అబ్దుల్ లతీఫ్ బజరాన్ మేనెల ప్రారంభంలో తన 150 జంతువులతో - గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒక కుక్క - రజౌరి జిల్లాలోని పరి గ్రామాన్ని వదిలి కశ్మీర్ పర్వతాల పైన మేత బయళ్ళ కోసం వెతికేందుకు బయలుదేరారు. ఆయన తనతోపాటు తన కొడుకు తారిక్నీ, మరికొంతమందినీ తీసుకువెళ్ళారు. "బలహీనంగా ఉన్న జంతువులతో పాటు ఆహారాన్నీ గుడారాలనూ, ఇంకా అవసరమైన వస్తువులనూ నా కుటుంబంతో (ఆయన భార్య, కోడలు) పాటు ఒక మినీ ట్రక్కులో పంపించాను," జమ్మూకు చెందిన ఈ 65 ఏళ్ళ పశువుల కాపరి చెప్పారు.
కానీ రెండు వారాల తర్వాత, "వారిని చూసి (వయిల్‌లో) నేను దిగ్భ్రాంతి చెందాను," అన్నారాయన. వారు తమ గమ్యస్థానమైన మినిమార్గ్ (భారత్-పాకిస్తాన్ సరిహద్దులో) చేరి ఒక వేసవి శిబిరాన్ని సిద్ధంచేసి వుంటారని ఆయన ఊహించారు.
అందుకు బదులుగా వారు తమ గమ్యస్థానానికి 15 రోజుల దూరంలో ఉన్నారు. వాతావరణం సరిగ్గా లేకపోవటం వలన వారు ఆగిపోయారని ఆయన చెప్పారు. మినిమార్గ్ చేరాలంటే తప్పనిసరిగా తాము దాటవలసిన జోజిలా పాస్ వద్ద వారు మంచు కరగటం కోసం ఎదురుచూస్తూ ఆగిపోయారు.
జమ్మూ ప్రాంతంలో ప్రతిసారీ వేసవికాలం వస్తుందనగా గడ్డి దొరకటం అరుదైపోవటంతో, బకర్వాల్ల వంటి సంచార పశుపోషక సముదాయాలు మెరుగైన మేత బయళ్ళు దొరుకుతాయనే ఆశతో కశ్మీర్ లోయకు వలసపోతుంటారు. జమ్మూలో వాతావరణం చల్లగా మారుతుండే అక్టోబర్‌లో మాత్రమే వారు మళ్ళీ తిరిగివస్తారు.
కానీ ఎత్తులో ఉన్న మేతమైదానాలను మంచు ఇంకా కప్పి వుండటం వలన, అబ్దుల్ వంటి పశుపోషకులు మధ్యలో చిక్కుకుపోతారు - వారు కిందికి తమ గ్రామాలకు, అక్కడ మేయటానికి గడ్డి ఉండదు కాబట్టి - తిరిగివెళ్ళనూ లేరు, పైన ఉన్న పచ్చికబయళ్ళను చేరుకోనూలేరు.
మొహమ్మద్ కాసిమ్ కూడా అదే సందిగ్ధంలో ఉన్నారు. పర్వతాల పైకి వెళ్ళేందుకు బయలుదేరకముందే, అకాలమైన వేడిమికి ఆయన కొన్ని జంతువులను నష్టపోయారు. "వేడిమి పెరిగినపుడు మా గొర్రెలకూ మేకలకూ జ్వరం, విరోచనాలు పట్టుకోవడంతో అవి బలహీనపడతాయి. అది వాటిని చంపగలదు కూడా," అని 65 ఏళ్ళ కాసిమ్ చెప్పారు.
కాసిమ్ జమ్మూలోని రజౌరీ జిల్లా, ఆంధ్ గ్రామానికి చెందిన బకర్వాల్. రావలసినదానికంటే ముందుగానే వచ్చిన వేడి వేసవికాలం వలన ఆయన మందలోని అనేక జంతువులు జబ్బుపడ్డాయి. ఆ వేడిమికి ఆయన 50 మేకలను నష్టపోయారు.
ఇప్పటికే కశ్మీర్ లోయలో ఉన్న తన తోటి సంచారి లియాకత్‌ను వాతావరణం గురించి మధ్యమధ్య ఫోన్లో వాకబు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. "ఎప్పుడు చేసినా, వాతావరణం చాలా చెడ్డగా ఉందనే జవాబు." అక్కడ దాదాపు ఎలాంటి మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవటంతో లియాకత్‌ను చేరటం కష్టమయింది.
లోయలో మంచు ఇంకా ఉందని విని, కాసిమ్ తన గ్రామాన్ని విడిచివెళ్ళడానికి వెనుకాడారు. మరీముఖ్యంగా వేడి ఇప్పటికే ఆయన జంతువులలో బలహీనతను కలిగించింది. మేకలు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోతాయనీ, గొర్రెలు వాటి చర్మంపై ఉండే ఉన్ని కారణంగా కొంత ఓర్చుకోగలవనీ ఆయన చెప్పారు.
అనేక రోజులు ఎదురుచూసిన తర్వాత, వయిల్‌లో ఉన్న తన సాటి బకర్వాల్ కుటుంబాలను కలుసుకోవడానికి జంతువులను ఒక ట్రక్‌లో ఎక్కించి పంపించడం తప్ప ఆయనకు వేరే అవకాశం లేకుండాపోయింది. జమ్మూ మరింత వేడెక్కి పోతుండటంతో ఆయన ఆందోళన చెందారు. "ఇక్కడ నుంచి తొందరగా వాటిని తరలించకపోతే, వాటన్నిటినీ నేను నష్టపోతాను," అని తాను ఆలోచించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
వెళ్ళాల్సిన సమయం కంటే ఒక రెండు వారాలు వెనుకబడినప్పటికీ, కాసిమ్ మరింక ఎటువంటి అవకాశాలూ తీసుకోలేదు,"నా జంతువులను కాలాకోట్ నుండి గాందర్‌బల్‌కు (229 కిలోమీటర్లు) తీసుకువెళ్ళేందుకు నేను రూ. 35,000 చెల్లించాను."
తన జంతువుల క్షేమానికే ప్రాధాన్యం ఇచ్చిన అబ్దుల్ కూడా మినిమార్గ్ను చేరుకోవడం ఒక నెల రోజులు ఆలస్యం చేశారు. "ఈ సంవత్సరం కశ్మీర్‌లోని ఎత్తైన ప్రదేశాల్లో ఇంకా మంచు ఉండటం వలన." చివరకు జూన్ 12 నాటికి ఆయన కుటుంబం, మందలూ ఆ ప్రాంతానికి చేరారు.
అబ్దుల్ జంతువులకు మంచు ఒక్కటే కాక దారిలో కురిసిన భారీ వర్షాలు కూడా చాలా చేటును తెచ్చిపెట్టాయి. "వరదల కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని శొపియాన్ ప్రాంతంలో నేను 30 గొర్రెలను కోల్పోయాను," అన్నారు అబ్దుల్. ఇది ఈ ఏడాది మినిమార్గ్కు వేళ్ళే దారిలో జరిగింది. "మేం శొపియాన్ జిల్లా, ముఘల్ రోడ్డు నుంచి వస్తూవుండగా అకస్మాత్తుగా వర్షం మొదలయింది. ఆ వర్షం అలా ఐదు రోజులపాటు కురుస్తూనే ఉంది."
తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుండి ప్రతి వేసవి కాలంలోనూ జమ్మూ నుండి కశ్మీర్‌కు వలస వెళ్తూ ఉన్న అబ్దుల్, మే నెల చివరి నుండి జూన్ నెల ప్రారంభం వరకూ వాతావరణం ఇంత విపరీతంగా ఉండటాన్ని తానెన్నడూ చూడలేదని చెప్పారు. తన కుటుంబం తొందరపడి కొండల మీదకు రాకుండా, కొన్నిరోజులపాటు వయిల్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నందుకు ఆయన చాలా సంతోషించారు. "బ్రహ్మాండమైన జోజిలాను (మినిమార్గ్కు వెళ్ళే మార్గంలో) దాటే సమయంలో మరిన్ని గొర్రెలను పోగొట్టుకోవాలని నాకు లేదు," అన్నారాయన.
పశుపోషక సంచార సముదాయాల సంప్రదాయక మార్గం, శొపియాన్ మీదుగా పాత ముఘల్ మార్గం గుండా పోతుంది.
గడ్డిభూములకు బదులుగా వారు మంచును చూసినపుడు, "మేం ఏదైనా ఆశ్రయం కోసం గానీ, మా గుడారాలు వేసుకునే ప్రదేశం కోసం గానీ వెతుక్కుంటాం. మామూలుగా మేం పెద్ద పెద్ద చెట్లకోసమో, లేదా దగ్గరలో ఉండే దోకాల (మట్టి ఇళ్ళు) కోసమో వెతుకుతాం," అన్నారు అబ్దుల్. "మీకు అదృష్టం ఉంటే, మీకు ఏదో ఒకటి దొరుకుతుంది. లేదంటే మీరు బహిరంగ ప్రదేశంలో డేరాలు వేసుకొని వానలో నానిపోవలసి ఉంటుంది." వీలైనన్ని జంతువులను కాపాడుకోగలగటం చాలా కష్టమైన పని, అంటారతను. " సబ్కో అప్నీ జిందగీ ప్యారీ హై (ప్రతివారికీ తమ సొంత జీవితాలపై ప్రేమ ఉంటుంది)."
సాధారణంగా పశుపోషకులు కొన్ని వారాలకు సరిపోయే ఆహారాన్ని తమతో పాటు తెచ్చుకుంటుంటారు. అననుకూలమైన వాతావరణంలో శుభ్రమైన నీటిని సంపాదించడం ఒక పెద్ద సవాలు. "విపరీత వాతావరణ పరిస్థితులలో చిక్కుకుపోయినపుడు, మేం నీటి కొరతను ఎదుర్కొంటాం. మంచు పడుతున్న సమయంలో నీరు దొరకటం కష్టమవుతుంది. అప్పుడు మేం అది శుభ్రమైనదైనా కాకపోయినా ఏదో ఒక నీటిని వెదుక్కొని, వాటిని మరిగించి, తాగడానికి వీలుగా చేసుకుంటాం," అంటారు తారిక్ అహ్మద్.
తాము కూడా ఈ ఏడాది ఆలస్యంగా పర్వతాలపైకి వెళ్తున్నట్లు మిగిలిన బకర్వాల్లు చెప్పారు. "మేం రజౌరీ నుంచి ఈ ఏడాది (2023) మే 1న మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. అయితే, మంచు కరగడానికి ఎదురుచూస్తూ పహల్గామ్లో ఒక 20 రోజులు ఆగిపోయాం," అన్నారు అబ్దుల్ వహీద్. 35 ఏళ్ళ ఈ బకర్వాల్ తన సముదాయానికి చెందిన ఒక పశువుల కాపరుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారు లిద్దర్ లోయ గుండా కొలాహోయ్ హిమానీనదానికి వెళ్ళే దారిలో ఉన్నారు.
మామూలుగా ఈ దారిలో వెళ్ళడానికి వారికి 20-30 రోజులు పడుతుంది, కానీ అదంతా వాతావరణ పరిస్థితులపై ఆధారపడివుంటుంది. నేను నాతోపాటు తీసుకువచ్చిన 40 గొర్రెలలో ఎనిమిది గొర్రెలను పోగొట్టుకున్నాను," అన్నాడు 27 ఏళ్ళ షకీల్ అహ్మద్ బర్గాడ్. తాను వెళ్ళవలసిన సోనామార్గ్‌లోని బల్తాల్‌లో మంచు ఇంకా కరగకపోవటంతో, మే నెల 7వ తీదీన వయిల్‌లో ఆయన డేరా వేశాడు. బల్తాల్ నుంచి అతను జోజిలాలోని జీరో పాయింట్‌కు వెళ్తాడు. అక్కడ ఇంకా కొంతమంది బకర్వాల్ కుటుంబాలతో కలిసి తర్వాతి మూడు నెలలు పశువులను కాస్తూ ఉంటారు. మరికొన్ని జంతువులను పోగొట్టుకోవచ్చునని అతను ఊహిస్తున్నాడు, "మేం వెళ్ళే ప్రాంతం మంచు తుఫానులు వచ్చే అవకాశమున్న ప్రాంతం," అంటాడు షకీల్.
తన స్నేహితుడైన ఫరూక్ గత ఏడాది వచ్చిన వరదలలో తన కుటుంబంతో పాటు తన జంతువులన్నిటినీ పోగొట్టుకున్న విషయాన్ని షకీల్ గుర్తుచేసుకున్నాడు.
అకాలంగా వర్షాలు కురవటం, మంచు పడటం బకర్వాల్లకు కొత్త అనుభవమేమీ కాదు. 2018లో మినిమార్గ్‌లో ఉన్నట్టుంది మంచు పడటం మొదలైన సంఘటనను తారిక్ గుర్తుచేసుకున్నాడు. "మేం ఉదయాన్నే నిద్రలేచేసరికి దాదాపు 2 అడుగుల ఎత్తున మంచు పేరుకొని, డేరాల ద్వారాలన్నీ మూసుకుపోయి ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాం," అన్నారు 37 ఏళ్ళ ఈ పశుపోషకుడు. మంచును తొలగించే పరికరాలేవీ అందుబాటులో లేకపోవటంతో, "మా దగ్గరున్న పాత్ర సామానుతో మేం ఆ మంచును తొలగించాల్సివచ్చింది."
తమ జంతువులు ఎలావున్నాయో వాళ్ళు చూసుకునేటప్పటికే, అనేక జంతువులు చనిపోయివున్నాయి. "మేం గొర్రెలను, మేకలను, గుర్రాలను నష్టపోయాం. డేరాల బయట ఉండిపోవటంతో, చివరకు కుక్కలు కూడా కురిసిన హిమపాతానికి తాళలేక చనిపోయాయి," అని తారిక్ గుర్తుచేసుకున్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి