"ఈ ప్రాంతంలో ఎన్నికల రోజు ఒక పండుగలాంటిది," తాను బొంతగా అల్లబోయే బట్టలను వరుసలు పేరుస్తూ అన్నారు మర్జినా బేగమ్. "పని కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన జనం వోటు వేయడానికి ఇళ్ళకు తిరిగివస్తారు."

ఆమె నివసించే రూపాకుసి గ్రామం మే 7, 2024న పోలింగ్ జరగబోయే ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది.

కానీ 48 ఏళ్ళ మర్జినా వోటు వేయలేదు. "నేనా రోజును పట్టించుకోనట్టుంటాను. జనాన్ని తప్పించుకోవడానికి నేను ఇంట్లోనే దాక్కుంటాను కూడా."

మర్జినా వోటర్ల జాబితాలో అనుమానాస్పద వోటర్ (డి-వోటర్)గా నమోదైవున్నారు. ఈ రకంగా జాబితా అయిన 99,942 మంది వోటర్లలో ఆమె కూడా ఒకరు. వీరంతా తమ భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునే విశ్వసనీయమైన సాక్ష్యాలను అందించలేకపోయారు. వీరిలో అస్సామ్‌లో నివాసముండే బంగ్లా భాష మాట్లాడే హిందువులు, ముస్లిములు ఎక్కువగా ఉన్నారు.

డి-వోటర్లను కలిగి ఉన్న ఏకైక భారతీయ రాష్ట్రమైన అస్సామ్‌లో, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చినట్టు చెప్తోన్న వలసలు ఎన్నికల రాజకీయాలలో కీలకమైన అంశం. భారత ఎన్నికల సంఘం 1997లో డి-వోటర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం మర్జినా తన పేరును వోటర్ల జాబితాలో చేర్చడానికి మొదటగా ఎన్యుమరేటర్లకు ఇచ్చింది. “అప్పట్లో, వోటరు జాబితాలో వ్యక్తుల పేర్లను చేర్చడానికి పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వచ్చేవారు. నా పేరు కూడా ఇచ్చాను,” అని మర్జినా చెప్పారు. “కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల సమయంలో నేను వోటు వేయడానికి వెళ్ళినప్పుడు, నన్ను అనుమతించలేదు. నేను డి-వోటర్‌ని అని చెప్పారు."

PHOTO • Mahibul Hoque

అస్సామ్‌లోని రూపాకుసి గ్రామ నేత బృందంలో భాగమైన మర్జినా ఖాతూన్ (ఎడమ). వీరు స్థానికంగా ఖేటా అని పిలిచే సంప్రదాయక మెత్తని బొంతలను నేస్తారు. ఒకే రకమైన కుట్లతో తాను రూపొందించిన దిండు కవర్‌ను పట్టుకునివున్న మర్జినా

2018-19లో, విదేశీయుల ట్రిబ్యునల్‌లో అక్రమ వలసదారులుగా ప్రకటించిన తరువాత అస్సామ్‌లోని చాలామంది డి-వోటర్లను అరెస్టు చేశారని, మేం ఆమె ఇంటికి వెళ్తుండగా మర్జినా చెప్పారు.

దీంతో మర్జినా తనను డి-వోటర్‌గా ఎందుకు గుర్తించారనే దానిపై ఆరా తీశారు. “కోవిడ్-19 లాక్‌డౌన్‌కు ముందు నేను ముగ్గురు న్యాయవాదులకు దాదాపు రూ.  10,000 చెల్లించాను. వారు సర్కిల్ కార్యాలయంలో [మాండియాలో], ట్రిబ్యునల్‌లో [బర్‌పెటాలోని] పత్రాలను తనిఖీ చేశారు, కానీ నా పేరుకు వ్యతిరేకంగా ఏమీ కనబడలేదు,” అన్నారామె, తన కచ్చా ఇంటి ప్రాంగణంలో కూర్చుని పత్రాలను వెతుకుతూ.

మర్జినా కౌలు రైతు. ఆమె, ఆమె భర్త హషీమ్ అలీ రెండు బిఘాల (0.66 ఎకరాలు) సాగునీటి సౌకర్యం లేని భూమిని ఒక్కొక్క బిఘాకు రూ. 8,000 చొప్పున కౌలుకు తీసుకున్నారు. అందులో వరిని, వంకాయలు, మిర్చి, దోసకాయ వంటి కూరగాయలను వారి స్వంత వినియోగం కోసం పండిస్తారు.

తన పాన్, ఆధార్ కార్డులను బయటకు తీస్తూ, "నా వోటు హక్కును ఏకపక్షంగా కోల్పోవడం నాకు బాధగా ఉండదా?" అన్నారామె. ఆమె పుట్టింటి కుటుంబ సభ్యులందరికీ చెల్లుబాటు అయ్యే వోటరు కార్డులున్నాయి. 1965 నాటి వోటర్ల జాబితా ధృవీకృత పత్రంలో మర్జినా తండ్రి నసీమ్ ఉద్దీన్ బర్‌పెటా జిల్లాలోని మారిసా గ్రామ నివాసి అని ఉంది. "నా తల్లిదండ్రులలో ఎవరికీ బంగ్లాదేశ్‌తో ఎలాంటి సంబంధమూ లేదు," అని మర్జినా చెప్పారు.

అయితే ఒక్క తన ప్రజాస్వామిక హక్కు అయిన వోటు వేయడం గురించి మాత్రమే మర్జినాను వేధిస్తోన్న ఆందోళన కాదు

"నన్ను నిర్బంధ కేంద్రంలో పెడతారేమోనని నేను భయపడ్డాను," మర్జినా లోగొంతుకతో చెప్పారు. "అప్పటికి చాలా చిన్నవాళ్ళయిన నా పిల్లలు లేకుండా నేనెలా జీవించగలనో అని ఆలోచించాను. చావటం గురించి ఆలోచనలు చేసేదాన్ని."

PHOTO • Mahibul Hoque
PHOTO • Kazi Sharowar Hussain

ఎడమ: కౌలు రైతులైన మర్జినా, ఆమె భర్త హషీమ్ అలీ. మర్జినా పుట్టింటివారందరికీ సరైన వోటరు గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ, మర్జినాను మాత్రం అనుమానాస్పద వోటరుగా జాబితా చేశారు. తనకు చట్టబద్ధమైన వోటర్ ఐడి లేకపోవటంతో మర్జినా తన భవిష్యత్తు గురించే కాక తన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. కుడి: చావుల్‌ఖోవా నది ఒడ్డున ఉన్న గ్రామంలోని ఇనువారా ఖాతూన్ (కుడి నుండి మొదటివారు) ఇంటి వద్ద సమావేశమయ్యే తన నేత బృందం వద్ద మర్జినాకు కొంత సాంత్వన లభిస్తుంది

నేత బృందంలో భాగం కావడం, ఇతర మహిళల సాంగత్యం మర్జినాకు సహాయపడింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆమె మొదటిసారి ఈ బృందం గురించి తెలుసుకున్నారు. నేత బృందాన్ని బర్‌పెటా నుంచి పనిచేసే ఆమ్రా పరి అనే సంస్థ ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాటు గ్రామంలో కొంత వెసులుబాటును కలిగించింది. “ బైదేవ్ [మేడమ్] ఖేటాలు [బొంతలు] నేయడం ప్రారంభించమని కొంతమంది మహిళలను కోరారు,” అన్నారు మర్జినా. మహిళలకు ఇందులో బయటకు అడుగు పెట్టకుండానే సంపాదించుకునే అవకాశం కనిపించింది. " ఖేటాల ను ఎలా నేయాలో నాకు ముందే తెలుసు, కాబట్టి నేను ఇందులో సులభంగా ఇమిడిపోగలను," అన్నారామె

ఒక బొంతను నేసేందుకు ఆమెకు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. ప్రతి బొంత అమ్మకానికి ఆమె రూ. 400-500 వరకూ సంపాదిస్తారు.

స్థానికంగా ఖేటా అని పిలిచే ఈ సంప్రదాయ మెత్తని బొంతలు నేయడానికి వాళ్ళు సమావేశమయ్యే రూపకుసిలోని ఇనువారా ఖాతూన్ ఇంటిలో మర్జినాతో పాటు మరో 10 మంది మహిళలను కూడా PARI సందర్శించింది.

సమూహంలోని ఇతర మహిళలతోనూ, వారిని కలవడానికి వచ్చిన మానవ హక్కుల కార్యకర్తలతోనూ జరిగిన సంభాషణల వలన మర్జినా తన విశ్వాసాన్ని కొంత తిరిగి పొందగలిగారు. “నేను పొలాల్లో పని చేస్తాను, ఖేటాలు నేయటమో లేదా కొంత కుట్టుపని చేయటమో చేస్తాను. పగటివేళల్లో నేనంతా మర్చిపోతాను, కానీ ఇప్పటికీ రాత్రివేళల్లో ఒత్తిడిని అనుభవిస్తున్నాను.”

ఆమె తన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. మర్జినా, ఆమె భర్త హషేమ్ అలీకి నలుగురు పిల్లలు - ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్ళయిపోయింది, వారికంటే చిన్నవాళ్ళు మాత్రం ఇంకా బడిలోనే ఉన్నారు. వారు ఇప్పటికే ఉద్యోగాలు రాకపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు. "కొన్నిసార్లు చదువుకున్నప్పటికీ, నా పౌరసత్వ పత్రాలు లేకుండా వారు [ప్రభుత్వ] ఉద్యోగం పొందలేరని నా పిల్లలు చెబుతుంటారు," అని మర్జినా చెప్పారు.

తన జీవితకాలంలో ఒక్కసారైనా వోటు వెయ్యాలని మర్జినా కోరుకుంటున్నారు. "దానివల్ల నేను నా పౌరసత్వాన్ని నిరూపించుకోగలను, నా పిల్లలు తాము కోరుకున్న ఉద్యోగాన్ని పొందగలరు," అంటారామె.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mahibul Hoque

محب الحق آسام کے ایک ملٹی میڈیا صحافی اور محقق ہیں۔ وہ پاری-ایم ایم ایف فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Mahibul Hoque
Editor : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli