1947 నాటి రక్తసిక్త విభజన ద్వారా రెండు దేశాల మధ్య ఒక సరిహద్దు ఏర్పడితే, రాడ్‌క్లిఫ్ లైన్ కూడా పంజాబ్‌ను రెండు భాగాలుగా విభజించింది. సరిహద్దు కమిషన్ల ఛైర్మన్‌గా పనిచేసిన బ్రిటిష్ న్యాయవాది పేరుతో ఉన్న ఆ సరిహద్దు రేఖ, పంజాబ్‌ను భౌగోళికంగానే కాక, పంజాబీ భాషకు చెందిన రెండు లిపులను కూడా విభజించింది. "పంజాబీ సాహిత్యంపై, భాషకు చెందిన రెండు లిపులపై దేశ విభజన ఎప్పటికీ తాజా గాయాన్ని మిగిల్చింది," అని రాష్ట్రంలోని లుథియాణా జిల్లా, పాయల్ తహసీల్‌ లోని కటెహ్రీ గ్రామానికి చెందిన కిర్పాల్ సింగ్ పన్నూ అన్నారు.

పన్నూ 90 ఏళ్ళ వయసున్న మాజీ సైనికుడు. ఆయన తన జీవితంలోని మూడు దశాబ్దాల కాలాన్ని దేశ విభజన వలన అయిన ఈ ప్రత్యేక గాయానికి మలామా పూయడానికే అంకితం చేశారు. సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)లో డిప్యూటీ కమాండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన పన్నూ, గురుగ్రంథ సాహిబ్, మహాన్ కోశ్ [పంజాబ్‌లోని అత్యంత గౌరవనీయమైన సర్వసంగ్రహ నిఘంటువు (ఎన్‌సైక్లోపీడియా) లలో ఒకటి] వంటి గ్రంథాలనూ, పవిత్ర పుస్తకాలనూ, ఇతర సాహిత్య రచనలనూ గురుముఖి నుండి షాహ్‌ముఖిలోకీ, అలాగే షాహ్‌ముఖి నుండి గురుముఖిలోకీ లిప్యంతరీకరించారు.

ఉర్దూ భాషలాగా కుడి నుండి ఎడమకు రాసే షాహ్‌ముఖిని 1947 నుంచి భారతదేశపు పంజాబ్‌లో ఉపయోగించడంలేదు. 1995-1996లో పన్నూ గురు గంథ్ సాహిబ్‌ను గురుముఖి నుంచి షాహ్‌ముఖిలోకీ, అలాగే షాహ్‌ముఖి నుండి గురుముఖిలోకీ మార్చే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ ను అభివృద్ధి చేశారు.

విభజనకు ముందు, ఉర్దూ మాట్లాడేవారు షాహ్‌ముఖిలో రాసిన పంజాబీని కూడా చదవగలిగేవారు. పాకిస్తాన్ ఏర్పడక ముందు అనేక సాహిత్య రచనలు, అధికారిక కోర్టు పత్రాలు షాహ్‌ముఖిలోనే ఉండేవి. గతంలో అవిభాజ్య ప్రావిన్స్‌కు చెందిన కథ చెప్పే సంప్రదాయక కళ అయిన కిస్సా కూడా షాహ్‌ముఖిని మాత్రమే ఉపయోగించింది.

ఎడమ నుండి కుడికి రాసే గురుముఖికి దేవనాగరి లిపితో కొంత పోలిక ఉంది. దీనిని పాకిస్తాన్ పంజాబ్‌లో ఉపయోగించరు. తత్ఫలితంగా, పంజాబీ మాట్లాడే పాకిస్తానీల తరువాతి తరాలు, గురుముఖిని చదవలేరు కాబట్టి వారి సాహిత్యానికి దూరంగా ఉండిపోయారు. తమకు తెలిసిన లిపి అయిన షాహ్‌ముఖిలో రూపొందించినప్పుడు మాత్రమే వారు అవిభక్త పంజాబ్‌కు చెందిన గొప్ప సాహిత్య రచనలను చదవగలిగారు.

Left: Shri Guru Granth Sahib in Shahmukhi and Gurmukhi.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: Kirpal Singh Pannu giving a lecture at Punjabi University, Patiala
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ఎడమ: షాహ్‌ముఖి, గురుముఖి లిపులలోని శ్రీ గురు గ్రంథ్ సాహిబ్. కుడి: పటియాలలోని పంజాబీ విశ్వవిద్యాలయంలో ఉపన్యసిస్తోన్న కిర్‌పాల్ సింగ్ పన్నూ

భాషా నిపుణుడు, పటియాలాలో ఫ్రెంచ్‌ని బోధించే డాక్టర్ భోజ్ రాజ్(68) షాహ్‌ముఖిని కూడా చదువుతారు. "1947కి ముందు, షాహ్‌ముఖి, గురుముఖి రెండూ వాడుకలో ఉండేవి, కానీ గురుముఖి ఎక్కువగా గురుద్వారా లకు (సిక్కు ప్రార్థనా స్థలాలు) పరిమితమై ఉండేది," అని ఆయన చెప్పారు. రాజ్ చెప్పినదాని ప్రకారం, స్వాతంత్ర్యానికి పూర్వపు సంవత్సరాలలో పంజాబీ భాషలో పరీక్షలు రాసే విద్యార్థులు షాహ్‌ముఖిలో రాయాలని భావించేవారు.

"రామాయణం, మహాభారతం వంటి హిందూ మత గ్రంథాలు కూడా పర్సో-అరబిక్ లిపిలో రాయబడ్డాయి," అని రాజ్ చెప్పారు. పంజాబ్ విభజనతోనే భాష కూడా చీలిపోయింది. షాహ్‌ముఖి పశ్చిమ పంజాబ్‌కు వలసపోయి పాకిస్తానీ అయిపోగా, గురుముఖి భారతదేశంలో ఒంటరిగా ఉండిపోయింది.

పంజాబీ సంస్కృతి, భాష, సాహిత్యం, చరిత్రలలో కీలకమైన భాగాన్ని కోల్పోవడంపై దశాబ్దకాలంగా ఉన్న ఆందోళనను తగ్గించేందుకు పన్నూ ప్రాజెక్ట్ ఒక మార్గంగా వచ్చింది.

"తూర్పు పంజాబ్ (భారతదేశం వైపు)కు చెందిన రచయితలు, కవులు తమ సృజనను పశ్చిమ పంజాబ్‌లోనివారు (పాకిస్తాన్ వైపువారు) చదవాలని కోరుకున్నారు, అదేవిధంగా అటువైపు వారు కూడా ఇలాగే కోరుకున్నారు," అని పన్నూ చెప్పారు. కెనడాలోని టొరంటోలో జరిగే సాహిత్య సమావేశాలలో ఆయన పాల్గొన్నపుడు, అక్కడికి హాజరైన పాకిస్తానీ పంజాబీలు, ఇతర దేశాలకు చెందిన పంజాబీలు ఈ నష్టం గురించి వాపోయేవారు.

అలాంటి ఒక సమావేశంలో పాఠకులు, పండితులు ఒకరి సాహిత్యాన్ని మరొకరు చదవాలనే కోరికను వ్యక్తం చేశారు. "ఇరువైపులా ఈ రెండు లిపులను నేర్చుకుంటేనే అది సాధ్యమవుతుంది," అని పన్నూ చెప్పారు. "అయితే, ఇది జరగడం కంటే చెప్పడం సులభం."

ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఏకైక మార్గం ప్రధాన సాహిత్య రచనలను అవి అందుబాటులో లేని లిపిలోకి తిరగరాయడం. పన్నూకి ఓ ఆలోచన పుట్టింది.

చివరికి, పన్నూ కంప్యూటర్ ప్రోగ్రామ్ పాకిస్తాన్ పాఠకుడికి సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను షాహ్‌ముఖిలో అందుబాటులోకి తెచ్చి, చదవడానికి వీలు కల్పిస్తుంది. అదే కార్యక్రమం పాకిస్తాన్‌లో ఉర్దూ లేదా షాహ్‌ముఖిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను, వాచకాలను గురుముఖిలో  లిప్యంతరీకరణ చేస్తుంది.

Pages of the Shri Guru Granth Sahib in Shahmukhi and Gurmukhi
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

షాహ్‌ముఖిలోనూ గురుముఖిలోనూ ఉన్న శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అంగాలు (పుటలు)

*****

1988లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, పన్నూ కెనడా వెళ్ళి, కంప్యూటర్‌ను ఉపయోగించడమెలాగో అధ్యయనం చేశారు.

కెనడాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న పంజాబీలు తమ మాతృదేశం నుంచి వచ్చే వార్తలను చదవాలనే ఆసక్తితో ఉండేవారు. పంజాబీ దినపత్రికలైన అజిత్, పంజాబీ ట్రిబ్యూన్ వంటివి విమాన మార్గంలో భారతదేశం నుంచి కెనడా చేరేవి.

ఈ పత్రికలతో పాటు ఇతర వార్తాపత్రికల నుండి చేసిన కత్తిరింపులు, టొరంటోలో వార్తాపత్రికలను వెలువరించడానికి ఉపయోగించబడతాయని పన్నూ చెప్పారు. ఈ వార్తాపత్రికలన్నీ దాదాపుగా వివిధ ప్రచురణల నుండి కత్తిరించిన వార్తల కత్తిరింపులు కావటంతో, అవి రకరకాల ఫాంట్‌లను కలిగి ఉంటాయి

అటువంటి దినపత్రికలలో ఒకటి హమ్‌దర్ద్ వీక్లీ , ఆ తర్వాతి రోజులలో పన్నూ ఇందులో పనిచేశారు. 1993లో, ఆ పత్రిక సంపాదకులు తమ వార్తాపత్రికను ఒకే ఫాంట్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

“ఫాంట్‌లు రావడం ప్రారంభమైంది, అప్పుడు కంప్యూటర్ల ఉపయోగం కూడా సాధ్యమైంది. నేను మొదటగా ఒక గురుముఖి ఫాంట్‌ను మరొక ఫాంట్‌గా మార్చడంతో ప్రారంభించాను,” పన్నూ చెప్పారు.

టైప్ చేసిన హమ్‌దర్ద్ వీక్లీ మొదటి కాపీ, అనంతపుర్ ఫాంట్‌లో, తొంభైల ప్రారంభంలో టొరంటోలోని ఆయన నివాసం నుండి విడుదలయింది. ఆ తర్వాత, 1992లో టొరంటోలో ప్రారంభమైన పంజాబీ రచయితల సంస్థ పంజాబీ కల్మాఁ దా కాఫ్లా (పంజాబీ రైటర్స్ అసోసియేషన్) సమావేశంలో గురుముఖి-షాహ్‌ముఖి మార్పిడి అవసరమని సభ్యులు నిర్ణయించారు.

Left: The Punjabi script as seen on a computer in January 2011.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Kirpal Singh Pannu honoured by Punjabi Press Club of Canada for services to Punjabi press in creating Gurmukhi fonts. The font conversion programmes helped make way for a Punjabi Technical Dictionary on the computer
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ఎడమ: జనవరి 2011లో పంజాబీ లిపి కప్యూటర్‌లో ఇలా కనిపించేది. కుడి: గురుముఖి ఫాంట్‌లను సృజించడం ద్వారా పంజాబీ ప్రెస్‌కు చేసిన సేవలకు గాను కిర్‌పాల్ సింగ్ పన్నూను సన్మానించిన పంజాబీ ప్రెస్ క్లబ్ ఆఫ్ కెనడా. ఫాంట్ మార్పిడి ప్రోగ్రాములు కంప్యూటర్‌లో పంజాబీ సాంకేతిక నిఘంటువు ఏర్పాటుకు దారితీశాయి

కంప్యూటర్‌లను సౌకర్యవంతంగా ఉపయోగించగల కొద్దిమందిలో పన్నూ కూడా ఉండటంతో, ఈ ఫలితాన్ని సాధించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. 1996లో, పంజాబీ సాహిత్యానికి అంకితమైన ఉత్తర అమెరికాలోని అకాడమీ ఆఫ్ పంజాబ్ లేదా అప్నా (APNA) సంస్థ అనే మరో సంస్థ, ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పంజాబీ కవులలో ఒకరైన నవతేజ్ భారతి ఇలా ప్రకటించారు: “కిర్పాల్ సింగ్ పన్నూ ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. కి తుస్సీ ఏక్ క్లిక్ కరోగే గురుముఖి తోఁ షాహ్‌ముఖి హో జావ్‌గా, ఏక్ క్లిక్ కరోగే తే షాహ్‌ముఖి తోఁ గురుముఖి హో జావ్‌గా (మీరు కేవలం ఒక్క క్లిక్‌తో షాహ్‌ముఖి నుండి పుస్తకపాఠాన్ని గురుముఖికి, గురుముఖి నుండి షాహ్‌ముఖికి మార్చుకోవచ్చు)."

మొదట్లో తాను చీకట్లో బాణం వేస్తున్నట్లుగా భావించేవాడినని ఈ సైనికుడు చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కష్టాల తర్వాత ఆయన ముందుకు పోగలిగారు.

"ఎంతో సంభ్రమంగా నేను దానిని ఉర్దూ, షాహ్‌ముఖి రెండూ తెలిసిన సాహితీవేత్త జావెద్ బూటా వద్దకు తీసుకువెళ్ళాను," చెప్పారాయన.

షాహ్‌ముఖి కోసం పన్నూ ఉపయోగించిన ఫాంట్ గోడలోని కాంక్రీట్ అచ్చుల వరుసలా చదునుగా ఉందని బూటా ఎత్తి చూపారు. ఇది కుఫీ (అరబిక్ భాషను అనువదించే ఫాంట్) లాంటిదని, దీనిని ఉర్దూ పాఠకులు ఎవరూ అంగీకరించరని, ఎండిపోయిన చెట్టు మీద ఆకులు లేని రెమ్మలా కనిపించే నాస్తలిక్ ఫాంట్‌గా ఉర్దూలోనూ షాహ్‌ముఖిలోనూ దీనిని స్వీకరించారని అతను పన్నూకు చెప్పారు.

పన్నూ నిరాశపడిపోయి తిరిగివచ్చారు. ఆ తర్వాత ఆయనకు ఈ విషయంలో ఆయన కొడుకులు, కొడుకుల స్నేహితులూ సహాయం చేశారు. ఆయన నిపుణులను కలిశారు, గ్రంథాలయాలను సందర్శించారు. బూటా, ఆయన కుటుంబం కూడా సహాయంచేశారు. చివరకు పన్నూ నూరి నస్తలీక్ ఫాంట్‌ను కనిపెట్టారు.

Left: Pannu with his sons, roughly 20 years ago. The elder son (striped tie), Narwantpal Singh Pannu is an electrical engineer; Rajwantpal Singh Pannu (yellow tie), is the second son and a computer programmer; Harwantpal Singh Pannu, is the youngest and also a computer engineer.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: At the presentation of a keyboard in 2005 to prominent Punjabi Sufi singer
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ఎడమ: సుమారు 20 ఏళ్ళ క్రితం తన కుమారులతో పన్నూ. పెద్ద కుమారుడైన నర్వంత్‌పాల్ సింగ్ పన్నూ (చారల టై) ఎలెక్ట్రికల్ ఇంజినీర్; రెండవ కుమారుడైన రాజ్వంత్‌పాల్ సింగ్ పన్నూ (పసుపు రంగు టై) కంప్యూటర్ ప్రోగ్రామర్; అందరిలోకీ చిన్నవాడైన హర్వంత్‌పాల్ సింగ్ పన్నూ కూడా కంప్యూటర్ ఇంజినీర్. కుడి: 2002లో ప్రసిద్ధ పంజాబీ సూఫీ గాయకునికి ఒక కీబోర్డ్‌ను బహూకరిస్తూ

అప్పటికి ఆయన ఫాంట్‌ల గురించి గణనీయమైన జ్ఞానాన్ని పొందారు, తన అవసరాలకు అనుగుణంగా నూరి నస్తలీక్‌ ను రూపొందించగలిగారు. “నేను దానిని గురుముఖికి సమాంతరంగా సిద్ధం చేశాను. అందువల్ల, మరొక ప్రధాన సమస్య మిగిలిపోయింది. మేం దానిని ఇంకా కుడి వైపుకు తీసుకురావాలి. అప్పుడే దానిని కుడి నుండి ఎడమకు రాయటం కుదురుతుంది. కాబట్టి, ఒక తాడుకూ స్తంభానికీ కట్టిన జంతువును లాగినట్లు, నేను ప్రతి అక్షరాన్ని ఎడమ నుండి కుడికి లాగుతాను,” అని పన్నూ చెప్పారు.

లిప్యంతరీకరణకు మూల లిపితో, లక్ష్య లిపికి సరిపోలే ఉచ్చారణ ఉండటం అవసరం, కానీ ఈ లిపులలో ప్రతి ఒక్కదానిలో మరొకదానికి సమానమైన అక్షరం లేకుండా కొన్ని శబ్దాలు మాత్రం ఉన్నాయి. ఒక ఉదాహరణ షాహ్‌ముఖి అక్షరం నూన్ ن — ఇది ఒక నిశ్శబ్ద నాసికా ధ్వనిలా పనిచేస్తుంది కానీ గురుముఖిలో ఈ అక్షరం లేదు. అటువంటి ప్రతి శబ్దానికి, ఇప్పటికే ఉన్న అక్షరానికి మూలకాలను జోడించడం ద్వారా కొత్త అక్షరాన్ని పన్నూ సృష్టించారు.

పన్నూ ఇప్పుడు గురుముఖిలో 30కి పైగా ఫాంట్‌లతో పనిచేయగలరు, ఇంకా ఆయన వద్ద షాహ్‌ముఖి కోసం మూడు లేదా నాలుగు ఫాంట్‌లు ఉన్నాయి.

*****

పన్నూ రైతు కుటుంబానికి చెందినవారు. ఆ కుటుంబానికి కటెహ్రీలో 10 ఎకరాల పొలం ఉంది; ఇంజినీర్లయిన పన్నూ ముగ్గురు కుమారులు కెనడాలో నివసిస్తున్నారు.

1958లో, ఆయన ఈ ప్రాంతంలోని పూర్వపు రాచరిక రాష్ట్రాల యూనియన్ అయిన పటియాలా మరియు ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (PEPSU) సాయుధ పోలీసులలో - పటియాలాలోని ఖిలా బహదూర్‌ఘర్‌లో సీనియర్ గ్రేడ్ కానిస్టేబుల్‌గా - చేరారు. 1962 యుద్ధ సమయంలో, గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌లో పన్నూ హెడ్ కానిస్టేబుల్‌గా నియమితులైనారు. ఆ సమయంలో, పంజాబ్ సాయుధ పోలీసులు (పిఎపి) రాడ్‌క్లిఫ్ లైన్‌కు కాపలాగా ఉన్నారు

పంజాబ్ సాయుధ పోలీసులు 1965లో సరిహద్దు భద్రతా దళాలలో విలీనమయ్యారు. పన్నూ పంజాబ్‌లో భాగమైన లాహౌల్, స్పితిలలో నియమించబడ్డారు. బిఎస్ఎఫ్ వంతెన నిర్మాణ పనిలో ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేశారు. తరువాత సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన, బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎదిగారు.

Left: Pannu in uniform in picture taken at Kalyani in West Bengal, in 1984.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
He retired as Deputy Commandant in 1988 from Gurdaspur, Punjab, serving largely in the Border Security Force (BSF) in Jammu and Kashmir . With his wife, Patwant (right) in 2009
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ఎడమ: 1984లో పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలో ఉండగా తీసిన చిత్రంలో యూనిఫామ్‌లో ఉన్న పన్నూ. ఆయన 1988లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో డిప్యూటీ కమాండెంట్‌గా పదవీ విరమణ చేశారు, ఎక్కువగా జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు భద్రతా దళాల (బిఎస్ఎఫ్)లో పనిచేశారు. భార్య పత్వంత్ (కుడి)తో, 2009లో

సాహిత్యం పట్లా, కవిత్వం పట్లా తనకున్న ప్రేమ తన ఆలోచనా స్వేచ్ఛ నుండి, సరిహద్దులలో పనిచేయడం వలన తాను కోల్పోయిన తన ఇంటి జీవితం నుండి ఉద్భవించిందని అతను చెప్పారు. తన భార్య కోసం రాసిన ద్విపదను ఆయనిలా చదివారు:

“పల్ భీ సహా న జాయే రే తేరీ జుదాయి ఏ సచ్ హై
పర్ ఇద్దా జుదాయియాఁ విచ్ హీ యే బీత్ జానీ హై జిందగీ.

[నేను నీ కోసం ఆరాటపడుతూ చనిపోని క్షణం ఒక్కటి కూడా గడిచిందిలేదు
ఆరాటపడటమే నా విధిగా మారింది - శాశ్వతంగా, అల్లాహు!”

బిఎస్ఎఫ్ కంపెనీ కమాండెంట్‌గా ఖేమ్ కరణ్‌లో నియమించబడినపుడు ఆయనా, పాకిస్తాన్‌కు చెందిన ఆయన సమస్థాయి ఉద్యోగి ఇక్బాల్ ఖాన్ ఒక వాడుక చేసుకున్నారు. “ఆ రోజుల్లో సరిహద్దురేఖకు ఇరువైపుల ఉండే ప్రజలు సరిహద్దును సందర్శించేవారు. పాకిస్తానీ అతిథులకు తేనీరు అందించాల్సిన బాధ్యత నాపై ఉండేది; భారతీయ అతిథులు ఎప్పుడూ తన వద్ద తేనీరు తాగకుండా వెళ్ళకుండా ఉండేలా అతను చూసుకునేవారు. కొన్ని కప్పుల తేనీరు నాలుకను తీయగానూ, హృదయాన్ని మృదువుగానూ చేస్తుంది,” అని పన్నూ చెప్పారు.

పన్నూ చివరకు తన గురుముఖి నుండి షాహ్‌ముఖి లిపి మార్పిడిని పంజాబీ సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ కుల్బీర్ సింగ్ థింద్‌కి చూపించారు. ఆయన పన్నూ లిప్యంతరీకరణ ను తన వెబ్‌సైట్, శ్రీ గ్రంథ్ డాట్ ఆర్గ్‌ లో అప్‌లోడ్ చేశారు. "అది చాలా సంవత్సరాలపాటు అందులో ఉంది," అని పన్నూ చెప్పారు.

డాక్టర్ గుర్‌బచన్ సింగ్ 2000లో, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అరబిక్ అనువాదంలో పర్షియన్ అక్షరాలను ఉపయోగించారు. అలా చేస్తూన్నపుడు పన్నూ రూపకల్పన చేసిన ప్రోగ్రామ్‌ని వాడుకున్నారు.

Left: The cover page of Computran Da Dhanantar (Expert on Computers) by Kirpal Singh Pannu, edited by Sarvan Singh.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: More pages of the Shri Guru Granth Sahib in both scripts
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ఎడమ: కిర్పాల్ సింగ్ పన్నూ రచించిన, సర్వన్ సింగ్ సంపాదకత్వం వహించిన కంప్యూట్రా దా తనంతర్ (కంప్యూటర్ నిపుణుడు) ముఖపత్రం. కుడి: రెండు లిపులలో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ మరిన్ని అంగాలు (పుటలు)

పంజాబ్‌లోని అత్యంత గౌరవనీయమైన ఎన్‌సైక్లోపీడియాలలో ఒకటైన మహాన్ కోశ్‌ని లిప్యంతరీకరణ చేయడంలోనూ పన్నూ పనిచేశారు. దీనిని 14 సంవత్సరాలుగా భాయ్ కాన్ సింగ్ నభా సంకలనం చేశారు. ఇది ప్రధానంగా గురుముఖి లో రాసివుంది.

ఆయన హీర్ వారిస్ కే షేరోఁ కా హవాలా అనే వెయ్యి పేజీల కవిత్వ పుస్తకాన్ని కూడా గురుముఖిలోకి లిప్యంతరీకరణ చేశారు.

1947కి ముందు భారతదేశంలోని గురుదాస్‌పూర్ జిల్లాలో భాగమైన పాకిస్తాన్‌లోని శకర్‌గఢ్ తహసీల్‌ కు చెందిన రిపోర్టర్ సబా చౌదురి (27), ఈ ప్రాంతంలోని కొత్త తరానికి పంజాబీ తెలియదనీ, ఎందుకంటే పాకిస్థాన్‌లో ఉర్దూలోనే మాట్లాడాలని సూచిస్తారనీ తెలిపింది. "పాఠశాల కోర్సులలో పంజాబీని బోధించరు," అని ఆమె చెప్పింది. "ఇక్కడి ప్రజలకు గురుముఖి తెలియదు, నాకు కూడా తెలియదు. మా పాత తరాలకు మాత్రమే దాని గురించి తెలుసు."

ఈ ప్రయాణం ఎల్లప్పుడూ ఉల్లాసంగా జరిగిన ప్రయాణమేమీ కాదు. 2013లో, ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, లిప్యంతరీకరణ పని తన సొంతమని చెప్పుకున్నారు. పన్నూ ఆయన వాదనలను ఖండిస్తూ ఒక పుస్తకాన్ని రాశారు. ఆయన పరువు నష్టం దావాను కూడా ఎదుర్కొన్నారు; దిగువ న్యాయవ్యవస్థ పన్నూకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, ఆ నిర్ణయం అప్పీళ్ళ కోర్టులో వాయిదా పడివుంది.

విభజన వలన తగిలిన కఠినమైన దెబ్బలలో ఒకదానిని నయంచేయడానికి పన్నూ తాను సంవత్సరాల తరబడి చేసిన కృషితో సాధించిన ఫలితం గురించి సంతోషించటానికి కారణం ఉంది. పంజాబీ భాషకు సూర్యచంద్రులైన రెండు లిపులు సరిహద్దులు దాటి ప్రకాశిస్తూనే ఉన్నాయి. ప్రేమ, గాఢమైన వాంఛల సాధారణ భాషకు సంబంధించి కిర్పాల్ సింగ్ పన్నూ ఒక వీరుడు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Amir Malik

عامر ملک ایک آزاد صحافی، اور ۲۰۲۲ کے پاری فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Amir Malik
Editor : Kavitha Iyer

کویتا ایئر گزشتہ ۲۰ سالوں سے صحافت کر رہی ہیں۔ انہوں نے ’لینڈ اسکیپ آف لاس: دی اسٹوری آف این انڈین‘ نامی کتاب بھی لکھی ہے، جو ’ہارپر کولنس‘ پبلی کیشن سے سال ۲۰۲۱ میں شائع ہوئی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Kavitha Iyer
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli