కోవిడ్ -19 మహామారి సమయంలో కాలి నడకన హరియాణా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మహారాజ్‌గంజ్‌కి ఎలా ప్రయాణించాల్సి వచ్చిందో సునీతా నిషాద్ గుర్తు చేసుకున్నారు.
హఠాత్తుగా దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించటంతో ఎన్నో అవస్థలు పడి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళాల్సివచ్చిన లక్షలాదిమంది వలస కార్మికులలో ఆమె కూడా ఒకరు. అందువల్ల కేంద్ర బడ్జెట్‌లోనైనా, లేదా మరెక్కడైనా ప్రకటించే ఎలాంటి నూతన ప్రభుత్వ పథకాలపైన కూడా ఆమె ఆసక్తి చూపకపోవడంలో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
" మీరు నన్ను బడ్జెట్ గురించి అడుగుతున్నారు," ఆమె ఈ విలేకరితో అన్నారు. "అలా కాకుండా, కరోనా [కోవిడ్-19] సమయంలో మమ్మల్ని ఇళ్ళకు పంపించడానికి తగినంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎందుకు లేదో ప్రభుత్వాన్నే అడగండి."
ప్రస్తుతం, 35 ఏళ్ళ ఈ మహిళ హరియాణా, రోహ్‌తక్ జిల్లాలోని లాఢోత్ గ్రామంలో తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సరికూర్చే పనిలో ఉన్నారు. “ మజ్‌బూర్ హూఁ [నేను నిస్సహాయురాలిని]. అందుకే ఇక్కడికి తిరిగి రావాల్సి వచ్చింది."
రీసైక్లింగ్ చేయటంకోసం పారేసిన పెర్ఫ్యూమ్ డబ్బాలకు కన్నాలు చేస్తూన్న ఆమె, “ మేరే పాస్ బడా మొబైల్ నహీఁ హై, ఛోటా మొబైల్ హై [నా దగ్గర పెద్ద మొబైల్ ఫోన్ లేదు, చిన్నదే ఉంది]. బడ్జెట్ అంటే ఏమిటో నాకెలా తెలుస్తుంది?" అన్నారు. డిజిటలైజేషన్ పెరిగిపోతోన్న నేపథ్యంలో, వేగంగా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లపై ఆధారపడటం తప్పనిసరిగా మారిపోయింది. కానీ గ్రామీణ భారతదేశంలో చాలామందికి ఇవి ఇప్పటికీ అందుబాటులో లేవు.
![](/media/images/02-IMG_5966-AM-Budget_What_have_I_got_to_d.max-1400x1120.jpg)
రోహ్‌తక్‌లోని లాఢోత్ గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సరికూర్చే పనిలో సునీతా నిషాద్
![](/media/images/03a-IMG_5979-AM-Budget_What_have_I_got_to_.max-1400x1120.jpg)
![](/media/images/03b-IMG_5999-AM-Budget_What_have_I_got_to_.max-1400x1120.jpg)
హరియాణా, రోహ్‌తక్‌లోని భైయాఁపూర్ గ్రామానికి చెందిన గేదెల కాపరి కౌసల్యా దేవి. కేంద్ర బడ్జెట్‌పై ఆమె ఏమనుకుంటున్నారో అడిగినప్పుడు,"బడ్జెట్టా? దాంతో నాకేం పని?" అని అడిగారామె
పొరుగు గ్రామమైన భైయాఁపూర్‌లో గేదెల కాపరి అయిన 45 ఏళ్ళ కౌసల్యా దేవి కూడా కేంద్ర బడ్జెట్‌పై అదే విధమైన ఉదాసీనతను వ్యక్తం చేశారు.
“బడ్జెట్టా? ఉస్సే క్యా లేనా-దేనా? [దాంతో నాకేం సంబంధం?] నేను కేవలం పిడకలు చేసుకునే, గేదెలను పెంచుకునే మహిళను. జై రామ్‌జీ కీ !” అంటూ ఆమె మా సంభాషణను ముగించేశారు.
అయితే, కౌసల్యాదేవి ఆవేదన వేరే. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ కొనుగోలు ధరలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు- ముఖ్యంగా పాల సేకరణ ధర గురించి. తాను గేదె పేడను సేకరించడానికి ఉపయోగించే రెండు బరువైన తట్టలలో ఒకదానిని పైకి ఎత్తి, "కావాలంటే నేను రెండింటినీ ఎత్తేస్తాను, కానీ నా పాలకు మంచి ధర ఇవ్వండి," సరదాగా అన్నారామె.
"ప్రభుత్వం పాలకు కూడా విలువ ఇవ్వకపోతే, దాని ఇతర పథకాలు మాత్రం మాకేం విలువనిస్తాయి?"
అనువాదం: రవి కృష్ణ