“ఎవరు గెలుస్తారనేది ఏం ముఖ్యం? అది ఐపిఎల్ అయితే ఏంటి, ప్రపంచకప్ అయితే ఏంటి?’’

క్రికెట్ దాదాపు మతంగా ఉన్న దేశంలో, మదన్ ఈ ప్రశ్న చాలా అపచారం.

దానికి కొనసాగింపుగా ఆయన, “ కోయి భీ జీతే, హమేఁ కామ్ మిల్ జాతా హై (ఎవరు గెలిచినా మాకు పని దొరుకుతుంది),” అన్నారు. 51 ఏళ్ల మదన్, క్రికెట్ బంతులు తయారుచేస్తారు. మీరట్ నగరంలో మెరిసిపోయే ఎరుపు, తెలుపు బంతులను తయారుచేసే అనేక యూనిట్లలో అతనిదీ ఒకటి.

అది మార్చి నెల. అతని చుట్టూ దాదాపు 100 పెట్టెలు ఉన్నాయి, ఒక్కొక్క దానిలో ఆరు తోలు బంతులున్నాయి. నిర్విరామంగా జరగబోతోన్న పురుషుల క్రికెట్ సీజన్‌కు అవి సిద్ధంగా ఉన్నాయి. రెండు నెలల పాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్‌లోని మొదటి బంతి మార్చి చివరిలో బౌలింగ్‌తో ప్రారంభమవుతుంది. దాని తర్వాత జూన్‌లో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లలో జరిగే వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

"బంతిని ఏ స్థాయిలో ఉపయోగిస్తారు, బంతితో ఎవరు ఆడతారు, ఎన్ని ఓవర్లు ఆడతారు అనేది (బంతి) నాణ్యతను బట్టి నిర్ణయిస్తారు," అని మదన్ చెప్పారు.

Madan (left) at his cricket-ball-making unit in Shobhapur slum of Meerut district.
PHOTO • Shruti Sharma
Dharam Singh (right) is the most experienced craftsperson at Madan’s unit. Most of the artisans are Jatavs and follow Dr. Ambedkar
PHOTO • Shruti Sharma

మీరట్ జిల్లాలోని శోభాపుర్ మురికివాడలో ఉన్న తన క్రికెట్ బంతుల తయారీ యూనిట్‌లో మదన్ (ఎడమ). ధరమ్ సింగ్ (కుడి) మదన్ యూనిట్‌లోని అత్యంత అనుభవజ్ఞుడైన నైపుణ్య కార్మికుడు. చాలామంది కార్మికులు జాటవ్‌లు, డాక్టర్ అంబేద్కర్ అనుయాయిలు

"పెద్దపెద్ద టోర్నమెంట్‌లు జరగబోయే ముందు, క్రీడా పరికరాలను చిల్లరగానూ టోకుగానూ అమ్మే వ్యాపారులు చాలా ముందుగానే మా దగ్గరకు వస్తారు," అంటూ అతను ఈ ఆటపై మొత్తం దేశానికంతా ఉన్న అతి అభిమానాన్ని గురించి నొక్కి చెప్తూ అన్నారు. "రెండు నెలల ముందు నుంచే భారీగా గిరాకీ పెరుగుతుంది, పెద్ద నగరాల్లో ఉండే దుకాణాలు కావాలనుకున్న సమయానికి బంతులను నిలువ ఉంచుకోవాలని కోరుకుంటాయి." ఆట ఎవరు ఆడుతున్నారు, ఎంత పందెం వేస్తున్నారు అనేదానిపై ఆధారపడి బంతి ధర రూ. 250 నుంచి రూ. 3,500 వరకు ఉంటుంది.

మదన్‌కి ముంబై, అహ్మదాబాద్, బరోడా, జైపూర్, బెంగళూరు, పుణేలోని క్రికెట్ అకాడమీలు, పంపిణీదారులు, చిల్లర వ్యాపారుల నుండి నేరుగా ఆర్డర్లు వస్తాయి. అతని యూనిట్‌లో తయారుచేసిన బంతులను ఆట దిగువ స్థాయిలో ప్రాక్టీస్‌లోనూ మ్యాచ్‌లలోనూ ఉపయోగిస్తారు.

మేం అతని కార్ఖానాలో ఉన్నాం, చిన్నగా, కొద్దిగా వంపు తిరిగిన డిస్‌ప్లే ఉన్న ఒక టివిలో క్రికెట్ మ్యాచ్ లైవ్‌లో వస్తోంది. దాని స్క్రీన్ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్న ఎనిమిది మంది కారీగర్ల (కార్మికులు) వైపుకు తిరిగి ఉంది. కానీ వాళ్ళు మ్యాచ్‌ను కేవలం వింటారంతే, వాళ్ళ కళ్ళన్నీ పని మీదే ఉన్నాయి: " హమేఁ అభీ బిల్కుల్ ఫుర్సత్ నహీ హై (మాకిప్పుడు కొంచెం కూడా ఖాళీ సమయం లేదు)," అని మదన్ చెప్పారు.

మధ్యస్థమైన నాణ్యత కలిగిన 600 రెండు-ముక్కల క్రికెట్ బంతుల ఆర్డర్ కోసం వాళ్ళు ఇనుప బందులపైకి వంగి, అమిత కష్టమైన కుట్టుపనిలో నిమగ్నమై ఉన్నారు. వాటిని కొనుగోలు చేస్తున్నది జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారు, మూడు రోజుల్లో వారికి ఈ బంతులను పంపించేయాలి.

రవాణాకు సిద్ధంగా ఉన్న మెరిసే ఎర్రటి బంతుల్లోంచి ఒకదానిని మదన్ చేతిలోకి తీసుకున్నారు. “బంతి తయారీకి మూడు పదార్థాలు అవసరం. పై కవర్ కోసం పటికతో శుద్ధిచేసిన చర్మం, బెండుతో చేసిన లోపలి భాగం ( గోలా ), కుట్టడానికి నూలు దారం.” ఈ మూడూ మీరట్ జిల్లాలో స్థానికంగా అందుబాటులో ఉంటాయి. "కొనేవాళ్లు వాళ్ళకు ఎటువంటి నాణ్యత కలిగిన బంతులు కావాలో మాకు చెప్తారు, దానికి తగ్గట్లుగా మేం తోలునూ బెండునూ ఎంచుకుంటాం."

Women are rarely formally employed here, and Samantara comes in to work only when Madan’s unit gets big orders. She is grounding alum crystals that will be used to process leather hides (on the right). These hides are soaked for three days in water mixed with baking soda, alum, and salt to make them soft and amenable to colour
PHOTO • Shruti Sharma
These hides are soaked for three days in water mixed with baking soda, alum, and salt to make them soft and amenable to colour
PHOTO • Shruti Sharma

స్త్రీలను చాలా అరుదుగా మాత్రమే ఇక్కడ పనిలోకి తీసుకుంటారు. మదన్ యూనిట్‌కి పెద్ద ఆర్డర్‌లు వచ్చినప్పుడు మాత్రమే సమాంతర పనిలోకి వస్తారు. ఆమె చర్మాలను (కుడి) శుద్ధి చేయడానికి ఉపయోగించే పటిక ముక్కలను చూర్ణం చేస్తున్నారు. ఈ చర్మాలను బేకింగ్ సోడా, పటిక, ఉప్పు కలిపిన నీటిలో మూడు రోజులు నానబెడితే అవి మెత్తబడి, రంగు అద్దకానికి అనుకూలంగా మారతాయి

Workers dye the leather red (left) and make cricket balls using two or four pieces of leather.
PHOTO • Shruti Sharma
Sachin, 35, (right) cuts the leather in circles for two-piece balls
PHOTO • Shruti Sharma

తోలుకు ఎరుపు రంగు (ఎడమ) వేస్తున్న కార్మికులు. రెండు లేదా నాలుగు తోలు ముక్కలను ఉపయోగించి క్రికెట్ బంతులను తయారుచేస్తారు. రెండు ముక్కల బంతుల కోసం తోలును గుండ్రంగా కత్తిరిస్తున్న 35 ఏళ్ళ సచిన్ (కుడి)

జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం (డిఐపిఇడిసి) అంచనా ప్రకారం మీరట్‌లో 347 క్రికెట్ బంతులను తయారుచేసే యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటిలో పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న పెద్ద కర్మాగారాలు; మీరట్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ నివాస ప్రాంతాలలో ఉన్న చిన్న ఉత్పత్తి యూనిట్లు కూడా ఉన్నాయి.

అయితే, ఈ లెక్కలో అనేకచోట్ల చెల్లాచెదురుగా ఉన్న అసంఘటిత ఉత్పత్తి కేంద్రాలను, మొత్తం బంతులను తయారుచేసే, లేదా ఒక పనిని అవుట్‌సోర్స్ చేసే గృహ యూనిట్లను కలపలేదు. వీటిలో మీరట్ జిల్లావ్యాప్తంగా ఉన్న జంగేఠి, గగౌల్, భావన్‌పుర్ వంటి గ్రామాలు ఉన్నాయి. " ఆజ్ గాఁవోఁ కే బినా బిల్కుల్ పూర్తి నహీఁ హోగీ మీరట్ మే (ఈ రోజు గ్రామాలే లేకుంటే మీరట్‌లో క్రికెట్ బంతుల సరఫరా ఎంతమాత్రం ఉండదు)," అని మదన్ అన్నారు.

"క్రికెట్ బంతులను తోలుతో తయారుచేస్తారు కాబట్టి గ్రామాలలోని చాలామంది కారీగర్లు , నగరంలోని పెద్ద కర్మాగారాల్లో కూడా జాటవలే వీటిని తయారుచేస్తారు," అని అతను వివరించారు. 1904 జిల్లా గెజిటీర్ ప్రకారం, మీరట్‌లోని తోలు పరిశ్రమలో జాటవ లేదా చమార్ (ఉత్తర్ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంది) సముదాయానికి చెందినవారే ఎక్కువగా పనిచెస్తున్నారు. "జనాలకు క్రికెట్ బాల్ రూపంలో ఉండే తోలుతో సమస్య లేదు, కానీ ఆ తోలుతో పనిచేయాల్సివస్తే మాత్రమే సమస్య ఉంటుంది," అని అతను చెప్పారు.

మదన్ కుటుంబానికి శోభాపుర్‌లో చర్మశుద్ధి కర్మాగారం ఉంది. ఇక్కడ మాత్రమే క్రికెట్ బంతుల తయారీ పరిశ్రమ కోసం చర్మాన్ని పటికతో శుద్ధిచేయడం జరుగుతుంది (చదవండి: ఇంకా పట్టు కొనసాగిస్తోన్న మీరట్ చర్మకారులు ). "పటికతో శుద్ధిచేసిన తోళ్ళకు పెరుగుతున్న గిరాకీని చూసి, క్రికెట్ బంతులకు ఎప్పటికీ గిరాకీ తగ్గదని నేను గ్రహించాను," అని అతను చెప్పారు. ఆశాజనకంగా ఉన్న మార్కెట్ అతన్ని 20 సంవత్సరాల క్రితమే మెస్సర్స్ బి.డి. అండ్ సన్స్‌ని ప్రారంభించడానికి పురికొల్పింది. ఆ ప్రాంతంలో ఉన్న రెండు క్రికెట్ బంతుల తయారీ యూనిట్లలో ఇది ఒకటి.

బంతిని తయారుచేయడంలో అనేక ప్రక్రియలు ఉన్నందువల్ల, ఒక బంతిని చేయడానికి ఎన్ని గంటల సమయం అవసరమో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని మదన్ చెప్పారు. సీజన్‌ని బట్టి, తోలు నాణ్యతను బట్టి కూడా దానికి పట్టే సమయం ఆధారపడివుంటుంది. " దో హఫ్తే లగ్తే హైఁ ఏక్ గేంద్ కో తయ్యార్ హోనే మేఁ కమ్ సే కమ్ (ఒక బంతిని తయారుచేయడానికి కనీసం రెండు వారాలు పడుతుంది)," అని అతను చెప్పారు.

మదన్ యూనిట్‌లోని కార్మికులు మొదట పటికతో చర్మాన్ని శుద్ధిచేస్తారు. దానికి ఎరుపు రంగు వేసి, ఎండలో ఆరబెట్టి, దానికి మైనం లేదా జంతువుల కొవ్వును పట్టించి, ఆపై దానిని మెత్తగా చేయడానికి చెక్క సుత్తితో బాదుతారు. “తెల్లని బంతులు చేయడానికి పటికతో శుద్ధిచేసిన చర్మం అప్పటికే తెల్లగా ఉంటుంది కాబట్టి వాటికి రంగులు వేయాల్సిన అవసరం ఉండదు. ఆవు పాలతో చేసిన పెరుగు వాటికి గ్రీజుగా ఉపయోగపడుతుంది," అని మదన్ వివరించారు.

Left: Heat-pressed hemispheres for two-piece balls are left to dry in the sun.
PHOTO • Shruti Sharma
Right: Dharam uses a machine to stitch two parallel layers of seam on each of these hemispheres. Unlike a handstitched seam in the case of a four-piece ball, a machine-stitched seam is purely decorative
PHOTO • Shruti Sharma

ఎడమ: రెండు ముక్కల బంతుల తయారీ కోసం అర్ధగోళాకారంలో కత్తిరించి, వేడి అచ్చులోకి పంపి, ఎండలో ఆరబెట్టిన తోలుముక్కలు. కుడి: ఈ రెండు అర్ధగోళాలను కలిపి, సమాంతరంగా రెండు పొరల కుట్లను కుట్టడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తున్న ధరమ్. నాలుగు-ముక్కల బంతిని చేతితో కుట్టిన కుట్టులా కాకుండా, యంత్రంతో కుట్టిన ఈ కుట్లు పూర్తిగా అలంకారప్రాయమైనవి

Left: Dharam puts lacquer on finished balls to protect the leather from wearing out.
PHOTO • Shruti Sharma
Right: Gold and silver foil-stamped cricket balls at a sports goods retail shop in Dhobi Talao, Mumbai. These have been made in different ball-making units in Meerut
PHOTO • Shruti Sharma

ఎడమ: తోలు అరిగిపోకుండా ఉండడానికి తయారైన బంతులపై లక్కను పూస్తోన్న ధరమ్. కుడి: ముంబైలోని ధోబీ తలావ్‌లోని ఒక క్రీడా వస్తువుల దుకాణంలో బంగారు, వెండి రేకులలో ముద్రించిన క్రికెట్ బంతులు. వీటిని మీరట్‌లోని వివిధ బంతుల తయారీ యూనిట్లలో తయారుచేశారు

" లైన్ సే కామ్ హోవే హై ఔర్ ఏక్ కారీగర్ ఏక్ హీ కామ్ కరే హై (పనులు వరుసగా ఉంటాయి, ఒక్కో కార్మికుడు ప్రత్యేకించి ఒక పని మాత్రమే చేయాలి)," అని ఆయన వివరించారు. ఆ ప్రత్యేకమైన పనికి కేటాయించిన కారీగర్ తోలును రెండు గుండ్రని ముక్కలుగా గానీ, లేదా నాలుగు అండాకారంలోని ముక్కలుగాగానీ కత్తిరిస్తారు. క్రికెట్ బంతులను రెండు లేదా నాలుగు తోలు ముక్కలతో తయారుచేస్తారు.

"ఈ ముక్కలన్నీ ఒకే మందంతో ఉండాలి, వెంట్రుకల కణాలు కూడా ఒకే విధంగా ఉండాలి," అని మదన్ చెప్పారు. " ఇస్ వక్త్ ఛాంట్‌నే మేఁ గల్తీ హో గయీ, తో సమఝ్‌లో కి గేంద్ డీషేప్ హోగా హీ (ఈ దశలో వర్గీకరించడంలో పొరపాటు జరిగితే, ఖచ్చితంగా బంతి ఆకారం చెడిపోతుందని అర్థంచేసుకోవాలి)," అన్నారతను.

బంతి తయారీ ప్రక్రియలో అత్యంత నైపుణ్యం అవసరమైన పని ఏమిటంటే, తోలు ముక్కల చివరలకు నూలు దారంతో చేతి కుట్టు వేయడం. ఈ దారాలకు చివర బిరుసుగా ఉండే పంది వెంట్రుకలు అతికించి ఉంటాయి. "పంది వెంట్రుకలకు వంగే గుణం ఉంటుంది, బలంగా ఉంటాయి, తోలును చింపేంత పదునుగా ఉండవు కాబట్టి సూదులకు బదులుగా వాటిని ఉపయోగిస్తారు," అని మదన్ చెప్పారు. "అవి పొడవుగా ఉంటాయి, సులువుగా పట్టుచిక్కుతాయి, కుట్టేవాళ్ళ వేళ్ళకు కూడా ఎటువంటి గాయాలు కావు."

లేకిన్ సిర్ఫ్ ఇసీ చీజ్ కీ వజహ్ సే హమారే ముసల్మాన్ భాయ్ యే కామ్ నహీఁ కర్ సక్తే. ఉన్‌కో సువర్ సే దిక్కత్ హోతీ హై నా (కేవలం ఈ కారణం వల్లనే మా ముసల్మాన్ సోదరులు ఈ పనిని చేయరు. వారికి పందులతో సమస్య ఉంది కదా)," అని అతను చెప్పారు.

"నాలుగు ముక్కలతో బంతిని తయారుచేయడానికి అవసరమయ్యే మూడు రకాల కుట్లు వేయడంలో నైపుణ్యం సాధించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది" అని మదన్ యూనిట్‌లో బంతులను తయారు చేయడంలో అత్యంత అనుభవజ్ఞుడైన ధరమ్ సింగ్ చెప్పారు. 50 ఏళ్ళ వయసున్న ఆయన జమ్ము-కశ్మీర్‌కు చెందిన క్లయింట్ ఆర్డర్‌లో భాగంగా చేస్తున్న బంతులపై వార్నిష్‌ను పూస్తున్నారు. " కారీగర్ ఒక రకమైన కుట్టు నుంచి మరొక నైపుణ్యమైన కుట్టుని నేర్చుకున్నప్పుడు, అతని కూలీ రేటు కూడా పెరుగుతుంది," అన్నారు ధరమ్. నైపుణ్యమైన ప్రతి కుట్టుకు ప్రత్యేకమైన సాంకేతికత, ప్రత్యేక పనితీరు అవసరం .

Sunil (left) beats a roll of processed leather with a hammer to make it pliable, a step locals call melli maarna
PHOTO • Shruti Sharma
For four-piece balls, leather is cut (right) into oval pieces that will make four quarters of a ball
PHOTO • Shruti Sharma

శుద్ధి చేసిన తోలును మెత్తగా చేయడానికి సుత్తితో కొడుతున్న సునీల్ (ఎడమ), స్థానికులు దీన్ని మెల్లీ మార్నా అని పిలుస్తారు. నాలుగు-ముక్కల బంతుల కోసం, తోలును అండాకారపు భాగాలుగా కత్తిరిస్తారు (కుడి). ఈ కత్తిరించిన నాలుగు ముక్కలతో ఒక బంతి తయారవుతుంది

Left: Monu joins two oval pieces to make a cup or hemisphere and then makes holes using a tool called aar .
PHOTO • Shruti Sharma
Right: Vikramjeet reinforces the inside of the hemispheres with thinner, oval pieces, a process known as astar lagana . The machine on his right is used for seam-pressing, and the one on his left is the golai (rounding) machine
PHOTO • Shruti Sharma

ఎడమ: ఒక కప్పులాగా లేదా అర్ధగోళంలా తయారుచేయడానికి రెండు అండాకారపు ముక్కలను ఒక్కటిగా చేస్తున్న మోనూ. ఆపైన ఆర్ అనే సాధనాన్ని ఉపయోగించి వాటికి రంధ్రాలు చేస్తారు. కుడి: విక్రమ్‌జీత్ అర్ధగోళాల లోపలి భాగాన్ని సన్నని, అండాకారపు ముక్కలతో బలంగా చేస్తారు. ఈ ప్రక్రియను అస్తర్ లగానా అంటారు. అతని కుడి వైపున ఉన్న యంత్రాన్ని బంతికుట్టును నొక్కడం కోసం ఉపయోగిస్తారు. అతనికి ఎడమ వైపున ఉన్నది గోళాయీ (గుండ్రంగా చేసే) యంత్రం

మొదట, రెండు అండాకారపు తోలు ముక్కలను లోపలి కుట్టు వేసి కలిపి, ఒక అర్ధగోళంగా లేదా కప్పులా తయారు చేస్తారు, దీనిని స్థానికంగా పీస్ (ముక్కలు) జుడాయి (జోడించడం) అంటారు. మొదటి కుట్టును సాధారణంగా అప్పుడప్పుడే పని నేర్చుకుంటున్నవాళ్ళు కుడతారు. వాళ్ళు కుట్టిన ప్రతి అర్ధగోళానికి రూ. 7.50 సంపాదిస్తారు. "పీస్ జుడాయి తర్వాత ఆ కప్పుల లోపల లప్పే అని పిలిచే సన్నని తోలు ముక్కలతో బలంగా ఉండేలా చేస్తారు," అని ధరమ్ వివరించారు. అలా బలంగా చేసిన తోలు అర్ధగోళాలను గోళాయ్ యంత్రం అచ్చులో వేసి గుండ్రంగా చేస్తారు.

బంతిలా తయారుకావడానికి మధ్యలో బాగా అణచిపెట్టిన గుండ్రని బెండును ఉంచి, రెండు వైపుల నుండి ఏకకాలంలో కుట్లు వేసి రెండు అర్ధగోళాలను కలుపుతారు. దీనిని కప్ జుడాయి అంటారు. కప్ జుడాయి చేసినందుకు వేతనం రూ. 17-19 ఉంటుంది. రెండు ముక్కల బంతులకు కూడా కప్ జుడాయి చేతి కుట్లు వేస్తారు.

"రెండో కుట్టు పూర్తయ్యాకే, బంతి ( గేంద్ ) అనే పదాన్ని ఉపయోగిస్తారు," ధరమ్ చెప్పారు. " పహలీ బార్ చమ్రా ఏక్ గేంద్ కా ఆకార్ లేతా హై (తోలు మొదటిసారిగా బంతి ఆకారాన్ని తీసుకుంటుంది).

ధరమ్ సుమారు 35 సంవత్సరాల క్రితం సూరజ్ కుండ్ రోడ్‌లోని ఒక కర్మాగారంలో బంతులను తయారుచేసే కళను నేర్చుకున్నారు. అక్కడ 1950లలో క్రీడా వస్తువుల తయారీ ప్రారంభమైంది. విభజన తరువాత సియాల్‌కోట్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) నుండి వచ్చిన నిర్వాసితులు, మీరట్‌లోని సూరజ్ కుండ్ రోడ్, విక్టోరియా పార్క్ చుట్టూ ఉన్న క్రీడా కాలనీలలో పునరావాసం పొంది, క్రీడా పరికరాల పరిశ్రమను స్థాపించారు. "మీరట్ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు నగరానికి వెళ్లి, ఆ కళను నేర్చుకుని, దానిని గ్రామాలకు తీసుకువెళ్ళారు. "

నాలుగు ముక్కల బంతి తయారీలో మూడవ దశ కుట్టు చాలా కీలకం. బంతి పైన నాలుగు సమాంతర వరుసల బంతికుట్లు ( గేంద్ సిలాయి ) చిక్కగా కుట్టడం అవసరం. "మంచి రకం బంతుల్లో సుమారు 80 కుట్లు ఉంటాయి," అని అతను చెప్పారు. కుట్ల సంఖ్యను బట్టి ఒక కార్మికుడు బంతికి రూ. 35-50 సంపాదిస్తాడు. రెండు ముక్కల బంతులపై యంత్రంతో కుట్లను వేస్తారు.

Bharat Bhushan using an aar to make insertions through the leather that protrudes between the two hemispheres, held together by an iron clamp. He places a rounded cork between the two cups and attaches pig bristles by their roots to the ends of a metre-long cotton thread for the second stage of stitching. He then inserts the two pig bristles through the same holes from opposite directions to stitch the cups into a ball
PHOTO • Shruti Sharma
Bharat Bhushan using an aar to make insertions through the leather that protrudes between the two hemispheres, held together by an iron clamp. He places a rounded cork between the two cups and attaches pig bristles by their roots to the ends of a metre-long cotton thread for the second stage of stitching. He then inserts the two pig bristles through the same holes from opposite directions to stitch the cups into a ball
PHOTO • Shruti Sharma

ఒక ఇనుప బందు మధ్య బిగించివున్న రెండు అర్ధగోళాల మధ్య ఉన్న తోలులో రంధ్రాలు చేయడానికి ఒక ఆర్‌ను ఉపయోగిస్తోన్న భారత్ భూషణ్. అతను రెండవ దశ కుట్టు కోసం రెండు అర్ధగోళాల మధ్య ఒక గుండ్రని బెండును ఉంచి, మీటర్ పొడవు గల నూలు దారం చివరన పంది వెంట్రుకలను అతికిస్తారు. ఆ తర్వాత అతను ఆ రెండు అర్ధగోళాలను కలిపి బంతిలా కుట్టడానికి రెండు పంది వెంట్రుకలను ఎదురెదురుగా ఉన్న రంధ్రాలలోకి చొప్పిస్తారు

A karigar only moves to seam stitching after years of mastering the other routines.
PHOTO • Shruti Sharma
Pappan, 45, (left) must estimate correctly where to poke holes and space them accurately. It takes 80 stitches to makes holes for the best quality balls, and it can take a karigar more than 30 minutes to stitch four parallel rows of seam
PHOTO • Shruti Sharma

ఏళ్ళ తరబడి ఇతర పనుల్లో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత మాత్రమే ఒక కారీగర్ బంతికుట్లు వేయడం మొదలెడతారు. 45 ఏళ్ళ పప్పన్, (ఎడమ) రంధ్రాలు ఎక్కడ వేయాలో సరిగ్గా అంచనా వేసి, వాటి మధ్య ఖచ్చితమైన ఎడం ఉండేలా చూడాలి. అత్యుత్తమ నాణ్యత గల బంతులకు రంధ్రాలు వేయడానికి 80 కుట్లు పడతాయి. నాలుగు సమాంతర వరుసల బంతికుట్లను వేయడానికి ఒక కారీగర్‌కు 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది

" స్పిన్నర్ హో యా ఫాస్ట్ బౌలర్, దోనోఁ సీమ్ కే సహారే హీ గేంద్ ఫేఁక్తే హై (స్పిన్నర్ అయినా, ఫాస్ట్ బౌలర్ అయినా, బంతిని వదలడానికి ఇద్దరూ బంతికుట్ల సహాయాన్ని తీసుకుంటారు)," అని ధరమ్ చెప్పారు. బంతి కుట్లు పూర్తయిన తర్వాత, బంతిపై పొడుచుకు వచ్చిన ఆ కుట్లను చేతితో నొక్కుతారు, ఆపై బంతికి లక్క పూత పూసి, దానిపై ముద్రవేస్తారు. “ ఖిలాడీ క్యా పహచాన్‌తే హై? సిర్ఫ్ చమక్‌తీ హుయీ గేంద్, సోనే కీ ముహర్ కే సాథ్ (ఆటగాడు ఏం గుర్తిస్తాడు? బంగారు రంగు ముద్రతో మెరుస్తున్న బంతిని మాత్రమే).”

క్రికెట్ బాల్ కీ ఏక్ ఖాస్ బాత్ బతాయియే (క్రికెట్ బంతుల ప్రత్యేకత ఏమిటో చెప్పండి?)” అని మదన్ అడిగారు.

"రూపాలు మారిన ఏకైక ఆట ఇదొక్కటే," అని అతను చెప్పారు, " లేకిన్ బనానేవాలా ఔర్ బనానే కీ తక్నీక్, తరీకా ఔర్ చీజేఁ బిల్కుల్ నహీ బద్‌లీఁ (కానీ బంతులను తయారుచేసేవాళ్ళు, సాంకేతికత, ప్రక్రియ, వాటి ఉత్పత్తికి ఉపయోగించే పదార్థాలు మాత్రం మారలేదు).

మదన్‌తో పనిచేస్తున్న కారీగర్లు సగటున రోజుకు 200 బంతుల వరకు తయారుచేస్తారు. ఒక బంతిని లేదా ఒక బ్యాచ్ బంతులను తయారుచేయడానికి దాదాపు 2 వారాలు పడుతుంది. చర్మాన్ని శుద్ధి చేయడం దగ్గర నుండి మొదలుకొని బంతిని పూర్తిచేయడం వరకు, "11 మంది క్రికెటర్లు కలిస్తే ఒక జట్టు తయారైనట్లే, కనీసం 11 మంది కారీగ ర్ల నైపుణ్యాలు ఒక బంతి తయారీకి అవసరం," అంటూ మదన్, తాను తెచ్చిన సామ్యానికి తానే నవ్వారు.

" పర్ ఖేల్ కా అస్లీ కారీగర్ తో ఖిలాడీ హీ హోవే హై (కానీ క్రీడలో నిజమైన పనిమంతుడిగా పరిగణించేది కేవలం ఆటగాడిని మాత్రమే)," అంటూ జోడించారు.

ఈ కథనానికి తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన భారత్ భూషణ్‌కు రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఒక ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: రవి కృష్ణ

Shruti Sharma

شروتی شرما ایم ایم ایف – پاری فیلو (۲۳-۲۰۲۲) ہیں۔ وہ کولکاتا کے سنٹر فار اسٹڈیز اِن سوشل سائنسز سے ہندوستان میں کھیلوں کے سامان تیار کرنے کی سماجی تاریخ پر پی ایچ ڈی کر رہی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Shruti Sharma
Editor : Riya Behl

ریا بہل ملٹی میڈیا جرنلسٹ ہیں اور صنف اور تعلیم سے متعلق امور پر لکھتی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) کے لیے بطور سینئر اسسٹنٹ ایڈیٹر کام کر چکی ہیں اور پاری کی اسٹوریز کو اسکولی نصاب کا حصہ بنانے کے لیے طلباء اور اساتذہ کے ساتھ کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Riya Behl
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

کے ذریعہ دیگر اسٹوریز Ravi Krishna