ని తస్కరీ (దొంగరవాణా) అని తప్ప మరో పేరుతో పిలవలేమని నేననుకుంటున్నాను. అది ఇంకా పెరిగిపోతోంది," అన్నారు టీనా.

*****

దియాను ఎత్తుకుపోయిన తర్వాత ఆమెను అహ్మదాబాద్‌లోనూ, ఆ తర్వాత సూరత్‌లోనూ పనిలో పెట్టారు. ఆమె రవితో పాటు నిలబడి రోక్డీ - ఈ జంటను లేబర్ మండీల (బజార్లు) నుండి రోజుకు ఒక్కొక్కరికీ రూ. 350 నుండి 400 కూలీ ఇచ్చి పనికోసం లేబర్ కాంట్రాక్టర్లు తీసుకువెళ్తారు - చేసింది. తర్వాత, రవికి కాయం వచ్చింది. అంటే వారికి నెలవారీ కూలీ చెల్లిస్తారు, వాళ్ళు నిర్మాణ స్థలం దగ్గరే నివాసముంటారు.

"[కానీ] నేనెప్పుడూ నా సంపాదనను కళ్ళచూడలేదు. అతనే ఉంచుకునేవాడు," చెప్పింది దియా. రోజంతా కష్టమైన శారీరక శ్రమ చేసిన తర్వాత, ఆమె వంట, ఇంటి శుభ్రాలూ, కడుగుళ్ళూ ఉతుకుళ్ళూ- ఇలా ఇంటిపనులన్నీ చేసేది. కొన్నిసార్లు అక్కడ పనిచేసే మహిళా కూలీలు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసేవారు, కానీ రవి ఆమెను డేగలా కాపు కాసేవాడు.

"అక్కడినుండి తప్పించుకుని వెళ్ళిపోవడం కోసం మా నాన్న ఎవరితోనో మూడుసార్లు డబ్బు పంపించాడు. కానీ నేనలా బయటకు కాలు పెట్టగానే, ఎవరో ఒకరు చూసి చెప్పేవాళ్ళు (రవికి), అతను నన్ను వెళ్ళనిచ్చేవాడు కాదు. అప్పుడు బస్ ఎక్కిన రోజు కూడా, ఎవరో అతనికి చెప్పడం వల్లనే అతను నా వెంటపడి రాగలిగాడు," అతను తనని వెనక్కు ఈడ్చుకువెళ్ళిన రోజును గురించి చెప్పింది దియా.

తనను దొంగతనంగా ఎత్తుకొచ్చినందుకూ, తనపై జరుగుతోన్న హింసకూ వ్యతిరేకంగా సహాయం కోసం అడగటం గానీ ఏదైనా ప్రభుత్వ మద్దతు కోరటం గానీ చేయటానికి వాఁగ్డీ మాండలికంలో మాత్రమే మాట్లాడగలిగే దియాకు సాధ్యమయ్యేది కాదు. సూరత్‌లో ఆమెను ఎవరూ అర్థంచేసుకోలేదు. కంట్రాక్టర్లు కూడా గుజరాతీ, హిందీ మాట్లాడగలిగే మగవాళ్ళ ద్వారానే మహిళలతో మాట్లాడేవారు.

రవి దియాను బస్‌లో నుంచి బలవంతంగా లాక్కువచ్చిన నాలుగు నెలలకు దియా గర్భవతి అయింది; అది ఎంతమాత్రం ఆమె ఇష్టంతో జరిగింది కాదు. కొట్టడాలు తగ్గాయి కానీ మొత్తంగా మాత్రం ఆగిపోలేదు.

ఆమెకు ఎనిమిదో నెల రాగానే, రవి ఆమెను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో దిగబెట్టాడు. ఆమె ప్రసవం రోజున వాళ్ళు ఆమెను ఝాలోద్ (వారికి దగ్గరలో ఉన్న పెద్ద పట్టణం) లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత 12 రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచటం వలన దియా బిడ్డకు తన పాలు ఇవ్వలేకపోయింది, ఆ తర్వాత ఆమెకు పాలు రావటం ఆగిపోయింది.

Migrant women facing domestic violence are at a double disadvantage – contractors deal with them only through their husbands, and the women who don't speak the local language, find it impossible to get help
PHOTO • Priti David
Migrant women facing domestic violence are at a double disadvantage – contractors deal with them only through their husbands, and the women who don't speak the local language, find it impossible to get help
PHOTO • Priti David

గృహ హింసను ఎదుర్కొంటున్న వలస మహిళలు రెండు విధాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు - కాంట్రాక్టర్లు వారి భర్తల ద్వారా మాత్రమే వారితో మాట్లాడతారు, స్థానిక భాష మాట్లాడలేకపోవటంతో మహిళలకు సహాయం పొందడం అసాధ్యంగా మారింది

ఆ సమయంలో రవి హింసాత్మక ధోరణి గురించి ఆమె కుటుంబంలో ఎవరికీ తెలియదు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరిగి అతని ఇంటికి పంపేందుకు తొందరపడ్డారు - కొత్తగా తల్లులైనవాళ్ళు వలస వెళ్ళేటపుడు తమ పిల్లలను కూడా తమతో తీసుకువెళ్తారు. "ఆడపిల్లకు సహారా (ఆసరా) ఆమెను పెళ్ళి చేసుకున్న మగవాడే," కమల వివరించారు. "వాళ్ళు కలిసి జీవిస్తారు, కలిసి పనిచేసుకుంటారు." తల్లీ బిడ్డలు ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల ఆ కుటుంబ ఆర్థిక వనరులు ఆవిరైపోవటం మొదలయింది.

ఇంతలో మళ్ళీ తిట్లు మొదలయ్యాయి, ఇప్పుడు ఫోన్‌లో. " బహుత్ ఝగడా కర్తే థే (చాలా వాదనలు చేసుకునేవాళ్ళు)," కమల గుర్తుచేసుకున్నారు. బిడ్డకు చికిత్స కోసం డబ్బు ఇచ్చేందుకు రవి నిరాకరించాడు. ఇప్పుడు ఇంట్లో ఉంటోన్న దియా కొంచం ధైర్యం కూడగట్టుకుంది, తన స్వతంత్రాన్ని చూపించింది. "అలాగైతే నేను మా నాన్నను అడుగుతాను," అంటూ విసురుగా చెప్పింది.

అటువంటి ఒక సంభాషణలో తాను వేరే మహిళతో వెళ్తున్నట్టు అతను ఆమెకు చెప్పాడు. "నువ్వట్లా చేసినప్పుడు, నేను కూడా చేయగలను [మరో పురుషునితో]," అంటూ ఆమె జవాబిచ్చి, కాల్ కట్ చేసింది.

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పొరుగున ఉండే తహసీల్‌ లో తన ఇంట్లో ఉన్న రవి, మరో ఐదుగురు మగవాళ్ళతో కలిసి మూడు మోటార్ సైకిళ్ళ మీద ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. తాను మంచిగా ఉంటాననీ, మళ్ళీ సూరత్ వెళ్ళిపోదామనీ చెప్పి అతను ఆమెను ఒప్పించి తనతో తీసుకువెళ్ళాడు.

"అతను నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు నా బిడ్డను ఒక మంచం మీద పెట్టారు. మేరా ఘర్‌వాలా (భర్త) నన్ను కొట్టి, నా జుట్టు పట్టుకుని వేరే గదిలోకి లాక్కెళ్ళి తలుపు మూసేశాడు. అతని తమ్ముళ్ళు, స్నేహితులు కూడా లోపలికి వచ్చారు. గలా దబాయా (నా గొంతు నొక్కాడు), మిగిలినవాళ్ళు నా చేతుల్ని కదలకుండా పట్టుకుంటే, అతను తన రెండో చేతిలో ఉన్న బ్లేడుతో నా తలను గొరిగాడు," ఆమె గుర్తుచేసుకుంది.

ఆ సంఘటన దియా జ్ఞాపకాలలో బాధాకరంగా ముద్రపడిపోయింది. "నన్ను ఒక థంబా (స్తంభం)కి అణిచిపెట్టారు. నాకు చేతనైనంత పెద్దగా అరిచి కేకలు పెట్టాను, కానీ ఎవరూ రాలేదు." అప్పుడు మిగిలినవాళ్ళు ఆ గదిని వదిలి తలుపు మూశారు. "అతను నా బట్టలు తీసేసి నాపై అత్యాచారం చేశాడు. అతను వెళ్ళగానే, మరో ముగ్గురు వచ్చి వంతులవారీగా నాపై అత్యాచారం చేశారు. అంతవరకే నాకు గుర్తుంది, ఆ తర్వాతా నేను బేహోశ్ (స్పృహ కోల్పోయాను) అయ్యాను."

ఆమెకు స్పృహ రాగానే, తన పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తర్వాత ఆమెకు తెలిసిన విషయం ఏమిటంటే, "నా ఘర్‌వాలా (భర్త) 'ఆమె రావటంలేదు. మేం వచ్చి పిల్లాడిని ఇచ్చిపోతాం,' అని మా అమ్మకు కాల్‌చేసి చెప్పాడట. మా అమ్మ అందుకు ఒప్పుకోకుండా తానే వస్తానని చెప్పిందట."

Young mothers who migrate often take their very young children with them. In Diya's case, staying with her parents was straining the family’s finances
PHOTO • Priti David
Young mothers who migrate often take their very young children with them. In Diya's case, staying with her parents was straining the family’s finances
PHOTO • Priti David

కొత్తగా తల్లులైనవారు పనికోసం వలస వెళ్ళేటప్పుడు తమ చంటిబిడ్డలను కూడా తమతో తీసుకువెళ్తారు. దియా విషయంలో, ఆమె తన తల్లిదండ్రులతో ఉండటం వలన ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది

అతని ఇంటికి వెళ్ళినప్పుడు రవి తనను బిడ్డను తీసుకువెళ్ళమని చెప్పాడని కమల గుర్తుచేసుకున్నారు. "నేను 'లేదు' అన్నాను. నేను నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను." 'ఏదో కర్మకాండల కోసం' అన్నట్టుగా గుండు గీసివున్న దియా వణికిపోతూ ముందుకువచ్చింది. "నేను నా భర్తను పిలిచాను, ఆ ఊరి సర్పంచ్‌ నీ ముఖియా ని కూడా పిలిచాను. వాళ్ళు పోలీసులను పిలిచారు," కమల గుర్తుకుతెచ్చుకున్నారు.

పోలీసులు వచ్చే సమయానికి ఇదంతా చేసినవాళ్ళు మాయమైపోయారు. దియాను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. "నాపై కొరికిన గుర్తులున్నాయి. అత్యాచారానికి సంబంధించిన పరీక్షలేమీ చేయలేదు. నా గాయాలను ఫోటో కూడా తీయలేదు," చెప్పింది దియా.

గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం , 2005, సెక్షన్ (9జి), శారీరక హింస జరిగినట్లయితే, పోలీసులు తప్పనిసరిగా శారీరక పరీక్షకు ఆదేశించాలని స్పష్టంగా చెబుతోంది. జరిగినదంతా పోలీసులకు చెప్పామని ఆమె కుటుంబం చెపుతున్నప్పటికీ, కుశల్‌గఢ్ డిఎస్‌పిని ఈ రిపోర్టర్ ఈ విషయం గురించి అడిగినప్పుడు, దియా తన వాంగ్మూలాన్ని మార్చేసిందనీ, తనపై అత్యాచారం జరిగినట్టుగా చెప్పలేదనీ, ఆమెతో ఎవరో ఇలా చెప్పించినట్టుగా కనిపించిందనీ చెప్పుకొచ్చాడు.

దియా కుటుంబం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. " ఆధా ఆధా లిఖా ఔర్ ఆధా ఆధా ఛోడ్ దియా [వాళ్ళు మేం చెప్పినదానిని సగం రాసి సగం వదిలేశారు]," అంది దియా. "రెండుమూడు రోజుల తర్వాత నేను ఆ ఫైల్‌ని కోర్టులో చదివాను. అందులో నాపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా వాళ్ళు రాయలేదు. నేను వాళ్ళ పేర్లు చెప్పినప్పటికీ వాళ్ళు రాయలేదు."

The Kushalgarh police station where the number of women and their families filing cases against husbands for abandonment and violence is rising
PHOTO • Priti David

భర్తలు తమను విడిచిపేడుతున్నారనీ, హింసిస్తున్నారనీ మహిళలు, వారి కుటుంబాలు నమోదు చేస్తున్న కేసుల సంఖ్య పెరిగిపోతోన్న కుశల్‌గఢ్ పోలీస్ స్టేషన్‌

గృహ హింసను ఎదుర్కొంటున్న వలస మహిళలు రెండు విధాలా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు - కాంట్రాక్టర్లు వారి భర్తల ద్వారా మాత్రమే వారితో మాట్లాడతారు, స్థానిక భాష మాట్లాడలేకపోవటంతో మహిళలు సహాయం కోసం ఎవరినీ అడగలేకపోతున్నారు

రవి, తనపై అత్యాచారం చేసినట్టుగా దియా చెప్తోన్న మరో ముగ్గురు వ్యక్తులు అరెస్టయ్యారు. అలాగే అతని కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేశారు. వాళ్ళంతా బెయిలుపై బయటకు వచ్చారు. రవి స్నేహితులు, అతని కుటుంబం తన ప్రాణాలు తీస్తామని చేస్తోన్న బెదిరింపులను దియా తన ఇరుగుపొరుగువారి ద్వారా వింటూనేవుంది

2024 ప్రారంభంలో ఈ రిపోర్టర్ దియాను కలిసినప్పుడు, తన దినచర్య మొత్తం పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు అనేకసార్లు తిరుగడంతోనూ, మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన 10 నెలల బిడ్డను చూసుకోవడం చుట్టూనే తిరుగుతోందని ఆమె చెప్పింది.

"మేం కుశల్‌గఢ్‌కు బస్‌లో రావాలంటే ఒక్కొక్కరికీ రూ. 40 ఖర్చవుతుంది," అన్నారు దియా తండ్రి కిషన్. ఒక్కోసారి వెంటనే రావాలని ఆ కుటుంబానికి పిలుపు వస్తుంది. అప్పుడు 35 కిలోమీటర్ల దూరం ఉన్న తమ ఇంటి నుంచి ఒక ప్రైవేట్ వ్యాన్‌ని అద్దెకు తీసుకుని వెళ్ళడానికి వారికి రూ. 2000 ఖర్చవుతుంది.

ఖర్చులు పెరిగిపోతున్నప్పటికీ, పనికోసం వలస వెళ్ళడాన్ని కిషన్ ప్రస్తుతానికి నిలిపివేశారు. "ఈ కేసు పూర్తవకుండా నేనెలా వలసపోగలను? కానీ నేను పనిచేయకపోతే ఇల్లు గడవటం ఎలా?" అని అడుగుతారతను. "ఈ కేసును వదులుకోవటానికి బంజాడియా మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వజూపింది. 'తీసుకో'మని మా సర్పంచ్ చెప్పాడు. నేను వద్దని చెప్పేశాను! కానూన్ (చట్టం) ప్రకారం అతనికి శిక్ష పడనివ్వండి."

తన ఇంటిలోని మట్టి నేల మీద కూర్చొని ఉన్న 19 ఏళ్ళ దియా, నేరస్తులకు శిక్ష పడుతుందని ఆశిస్తోంది. ఆమె జుత్తు ఒక అంగుళం మేర పెరిగింది. "వాళ్ళు నాకేం చేయాలనుకున్నారో చేసేశారు. ఇప్పుడు నేను దేనికోసం బెదిరిపోవాలి? నేను పోరాడతాను. ఇలాంటి పనులు చేసినప్పుడు ఏం జరుగుతుందో అతను తెలుసుకొని తీరాలి. అప్పుడే అతను మరొకరి విషయంలో ఇలా చేయకుండా ఉంటాడు."

"అతనికి తప్పనిసరిగా శిక్ష పడాలి" హెచ్చిన స్వరంతో చెప్పింది దియా.

ఈ కథనం, భారతదేశంలో లైంగిక, జెండర్-ఆధారిత హింస (SGBV) నుండి బయటపడిన వారి సంరక్షణ కోసం సామాజిక, సంస్థాగత, నిర్మాణాత్మక అడ్డంకులపై దృష్టి సారించే దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఇది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండియా అందించిన ప్రేరణలో భాగం.

గుర్తింపును కాపాడటం కోసం హింస నుంచి బయటపడిన వ్యక్తుల, వారి కుటుంబ సభ్యుల పేర్లను మార్చాం.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Series Editor : Anubha Bhonsle

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli