గత మూడేళ్ళలో ఒక్కరు కూడా నాగలి చేయించుకోలేదు. కనీసం గొడ్డలి, పారలకి పిడి కూడా చేయించుకోలేదు. అంటే అర్థం, వ్యవసాయ పనిముట్లు చేసే బంగారు రామాచారి కష్టాల్లో వున్నారని. ఎన్నో ఏళ్ళుగా అతను ముకుందాపురంలో ఉన్న ఏకైక వడ్రంగి. ఆయనకు భూమి లేదు. పశువులు లేవు, రైతూ కాదు. కానీ ఆతని బాగోగులన్నీ ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలోని ఆ గ్రామంలో జరిగే వ్యవసాయం మీదే ఆధారపడివున్నాయి.
"వ్యవసాయం బాగాలేనప్పుడు రైతులే కాదు అందరూ చిక్కుల్లో పడతారు," అన్నారు ఎస్. శ్రీనివాస్ అనే ఇక్కడి రాజకీయ కార్యకర్త. "రామాచారి పరిస్థితి మరీ ఘోరం. ఆయన ఆకలితో చనిపోయారు. అది కూడా నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమకాలువ ఆయకట్టులోనే ఉన్న గ్రామంలో. ఇంతకుముందు ఏళ్ళకు ఏళ్ళు వ్యవసాయం బాగా సాగిన చోట.
వ్యవసాయ సంక్షోభం దుష్ప్రభావ ప్రకంపనలు ఆ రంగాన్ని దాటి విస్తరించాయి. రైతులను ఆత్మహత్యల వైపుకు నెడుతున్న ఈ సంక్షోభం కుమ్మరులు, చర్మకారులు, వడ్రంగులు వంటి ఎన్నో వ్యవసాయ అనుబంధ రంగాలవారిని కూడా సంక్షోభంలోకి నెట్టింది. సున్నితమైన, తరాల నాటి అనుబంధ రంగాల సంబంధాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి.
"నేను విజయవాడలో చెప్పుల కంపెనీలో పనికి వెళ్ళాను," అన్నారు చనిపోయిన రామాచారి భార్య అరుణ. వడ్రంగి సామాజిక వర్గానికి చెందిన మహిళలు సామాన్యంగా పనికోసం వలస పోరు. "మరో మార్గం లేదు," అందావిడ. "నేను ఇంతకు ముందెప్పుడూ ఇలా పనికోసం వలసవెళ్ళలేదు. కానీ ఇక్కడ పని దొరికే అవకాశాలు తక్కువ." నెలకొకసారి వచ్చేటట్టు పిల్లల్ని భర్త దగ్గర వదిలేసి వెళ్ళింది ఆవిడ.
"రామాచారికి ఒకప్పుడు 40 మంది దాకా ఖాతాదారులు వుండేవాళ్ళు," అన్నారు శ్రీనివాస్. "అతనితో పని చేయించుకున్నందుకు వాళ్ళతనికి ధాన్యం ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు ఏడాదికి 70 కిలోల ధాన్యం ఇచ్చేవాళ్ళు." మొత్తం వచ్చే 2800 కిలోల ధాన్యంలో తన కుటుంబానికి కావాల్సిన ధాన్యం ఉంచుకుని, మిగతాది మార్కెట్లో అమ్మేసేవారు. "70 కిలోలకు 250 రూపాయలు వచ్చేవి. అవి బియ్యం కాదు, వడ్లు అని గుర్తుంచుకోవాలి." తన కుటుంబ అవసరాలకు ఉంచుకుని మిగతా వడ్లు అమ్మితే సంవత్సరానికి 4000 రూపాయలు వచ్చేవి. దానితో అతను తన కుటుంబాన్ని పోషించుకునేవారు."
అతనికి ఇంకా ఎక్కువమందే ఖాతాదారులు ఉండేవారు. కానీ వ్యవసాయం పరిస్థితి బ్రహ్మాండంగా వున్నప్పుడు అతనికి కష్ఠాలు మొదలయ్యాయి. ఊర్లోకి వచ్చిన 12 ట్రాక్టర్ల వల్ల అతనికి పని తగ్గిపోయింది. "అది శరీరకష్టం చేసే వాళ్లందరినీ దెబ్బకొట్టింది," కె. లింగయ్య అన్నారు. అతనిలాంటి భూమి లేని కూలీలందరి పనీ అప్పటినుంచి కష్టంగానే వుంది. ఊర్లోకి ట్రాక్టర్లు రావడం రామాచారికి పెద్ద దెబ్బ. అయినా అతను తన వృత్తిని కొనసాగిస్తూ ఏదో ఒకరకంగా నెట్టుకొచ్చారు. "అతనికి ఇంకో పని రాదు," అన్నారు అరుణ. అతను 5వ తరగతి వరకూ, ఆమె 4వ తరగతి వరకూ చదివారు.




