ఉదయం 7 గంటల వేళ, డాల్టన్‌గంజ్ పట్టణంలోని సాదిక్ మంజిల్ చౌక్ అప్పటికే కోలాహలంగా ఉంది. బొబ్బరిస్తోన్న ట్రక్కులు, షట్టర్లను పైకి లేపుతున్న దుకాణాలు, దగ్గరలోనే ఉన్న ఒక గుడి నుంచి వినిపిస్తోన్న రికార్డ్ చేసిన హనుమాన్ చాలీసా .

ఒక దుకాణం మెట్ల మీద సిగరెట్ తాగుతూ కూర్చొని ఉన్న ఋషి మిశ్రా చుట్టుపక్కల ఉన్నవారితో పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం వారి చర్చలన్నీ ఈ మధ్యనే ముగిసిన సార్వత్రిక ఎన్నికల గురించి, ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనే విషయం చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు అరచేతుల మధ్యన పొగాకును రుద్దుతూ, తన చుట్టూ ఉన్నవారి వాదనలన్నీ వింటోన్న నజరుద్దీన్ అహ్మద్ చివరికిలా జోక్యం చేసుకున్నారు,"ఎందుకు మీరు వాదులాడుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా, మన జీవనం కోసం మనం సంపాదించుకోవాల్సిందే కదా."

ప్రతి రోజూ ఉదయం పూట ‘లేబర్ చౌక్’ అని కూడా పిలిచే ఈ ప్రదేశంలో గుమిగూడే అనేకమంది దినసరి కూలీలలో ఋషి, నజరుద్దీన్‌లు కూడా ఉన్నారు. పలామూ చుట్టుపక్కల ఊళ్ళలో పనులేమీ దొరకటంలేదని వారు చెప్తున్నారు. దాదాపు 25-30 మంది కూలీలు ఇక్కడి సాదిక్ మంజిల్ లేబర్ చౌక్ (జంక్షన్) వద్ద రోజువారీ కూలీ పని కోసం వేచి ఉన్నారు. పట్టణంలోని ఇటువంటి ఐదు చౌక్‌లలో ఇది కూడా ఒకటి. ఝార్ఖండ్‌లోని సమీప గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఉదయం ఈ చౌకులకు వచ్చి పని కోసం వెతుక్కుంటారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

పలామూ జిల్లాలోని సింగ్రాహా కలాన్ గ్రామానికి చెందిన ఋషి మిశ్రా (ఎడమ), నేవురా గ్రామానికి చెందిన నజరుద్దీన్ (కుడి). వీరిద్దరూ పని కోసం వెతుకుతూ డాల్టన్‌గంజ్‌లోని సాదిక్ మంజిల్ వద్ద గుమిగూడే దినసరి కూలీలు. గ్రామాల్లో పనులు దొరకటంలేదని ఈ శ్రామికులు చెప్తున్నారు

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

డాల్టన్‌గంజ్‌లోని ఇటువంటి ఐదు జంక్షన్లలో ‘లేబర్ చౌక్’ అని పిలిచే సాదిక్ మంజిల్ కూడా ఒకటి. 'ప్రతి రోజూ ఇక్కడకు 500 మంది వస్తారు. వారిలో 10 మందికి మాత్రమే పని దొరుకుతుంది, మిగిలినవారంతా ఉత్త చేతులతో ఇళ్ళకు వెళ్తారు," అన్నారు నజరుద్దీన్

"ఎనిమిది గంటల వరకూ ఎదురు చూడు. ఇక్కడ నిలబడటానికి కూడా చోటు దొరకనంతమంది జనం వస్తారు," తన మొబైల్ ఫోన్‌లో టైమ్ చూసుకుంటూ చెప్పాడు ఋషి.

2014లో తన ఐటిఐ శిక్షణను పూర్తిచేసుకున్న ఋషి, డ్రిల్లింగ్ యంత్రాన్ని నడిపించగలడు. ఈ రోజు ఆ పని దొరుకుతుందేమోనని అతను ఆశిస్తున్నాడు. "ఉద్యోగాలు వస్తాయనే ఆశతో మేం ఈ ప్రభుత్వానికి వోటు వేశాం. [నరేంద్ర] మోదీ పదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు. ఎన్ని ఖాళీలను ప్రకటించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?" సింగ్రాహా కలాన్ గ్రామానికి చెందిన 28 ఏళ్ళ ఋషి అడిగాడు. "ఈ ప్రభుత్వం మరో ఐదేళ్ళు కొనసాగేట్టయితే, ఇహమాకే ఆశా ఉండదు."

నజరుద్దీన్ (45) కూడా ఇదేవిధంగా భావిస్తున్నారు. నేవురా గ్రామానికి చెందిన ఈ తాపీ మేస్త్రీ, ఏడుగురున్న తన కుటుంబానికి ఏకైక సంపాదనాపరుడు. "పేదవాళ్ళనూ రైతులనూ పట్టించుకునేదెవరు?" అంటారు నజరుద్దీన్. "ప్రతి రోజూ ఇక్కడకు 500 మంది జనం వస్తారు. వారిలో 10 మందికి మాత్రమే పని దొరుకుతుంది, మిగిలినవారంతా ఉత్త చేతులతో ఇళ్ళకు వెళ్తారు."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఆడా మగా ఈ కూలీలంతా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి నిల్చుంటారు. ఎవరైనా అక్కడికి రాగానే, ఆ రోజుకు పని దొరుకుతుందనే ఆశతో అందరూ అతని చుట్టూ మూగుతారు

మోటర్‌బైకె మీద ఒక వ్యక్తి అక్కడకు రాగానే, ఆ సంభాషణకు అంతరాయం కలిగింది. ఆ రోజుకు పని దొరుకుతుందని ఆశిస్తూ జనమంతా అతని చుట్టూ చేరారు. కూలీ నిర్ణయమయ్యాక, ఒక యువకుడు ఎంపికయ్యాడు. అతన్ని వెనకవైపున ఎక్కించుకొని ఆ బైకు దూసుకుపోయింది.

ఋషి, అతని తోటి శ్రామికులు మళ్ళీ వారి వారి స్థానాలకు వచ్చారు. " తమాషా చూడండి. ఒకరు వస్తారు, అందరూ ముందుకు దూకుతారు," బలవంతంగా నవ్వుతూ అన్నాడు ఋషి.

వెనక్కు వెళ్ళి కూర్చుంటూ, "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారెవరైనా, అది పేదలకు ప్రయోజనకరంగా ఉండాలి. మెహెంగాయీ [ద్రవ్యోల్బణం] దిగిరావాలి. ఆలయం కడితే పేదవాళ్ళ పొట్టలు నిండుతాయా?" అన్నాడు ఋషి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ashwini Kumar Shukla

اشونی کمار شکلا پلامو، جھارکھنڈ کے مہوگاواں میں مقیم ایک آزاد صحافی ہیں، اور انڈین انسٹی ٹیوٹ آف ماس کمیونیکیشن، نئی دہلی سے گریجویٹ (۲۰۱۸-۲۰۱۹) ہیں۔ وہ سال ۲۰۲۳ کے پاری-ایم ایم ایف فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli