ఐదవ తరగతి చదువుతున్నప్పుడు, అంతవరకూ అబ్బాయిగా పెరిగిన రమ్య, తనను తాను అమ్మాయిగా గుర్తించటం మొదలెట్టింది.

“(మాధ్యమిక) పాఠశాలలో, నేను షార్టులు ధరించాల్సి వచ్చేది. అప్పుడు నా తొడలు కనిపించేవి. దాంతో, అబ్బాయిలతో కలిసి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది,” ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ముప్పయ్యో వడిలో ఉన్న రమ్య ఎరుపు రంగు చీర ధరించి, పొడవుగా పెంచుకున్న జుట్టుతో స్త్రీగా తన గుర్తింపును హత్తుకున్నారు.

చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ పట్టణంలో, ఒక చిన్న అమ్మన్ (దేవత) ఆలయాన్ని రమ్య నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి వెంగమ్మ ఆమె పక్కనే నేలపై కూర్చొనివున్నారు. “ఎదుగుతున్నప్పుడు అతను (రమ్యని చూపిస్తూ) చురీదార్ (స్త్రీలు ధరించే దుస్తులు), దావణి (ఓణీ), కమ్మల్ (చెవి దుద్దులు) ధరించడానికి ఇష్టపడేవాడు. అబ్బాయిలా ప్రవర్తించమని చెప్పే ప్రయత్నాలు చేశాం, కానీ అతను ఇలా ఉండడానికే ఇష్టపడ్డాడు,” రమ్య తల్లి, 56 ఏళ్ళ వెంగమ్మ అన్నారు.

ఆ సమయానికి కన్నియమ్మ దేవత ఆలయాన్ని మూసివేయడంతో, అక్కడ పరుచుకున్న నిశ్శబ్దం మా ఈ సంభాషణ స్వేచ్ఛగా కొనసాగేందుకు సహాయం చేసింది. ఈ తల్లీకూతుళ్ళలాగే, ఇరులర్ సముదాయంవారు కన్నియమ్మ దేవతను పూజించడానికి ఇక్కడకు పగటివేళల్లో వస్తుంటారు.

ఇరులర్ వాడలో పెరిగిన రమ్య, నలుగురు తోబుట్టువులలో ఒకరు. తమిళనాడులో జాబితా చేసివున్న ఆరు ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహాలలో (PVTGలు) ఇరులర్లు కూడా ఒకరు. తమ సముదాయంలోని చాలామందిలాగే రమ్య తల్లిదండ్రులు కూడా పొలాల్లో, నిర్మాణ స్థలాల్లో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పనిప్రదేశాలలో కాలానుగుణంగా కూలీ పనులు చేస్తూ, రోజుకు రూ.250 నుండి 300 వరకు సంపాదిస్తున్నారు.

“ఆ రోజుల్లో ఎవరికీ తిరునంగైల (ట్రాన్స్ మహిళకు తమిళ పదం) గురించి తెలియదు. దాంతో, నేను ఇంటి నుండి బయటకి వెళ్ళినప్పుడల్లా, మా ఊరి జనం నా వెనుక గుసగులాడుకునేవారు," అన్నారు రమ్య. "వాళ్ళు 'అతను అబ్బాయిలాగా ఉన్నాడు కానీ అమ్మాయిలా ప్రవర్తిస్తాడు. ఇంతకీ ఇతను అబ్బాయా లేదా అమ్మాయా?’ అనేవారు. ఆ మాటలు నన్ను బాధపెట్టేవి.”

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తిరుప్పోరూర్ పట్టణంలో తను నిర్వహిస్తున్న ఆలయంలో రమ్య. కుడి: తల్లి (నల్ల చీరలో ఉన్నవారు)తోనూ, పొరుగింటావిడతోనూ కలిసి విద్యుత్ కార్యాలయ అధికారులను కలవడానికి వెళ్తోన్న రమ్య

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తన దగ్గరి బంధువు దీపతో రమ్య. కుడి: MNREGA పనిలో భాగంగా ఇతర మహిళలతో కలిసి పండ్ల తోటలో పనిచేస్తోన్న రమ్య

తొమ్మిదవ తరగతిలో చదువు మానేసిన రమ్య, తన తల్లిదండ్రుల మాదిరిగానే రోజువారీ కూలీ పనులకు వెళ్ళేది. తన జెండర్‌ను అమ్మాయిగానే వ్యక్తపరిచేది. అయితే, తమ సముదాయంలోని ఇతర జనం తమ గురించి ఏమనుకుంటారోనని ఆందోళన చెందిన ఆమె తల్లి, రమ్యను “అబ్బాయిలా ఉండమని” తరచూ బతిమిలాడేవారు.

తన ఇరవయ్యోవడిలో, తాను కోరుకున్నట్లు జీవించడానికి ఇల్లు వదిలివెళ్తానని రమ్య సూచించింది. అప్పుడే ఆమె తల్లి, అప్పటికి జీవించే ఉన్న ఆమె తండ్రి రామచంద్రన్, రమ్య మనోవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. “మాకు నలుగురు కొడుకులున్నారు. ఎలాగూ ఆడపిల్ల పుట్టలేదు కాబట్టి, అమెనలాగే ఉండిపొమ్మని చెప్పాం," అన్నారు వెంగమ్మ. “అబ్బాయైనా అమ్మాయైనా, అది మా బిడ్డ. ఇంటి నుండి తనను ఎలా వెళ్ళిపోనివ్వగలం?”.

ఆ విధంగా వారి ఇంటిలో రమ్యను స్త్రీల దుస్తులు ధరించడానికి అనుమతించారు. అయితే, ట్రాన్స్ మహిళలు సాధారణంగా పాటించే మూస పద్ధతులకు భయపడిన వెంగమ్మ, “ నీ కడై ఏరక్కూడాదు, ” అని కూతురితో చెప్పారు. అంటే, రమ్య తన జీవనోపాధి కోసం డబ్బులడుగుతూ దుకాణాల చుట్టూ తిరక్కూడదని అర్థం.

“నా లోలోపల నన్ను నేను స్త్రీగా భావించుకుంటున్నప్పటికీ, బయటికి గడ్డంతో, మగవాడి లక్షణాలతో ఉన్న నన్ను ఇతరులు పురుషుడిగా మాత్రమే చూసేవారు,” రమ్య తెలిపారు. 2015లో, తాను పొదుపు చేసుకున్న డబ్బు, దాదాపు లక్ష రూపాయలు ఖర్చుపెట్టి, లింగ స్థిరీకరణ శస్త్రచికిత్సతో పాటు, లేజర్ చికిత్స ద్వారా వెంట్రుకలను తొలగించుకున్నారు రమ్య.

తిరుప్పోరూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే పుదుచ్చేరిలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఆమెకు రూ.50,000 ఖర్చయింది. అది చాలా దూరం, పైగా శస్త్రచికిత్స కూడా ఉచితం కాకపోయినప్పటికీ, అక్కడి లింగ సంరక్షణ బృందంలో పనిచేసే తన స్నేహితురాలు సిఫార్సు చేయడంతో రమ్య ఆ ఆసుపత్రికి ప్రాధాన్యం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచిత శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలోని ఒక క్లినిక్‌లో, అదనంగా మరో రూ.30,000 ఖర్చుపెట్టి, ఆరు సెషన్లలో ఆమె తన ముఖం పైన వెంట్రుకలను తొలగించుకున్నారు.

వళర్మది అనే ఇరుల తిరునంగై , ఆమెకు తోడుగా ఆసుపత్రికి వెళ్ళారు. సర్జరీకి కొద్ది క్షణాల ముందు, ఆసుపత్రి పడకపై కూర్చొనివున్న రమ్య, తను వేయబోయే అడుగు ఎంత పెద్దదో అనే విషయాన్ని గ్రహించారు. శస్త్రచికిత్సలు సరిగ్గా జరగని తోటి ట్రాన్స్ మహిళల గురించి ఆమె విన్నారు. “సదరు శరీరభాగాలను పూర్తిగా తొలగించకపోవటమో, లేదా మూత్ర విసర్జన సమయంలో వారు ఇబ్బంది ఎదుర్కోవటమో జరిగేది.”

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తన తల్లి వెంగమ్మతో రమ్య. కుడి: తన ఇంట్లో వళర్మది

ఆమె శస్త్రచికిత్స విజయవంతమైంది. “అదొక పునర్జన్మలా భావించాను,” అన్నారు రమ్య. “నేను ఈ శస్త్రచికిత్స చేయించుకున్న తరువాతనే నా తల్లిదండ్రులు నన్ను ‘రమ్య’ అని పిలవసాగారు. అప్పటి వరకు వారు నన్ను నా పంతి (పాత) పేరుతో పిలిచేవారు.”

తన శస్త్రచికిత్స, తన చుట్టూ ఉన్న మహిళల దృక్పథాన్ని మార్చిందని ఆవిడ నమ్ముతున్నారు. వారందరూ ఇప్పుడు ఆమెను తమలో ఒకరిగా భావిస్తున్నారు. “నేను బయటకు వెళ్ళినప్పుడు, వారు నాతో పాటు టాయిలెట్‌కు కూడా వస్తారు,” నవ్వుతూ తెలిపారామె. పద్నాలుగు మంది సభ్యులతో కూడిన ‘ కాట్టుమల్లి ఇరులర్ పెణ్‌గళ్ కుళు ’ అనే మహిళా స్వయం సహాయక బృందానికి రమ్య నాయకురాలు కూడా.

అంతేకాకుండా, పాములు పట్టుకోవడానికి లైసెన్స్ ఉన్న రమ్య, తన సోదరునితో కలిసి విషానికి విరుగుడు (యాంటీ-వెనమ్)ను తయారుచేయడం కోసం, ఇరులర్ స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీకి పాములను సరఫరా చేస్తుంటారు. దీని ద్వారా, సంవత్సరంలో (వానా కాలం మినహా) ఆరు నెలల పాటు, నెలకు సుమారు రూ.3,000 సంపాదిస్తున్నారు. ఆమె రోజువారీ కూలీ పనులకు కూడా వెళ్తుంటారు.

యాభై ఆరు కుటుంబాలతో కూడిన ఆమె ఇరులర్ సముదాయం, తిరుప్పోరూర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్, చంబాక్కం చుణ్ణాంబు కలవై కు గత ఏడాది మకాం మార్చింది. రమ్య ప్రభుత్వ అధికారులను కలిసి, కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందడంలో, గుర్తింపు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో తన సముదాయానికి సహాయపడ్డారు.

పౌర సమాజంలోనూ, రాజకీయాలలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు; గత 2022లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో, తన సముదాయానికి వోటు చేసే హక్కును పొందడం కోసం చేపట్టిన నిరసనలకు ఆమె నాయకత్వం వహించారు. అయితే, చెంబాక్కం పంచాయతీకి చెందిన ఇరులరేతర సభ్యులు వారికి వోటు హక్కు ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇప్పుడు, మా వాడకు ప్రత్యేక వార్డు హోదాను సంపాదించటం కోసం ప్రయత్నిస్తున్నాను,” ఆమె తెలిపారు. తన సముదాయానికి సేవ చేయడం కోసం, ఏదో ఒక రోజున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆమె భావిస్తున్నారు. “ఎవరైనా వారికి నచ్చిన జీవితాన్ని జీవించాలి. నేను అబద్ధపు బతుకు బతకలేను.”

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: ఫోన్ నంబర్లతో కనెక్షన్లను లింక్ చేయడానికి అవసరమైన విద్యుత్ మీటర్ రీడింగును, ఇతర వివరాలను రాసుకుంటున్న రమ్య. కుడి: వారి కొత్త ఇళ్ళ విద్యుత్ కనెక్షన్లు, సంబంధిత ఫోన్ నంబర్లతో అనుసంధానించబడి ఉన్నాయని విద్యుత్ కార్యాలయ అధికారులతో నిర్ధారించుకుంటోన్న రమ్య

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తన స్వయం సహాయక బృందం సభ్యులతో రమ్య. (ఎడమవైపున మలర్, కుడి వైపున లక్ష్మి) కుడి: చెంబాక్కం చుణ్ణాంబు కలవైలోని తన కొత్త ఇంటి ముందు రమ్య

రాష్ట్రవ్యాప్తంగా, దాదాపు రెండు లక్షల మంది (2011 జనగణన) ఇరులర్ సముదాయం వారున్నారు. “మాకు అబ్బాయైనా, అమ్మాయైనా, తిరునంగై అయినా, మా బిడ్డను మేం అంగీకరించి తనకి అన్నీ సమకూరుస్తాం. అయితే, ప్రతి కుటుంబం ఇలాగే చేస్తుందని చెప్పలేం,” అన్నారామె. ఇరులర్ సముదాయానికి చెందిన ఆమె స్నేహితులు – ఇరవయ్యోవడిలో ఉన్న సత్యవాణి, సురేశ్‌లకు వివాహమై పది సంవత్సరాలయింది. 2013 నుండి, వారు తిరుప్పోరూర్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్నప్పట్టులోని ఇరులర్ కుగ్రామంలో, తారుగుడ్డ (టార్పాలిన్)తో కప్పిన ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు.

ఒక ట్రాన్స్ మహిళగా సౌకర్యవంతంగా తాను ఎదగడానికి తన సముదాయం, ఇంకా వళర్మదిలాంటి స్నేహితులే కారణమని రమ్య తెలిపారు. రమ్య ఇంటి బయట కూర్చున్న ఆ స్నేహితురాళ్ళిద్దరూ తమిళ మాసమైన ఆడి లో జరుపుకునే ఆడి తిరువిళ , అలాగే మామల్లాపురం [మహాబలిపురంగా ప్రసిద్ది గాంచింది] తీరం వెంబడి జరిగే ఇరులర్ సముదాయపు వార్షిక సమ్మేళనమైన మాసి మగమ్ వంటి పండుగలు ఎలా తమకు ఒక ఆత్మీయ అనుభూతిని కలిగిస్తాయో మాతో పంచుకున్నారు.

ఈ సమ్మేళనాలలో, “అమ్మాయిల్లాగా దుస్తులు వేసుకోవటం” కోసమే నృత్య ప్రదర్శనలివ్వడానికి తాము ఒప్పుకున్నామని వళర్మది తెలిపారు. ఆడి పండుగ కోసం ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతిరోజూ తాను ఎందుకలాంటి దుస్తులు వేసుకోలేకపోతున్నానని ఆమె తరచూ ఆలోచిస్తుంటారు!

“ప్యాంట్-షర్ట్ వేసుకునే రోజుల నుండి మేం స్నేహితులం.” రమ్య తెలిపారు. వారు 6వ తరగతిలో కలుసుకున్నారు. తన తల్లిని కోల్పోయిన వళర్మది తన తండ్రి, ఇద్దరు తోబుట్టువులతో కలిసి కాంచీపురం పట్టణాన్ని వదిలి, తిరుప్పోరూర్ పట్టణ సమీపంలోని ఎడయాన్‌కుప్పం అనే ఇరులర్ కుగ్రామానికి మారారు. ఇద్దరూ తమ భావాలను, చింతలను ఒకరికొకరు పంచుకునేవారు; చిన్న వయసులోనే తామిద్దరం కొన్ని విషయాల గురించి ఒకేవిధంగా ఎలా ఆరాటపడుతున్నారో వాళ్ళు కనుగొన్నారు.

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: రమ్య, వళర్మది. కుడి: యుక్తవయసులో, స్త్రీలు వేసుకునే ‘దావణి’ ధరించినప్పటి తన ఫోటోను చూపిస్తున్న వళర్మది. సముదాయం జరుపుకునే ఒక పండుగ సందర్భంగా ప్రదర్శన కోసం ఆమె దానిని ధరించింది- అదే ఆమె దావణిని ధరించగలిగే ఏకైక సమయం

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: సత్యవాణి, వళర్మది. కుడి: తిరుప్పోరూర్ పట్టణ సమీపంలోని ఇరుల కుగ్రామమైన కున్నప్పట్టులో, ఒక గుడిసెలో నివసిస్తోన్న సత్యవాణి, సురేశ్‌లు. ఇరులర్ సంస్కృతి ప్రకారం, పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఒకరిపై ఒకరు పసుపు నీళ్ళు పోసుకున్నారు

*****

ఇంట్లో మొదటి 'కొడుకు’గా పుట్టిన వళర్మది జెండర్ గుర్తింపు, తండ్రితో ఆమెకున్న సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నవయసులోనే బడి మానేసిన ఆమె, అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తిరునంగై కుటుంబంలో చేరడానికి తన ఇంటి నుండి పారిపోయింది. “నేను ఇతర తిరునంగై లతో కలిసి ఒక ఇంట్లో నివసించాను. మమ్మల్ని ఒక గురువు/ అమ్మ – పెద్ద వయసు ట్రాన్స్ మహిళ – దత్తత తీసుకున్నారు.”

తరువాతి మూడేళ్ళూ స్థానిక దుకాణాలకు వెళ్ళి, ఆశీర్వదించి డబ్బు తీసుకోవడమే వళర్మది పనిగా మారింది. “బడికి వెళ్ళినట్లే నేను ప్రతిరోజూ దుకాణాలకు వెళ్ళేదాన్ని,” గుర్తుచేసుకున్నారామె. తన సంపాదన మొత్తాన్ని – ఆవిడ అంచనాల ప్రకారం కొన్ని లక్షల రూపాయలు – తన గురువుకు ఇవ్వవలసి వచ్చింది. అదే సమయంలో, ఒక లక్ష రూపాయల అప్పును కూడా ఆమె తిరిగి చెల్లించవలసి వచ్చింది. ఆ డబ్బును, ఆమె లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స కోసం, ఆ తరువాత దానిని పండుగలా జరుపుకునే ఒక భారీ ఆచారం కోసం ఆమె పేరు మీద ఆమె గురువు అప్పుగా తీసుకుంది.

ఇంటికి డబ్బు పంపలేకపోవడం, తనను కనీ పెంచిన కుటుంబాన్ని కలవడానికి కూడా అనుమతి దొరకకపోవడంతో, ఆ ఇంటిని వదిలివెళ్ళడం కోసం వళర్మది వేరొక గురువు సహాయాన్ని తీసుకున్నారు. ప్రస్తుత ట్రాన్స్ కుటుంబాన్ని విడిచిపెట్టి, చెన్నైలోని కొత్త తిరునంగై కుటుంబానికి బదిలీ కావడానికి తన గురువుకు ఆమె రూ.50,000 జరిమానా చెల్లించారు.

“ఇంటికి డబ్బు పంపిస్తానని, నా తోబుట్టువులను ఆదుకుంటానని నేను మా నాన్నకు వాగ్దానం చేశాను,” ఆమె తెలిపారు. ట్రాన్స్ వ్యక్తులకు, ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న తనలాంటి వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు పరిమితంగా అందుబాటులో ఉండటంతో, ఆమె సెక్స్ వర్క్ చేశారు. డబ్బుల కోసం ప్రజలను ఆశీర్వదిస్తూ సబర్బన్ రైళ్ళలో ప్రయాణించారు. ఆ రైలు ప్రయాణాల్లోనే, ఆమెకు అప్పటికి ఇరవయ్యోవడిలో ఉన్న రాకేశ్ పరిచయమయ్యారు. అతనప్పుడు షిప్పింగ్ యార్డ్‌లో పనిచేస్తున్నారు.

PHOTO • Smitha Tumuluru

తన ఇంటికి మొదటి ‘కొడుకు’గా పుట్టిన వళర్మది. ఆమె జెండర్ గుర్తింపు, తన తండ్రితో సంబంధాలలో ఉద్రిక్తతకు కారణమైంది. చిన్నవయసులోనే ఆమె ఒక తిరునంగై కుటుంబంలో చేరడం కోసం తన ఇంటి నుండి పారిపోయింది

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: పాము పచ్చబొట్టు వేయించుకున్న ఇరులర్ సముదాయానికి చెందిన వళర్మది. తిరుప్పోరూర్ చుట్టుపక్కల నివసించే ఇరులర్ సముదాయాలు, పాములు పట్టడంలో దిట్టలు. పాములంటే తనకు చాలా ఇష్టమని వళర్మది తెలిపారు. కుడి: రాకేశ్ ఛాతీపై పచ్చబొట్టు రూపంలో ఉన్న ఆమె పేరు

ఈ జంట ప్రేమలో పడింది; 2021లో, ఆచారాల ప్రకారం వివాహం చేసుకొని, వారు కలిసి జీవించడం ప్రారంభించారు. తిరుప్పోరూర్ పట్టణంలో సరైన ఇల్లు/వారితో గౌరవంగా వ్యవహరించే ఇంటి యజమాని దొరకకపోవడంతో, మొదట్లో వారు ఎడయన్‌కుప్పంలోని వళర్మది తండ్రి నాగప్పన్ ఇంట్లో నివసించారు. అయితే, తన ఇంటిని వారితో పంచుకున్నప్పటికీ, నాగప్పన్ మనస్పూర్తిగా వారిని అంగీకరించలేకపోవడంతో, ఆ దంపతులు అతని ఇంటిని వదిలి, దాని పక్కనే ఒక గుడిసెను అద్దెకు తీసుకున్నారు.

“నేను వసూల్ కోసం (డబ్బుల కోసం దుకాణాలకు వెళ్ళడం) వెళ్ళడం మానేశాను. చప్పట్లు కొట్టి, కొన్ని వేల రూపాయలు సంపాదించాలని ఆరాటపడేదాన్ని, కానీ రాకేశ్‌కి అది నచ్చలేదు,” అన్నారు వళర్మది. తన తండ్రితో కలిసి, సమీపంలోని కల్యాణ మండపంలో, రోజుకు రూ.300ల జీతానికి గిన్నెలు కడిగి, ఆవరణను శుభ్రంచేసే పనిలో చేరారు.

“ఆమె తన గురించి నాకు అన్నీ చెప్పింది. అది నాకు నచ్చింది,” డిసెంబర్ 2022లో ఆయనను ఈ విలేఖరి కలిసినపుడు, రాకేశ్ అన్నారు. జెండర్ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత, రొమ్ముల పెరుగుదల ప్రక్రియ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు, వళర్మదికి ఆయన ఆర్థికంగానూ మానసికంగానూ మద్దతునిచ్చారు. శస్త్ర చికిత్స కోసం, ఆ తరువాత ఆమె కోలుకోవడానికి వారికి లక్ష రూపాయలకు పైగా ఖర్చయింది. “ఈ సర్జరీలన్నీ నా నిర్ణయాలే. ఇంకెవరో చేయించుకున్నారు కాబట్టి నేను చేయించుకోలేదు. నేను నా గురించి, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అన్నది మాత్రమే ఆలోచించాను,” అన్నారామె.

వారి పెళ్ళయ్యాక వచ్చిన వళర్మది మొదటి పుట్టినరోజు సందర్భంగా, ఆమెతో పాటు కేక్ కొనడానికి దుకాణానికి వెళ్ళారు రాకేశ్. ఆమెను చూసిన దుకాణదారుడు వసూల్‌ కి వచ్చిందని భావించి, కొన్ని నాణేలను ఇవ్వబోయాడు. దాంతో ఇబ్బందిపడిన ఆ జంట తమ ఉద్దేశ్యాన్ని వివరించడంతో, ఆ దుకాణదారుడు క్షమాపణలు అడిగాడు. ఆ రాత్రి వళర్మది తన భర్త, తోబుట్టువులతో కలిసి రంగు రంగుల కాగితాల ముక్కలను విసురుకుంటూ కేకు, నవ్వులు నిండిన ఒక చిరస్మరణీయమైన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఆ తరువాత, ఆ దంపతులు ఆశీస్సుల కోసం ఆమె తాతయ్యను కూడా కలిశారు.

మరొక సందర్భంలో, రాత్రిపూట ఆలస్యంగా బైక్‌పై వెళ్తుంటే, పోలీసులు తమను అడ్డుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పుడామె వారికి తన తాళి ని చూపించారు. అయితే, వారు భయపడినట్లుగా కాకుండా, ఆశ్చర్యపోయిన పోలీసులు వారికి శుభాకాంక్షలు తెలిపి, వారిని వెళ్ళనిచ్చారు.

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: తన పాళ్ వేడుక - ఒక తిరునంగై లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకున్న 48 రోజుల తరువాత, అనేక ఆచారాలతో జరుపుకునే విస్తృత వేడుక - ఆల్బమ్‌ను చూపిస్తోన్న వళర్మది. కుడి: తమిళనాడులోని ట్రాన్స్ వ్యక్తులకు జారీ చేయబడిన ‘టిజి కార్డ్’ (ట్రాన్స్ జెండర్ గుర్తింపు కార్డు)తో వళర్మది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రయోజనాలను, అర్హతలను పొందేందుకు ఈ కార్డు వారికి వీలు కల్పిస్తుంది

PHOTO • Smitha Tumuluru
PHOTO • Smitha Tumuluru

ఎడమ: ఒక దుకాణంలో ప్రార్థన చేస్తోన్న వళర్మది. కుడి: తిరుప్పోరూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడువాంచేరి పట్టణంలో, కూరగాయల దుకాణం నడుపుతున్న దంపతులను ఆశీర్వదిస్తున్న వళర్మది. ఆమె నెలవారీ సందర్శన కోసం ఈ ప్రాంతంలోని దుకాణదారులు వేచి చూస్తుంటారు. తిరునంగై ఆశీర్వాదం చెడును పారదోలుతుందని వారు నమ్ముతారు

ఆగస్ట్ 2024లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాకేశ్ చెన్నైకి వెళ్ళారు. “అతను నా ఫోన్ కాల్‌లకు సమాధానమివ్వలేదు. తిరిగి రాలేదు కూడా,” అతని కోసం వెతకమని తండ్రి ప్రోత్సహించడంతో ఆ నగరానికి వెళ్ళిన వళర్మది తెలియజేశారు.

“పిల్లల్ని కనడానికి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం కోసం అతన్ని వదిలేయమని రాకేశ్ తల్లిదండ్రులు నాకు మర్యాదగా చెప్పారు. నా వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలని నాకు ఎప్పుడూ తోచలేదు. అతను నన్ను వదిలేయడని నమ్మాను,” అన్నారామె. ఇకపై రాకేశ్ వెంటబడకూడదని నిర్ణయించుకొన్న వళర్మది, చెన్నైలోని తన తిరునంగై కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు.

ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాల నుండి తన తిరునంగై కుటుంబంలోకి తాను దత్తత తీసుకున్న ఇద్దరు ట్రాన్స్ బాలికలకు మార్గదర్శనం ఇవ్వడానికి ఆమె ఎదురుచూస్తున్నారు. వారిలో ఒకరు పోలీసు అధికారి కావాలని కోరుకుంటుండడంతో, ఆ కలను సాకారం చేసుకోవడంలో ఆమెకు సహాయం చేయాలని వళర్మది ఆశిస్తున్నారు.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Smitha Tumuluru

اسمیتا تُمولورو بنگلورو میں مقیم ایک ڈاکیومینٹری فوٹوگرافر ہیں۔ تمل ناڈو میں ترقیاتی پروجیکٹوں پر ان کے پہلے کے کام ان کی رپورٹنگ اور دیہی زندگی کی دستاویزکاری کے بارے میں بتاتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Smitha Tumuluru
Editor : Riya Behl

ریا بہل ملٹی میڈیا جرنلسٹ ہیں اور صنف اور تعلیم سے متعلق امور پر لکھتی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) کے لیے بطور سینئر اسسٹنٹ ایڈیٹر کام کر چکی ہیں اور پاری کی اسٹوریز کو اسکولی نصاب کا حصہ بنانے کے لیے طلباء اور اساتذہ کے ساتھ کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Riya Behl
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

کے ذریعہ دیگر اسٹوریز Y. Krishna Jyothi