ఒక సార్వత్రిక ఎన్నికలలో వోటు వేసే అవకాశం రావటం బబ్లూ కైబర్తాకు ఇది రెండవసారి.

బబ్లూ గత ఎన్నికలలో మొదటిసారి వోటు వేసేందుకు వెళ్ళినపుడు అధికారులు అతనిని వెంటనే వెళ్ళనిచ్చారు. అతనికి ఏ క్యూలోనూ నిల్చోవాల్సిన అవసరం రాలేదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా, పల్మా గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్‌లోకి వెళ్ళాక బబ్లూకు తన వోటు ఎలా వెయ్యాలో తెలియలేదు.

24 ఏళ్ళ బబ్లూకు దృష్టి లోపం ఉంది. 2019 సాధారణ ఎన్నికల నుంచి పోలింగ్ కేంద్రంగా కూడా పనిచేస్తోన్న ఆ ప్రాథమిక పాఠశాలలో బ్రెయిలీ భాషలో ఉన్న బ్యాలట్ పత్రాలు గానీ, బ్రెయిలీ ఇవిఎమ్ (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్) గానీ లేవు.

"నాకేం చేయాలో తోచలేదు. నాకు సాయం చేస్తోన్న వ్యక్తి ఎన్నికల గుర్తుల గురించి అబద్ధం చెప్తే నేనేం చేయాలి?" డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోన్న బబ్లూ అడిగాడు. సహాయకుడిగా ఉన్న వ్యక్తి నిజమే చెప్పినా కూడా, రహస్య బ్యాలట్ అనే తన ప్రజాస్వామిక హక్కును అతిక్రమించినట్టే కదా అని బబ్లూ వాదిస్తాడు. కొద్దిగా ఇబ్బందిపడుతూ బబ్లూ తనకు సూచించిన గుర్తుపై మీటను నొక్కాడు. బయటకు వచ్చాక అది తాను అనుకున్న గుర్తు అవునో కాదో రూఢి చేసుకున్నాడు. "ఆ వ్యక్తి నాకు అబద్ధం చెప్పలేదు, అందుకు కృతజ్ఞుడిని," అంటాడు బబ్లూ.

PWD (వైకల్యం ఉన్నవారు) - అనుకూల బూత్‌లలో బ్రెయిలీ బ్యాలెట్లు, ఇవిఎమ్‌ల ఏర్పాటును భారత ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. "ఉండటానికి కాగితాలపై చాలా నిబంధనలే ఉన్నాయి" అని కొల్‌కతాకు చెందిన శ్రుతి వికలాంగుల హక్కుల కేంద్రం డైరెక్టర్ శంపా సేన్‌గుప్తా చెప్పారు. "కానీ అమలు మాత్రం పేలవంగా ఉంటుంది."

సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ దగ్గరకు వచ్చాయి, అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఆరవ దశలో వోటు వేయడానికి తాను ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది ఇప్పటికింకా బబ్లూ నిర్ణయించుకోలేదు. మే 25న పోలింగ్ జరగనున్న పురూలియాలో బబ్లూ వోటరుగా నమోదై ఉన్నాడు.

PHOTO • Prolay Mondal

మే 25న జరిగే పోలింగ్‌లో వోటు వేయడానికి తాను ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది బబ్లూ కైబ్రతా ఇంకా నిర్ణయించుకోలేదు. గత ఎన్నికలలో అతను వోటు వేసేటప్పటికి, ఆ పోలింగ్ బూత్‌లో బ్రెయిలీ ఇవిఎమ్ గానీ, బ్రెయిలీ బ్యాలట్ పత్రం గానీ లేవు. అయితే, దృష్టిలోపం ఉన్నవారి కోసం తగిన ఏర్పాటు లేకపోవడం ఒక్కటే అతని అందోళనకు కారణం కాదు, ప్రయాణ ఖర్చుల గురించి కూడా

తనలాంటి దృష్టిలోపం ఉన్నవారి కోసం తగిన ఏర్పాటు లేకపోవడం ఒక్కటే అతని అందోళనకు కారణం కాదు. ప్రస్తుతం తాను బస చేస్తోన్న విశ్వవిద్యాలయ వసతిగృహం నుండి రైలులో పురూలియా వెళ్ళటానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది.

"నేను డబ్బుల గురించి ఆలోచించాలి. నా టిక్కెట్ల కోసం, స్టేషన్‌కు వెళ్ళేందుకు బస్ ఛార్జీలను కూడా నేను చెల్లించాల్సి ఉంటుంది," బబ్లూ చెప్పాడు. భారతదేశంలో సాధారణ వైకల్యాలు ఉన్న 26.8 మంది వ్యక్తులలో, 18 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా 19 శాతం మంది దృష్టిలోపం ఉన్నవారు (2011 జనగణన). ఈ సౌకర్యాలను ఎక్కడైనా అమలుచేయటానికి పూనుకున్నా, చాలావరకూ అది పట్టణప్రాంతాలకే పరిమితమయిందని శంపా చెప్పారు. "ఈ రకమైన అవగాహన పెరగటమనేది ఎన్నికల కమిషన్ చొరవ తీసున్నపుడే సాధ్యమవుతుంది. దీన్ని ప్రచారం చేసేందుకు రేడియో మాధ్యమాన్ని వాడాలి."

"ఎవరికి వోటు వేయాలో నేను తేల్చుకోలేకపోతున్నాను," కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఉన్న వికలాంగుల కేంద్రం వద్ద ఈ విలేఖరి తనతో మాట్లాడినప్పుడు బబ్లూ అన్నాడు.

"అతని పార్టీ, వాళ్ళ నాయకులు మంచి పని చేస్తున్నారని ఒక వ్యక్తికి నేను వోటు వేస్తాననుకోండి, వాళ్ళు మరో పార్టీలోకి మారిపోవచ్చు," బబ్లూ ఫిర్యాదు చేశాడు. గత కొన్నేళ్ళలో, ప్రత్యేకించి 2021 శాసనసభ ఎన్నికలకు ముందు, పశ్చిమబెంగాల్‌లో అనేక మంది రాజకీయ నాయకులు, అనేకసార్లు పార్టీలు మారారు.

*****

ఏదైన బడిలో లేదా కళాశాలలో ఉపాధ్యాయుడిగా - స్థిరమైన ఆదాయాన్నిచ్చే ప్రభుత్వోద్యోగం - చేయాలని బబ్లూ కోరుకుంటున్నాడు.

రాష్ట్రంలోని పాఠశాల సర్వీస్ కమిషన్ (SSC) అనేక తప్పుడు కారణాలతో వార్తలకెక్కింది. "ఒకప్పుడు ఈ కమిషన్ ఒక గొప్ప ఉపాధి కల్పనా కేంద్రం [యువతకు]గా ఉండేది," మాజీ ప్రొఫెసర్, హయ్యర్ సెకండరీ కౌన్సిల్ అధ్యక్షురాలైన గోపా దత్తా అన్నారు. "ఎందుకంటే గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, పెద్ద నగరంలో ఎక్కడ చూసినా పాఠశాలలే. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనేది అనేకమంది ఆకాంక్షగా ఉండేది."

PHOTO • Prolay Mondal

'ఎవరికి ఓటు వేయాలో నాకు ఖచ్చితంగా తెలియటంలేదు' అని బబ్లూ చెప్పాడు. ఫలితాల వెల్లడి తర్వాత తాను ఓటు వేసిన అభ్యర్థి ఫిరాయించే అవకాశం ఉందని, గత ఐదారేళ్ళుగా పశ్చిమ బెంగాల్‌లో ఇదే ట్రెండ్‌ కనిపిస్తోందని బబ్లూ ఆందోళన వ్యక్తం చేశాడు

గత ఏడెనిమిదేళ్ళుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జరిగిన అవినీతిని ప్రజలంతా చూశారు. ఒక అపార్ట్‌మెంట్‌లో మూటల కొద్దీ నోట్లకట్టలు కనిపించాయి, మంత్రులు జైలుకు వెళ్ళారు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిజాయితీగా జరగాలని కోరుతూ అభ్యర్థులు నెలల తరబడి శాంతియుత ధర్నా కు కూర్చున్నారు, కలకత్తా ఉన్నత న్యాయస్థానం 25,000 మంది ఉద్యోగ నియామకాల్ని రద్దుచేసింది. అర్హులైన, అనర్హులైన అభ్యర్థుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని చెబుతూ భారత అత్యున్నత న్యాయస్థానం మే మొదటి వారంలో ఈ ఉత్తర్వుపై స్టే విధించింది.

"నాకు భయంగా ఉంది," ఈ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ బబ్లూ చెప్పాడు. “104 మంది దృష్టి వైకల్యం ఉన్న అభ్యర్థులు ఉన్నారని నేను విన్నాను. బహుశా వాళ్ళు అర్హులై ఉంటారు. వారి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా?"

కేవలం SSC రిక్రూట్‌మెంట్ విషయంలోనే కాదు, వికలాంగుల అవసరాలను అధికారులు పెద్దగా పట్టించుకోరని బబ్లూ అభిప్రాయపడ్డాడు. "పశ్చిమ బెంగాల్‌లో దృష్టి వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం తగినన్ని పాఠశాలలు లేవు," అన్నాడతను. "బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి మాకు ప్రత్యేకమైన పాఠశాలలు కావాలి." మరే అవకాశం లేకపోవడంతో అతను తన ఇంటిని వదిలి రావలసి వచ్చింది. ఎంతగా అనుకున్నప్పటికీ, కళాశాలను ఎంచుకునే సమయం వచ్చినప్పుడు తిరిగి వెళ్ళలేకపోయాడు. “వైకల్యాలు కలవారి గురించి తాము ఆలోచిస్తున్నామని ఏ ప్రభుత్వమూ చెప్పగా నేను వినలేదు."

అయితే బబ్లూ ఆశాభావంతోనే ఉన్నాడు. "నేనేదైనా ఉద్యోగం చూసుకోవాలంటే మరి కొన్నేళ్ళు ఆగాలి," అన్నాడతను. "పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నాను."

బబ్లూకు 18 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుండి అతని కుటుంబంలో అతనే సంపాదనాపరుడు. అతని చెల్లెలైన బునూరాణి కైబర్తా కలకత్తా అంధుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అతని తల్లి సంధ్య పల్మాలో నివసిస్తారు. వీరి కుటుంబం చేపలు పట్టడాన్ని వృత్తిగా కలిగివున్న కైబర్తా సముదాయానికి (రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా నమోదయింది) చెందినది. బబ్లూ తండ్రి చేపలు పట్టి అమ్ముతుండేవారు, కానీ ఆయన పొదుపు చేసినదంతా ఆయనకు కేన్సర్ రావటంతో ఆ చికిత్స కోసమే ఖర్చయిపోయింది.

బబ్లూ తండ్రి 2012లో మరణించడంతో, కొన్నేళ్ళు బబ్లూ తల్లి బయట పనిచేశారు. "ఆమె కూరగాయలు అమ్మేది. కానీ ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన ఆమె ఎక్కవ కష్టపడి పనిచేయలేకపోతోంది," చెప్పాడు బబ్లూ. సంధ్య కైబర్తాకు ప్రతి నెలా రూ. 1000 వితంతు పింఛనుగా వస్తుంది. "పోయిన ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచే ఆమెకు పింఛను రావడం మొదలయింది," అన్నాడు బబ్లూ.

PHOTO • Antara Raman

‘వైకల్యాలు ఉన్న ప్రజల గురించి తాను ఆలోచిస్తున్నట్టుగా ఏదైనా ప్రభుత్వం చెప్పగా నేనెన్నడూ వినలేదు’

పురూలియాలో ట్యూషన్స్ చెప్పటం, స్థానికంగా ఉండే స్టూడియోలకు సంగీతం సమకూర్చడం అతని సొంత సంపాదనా మార్గాలు. అతనికి మానవిక్ పెన్షన్ పథకం కింద ప్రతినెలా రూ. 1000 పింఛను కూడా వస్తుంది. శిక్షణ పొందిన గాయకుడైన బబ్లూ, వేణువునూ సింథసైజర్‌నూ వాయిస్తాడు. తన ఇంట్లో ఒక సంగీత సంస్కృతి ఎల్లప్పుడూ ఉంటూనే ఉందని బబ్లూ అంటాడు. "మా ఠాకూర్‌దా [తండ్రికి తండ్రి] రవి కైబర్తా పురూలియాలో ప్రసిద్ధి చెందిన జానపద కళాకారుడు. ఆయన వేణువు ఊదేవాడు." బబ్లూ పుట్టకముందే ఆయన మరణించినప్పటికీ సంగీతంపై ప్రేమ ఆయన వారసత్వంగానే తనకు వచ్చిందని ఈ మనవడు (బబ్లూ) భావిస్తున్నాడు. "మా నాన్న కూడా అదే చెప్పేవాడు."

బబ్లూ పురూలియాలో ఉండే సమయంలోనే రేడియో ద్వారా మొదటిసారి వేణుగానాన్ని విన్నాడు. "నేను ఖుల్నా స్టేషన్ ద్వారా బంగాదేశ్ వార్తలు వింటుండేవాడిని. వార్తలకు ముందు వాళ్ళు వేణుగానాన్ని ప్రసారం చేసేవాళ్ళు. అదేమి సంగీతమని నేను మా అమ్మను అడిగాను." అది వేణువు అని తల్లి చెప్పారు. బబ్లూ తికమకపడ్డాడు. అంతవరకూ అతను పెద్దగా బాతు అరిచినట్టు శబ్దం చేసే భేఁపు అనే ఒక రకమైన వేణువు పేరే విన్నాడు. అతను దాన్ని తన చిన్నప్పుడు ఊదేవాడు. కొన్ని వారాల తర్వాత అతని తల్లి సంత నుండి అతని కోసం రూ. 20కి ఒక వేణువును కొని తెచ్చారు. కానీ దాన్ని ఎలా వాయించాలో అతనికి నేర్పించడానికి ఎవరూ లేరు.

బబ్లూ 2011లో కొల్‌కతా శివార్లలోని నరేంద్రపూర్‌లో ఉన్న అంధ బాలుర అకాడెమీలో చేరాడు. అంతకు ముందు పురూలియాలో ఉండే అంధుల పాఠశాలలో ఎదుర్కొన్న ఒక ఘోరమైన అనుభవం వలన అతను ఆ బడి మానేసి రెండేళ్ళపాటు ఇంటి దగ్గరే ఉండిపోయాడు. "ఒక రాత్రి జరిగినదేదో నన్ను చాలా భయపెట్టింది. ఆ బడిలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి, విద్యార్థులు రాత్రివేళ ఒంటరిగా ఉండేవారు. ఆ సంఘటన తర్వాత నన్ను ఇంటికి తీసుకుపొమ్మని మా అమ్మానాన్నలను అడిగాను," చెప్పాడు బబ్లూ.

ఈ కొత్త బడిలో సంగీతాన్ని వినిపించమని బబ్లూను ప్రోత్సహించేవారు. అతను వేణువునూ సింథసైజర్‌ను కూడా నేర్చుకున్నాడు. పాఠశాల సంగీత బృందంలో భాగమయ్యాడు. ఇప్పుడతను పురూలియా కళాకారులు పాడే పాటల మధ్య విరామంలో సంగీతాన్ని రికార్డ్ చేయటంతో పాటు తరచుగా వేడుకలలో ప్రదర్శనలు ఇస్తున్నాడు. స్టూడియోలో చేసే ప్రతి రికార్డింగ్‌కు అతనికి రూ. 500 చెల్లిస్తారు. కానీ అదేమీ స్థిరమైన ఆదాయ వనరు కాదని బబ్లూ అంటాడు.

"నేను సంగీతాన్ని వృత్తిగా కొనసాగించలేను," అంటాడతను. "దానికే అంకితం చేయగలిగేంత సమయం నాకు లేదు. మాకు డబ్బు లేకపోవడం వలన నేను తగినంతగా నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నా కుటుంబ సంరక్షణ నా బాధ్యత."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sarbajaya Bhattacharya

سربجیہ بھٹاچاریہ، پاری کی سینئر اسسٹنٹ ایڈیٹر ہیں۔ وہ ایک تجربہ کار بنگالی مترجم ہیں۔ وہ کولکاتا میں رہتی ہیں اور شہر کی تاریخ اور سیاحتی ادب میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sarbajaya Bhattacharya
Editor : Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David
Illustration : Antara Raman

انترا رمن سماجی عمل اور اساطیری خیال آرائی میں دلچسپی رکھنے والی ایک خاکہ نگار اور ویب سائٹ ڈیزائنر ہیں۔ انہوں نے سرشٹی انسٹی ٹیوٹ آف آرٹ، ڈیزائن اینڈ ٹکنالوجی، بنگلورو سے گریجویشن کیا ہے اور ان کا ماننا ہے کہ کہانی اور خاکہ نگاری ایک دوسرے سے مربوط ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Antara Raman
Photographs : Prolay Mondal

Prolay Mandal has an M.Phil from the Department of Bengali, Jadavpur University. He currently works at the university's School of Cultural Texts and Records.

کے ذریعہ دیگر اسٹوریز Prolay Mondal
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli