కిరణ్ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటివరకూ మోసుకొస్తుంది.

కేవలం 11 ఏళ్ళ వయసున్న ఆమెకు మరో అవకాశం లేదు - ప్రతి ఏటా ఆమె తల్లిదండ్రులు వలస పోతుండటంతో, బాన్స్‌వాడా జిల్లాలోని ఆమె గ్రామంలో (పేరును తొలగించాము) ఉన్న ఇంటిలో మరెవ్వరూ ఉండరు. 18 ఏళ్ళ వయసున్న ఆమె అన్న వికాస్ (పేరు మార్చాం) ప్రస్తుతానికి అక్కడే ఉన్నాడు, కానీ గతంలో చేసినట్టే అతను కూడా ఎప్పుడైనా వలసపోవచ్చు. మూడు నుంచి పదమూడేళ్ళ మధ్య వయసుండే వారి మిగిలిన ముగ్గురు తోబుట్టువులు గుజరాత్, వడోదరలోని నిర్మాణ స్థలాల వద్ద కూలీలుగా పనిచేసే వారి తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. వాళ్ళు బడికి వెళ్ళలేకపోయినా, కిరణ్ మాత్రం బడికి వెళ్తోంది.

"నేను ఉదయం పూట కొంత వంట చేస్తాను," ఈ రిపోర్టర్‌తో తన దినచర్య గురించి చెప్పింది కిరణ్ (పేరు మార్చాం). ఆ ఒంటిగది ఇంటిలో దాదాపు సగభాగాన్ని వంటచేసుకునే ప్రదేశం ఆక్రమించింది. కప్పుకు వేలాడదీసి ఉన్న ఒకే ఒక మెరుపు దీపం (ఫ్లాష్ లైట్), సూర్యుడు దిగిపోగానే ఆ ఇంటికి వెలుతురును అందిస్తుంది.

ఒక చివరన కట్టెల పొయ్యి ఉంది; మరికొన్ని కట్టెలు, ఒక పాత ఇంధనపు డబ్బా ఆ దగ్గరలోనే ఉన్నాయి. కూరగాయలు, మసాలాలు, ఇంకా ప్లాస్టిక్ సంచుల్లోనూ డబ్బాలలోనూ ఉన్న ఇతర దినుసులు కొన్ని నేలమీదా, మరికొన్ని ఆమె చిన్ని చేతులకు అందే ఎత్తున గోడలకూ తగిలించి ఉన్నాయి. "బడి అయిపోయాక సాయంత్రం పూట నేను రాత్రి భోజనాన్ని కూడా వండుకుంటాను. ఫిర్ ముర్గీ కో దేఖ్‌నా [తర్వాత కోడి పెట్టలనూ పుంజులనూ చూసుకుంటాను], ఆ తర్వాత నిద్రపోతాం," చెప్పింది కిరణ్

సిగ్గుపడుతూ ఆమె వివరించే కథనంలో, స్థానికులు బిజిలియా లేదా దావడా ఖోరా అని పిలిచే సమీపంలోని కొండల దిగువన ఉన్న అడవుల నుండి కట్టెలను సేకరించి మోసుకురావడం వంటి అనేక ఇతర ఇంటి పనులను గురించి చెప్పకుండా వదిలివేస్తుంది. అడవికి వెళ్ళడానికి కిరణ్‌కు సుమారు ఒక గంట పడుతుంది. కట్టెలను నరికి, వాటిని దగ్గరగా చేర్చి మోపుగా కట్టడానికి మరో గంట పడుతుంది. కొన్ని కిలోల బరువున్న కట్టెలతో ఇంటికి తిరిగి రావడానికి మరో గంట పడుతుంది. ఆ కట్టెల మోపు ఖచ్చితంగా ఆమె కంటే ఎత్తుగా ఉండి, పీలగా ఉండే ఆ చిన్నారి కంటే ఎక్కువ బరువు ఉంటుంది.

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ఆ గ్రామం నుంచి దూరంగా కనిపిస్తోన్న కొండలను స్థానికులు బిజిలియా లేదా దావడా ఖోరా అని పిలుస్తారు. ఈ ప్రాంతంలోని పిల్లలు కట్టెలను సేకరించడానికి, పశువులను మేపటానికి ఈ కొండలకే వెళ్తుంటారు

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ఎడమ: వాళ్ళకు సమయం చిక్కినప్పుడల్లా కిరణ్, ఆమె అన్న రానున్న కాలంలో ఉపయోగించుకోవటానికి కట్టెలను సేకరించి ఇంటి పక్కనే రాశివేసి ఉంచుతారు. ఒక్కసారి అడవికి వెళ్ళి రావటానికి వాళ్ళకు మూడు గంటలవరకూ సమయం పడుతుంది. కుడి: వంట సామగ్రి - ప్రభుత్వం ఇచ్చే రేషన్ మొదలుకొని పెంచినవి, ఏరి తెచ్చుకున్న కూరాకులతో సహా - ఇంట్లోని గోడలకు వేలాడుతోన్న సంచులలో నిలవచేసుకుంటారు

"నేను నీళ్ళు కూడా మోసుకొస్తాను," చెప్పటం మర్చిపోయిన కష్టమైన పనిని గుర్తుచేసుకుని చెప్పింది కిరణ్. ఎక్కడినుంచి? "చేతి పంపు దగ్గరనుంచి." ఆ చేతి పంపు ఆమె పొరుగువారైన అశ్మిత కుటుంబానికి చెందినది. "మా భూమిలో రెండు చేతిపంపులున్నాయి. ఈ ప్రాంతంలో నివాసముండే ఎనిమిది కుటుంబాలవారంతా వాటినుంచే నీళ్ళు తెచ్చుకుంటారు," 25 ఏళ్ళ అస్మిత చెప్పింది. "వేసవికాలం వచ్చి చేతిపంపులు ఎండిపోగానే, జనం గడ్డ [బిజిలియా కొండల పాదాల వద్ద సహజంగా ఏర్పడిన నీటి మడుగు] దగ్గరకు వెళ్తారు." మరింత దూరాన ఉన్న ఆ గడ్డ , కిరణ్‌లాంటి చిన్న పిల్లలకు ఇంకింత దూరమవుతుంది.

సల్వార్ కుర్తా వేసుకుని దానిపై శీతాకాలపు చలి నుంచి రక్షణ కోసం ఊదారంగు చలికోటు (స్వెటర్) వేసుకునివున్న కిరణ్, తన వయసు కంటే చాలా పెద్దగానే కనిపిస్తోంది. అయితే ఆమె ఉన్నట్టుండి " మమ్మీ పాపా సే రోజ్ బాత్ హోతీ హై... ఫోన్ పే [మేం మా అమ్మా నాన్నలతో రోజూ మాట్లాడతాం... ఫోన్‌లో], అన్నప్పుడు ఆమె పసితనపు తళుకు కనిపిస్తుంది

దక్షిణ రాజస్థాన్‌లోని బాన్స్‌వాడా జిల్లాలో సగం కుటుంబాలు వలస వెళ్ళినవే. జిల్లా జనాభాలో 95 శాతం కిరణ్ కుటుంబం వంటి భిల్ ఆదివాసీ కుటుంబాలే. ఇక్కడ ఉండే భూమికి, ఇంటికీ రక్షణగా వాళ్ళు తమ పిల్లల్ని ఇక్కడే వదిలేసి వలసపోతారు. కానీ, ఈ చిన్నారి భుజాలపై అన్యాయమైన ఈ భారంతో పాటు, ఒంటరిగా జీవించటం కూడా వేటాడాలనుకునేవారికి వారి దుర్బలత్వాన్ని కనిపించేలా చేస్తుంది.

అది జనవరి నెల ప్రారంభం, పొలాలన్నీ ఎండిన చిట్టిపొదలతోనూ, కోతకు సిద్ధంగా ఉన్న పత్తి పంటతోనూ గోధుమ రంగులో కనిపిస్తున్నాయి.శీతాకాలపు సెలవుదినాలు కావడంతో, చాలామంది పిల్లలు కుటుంబ భూముల్లో పనిచేయటం, కట్టెలను పోగుచేయటం, లేదా పశువులను మేపటంలో తీరికలేకుండా ఉన్నారు.

ఈసారి వికాస్ ఇంటిదగ్గరే ఉన్నాడు కానీ పోయిన ఏడాది తన తల్లిదండ్రులతో కలిసి వలసవెళ్ళాడు. "నేను ఇసుక కలిపే [నిర్మాణ స్థలాల వద్ద] యంత్రాల దగ్గర పనిచేశాను," పత్తి ఏరుతూ చెప్పాడతను. "మాకు రోజు పనికి 500 రూపాయలు చెల్లించేవారు. కానీ మేం రోడ్డు పక్కనే నివాసం ఉండాల్సివచ్చేది. నాకది నచ్చలేదు." దాంతో అతను విద్యా సంవత్సరం మళ్ళీ మొదలయ్యేనాటికి, దివాలీ (2023) సమయంలో ఇంటికి తిరిగివచ్చాడు.

వికాస్ త్వరలోనే ప్రాథమిక కళాశాల చదువును[undergraduate degree] పూర్తిచేయాలని ఆశిస్తున్నాడు. " పెహలే పూరా కామ్ కర్‌కే, ఫిర్ పఢ్‌నే బైఠ్‌తే హై [ముందు పనంతా పూర్తిచేసుకొని, ఆపైన చదువుకుంటాం]," PARIతో చెప్పాడతను.

తానైతే బడికి వెళ్ళటానికే ఇష్టపడతానని కిరణ్ చురుగ్గా చెప్పింది: "నాకు హిందీ, ఇంగ్లిష్ చదవడమంటే ఇష్టం. సంస్కృతం, గణితం అంటే నాకు ఇష్టముండదు."

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ఎడమ: కిరణ్ కుటుంబానికి చెందిన భూమిలో పెరుగుతోన్న శనగ మొక్కలు. కుడి: ఈ అన్నాచెల్లెళ్ళు ఒక్కోసారికి 10-12 కోళ్ళను కూడా పెంచుతుంటారు. పెరటి పైకప్పుకు వేలాడుతోన్న అల్లిక గంపలో ఆ కోళ్ళల్లోని ఒక కోడిపెట్టను కప్పెడతారు. పరిమాణాన్ని బట్టి ఒక్కో కోడిపెట్ట రూ. 300-500 వరకూ ధర పలుకుతుంది

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

ఎడమ: పాపడ్ (వెడల్పు చిక్కుళ్ళు)తో సహా పెంచుకున్న, ఏరుకొచ్చుకున్న కూరాకులను నిలవ ఉండటం కోసం ఇంటి పైకప్పులపై ఎండబెడతారు. కుడి: శీతాకాలపు సెలవులకు బడులు మూసివేయడంతో, ఈ ప్రాంతపు అనేక కుటుంబాలలోని పిల్లలకు ఇంటి పనులతో పాటు సమీపంలోని కొండల్లోకి పశువులను మేపటానికి తీసుకువెళ్ళే పనులు కూడా ఉంటాయి

మధ్యాహ్న భోజన పథకం కింద కిరణ్‌కు బడిలో భోజనం పెడతారు: " కిసీ దిన్ సబ్జీ, కిసీ దిన్ చావల్ [కొన్ని రోజులు కూరగాయలు, మరికొన్ని రోజులు అన్నం]," చెప్పింది కిరణ్. అయితే తమ ఇతర ఆహార అవసరాలు తీర్చుకోవటం కోసం ఈ అన్నాచెల్లెళ్ళు తమ పొలంలో తాము పండించినవే కాక, బయట నుంచి కూడా పాపడ్ (వెడల్పు చిక్కుళ్ళు)లను సేకరించటంతో పాటు ఆకు కూరలను కొనుక్కుంటారు. మిగిలిన వస్తువులు ప్రభుత్వం అందించే రేషన్ నుంచి వస్తాయి.

"మాకు 25 కిలోల గోధుమలు వస్తాయి," చెప్పాడు వికాస్. "ఇంకా ఇతర వస్తువులైన నూనె, మిరప, పసుపు, ఉప్పు కూడా. మాకింకా 500 గ్రాముల మూంగ్ (పెసర పప్పు), చనా (శనగ పప్పు) కూడా వస్తాయి. అవన్నీ మా ఇద్దరికి ఒక నెలకు సరిపోతాయి." కానీ మొత్తం కుటుంబం తిరిగివస్తే అవి సరిపోవు.

పొలం నుంచి వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోవు. ఈ అన్నాచెల్లెళ్ళు పెంచే కోళ్ళు అమ్మితే వచ్చే డబ్బు బడి ఫీజులకు, రోజు ఖర్చులకు కొంతవరకూ అక్కరకొస్తుంది. అయితే, ఆ డబ్బులు సరిపోనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే వారికి డబ్బు పంపించాల్సి ఉంటుంది.

MGNREGA కింద ఇచ్చే కూలీ విస్తృతంగా మారుతూంటుంది, కానీ రాజస్థాన్‌లో సూచించిన రోజువారీ వేతనం - రూ. 266 – వడోదరలో కిరణ్, వికాస్‌ల తల్లిదండ్రులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లు చెల్లించే రోజు కూలీ రూ.500లో దాదాపు సగం.

వేతనాలలో ఇటువంటి వ్యత్యాసాల వలన కుశల్‌గఢ్ పట్టణంలోని బస్టాండ్‌లు నిత్యం రద్దీగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏడాది పొడవునా ఒకేసారి 50-100 మంది ప్రయాణీకులతో 40 రాష్ట్ర బస్సులు ప్రతిరోజూ ఇక్కడి నుండి బయలుదేరుతాయి. చదవండి: Migrants…don’t lose that number

PHOTO • Swadesha Sharma
PHOTO • Swadesha Sharma

బాన్స్‌వాడలోని దక్షిణాది తహసీల్‌లలో ఒకటైన కుశల్‌గఢ్ బస్టాండ్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. ఒకేసారి 50-100 మంది ప్రయాణీకులతో, వారిలో ఎక్కువమంది వలస శ్రామికులు, 40 రాష్ట్ర బస్సులు ప్రతిరోజూ ఇక్కడి నుండి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు బయలుదేరుతాయి

పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తరచూ తమ తల్లిదండ్రులతో కలిసి కూలీ పనుల కోసం వెళతారు కాబట్టి రాజస్థాన్‌లో పాఠశాల నమోదు వయస్సు బాగా పడిపోవడం ఆశ్చర్యం కలిగించదు. "ఇక్కడ చాలామంది జనం ఎక్కువగా 8 లేదా 10వ తరగతి వరకు మాత్రమే చదువుతున్నారు," అని చెప్పిన సామాజిక కార్యకర్త అస్మిత, అధికారిక విద్యలో ఉన్న ఈ లోపాన్ని ధృవీకరిస్తున్నారు. ఆమె స్వయంగా అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లకు వలసవెళ్ళేది, కానీ ఇప్పుడు కుటుంబానికి చెందిన పత్తి పొలాల్లో పనిచేస్తోంది, పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం చదువుతూ ఇతరులకు సహాయం చేస్తోంది.

రెండు రోజుల తర్వాత ఈ రిపోర్టర్ కిరణ్‌ని మళ్ళీ కలిసినప్పుడు, ఆమె కుశల్‌గఢ్‌లో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ, ఆజీవిక బ్యూరో సహాయంతో అస్మితతో సహా ఆ ప్రాంతానికి చెందిన యువ మహిళా వాలంటీర్లు నిర్వహించే సాముదాయక ఔట్‌రీచ్ సమావేశానికి హాజరవుతోంది. యువతులకు వివిధ రకాల విద్య, వృత్తులు, భవిష్యత్తుల గురించి ఈ సమావేశంలో అవగాహన కలిగించారు. "మీరు ఏదైనా కావచ్చు," అని సలహాదారులు ఆ సమావేశమంతటా పదే పదే చెప్పారు

సమావేశం ముగిసిన తర్వాత మరో కుండెడు నీళ్ళు తీసుకురావటానికీ, సాయంకాలపు భోజనం తయారుచేయటం కోసం కిరణ్ తన ఇంటి ముఖం పడుతుంది. అయితే ఆమె తిరిగి బడికి వెళ్ళటానికి, తన స్నేహితులను కలవాలనీ శలవుల్లో తాను చేయలేకపోయిన పనులన్నీ చేయాలనీ, ఎదురుచూస్తోంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Swadesha Sharma

سودیشا شرما، پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں ریسرچر اور کانٹینٹ ایڈیٹر ہیں۔ وہ رضاکاروں کے ساتھ مل کر پاری کی لائبریری کے لیے بھی کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Swadesha Sharma
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli