కేంద్ర 'బడ్జెట్ కేవలం అధికారుల కోసమే'నని అలీ మొహమ్మద్ లోన్ నమ్ముతున్నారు. అంటే ఆయన అర్థంలో అది మధ్యతరగతి సర్కారీ లోగ్ లేదా ప్రభుత్వ ఉద్యోగులకోసం రూపొందించినదని. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక చిన్న బేకరీ దుకాణం యజమాని అయిన ఈయన, ఈ బడ్జెట్ తనలాంటి సామాన్యుల గురించి కాదని గుర్తించినట్లుగా కూడా ఇది సూచిస్తోంది.

"నేను 2024లో ఒక 50 కిలోగ్రాముల పిండి బస్తాను 1,400 రూపాయలకు కొన్నాను, ఇప్పుడు దాని ధర 2,200," టంగ్‌మర్గ్ బ్లాక్‌లోని మాహీన్ గ్రామానికి చెందిన ఈ 52 ఏళ్ళ రొట్టెల తయారీదారు మాతో మాట్లాడుతూ అన్నారు. "బడ్జెట్‌లో ధరలు తగ్గించటానికి సహాయపడేది ఏమైనా ఉండినట్లయితే, నాకు దాని పట్ల ఆసక్తి కలిగివుండేది; లేకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఈ బడ్జెట్ అధికారుల కోసమే."

శ్రీనగర్ నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే మాహీన్ గ్రామం శీతాకాలపు పర్యాటక ప్రాంతాలైన టంగ్‌మర్గ్, ద్రంగ్‌ల మధ్య ఉంది. ఇక్కడ పొట్టి గుర్రాలను అద్దెకివ్వటం, స్లెడ్జిలు లాగటం, గైడ్‌లుగా పనిచేయటం వంటి ప్రధానంగా పర్యాటక సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి అతిశీతల వాతావరణం కారణంగా, మాహీన్ ప్రధానంగా మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తుంది.

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ఎడమ: మాహీన్ గ్రామంలోని తన బేకరీ దుకాణంలో కూర్చొనివున్న అలీ మొహమ్మద్ లోన్. 2025 కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం, మధ్యతరగతి వారికోసమేనని ఆయన భావిస్తున్నారు. కుడి: మాహీన్ గ్రామం

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ఎడమ: మాహీన్ గ్రామం శీతాకాలపు పర్యాటక ప్రాంతాలైన టంగ్‌మర్గ్, ద్రంగ్‌ల మధ్య ఉంది. కుడి: టంగ్‌మర్గ్ వద్ద సందర్శకుల కోసం ఎదురుచూస్తోన్న మాహీన్‌కు చెందిన ATV డ్రైవర్లు

అలీ మొహమ్మద్ తన భార్య, ఇద్దరు కుమారులతో (ఇద్దరూ విద్యార్థులే) నివసిస్తున్నారు. ఆయన బేకరీ నుండి తయారయ్యే రొట్టెను గ్రామంలో నివసించే చాలామంది తమ ఆహారంగా తీసుకుంటారు. ఆయన పెద్ద కొడుకు యాసిర్ బేకరీ దుకాణంలో సహాయం చేస్తాడు. ఈ దుకాణాన్ని ఉదయం 5 గంటలకు తెరిచి మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తారు. దీని తరువాత, ఆయన మార్కెట్‌లో పెరుగుతోన్న ధరలను తట్టుకోవడానికి అవసరమైన అదనపు డబ్బును సంపాదించడానికి బేకరీ పక్కనే ఉన్న తన కిరాణా దుకాణానికి వెళ్తారు.

“12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు గురించి, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే రుణాల గురించి జనం చర్చించుకోవడాన్ని నేను విన్నాను. అయితే, నేను ముందుగా ఆ 12 లక్షలు సంపాదించాలి. నా వార్షిక ఆదాయం సుమారుగా 4 లక్షల రూపాయలు మాత్రమే. యువతకు ఉద్యోగ అవకాశాల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. బడ్జెట్‌లో ఉపాధి అవకాశాలకు సంబంధించినది ఏమైనా ఉందా?" ఆయన ఆసక్తిగా అడిగారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Muzamil Bhat

مزمل بھٹ، سرینگر میں مقیم ایک آزاد فوٹو جرنلسٹ اور فلم ساز ہیں۔ وہ ۲۰۲۲ کے پاری فیلو تھے۔

کے ذریعہ دیگر اسٹوریز Muzamil Bhat
Editor : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli