రుబేల్ షేక్, అనిల్ ఖాన్‌లు డ్రైవింగ్ చేస్తున్నారు... కానీ వాళ్ళెక్కడా భూమికి దగ్గరగా లేరు. భూమికి దాదాపు 20 అడుగుల ఎత్తులో, అది కూడా దాదాపు లంబంగా 80 డిగ్రీల వాలులో ఉన్నారు. అగర్తలాలోని ఆ మేళా లో ఉన్న పెద్ద జనసమూహం చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. రుబేల్, అనిల్‌లు కారు కిటికీల నుంచి బయటకు వచ్చి జనం వైపు చేతులూపుతున్నారు.
వాళ్ళిద్దరూ మౌత్-కా-కువాఁ (మృత్యు కూపం)ను - కారు, బైక్‌లను 'గోడ' లేదా వేదిక పక్క భాగంలో నిట్టనిలువుగా నడిపిస్తూ చేసే అనేక విస్మయపరిచే విన్యాసాలు - ప్రదర్శిస్తున్నారు.
10 నిమిషాల నిడివి గల ఆటలుగా విభజించిన ఈ ప్రదర్శనలు అనేక గంటలపాటు కొనసాగుతాయి. ఈ ప్రదర్శన చెక్క పలకలతో నిర్మించిన ఒక బావిలాంటి నిర్మాణం లోపల జరుగుతుంది. మేళాల లో దీన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. వాటి నిర్మాణం వారి ప్రదర్శన, భద్రత విషయంలో చాలా కీలకమైనది కాబట్టి, చాలామంది సవారీ చేసేవాళ్ళే ఈ ప్రదేశాన్ని నిర్మించడంలో పాలు పంచుకుంటారు.
అశుభాన్ని సూచించే 'మౌత్-కా-కువాఁ ' అనే పేరున్న ఈ ప్రమాదకరమైన ప్రదర్శన 2023 అక్టోబర్‌లో త్రిపురలోని అగర్తలాలో జరిగే దుర్గాపూజ సందర్భంగా జరిగే మేళా లో నిర్వహించే అనేక ఆకర్షణలలో ఒకటి. ఫెర్రిస్ వీల్, రంగులరాట్నం, బొమ్మ రైళ్ళు మొదలైనవి ఇతర ఆకర్షణలు.
"మేం గోడ మీద ఏ కారునైనా నడపగలం, కానీ మారుతి 800 మాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దాని కిటికీలు పెద్దవిగా ఉంటాయి, [ప్రదర్శన సమయంలో] మేం బయటకు వెళ్ళడం సులభం," అని స్టంట్‌మ్యాన్ రుబేల్ చెప్పారు. తాము నాలుగు యమహా ఆర్‌ఎక్స్-135 బైక్‌లను కూడా ఉపయోగిస్తామని అతను చెప్పారు: "మేం పాత బైక్‌లను ఉపయోగిస్తాం, కానీ వాటిని చక్కగా మెయిన్‌టెయిన్ చేస్తాం."
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుండి వచ్చిన అతను, తన బృందానికి నాయకత్వం వహిస్తారు. వాహనాలన్నీ అతనివే. తాను 10 సంవత్సరాలకు పైగా ఇవే మోటార్‌సైకిళ్ళను ఉపయోగిస్తున్నట్టు రుబేల్ చెప్పారు, కానీ "వాటికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాను," అన్నారతను.
ఈ ప్రదర్శనలు గ్రామీణ ప్రాంత యువకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన మొహమ్మద్ జగ్గా అన్సారీ తాను ఈ ప్రదర్శనల్లోకి ఎలా వచ్చాడో వివరించాడు: “నా చిన్నతనంలో మా ఊరికి ఇలాంటి జాతరలు వచ్చినప్పుడు నేను ఇష్టంగా చూసేవాణ్ని.” దాంతో అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే సర్కస్‌లో చేరాడు. మొదట్లో చిన్న చిన్న పనులలో సహాయంగా ఉండేవాడు. "నెమ్మదిగా, నేను వాహనాలను నడపడం నేర్చుకోవడం మొదలుపెట్టాను," అని 29 ఏళ్ళ ఆ ప్రదర్శనకారుడు చెప్పాడు, "ఈ పని వల్ల నేను చాలా ప్రదేశాలకు వెళుతున్నా, అందుకే ఇదంటే నాకు ఇష్టం."
బిహార్‌లోని నవాదా జిల్లాలోని వారిస్అలీగంజ్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ కూడా చిన్న వయసులోనే ఈ ప్రదర్శనల్లో చేరాడు: "నేను 10వ తరగతి తర్వాత చదువు వదిలిపెట్టి, డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను."
అన్సారీ, పంకజ్‌లలాగే ఇతర ప్రదర్శనకారులు, ఈ ప్రదర్శనా వేదికలను నిర్మించేవాళ్ళు భారతదేశం నలుమూలల నుంచి వచ్చారు. వాళ్ళు తమ బృందంతో కలిసి వివిధ మేళాల కు తరలి వెళుతుంటారు. వారు సాధారణంగా ప్రదర్శనలు జరిగే జాతర సమీపంలోని డేరాలలోనే ఉంటారు. రుబేల్, అన్సారీ వంటి కొందరు తమ కుటుంబాలతో సహా ప్రయాణిస్తారు, పంకజ్ మాత్రం పని లేనప్పుడు ఇంటికి తిరిగి వెళతాడు.
బావిలాంటి నిర్మాణంతో ‘ మౌత్-కా-కువాఁ ’ను ఏర్పాటు చేయడం ప్రారంభమవుతుంది. "దీన్ని మొత్తం నిర్మించడానికి 3-6 రోజుల మధ్య పడుతుంది, కానీ ఈసారి మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మేం మూడు రోజుల్లోనే పూర్తిచేయాల్సి వచ్చింది" అని రుబేల్ చెప్పారు. తమకు సమయం ఉంటే నెమ్మదిగా పని చేస్తామని అతనన్నారు.
చివరకు రాత్రి సుమారు 7 గంటలకు ప్రదర్శనను ప్రారంభించే సమయమైంది. అగర్తలాలో టిక్కెట్లు కొనడానికి జనం బారులు తీరారు. టిక్కెట్ ధర మనిషికి రూ. 70, పిల్లలకు ఉచితం. రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్ళపై కనీసం నలుగురు వ్యక్తులు విన్యాసాలు చేసే ఒక్కో ప్రదర్శన 10 నిమిషాల పాటు కొనసాగుతుంది. వారు ఒక రాత్రిలో కనీసం 30 ప్రదర్శనలు ఇస్తారు. మధ్యలో 15-20 నిమిషాల విరామం ఉంటుంది.
అగర్తలాలో జరిగిన ఈ మేళా లో వీరి ప్రదర్శన చాలా ప్రజాదరణ పొందడంతో, వారు తమ ప్రదర్శనలను ఐదు రోజుల నుంచి మరో రెండు రోజులు పొడిగించారు.
“మా రోజువారీ వేతనం రూ. 600-700 ఉంటుంది, కానీ ప్రదర్శన సమయంలో ప్రజలు ఇచ్చేదే మాకు ముఖ్యమైన ఆదాయ వనరు," అని అన్సారీ చెప్పాడు. ఒక నెలలో అనేక ప్రదర్శనలు విజయవంతమైతే వాళ్ళు నెలకు సుమారు రూ. 25,000 సంపాదిస్తారు.
అయితే ఏడాది పొడవునా ఈ ప్రదర్శనను నిర్వహించలేమని రుబేల్ తెలిపారు: "వర్షాకాలంలో దీన్ని ప్రదర్శించడం చాలా కష్టం." ఈ పని చేయలేని సమయంలో, రుబేల్ తన గ్రామానికి తిరిగి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు.
ఈ ప్రదర్శనలో ప్రమాదాలు ఉంటాయి కదా అంటే పంకజ్ కొట్టి పారేస్తాడు: “ప్రమాదాలకు నేను భయపడను. మనకు భయం లేకుంటే, భయపడాల్సిన పని లేదు.” తాము ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఎన్నడూ ఎలాంటి ఘోరమైన ప్రమాదాలు జరగలేదని ఆ బృంద సభ్యులు తెలిపారు.
" మేం ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల ఆనందాన్ని చూస్తే, అదే నాకు ఆనందం," అంటారు రుబేల్.
అనువాదం: రవి కృష్ణ