"వాళ్ళు మా మొహాల మీదనే దిల్లీ తలుపులను మూసేశారు," బుట్టర్ సరింహ్ గ్రామం వెలుపల మాట్లాడుతూ అన్నారు బిట్టూ మల్లన్. "ఇప్పుడు పంజాబ్‌లోని ప్రతి గ్రామం తలుపులు వారికి మూసుకున్నాయి."

బిట్టూ మల్లన్ శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా, మల్లన్ గ్రామానికి చెందిన ఐదెకరాల భూమి ఉన్న రైతు. ఆయన ప్రస్తావిస్తోన్న 'వాళ్ళు', 'వారికి' అనే మాటలు కేంద్రంలో అధికారంలో ఉన్న, ప్రస్తుతం జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్ నుంచి చాలా ఒంటరిగా పోటీ చేస్తోన్న బిజెపి పార్టీ గురించి. దిల్లీలోకి ప్రవేశించకుండా తలుపులను మూసేసినది ఎవరికంటే, నవంబర్ 2020లో దేశ రాజధానికి కవాతు చేసిన వేలాదిమంది రైతులకు.

కిసాన్ ఆందోళన, జాతీయ రాజధాని గేట్ల వద్ద వారు నెలకొల్పుకున్న క్యాంపు పట్టణాల జ్ఞాపకాలు పంజాబ్‌లో లోతుగా వేళ్ళూనుకుపోయాయి. మూడు వేసవి కాలాల క్రితం, ఈ రాష్ట్రానికి చెందిన వేలాదిమంది రైతులు తమ ప్రతిఘటన, ఆశల సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. ట్రాక్టర్లు, ట్రైలర్‌ల వాహనశ్రేణిలో వందల మైళ్ళ దూరం ప్రయాణించిన వారు, కేవలం ఒకే ఒక్క డిమాండ్‌తో రాజధానికి చేరుకున్నారు: వారి జీవనోపాధికి ముప్పు తెచ్చే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.

దిల్లీ ప్రవేశ ద్వారాల వద్దకు వారు చేరుకున్నప్పుడు, వారి విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన నిర్లక్ష్యపు ప్రభుత్వం నిర్మించిన భారీ కుడ్యాన్ని వారు ఎదుర్కోవలసి వచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఉష్ణోగ్రత కేవలం 2 డిగ్రీల సెల్సియస్ ఉందా, లేదంటే 45 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకిందా అనే దానితో పనిలేకుండా, వారి రాత్రులను ఒంటరితనపు శైత్యం, అన్యాయపు వేడిమి చుట్టుముట్టాయి. ఇనుప ట్రెయిలర్లు, ట్రాలీలు వారి నివాసాలుగా మారాయి.

సుమారు 358 రోజుల ఆటుపోట్ల మధ్య, దిల్లీ చుట్టూ వారు ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లో మరణించిన 700 మంది రైతుల మృతదేహాలు పంజాబ్‌కు తిరిగి చేరుకున్నాయి. ఈ మృతదేహాలు ఒక్కొక్కటి వారి పోరాటానికి వారు చెల్లించిన మూల్యానికి నిశ్శబ్ద నిదర్శనాలు. కానీ ఆందోళన అణగిపోలేదు. వారి త్యాగం, భారీ పోరాటం కారణంగా ఒక సంవత్సరం పాటు తిరస్కరణలు, అనేక గాండ్రింపుల తర్వాత చివరకు ప్రభుత్వం మోకరిల్లింది. నవంబర్ 19, 2021న ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు  ప్రధానమంత్రి ప్రకటించాడు.

ఇప్పుడు పంజాబ్‌లో లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం. బిట్టూ మల్లన్, ఇంకా అతని వంటి చాలామంది రైతులు దిల్లీలో తాము రుచి చూసిన చికిత్సను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 23న, చనిపోయిన ప్రతి రైతుకు సంబంధించిన లెక్కలను తేల్చడం తన కర్తవ్యంగా భావించే బిట్టూ, ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి హన్స్ రాజ్ హన్స్‌ను బుట్టర్ సరింహ్ గ్రామంలో ధైర్యంగా ఎదుర్కొన్నారు.

వీడియో చూడండి: 'ప్రచార సమయంలో బిజెపి అభ్యర్థులను చుట్టుముట్టిన పంజాబ్ రైతులు’

నవంబర్ 2020లో, దేశ రాజధానికి కవాతు చేస్తున్న పదివేలమంది రైతులకు దిల్లీ ప్రవేశాన్ని నిరాకరించింది. 2024లో, ఆ లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం ఇదేనని రైతులు నిర్ణయించుకున్నారు

బిట్టూ నుంచి అనేక ప్రశ్నల, వ్యాఖ్యానాల పరంపరను హన్స్ ఎదుర్కొన్నాడు: “మేం జంతువులపై సైతం వాహనాలను నడిపించటం గురించి ఆలోచించనైనా ఆలోచించలేం, కానీ లఖింపూర్ ఖేరీలో [అజయ్ మిశ్రా] టేనీ కుమారుడు రైతుల మీదుగా జీపును నడిపి, వారి కాళ్ళను నలగగొట్టి, రైతుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశాడు. ఖనౌరీలో, శంభూ లో తూటాల వర్షం కురిసింది. ప్రీత్‌పాల్ చేసిన నేరం ఏమిటి ? అతను లంగర్ సేవ చేయడానికి వెళ్ళినందుకేనా అతని ఎముకలు పగిలిపోయాయి, అతని దవడ ఎముక విరిగింది! అతను చండీగఢ్‌ పిజిఐ[ఆసుపత్రి]లో పడివున్నాడు; నువ్వతన్ని చూసొచ్చావా?

“పటియాలాకు చెందిన 40 ఏళ్ళ వ్యక్తి, ఇద్దరు చిన్న పిల్లల తండ్రి, బాష్పవాయు గోళం వలన తన కళ్ళను కోల్పోయాడు. ఆయనకు కేవలం మూడెకరాల భూమి మాత్రమే ఉంది. నువ్వతని ఇంటికి వెళ్ళావా? లేదు. నువ్వు సింఘుకు వచ్చే సాహసం చేశావా? లేదు." హన్స్ రాజ్ హన్స్ దగ్గర ఈ ప్రశ్నలకు జవాబులు లేవు

పంజాబ్ అంతటా - ప్రతి ఒక్కటీ ఒక్క బుట్టర్ సరింహ్‌గా కనిపిస్తోన్న - గ్రామాల ప్రవేశ ద్వారాల వద్ద బిజెపి అభ్యర్థుల రాక కోసం వెయ్యిమంది బిట్టూలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంజాబ్‌లో జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. కాషాయ పార్టీ మొత్తం 13 నియోజకవర్గాల్లో కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే మొదట అభ్యర్థులను ప్రకటించింది, అయితే మే 17న మరో నలుగురి పేర్లను ప్రకటించి, తన జాబితాను పూరించింది. వారందరికీ రైతులు నల్లజెండాలు, నినాదాలు, ప్రశ్నలతో స్వాగతం పలుకుతూ పలు గ్రామాల్లోకి వారిని రానివ్వడం లేదు.

“పరిణీత్ కౌర్‌ని మా గ్రామంలోకి రానివ్వం. దశాబ్దాలుగా ఆమెకు విధేయులుగా ఉంటోన్న కుటుంబాలను కూడా మేం ప్రశ్నించాం,” అని పటియాలా జిల్లాలోని డకాలా గ్రామానికి చెందిన నాలుగు ఎకరాల రైతు రఘ్‌బీర్ సింగ్ చెప్పారు. పరిణీత్ కౌర్ పటియాలా నుండి నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికయింది. ఈమె పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు చెందిన కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య. వీరిద్దరూ 2021లో కాంగ్రెస్‌ను వీడి, గత ఏడాది బిజెపిలో చేరారు. ఇతర బిజెపి అభ్యర్థులకు మాదిరిగానే ఆమెకు కూడా పలు చోట్ల నల్లజెండాలు, ముర్దాబాద్ నినాదాలతో జనం స్వాగతం పలుకుతున్నారు.

అమృత్‌సర్, హొషియార్‌పూర్, గురుదాస్‌పూర్, బఠిండాలో కూడా ఆమె పార్టీ అభ్యర్థులు కఠినమైన పాఠాలు నేర్చుకుంటున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఒక నెల తర్వాత, మూడుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉండి, ఇప్పుడు లుథియానా నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న రవ్‌నీత్ సింగ్ బిట్టూకి కూడా గ్రామాల్లో ప్రచారం చేయడం చాలా కష్టంగా ఉంది.

PHOTO • Courtesy: BKU (Ugrahan)
PHOTO • Vishav Bharti

ఎడమ: బర్నాలా (సంగ్రూర్)లో అధికార పార్టీ అభ్యర్థులు తమ గ్రామంలోకి ప్రవేశించకుండా మానవ కుడ్యాన్ని నిర్మించి నిరసన తెలిపిన రైతులు. కుడి: ఇటీవలి నిరసనల సమయంలో పంజాబ్‌లోని MNREGA మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న షేర్ సింగ్ ఫర్వాహీ (జెండా ముఖాన్ని కప్పేసింది)

PHOTO • Courtesy: BKU (Dakaunda)
PHOTO • Courtesy: BKU (Dakaunda)

సంగ్రూర్‌లోని మరో గ్రామం మెహల్‌కలాఁన్‌లో బిజెపి అభ్యర్థుల ప్రవేశానికి వ్యతిరేకంగా తమ గ్రామం వెలుపల వేచి ఉన్న రైతులు. రైతాంగ ప్రతిఘటన చరిత్రలో ఇది ఉన్నతంగా నిలిచిన ప్రాంతం

దేశంలోని ఇతర ప్రాంతాలలో రాజకీయ నాయకులు తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మైనారిటీలకు వ్యతిరేకంగా, 'సెంటిమెంట్‌లను దెబ్బతీసే' ప్రచారాలను చేస్తూండవచ్చు. పంజాబ్‌లో మాత్రం రైతులు వారిపై 11 ప్రశ్నలతో దండెత్తుతారు (ఈ కథనం క్రింద చూడండి). కనీస మద్దతు ధర (MSP)కు చట్టపరమైన హామీల గురించి; ఏడాది పాటు సాగిన పోరాటంలో మరణించిన రైతుల గురించి; లఖింపూర్ అమరవీరుల గురించి; ఖనౌరీ వద్ద తలలో బుల్లెట్‌ దిగబడి మరణించిన శుభకరణ్ గురించి; రైతులపై ఉన్న అప్పుల భారం గురించి వారిని అడుగుతారు.

రైతులొక్కరే కాదు, వ్యవసాయ కూలీలు సైతం కేంద్రంలోని అధికార పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. “బడ్జెట్‌ను తగ్గించేసి, బిజెపి MNREGAని చంపేసింది. అది రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా ప్రమాదకరం,” అని పంజాబ్‌లోని MNREGA మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు షేర్ సింగ్ ఫర్వాహీ చెప్పారు.

ఆ విధంగా 'చికిత్స' కొనసాగుతూ ఉంది. 18 నెలల క్రితమే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ, గాయాలు మాత్రం ఇంకా మానలేదు. ఆ చట్టాలు: ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; రైతుల ఉత్పత్తి, వర్తకం, వాణిజ్యం (ప్రోత్సాహం మరియు సులభతరం చేయటం) చట్టం, 2020 ; నిత్యావసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 . దొడ్డిదోవ గుండా ఈ చట్టాలను మళ్ళీ ప్రవేశపెడుతున్నారని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు

వోటింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, పంజాబ్‌లో ప్రచారం ఇంకా ఊపందుకుంది, అదేవిధంగా రైతు ప్రతిఘటన కూడా. మే 4న, పటియాలాలోని సెహరా గ్రామంలో బిజెపి అభ్యర్థి పరిణీత్ కౌర్ ప్రవేశానికి వ్యతిరేకంగా సురీందర్‌పాల్ సింగ్ అనే రైతు, ఇతర రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు సురీందర్ మరణించాడు. పరిణీత్ కౌర్ భద్రతా సిబ్బంది రోడ్డును ఖాళీ చేయించడానికి ప్రయత్నించినప్పుడు అతను చనిపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే పరిణీత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

గోధుమ పంట కోతలు ముగిసినందున, రైతులు ఇప్పుడు సాపేక్షంగా స్వేచ్ఛగా ఉన్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ నాటకంలో మరిన్ని విశేషాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగ్రూర్ వంటి ప్రాంతాలలో నేల ప్రతిఘటనకు సంబంధించిన కథలతో నిండివుండటమే కాక, ఇక్కడి పిల్లలు తేజా సింగ్ స్వతంతర్, ధరమ్ సింగ్ ఫక్కడ్, జాగీర్ సింగ్ జోగా వంటి మిలిటెంట్ రైతు నాయకుల పురాణ కథలను వింటూ పెరిగినవారు.

గ్రామంలోకి ప్రవేశించగానే బిజెపి అభ్యర్థులు ఎదుర్కొనే ప్రశ్నల జాబితా

మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు ఏక్తా ఉగ్రహాఁ) నాయకుడు ఝండా సింగ్ జెఠుకే ఇటీవల బర్నాలాలో ఇలా ప్రకటించారు: "ఒక్క వారం రోజులు వేచి ఉండండి, వారిని గ్రామాల నుండి మాత్రమే కాకుండా పంజాబ్ పట్టణాల నుండి కూడా తరిమికొట్టడాన్ని మీరు చూస్తారు. దిల్లీకి మేం వెళ్ళే మార్గాన్ని వారు అవరోధాలతోనూ మేకులతోనూ ఎలా అడ్డుకున్నారో గుర్తుందా? మేం ఆ విధంగా ప్రతీకారాన్ని తీర్చుకోం, వారిని మానవ కుడ్యాలతో అడ్డుకుంటాం. వాళ్ళు లఖింపూర్‌లో చేసినట్లుగా మాపైకి వాహనాలను నడపవచ్చు, కానీ మేం మా శరీరాలను అడ్డుపెట్టి వారిని మా గ్రామాలలోకి రాకుండా నిరోధించడానికి సిద్ధంగా ఉన్నాం.”

అయినప్పటికీ, న్యాయాన్ని ప్రేమించే రైతులకు వారు తప్పక కృతజ్ఞతగా ఉండాలని శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీఠియా అన్నారు. “వాళ్ళిప్పుడు వారిని కేవలం గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. దిల్లీలో వాళ్ళు రైతులకు చేసినట్లుగా బాష్పవాయు గోళాలతోనూ, రబ్బర్ బుల్లెట్లతోనూ బిజెపి నేతలను స్వాగతించడం లేదు.”

ప్రతిఘటనకూ, జనాదరణ పొందిన చర్యలకూ చెందిన జ్ఞాపకాలు - పాతవీ, ఇటీవలివి కూడా - పంజాబ్‌లో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. 28 నెలల క్రితమే ఫిరోజ్‌పూర్‌లోని ఓ ఫ్లైఓవర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ప్రజలు అడ్డుకున్నారు. ఈరోజు గ్రామాల్లో అతని పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం ద్వారా రెండుసార్లు వివిధ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమితుడైన సత్యపాల్ మలిక్, తనకు ఆ పదవులు కట్టబెట్టిన పార్టీకి ఇలా చెప్తున్నాడు: "పంజాబీలు తమ శత్రువులను అంత తేలికగా మర్చిపోరు."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Vishav Bharti

وشو بھارتی، چنڈی گڑھ میں مقیم صحافی ہیں، جو گزشتہ دو دہائیوں سے پنجاب کے زرعی بحران اور احتجاجی تحریکوں کو کور کر رہے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Vishav Bharti

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli