పంజాబ్‌లోని తన పిండ్ (గ్రామం)కు చెందిన ట్రావెల్ ఏజెంటును గురించి సింగ్‌కు ఇప్పటికీ పీడకలలు వస్తుంటాయి.

ఏజెంటుకు చెల్లించేందుకు సింగ్ (అసలు పేరు కాదు) తన కుటుంబానికి చెందిన ఒక ఎకరం పంటభూమిని అమ్మేశారు. బదులుగా అతను సెర్బియా మీదుగా పోర్చుగల్‌కు సురక్షిత మార్గంలో వెళ్ళేందుకు అవసరమైన ‘ ఏక్ నంబర్ [చట్టబద్ధమైన పత్రాలు]’ సమకూరుస్తానని ఆ ఏజెంట్ జతీందర్ వాగ్దానం చేశాడు.

తాను జతీందర్ చేతిలో మోసపోయి, అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా మానవ అక్రమ రవాణా బారిన పడినట్టుగా చాలా త్వరలోనే సింగ్‌కు అర్థమయింది. దిగ్భ్రాంతికీ విస్మయానికీ లోనైన అతను తన దుస్థితి గురించి గ్రామంలో ఉన్న తన కుటుంబానికి తెలియచేయలేకపోయారు.

దట్టమైన అడవులను దాటుకుంటూ, మురుగు కాలవలలో ఈడ్చుకుంటూ నడుస్తూ, యూరప్‌లోని పర్వతాలను ఎక్కుతూ ఆయన, ఆయన తోటి వలసజీవులు తమ ప్రయాణమంతా కేవలం బ్రెడ్ మాత్రమే తిని, నీటి గుంటలలో నిలిచివున్న వాన నీటిని తాగుతూ సాగించారు. ఇప్పుడతనికి బ్రెడ్ చాలా అసహ్యించుకునే ఆహారంగా మారిపోయింది.

" మేరే ఫాదర్ సాబ్ హార్ట్ పేషంట్ ఆ. ఇన్నా టెన్షన్ ఓ లే నై సక్తే. నాలే, ఘర్ మేఁ జా నహీ సక్తా క్యూఁ కే మైఁ సారా కుచ్ దావ్ తే లాకే ఆయా హీ [మా నాన్నగారు హృద్రోగి; ఆయన ఎక్కువ ఒత్తిడిని భరించలేరు. నేను ఇంటికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే నేను సర్వస్వాన్నీ పణంగా పెట్టి ఇక్కడకు వచ్చాను]," పోర్చుగల్‌లో ఒక రెండు గదుల అద్దె ఇంటిలో మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఉంటోన్న 25 ఏళ్ళ సింగ్ చెప్పారు.

కొన్నేళ్ళుగా దక్షిణాసియా దేశాలైన భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలకు చెందిన శ్రామికులకు పోర్చుగల్ అభిమాన గమ్యస్థానంగా కనబడుతోంది.

PHOTO • Karan Dhiman

తనను సెర్బియా మీదుగా పోర్చుగల్‌కు సురక్షిత మార్గంలో తీసుకువెళ్ళటానికి అవసరమైన ‘చట్టబద్ధ పత్రాలను’ కొనేందుకు సింగ్ తన కుటుంబానికి చెందిన ఒక ఎకరం పంటభూమిని అమ్మేశారు

సింగ్‌కు ఒకప్పుడు భారత సైన్యంలో చేరాలనే ఆశ ఉండేది, కానీ అందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమవటంతో ఆయన తన లక్ష్యాన్ని దేశం విడచి వలసపోవటానికి మార్చుకున్నారు. పోర్చుగల్ వలస విధానాలు సులభంగా ఉండటంతో ఆయన ఆ దేశాన్ని ఎంచుకున్నారు. తన ఊరికే చెందిన కొంతమంది వ్యక్తులు ఈ ఐరోపా దేశానికి విజయవంతంగా వలస వెళ్ళారని విన్న కథనాలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. అప్పుడొకరోజు ఎవరో అతనికి తమ ఊరికే చెందిన జతీందర్ గురించి చెప్పారు, సహాయం చేస్తానని అతను వాగ్దానం కూడా చేశాడు.

"జతీందర్ నాతో, 'నేను 12 లక్షల రూపాయలు (సుమారు 13,000 యూరోలు) తీసుకొని, నిన్ను చట్టబద్ధంగా పోర్చుగల్‌కు పంపిస్తాను ' అని చెప్పాడు. నేనతనికి డబ్బు మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నాను, చట్టబద్ధమైన దారినే అనుసరించాలని అతనితో నొక్కిచెప్పాను," అని సింగ్ చెప్పారు.

అయితే, డబ్బు చెల్లించే సమయంలో డబ్బును బ్యాంకు ద్వారా కాకుండా 'వేరే మార్గంలో' పంపించాలని ఏజెంట్ అతనిని అడిగాడు. అందుకు సింగ్ వ్యతిరేకించినప్పుడు, తాను చెప్పినట్టు చేయాల్సిందేనని జతీందర్ నొక్కి చెప్పాడు. వెళ్ళిపోవాలనే తొందరలో ఉన్న సింగ్, ఒక విడత సొమ్ము రూ. 4 లక్షలను (4,383 యూరోలు) జలంధర్‌లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర, ఆ తర్వాత మరో లక్ష రూపాయలను (1,095 యూరోలు) ఒక దుకాణం దగ్గరా అందజేశారు.

అక్టోబర్ 2021న సింగ్ దిల్లీకి బయలుదేరారు. అక్కడి నుండి ఆయన బెల్‌గ్రేడ్‌కూ, ఆ తర్వాత పోర్చుగల్‌కూ విమాన ప్రయాణం చేయాలి. విమాన ప్రయాణం అతనికదే మొదటిసారి. అయితే కోవిడ్-19 ఆంక్షలు అమలులో ఉండటం వల్ల భారతదేశం నుంచి సెర్బియాకు విమానాలు వెళ్ళకపోవటంతో ఎయిర్‌లైన్ అతనిని విమానం ఎక్కనివ్వలేదు. అయితే ఈ విషయాన్ని ఏజెంట్ సింగ్‌కు చెప్పకుండా దాచాడు. దుబాయ్ వెళ్ళి, అక్కడి నుండి బెల్‌గ్రేడ్ వెళ్ళే విధంగా సింగ్ మళ్ళీ టిక్కెట్లు తీసుకోవాల్సివచ్చింది.

"బెల్‌గ్రేడ్ ఎయిర్‌పోర్ట్‌లో మమ్మల్ని రిసీవ్ చేసుకున్న ఒక ఏజెంట్, సెర్బియా పోలీసులు మంచివారు కాదనీ, వారు భారతీయులను ఇష్టపడరనీ చెప్పి మా పాస్‌పోర్టులను లాగేసుకున్నాడు. మేం బెదిరిపోయాం," పాస్‌పోర్టును అప్పగించిన సింగ్ చెప్పారు.

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ నుంచి గ్రీస్‌లోని థీవా వరకు తాను చట్ట విరుద్ధంగా చేసిన ప్రయాణాల గురించి వివరించేటప్పుడు, సింగ్ తరచుగా " దో నంబర్ " అనే పదబంధాన్ని వాడతారు. వారితో పాటు వస్తోన్న డోంకర్లు (మానవ అక్రమ రవాణాదారులు) అతను గ్రీస్ మీదుగా పోర్చుగల్ చేరుకుంటాడని సింగ్‌కు హామీ ఇచ్చారు.

థీవాకు వచ్చిన తర్వాత, తాను అంతకుముందు వాగ్దానం చేసినట్లుగా అతన్ని పోర్చుగల్‌కు చేర్చలేనని ఏజెంట్ మాటమార్చాడు.

"జతీందర్, 'నేను నీ దగ్గర నుంచి ఏడు లక్షల రూపాయలు అందుకున్నాను. ఇంతటితో నా పని అయిపోయింది. నిన్ను నేను గ్రీస్ నుంచి బయటకు తీసుకురాలేను' అని నాతో చెప్పాడు," తీవ్రమైన క్షోభకు గురైన సింగ్ ఏడుస్తూ గుర్తుచేసుకున్నాడు.

PHOTO • Pari Saikia

సురక్షిత మార్గంలో విదేశాలకు తీసుకువెళ్తామని చాలామంది యువకులకూ మహిళలకూ వాగ్దానాలు చేసే ఏజెంట్లు, వారిని డోంకర్లకు (మానవ అక్రమ రవాణాదారులు) అప్పగిస్తారు

గ్రీసుకు వచ్చిన రెండు నెలల తర్వాత, 2022 మార్చిలో, సెర్బియా ట్రాఫికర్ వద్దనున్న తన పాస్‌పోర్టును తిరిగి తెచ్చుకోవాలని సింగ్ ప్రయత్నించారు. అతనికిక్కడ భవిష్యత్తు లేదనీ, పట్టుబడితే దేశం నుంచి బహిష్కరిస్తారనీ, అందుకే దేశం విడిచి వెళ్ళిపొమ్మనీ ఉల్లి పొలంలో అతనితో పాటు పనిచేసేవారు అతనికి సలహా ఇచ్చారు.

దాంతో పంజాబ్‌కు చెందిన ఈ యువకుడు అక్కడినుండి వెళ్ళిపోవడానికి మరోసారి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. "నేను గ్రీసును వదిలివెళ్ళేందుకు సిద్ధమైపోయాను [మానసికంగా]. అందుకోసం ఒక చివరిసారి నా ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి ఉంటుందని నేను ఆలోచించాను."

అతనొక కొత్త ఏజెంటును గుర్తించాడు. 800 యూరోలు తీసుకొని సెర్బియాకు తీసుకువెళ్తానని ఆ ఏజెంట్ సింగ్‌కు మాట ఇచ్చాడు. ఆ డబ్బును సింగ్, అక్కడున్న మూడు నెలలూ ఉల్లి పొలాల్లో పనిచేసి సంపాదించారు.

ఈసారి బయలుదేరే ముందు, సింగ్ కూడా తన స్వంత పరిశోధనలు చేసి గ్రీస్ నుండి సెర్బియాకు తిరిగివెళ్ళే ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ నుండి అతను హంగరీ మీదుగా ఆస్ట్రియాకు, ఆ తరువాత పోర్చుగల్‌కు వెళ్ళాలని అనుకున్నారు. గ్రీస్ నుండి సెర్బియాకు ప్రయాణించేందుకు ఇది కఠినమైన మార్గమని అతనికి తెలిసింది, "పట్టుబడితే, మీ లోదుస్తులతో మిమ్మల్ని టర్కీకి బహిష్కరిస్తారు," అన్నారతను.

*****

ఆరు పగళ్ళూ ఆరు రాత్రులూ నడచి 2022 జూన్‌లో సింగ్ సెర్బియా చేరుకున్నారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో ఆయన కొన్ని శరణార్థి జనావాసాలను కనుగొన్నారు - సెర్బియా-రొమానియా సరిహద్దులో ఉన్న కికిందా శిబిరం, సెర్బియా-హంగరీ సరిహద్దులోని సుబోటిత్సా శిబిరం. లాభదాయకమైన మానవ అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించే ట్రాఫికర్లకు ఈ శిబిరాలు ఆశ్రయాలని అతను చెప్పారు.

"అక్కడ [కికిందా శిబిరంలో], ప్రతి రెండవ వ్యక్తి ఒక మానవ అక్రమ రవాణాదారే. 'నేను నిన్నక్కడికి పంపిస్తాను, అయితే అందుకు ఇంత ఖర్చవుతుంది,' అని వాళ్ళు చెప్తారు," ఆస్ట్రియా చేరేందుకు తనకు సహాయపడటానికి సిద్ధపడిన ఒక ట్రాఫికర్‌ను గుర్తించిన సింగ్ చెప్పారు.

కికిందా శిబిరంలో ఉన్న ఒక ట్రాఫికర్ (భారతీయుడు) జలంధర్‌లో ‘గ్యారంటీని ఉంచాలి' అని సింగ్‌తో చెప్పాడు. 'గ్యారంటీ' అంటే ఇద్దరికి - వలస వెళ్ళేవారు, ట్రాఫికర్ - సంబంధించిన డబ్బు ఒక మధ్యవర్తి వద్ద ఉంటాయి. వెళ్ళాలనుకున్నవారు తాను అనుకున్న ప్రదేశానికి చేరుకోగానే మధ్యవర్తి ఆ డబ్బును ట్రాఫికర్‌కు అందజేస్తాడు.

PHOTO • Karan Dhiman

చట్టవిరుద్ధంగా వలస వెళ్ళటంలో ఉన్న ప్రమాదాలను పంజాబ్ యువత తెలుసుకోవాలనే ఆకాంక్షతో సింగ్ తన కథను ఇక్కడ పంచుకుంటున్నారు

తన కుటుంబ సభ్యులు ఒకరి ద్వారా రూ. 3 లక్షలను గ్యారంటీగా ఏర్పాటు చేసి, ట్రాఫికర్ ఇచ్చిన సూచన ప్రకారం హంగరీ సరిహద్దు వైపుకు కదిలారు సింగ్. అఫ్ఘనిస్తాన్‌కు చెందిన కొంతమంది డోంకర్లు అక్కడ వారిని కలిశారు. అర్ధరాత్రివేళ వారు 12 అడుగుల ఎత్తున్న రెండు ముళ్ళ కంచెలను దాటారు. అతనితో పాటు సరిహద్దులు దాటిన ఒక డోంకర్ అతన్ని అడవిలో నాలుగు గంటలు నడిపించాడు. అప్పుడు సరిహద్దు పోలీసులు వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

"వాళ్ళు [హంగరీ పోలీసులు] మమ్మల్ని మోకరిల్లేలా చేసి మా దేశీయతను గురించి అడిగారు. డోంకర్‌ను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత మమ్మల్ని (వలసదారులు) తిరిగి సెర్బియాకు పంపించేశారు," సింగ్ గుర్తుచేసుకున్నారు.

ట్రాఫికర్ సింగ్‌ను సుబోటిత్సా శిబిరానికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ అతని కోసం ఒక కొత్త డోంకర్ ఎదురుచూస్తున్నాడు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతను తిరిగి హంగరీ సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ అప్పటికే సరిహద్దులను దాటేందుకు 22 మంది వేచి చూస్తున్నారు. అయితే వారిలో సింగ్‌తో సహా ఏడుగురు మాత్రమే సరిహద్దును దాటగలిగారు.

ఆ తర్వాత అడవి గుండా మూడు గంటల కష్టతరమైన ప్రయాణం మొదలయింది. "సాయంత్రం 5 గంటలకు మేమొక విశాలమైన ఎండిపోయిన గుంట దగ్గరకు వచ్చాం. అందులో పడుకొని ఎండిన అడవి ఆకులతో మా శరీరాన్ని కప్పుకోవాలని డోంకర్ మమ్మల్ని ఆదేశించాడు." కొన్ని గంటల తర్వాత వాళ్ళు మళ్ళీ నడుస్తున్నారు. చివరకు వారందరినీ ఒక వ్యానులో ఎక్కించి, ఆస్ట్రియా సరిహద్దు వద్ద దించారు. "ఆ గాలి మరలు కనిపిస్తున్న వైపుకు నడవండి, మీరు ఆస్ట్రియాలోకి ప్రవేశిస్తారు," అని వారికి చెప్పారు.

తాము సరిగ్గా ఎక్కడున్నారో తెలియక, తిండి గానీ నీరు గానీ లేకుండా, సింగ్‌తో సహా ఇతర వలసదారులు రాత్రంతా నడిచారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళొక ఆస్ట్రియా సైనిక పోస్టును చూశారు. ఆస్ట్రియా బలగాలను చూడగానే వారికి లొంగిపోయేందుకు సింగ్ వేగంగా ముందుకెళ్ళారు. "ఆ దేశం శరణార్థులను స్వాగతిస్తుంది, డోంకర్లు ఆ విషయాన్ని ధృవీకరించారు," అన్నారతను.

"వాళ్ళు మాకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి మమ్మల్ని ఆస్ట్రియా శరణార్థి శిబిరంలోకి తీసుకున్నారు. అక్కడ వాళ్ళు మా వాఙ్మూలాన్ని తీసుకొని మా వేలిముద్రలను నమోదుచేసుకున్నారు. ఆ తర్వాత మాకు ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే శరణార్థి పత్రాలను ఇచ్చారు," అని సింగ్ చెప్పారు.

ఈ పంజాబ్ ప్రవాసి ఆరు నెలల పాటు వార్తాపత్రికలు అమ్మే పని చేసి 1,000 యూరోలు పొదుపు చేయగలిగారు. ఆయన గడువు పూర్తికాగానే, శిబిరం అధికారి ఆయనను వెళ్ళిపొమ్మని చెప్పాడు.

PHOTO • Karan Dhiman

పోర్చుగల్‌ చేరుకోగానే సింగ్ పంజాబ్‌లో ఉన్న తన తల్లికి కాల్ చేసి, ఆమె సందేశాలకూ, ఫార్వార్డ్‌లకు తప్పనిసరిగా తిరిగు జవాబులిచ్చేలా చూసుకుంటారు

"అప్పుడు నేను స్పెయిన్‌లోని బలెన్షియాకు నేరుగా విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నాను (షెంగిన్ ప్రాంతాలలో విమానాలను చాలా అరుదుగా తనిఖీ చేస్తారు), అక్కడి నుండి బర్సిలోనాకు రైలులో ప్రయణించి, అక్కడి నా స్నేహితుడి వద్ద ఒక రాత్రి గడిపాను. నా దగ్గర ఎలాంటి పత్రాలు గానీ, పాస్‌పోర్ట్ గానీ లేకపోవటంతో, నా స్నేహితుడు పోర్చుగల్‌ వెళ్ళటానికి నాకు బస్ టికెట్ బుక్ చేశాడు." ఈసారి అతను కావాలనే తన పాస్‌పోర్ట్‌ను గ్రీస్‌లో ఉన్న తన స్నేహితుడి వద్ద వదిలివచ్చారు. ఎందుకంటే, ఒకవేళ తాను పట్టుబడితే తనను తిరిగి భారతదేశానికి పంపించివేయటం అతనికి ఇష్టంలేదు.

*****

బస్‌లో ప్రయాణించిన సింగ్ ఫిబ్రవరి 15, 2023న తన కలల గమ్యస్థానమైన పోర్చుగల్‌కు చేరారు. అక్కడకు చేరటానికి ఆయనకు 500కు పైగా రోజులు పట్టింది.

అనేకమంది వలసదారులకు "సరైన నివాస పత్రాలు లేవనీ, అధికారిక సంఖ్యలు అందుబాటులో లేవనీ," పోర్చుగల్‌లోని భారత దౌత్య కార్యాలయం అంగీకరించింది . పోర్చుగల్ తన వలస నిబంధనలను సడలించడం వల్ల ఇటీవలి సంవత్సరాలలో భారతీయుల సంఖ్య (ముఖ్యంగా పంజాబ్, హర్యానాల నుండి) గణనీయంగా పెరిగిందని కూడా ఆ కార్యాలయం చెప్పింది.

" యహా డాక్యుమెంట్స్ బన్ జాతా హై, ఆద్మీ పక్కా హో జాతా హై, ఫిర్ అప్‌నీ ఫామిలీ బులా సక్తా హై, అప్‌నీ వైఫ్ బులా సక్తా హై [మీరిక్కడ పత్రాలను సంపాదించవచ్చు. ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆ తర్వాత, వారు తన కుటుంబాన్ని, లేదా భార్యను పోర్చుగల్ తీసుకురావచ్చు]," అని సింగ్ చెప్పారు.

ఫారినర్స్ అండ్ బోర్డర్స్ సర్వీస్ (SEF) ఇచ్చిన సమాచారం ప్రకారం 2022లో 35,000 మందికి పైగా భారతీయులకు పోర్చుగల్‌లో శాశ్వత నివాసం లభించింది. ఇదే ఏడాదిలో సుమారు 229 మంది భారతీయులు ఇక్కడ ఆశ్రయం కోరారు.

సింగ్ వంటి యువకులకు తమ దేశంలో మంచి భవిష్యత్తు కనిపించకపోవటం వల్ల వలస వెళ్ళడానికి తెగిస్తున్నారు. "సహేతుకమైన అధిక వృద్ధి ఉన్నప్పటికీ ఉత్పాదక ఉపాధి అవకాశాలలో తగినంత విస్తరణ జరగలేదు," అని అంతర్దేశీయ శ్రామిక సంస్థ రూపొందించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 చెబుతోంది.

తన వలస గురించి సింగ్ మాట్లాడుతోన్న వీడియో చూడండి

తిండీ నీళ్ళూ లేకుండా సింగ్ రాత్రంతా నడిచారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఒక ఆస్ట్రియా సైనిక పోస్టును చూశారు... లొంగిపోవటానికి వేగంగా వెళ్ళారు, ఎందుకంటే 'ఆ దేశం శరణార్థులను స్వాగతిస్తుంది’

ఐరోపాలో అతి తక్కువ కాలంలో పౌరసత్వాన్నిచ్చే దేశం పోర్చుగల్. ఈ దేశ పౌరులుగా మారడానికి ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం సరిపోతుంది. సాధారణంగా వ్యవసాయంలోనూ, నిర్మాణ రంగాలలోనూ పనిచేసే భారతదేశ గ్రామీణ ప్రజలు ఈ వలస ప్రయాణాన్ని తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన పురుషులు- అంటున్నారు ప్రొఫెసర్ భాస్వతి సర్కార్. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ యూరోపియన్ స్టడీస్‌లో జా మోనే (Jean Monnet) ఆచార్య పదవిలో ఉన్నారు. "బాగా స్థిరపడిన గోవా, గుజరాతీ సముదాయాలు కాకుండా, చాలామంది పంజాబీలు తోటలలోనూ, నిర్మాణ, వ్యవసాయ రంగాలలో తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలలో పనిచేస్తున్నారు" అని ఆమె అన్నారు.

టెంపరరీ రెసిడెన్సీ కార్డ్ (TRC) అని కూడా పిలిచే పోర్చుగల్ నివాస అనుమతి వలన ఉన్న పెద్ద ప్రయోజనం ఏమిటంటే, వీసా లేకుండా 100 కంటే ఎక్కువ షెంగెన్ దేశాలలో ప్రవేశించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, పరిస్థితులు మారుతున్నాయి - జూన్ 3, 2024న పోర్చుగల్‌లోని సెంటర్-రైట్ డెమోక్రటిక్ అలయన్స్ (AD)కి చెందిన లూయిస్ మాంటెనెగ్రో నమోదుకాని వలసదారుల కోసం వలస నిబంధనలను కఠినతరం చేయడానికి ఒక డిక్రీని జారీ చేశారు.

ఈ కొత్త శాసనం ప్రకారం, పోర్చుగల్‌లో స్థిరపడాలని అనుకొంటున్న ఏ విదేశీయులైనా ఆ దేశానికి ప్రయాణించబోయే ముందే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశం నుంచి, ప్రత్యేకించి పంజాబ్, హర్యానాల నుంచి వలసవచ్చిన వారిపై ప్రతికూల ప్రభావాన్ని వేస్తుందని భావిస్తున్నారు.

వలసలపై ఇతర ఐరోపా దేశాలు కూడా తమ వైఖరిని కఠినతరం చేస్తున్నాయి. కానీ అటువంటి నిబంధనలేవీ మిక్కిలి ఆకాంక్షలున్న అక్రమ వలసదారులను నివారించలేవని ప్రొఫెసర్ సర్కార్ అంటున్నారు. "వారివారి సొంత దేశాలలో అవకాశాలను కల్పించటం, రక్షణనూ భద్రతనూ అందించడం సహాయపడుతుంది," అని ఆమె అన్నారు.

పోర్చుగల్ AIMA (ఏజెన్సీ ఫర్ ఇంటిగ్రేషన్, మైగ్రేషన్ అండ్ అసైలమ్)లో 4,10,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. వలస సముదాయాల దీర్ఘకాలిక అభ్యర్థన మేరకు వలసదారు డాక్యుమెంట్లను, వీసాలను మరో సంవత్సరం వరకు - జూన్, 2025 - పొడిగించారు.

'భారత కార్మికులను చట్టపరమైన మార్గాల ద్వారా పంపించడం, స్వీకరించడం'ను లాంఛనప్రాయం చేయడానికి 2021లో భారత, పోర్చుగల్ దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత ప్రభుత్వం ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటి అనేక ఐరోపా దేశాలతో వలస, చలనశీలతకు సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజలకు దీని గురించి తెలిసిన సమాచారం చాలా తక్కువ.

ఈ విషయాలపై వ్యాఖ్యానించడం కోసం భారత, పోర్చుగీస్ ప్రభుత్వాలను సంప్రదించడానికి ఈ జర్నలిస్టులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఎవరూ స్పందించలేదు.

PHOTO • Pari Saikia

భారతదేశంలో ఉద్యోగాలు సంపాదించలేకపోవటంతో సింగ్ వంటి యువకులు వలస వెళ్ళేందుకు తెగిస్తున్నారు

*****

తన ‘కలల’ గమ్యాన్ని చేరుకోగానే సింగ్ గమనించినది, పోర్చుగల్‌లో ఉద్యోగావకాశాలు లేకపోవటం. నివాస అనుమతిని పొందటాన్ని ఇది మరింత కష్టతరం చేసింది. తన ఐరోపా ప్రణాళికను తయారుచేసుకుంటున్నాప్పుడు ఈ సంగతులేవీ అతనికి తెలియవు.

"పోర్చుగల్ చేరుకోగానే మొదట నేను చాలా గొప్పగా భావించాను. ఆ తర్వాత, ఉద్యోగావకాశాలు చాలా అరుదుగా ఉన్నాయనీ, ఇక్కడ అనేకమంది ఆసియావాసులు నివసిస్తుండటంతో అవి దొరికే అవకాశాలు కూడా శూన్యమని నేను తెలుసుకున్నాను. అంటే, ఇక్కడ ఉద్యోగావకాశాలు దాదాపు లేవు," అని ఆయన PARIతో అన్నారు.

స్థానికంగా ఉండే వలస వ్యతిరేక సెంటిమెంట్‌ను కూడా సింగ్ ఎత్తి చూపారు. "మేం వ్యవసాయంలోనూ, నిర్మాణ ప్రదేశాలలోనూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నప్పటికీ, స్థానికులు ఇక్కడి వలసదారులను ఇష్టపడరు." భారతీయులు అమిత కష్టతరమైన పనులు చేస్తారు. సర్కార్ మాటల్లో చెప్పాలంటే "3 డి ఉద్యోగాలు - డర్టీ (మురికి), డేంజరస్ (ప్రమాదకరమైన), డిమీనింగ్ (కించపరిచే) ఉద్యోగాలు; స్థానికులు చేయడానికి ఇష్టపడనివి." చట్టపరమైన వారి అనిశ్చిత స్థితి కారణంగా, సూచించిన చట్టపరమైన వేతనాల కంటే కూడా చాలా తక్కువకు పనిచేయడానికి వారు సిద్ధపడతారు.

ఎవరైనా ఆ ఉద్యోగాల కోసం చూస్తున్నప్పుడు, సింగ్ ఇతర విషయాలను కూడా గమనిస్తారు. ఒక ఉక్కు కర్మాగారం మొత్తం ఐదు శాఖలలో, సూచనల బోర్డులు పోర్చుగీస్‌లోనూ, పంజాబీలోనూ రాసివున్నాయి. “ఒప్పందపు పత్రాలు కూడా పంజాబీ అనువాదంతో వస్తాయి. అయినప్పటికీ, మేం నేరుగా వారిని ఉద్యోగం కోసం సంప్రదించినప్పుడు, వారి ప్రతిస్పందన 'ఇక్కడ పని లేదు' అని మాత్రమే," అని సింగ్ చెప్పారు.

PHOTO • Karan Dhiman

పోర్చుగల్‌లో వలస వ్యతిరేక భావనలు ఉన్నప్పటికీ, తనకు దయ కలిగిన, సహాయకారిగా ఉండే ఇంటి యజమాని దొరకటం అదృష్టమని సింగ్ అంటారు

పత్రాలు లేని వలసదారుడిగా, అతనికి ఒక నిర్మాణ ప్రదేశంలో ఉద్యోగం దొరకడానికి ఏడు నెలలు పట్టింది.

"ఒప్పంద పత్రాలతో పాటు రాజీనామా పత్రాలపై కూడా సంతకాలు చేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను అడుగుతాయి. వాళ్ళు తమకు నెలకు 920 యూరోల అతి తక్కువ వేతనాన్ని చెల్లిస్తున్నప్పటికీ, తమను ఎప్పుడు తొలగిస్తారో ఉద్యోగులు ఎప్పటికీ తెలుసుకోలేరు," రాజీనామా పత్రంపై తాను కూడా సంతకం చేసిన సింగ్ చెప్పారు. రెసిడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన తాను చట్టబద్ధం కావాలని ఆశిస్తున్నారు.

" బస్ హూఁతా అహ్హీ సప్నా ఆహ్ కీ, ఘర్ బన్ జే, సిస్టర్ దా వ్యాహ్ హో జే, తె ఫిర్ ఇత్థే అప్నే డాక్యుమెంట్స్ బనా కే ఫ్యామిలీ నూ వీ ఇత్థే బులా కే [ఇప్పటి నా కల ఏమిటంటే, పంజాబ్‌లో ఒక ఇల్లు కట్టాలి, నా చెల్లెలికి పెళ్ళి చేయాలి, నేను చట్టబద్ధం కావాలి. అలా అయితేనే మా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకురాగలను]," 2023 నవంబర్‌లో మాట్లాడిన సింగ్ అన్నారు.

సింగ్ 2024 నుండి ఇంటికి డబ్బు పంపడం ప్రారంభించారు. ప్రస్తుతం వారి ఇంటిని నిర్మిస్తున్న తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నారు. పోర్చుగల్‌లో అతను చేస్తోన్న పని ఆ ఇంటి నమూనా చిత్రంలోని గణనీయమైన మొత్తాన్ని అందించింది.

అదనపు వార్తా కథనాన్ని పోర్చుగల్ నుంచి కరణ్ ధీమన్ అందించారు

Modern Slavery Grant Unveiled programme కింద జర్నలిజం ఫండ్ మద్దతుతో భారతదేశం, పోర్చుగల్‌ల మధ్య ఈ పరిశోధన జరిగింది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Pari Saikia

پری سیکیا ایک آزاد صحافی ہیں اور جنوبی مشرقی ایشیا اور یوروپ کے درمیان ہونے والی انسانی اسمگلنگ پر مرکوز صحافت کرتی ہیں۔ وہ سال ۲۰۲۳، ۲۰۲۲ اور ۲۰۲۱ کے لی جرنلزم فنڈ یوروپ کی فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pari Saikia
Sona Singh

سونا سنگھ، ہندوستان کی آزاد صحافی اور محقق ہیں۔ وہ سال ۲۰۲۲ اور ۲۰۲۱ کے لیے جرنلزم فنڈ یوروپ کی فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sona Singh
Ana Curic

اینا کیورک، سربیا کی ایک تفتیشی صحافی ہیں، اور ڈیٹا جرنلزم بھی کرتی ہیں۔ وہ فی الحال جرنلزم فنڈ یوروپ کی فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Ana Curic
Photographs : Karan Dhiman

کرن دھیمان، ہندوستان کے ہماچل پردیش کے ویڈیو صحافی اور سماجی ڈاکیومنٹری فلم ساز ہیں۔ سماجی مسائل، ماحولیات اور برادریوں کی دستاویزکاری میں ان کی خاص دلچسپی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Karan Dhiman
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Editor : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli